Menu

Mad Cow Sacred Cow

mad-cow-sacred-cow1అనగనగా ఒక కెనడాలో పట్టిన భారతీయ సంతతి వ్యక్తి. పేరు ఆనంద్ రామయ్య. కెనడియన్ భార్య. అప్పుడే మరో బిడ్డకు తండ్రయ్యాడు. సంతోషంగా సాగే జీవితం. హఠాత్తుగా కెనడాలో ‘మ్యాడ్ కౌ’ రోగం కమ్ముకుంది. రోజూతినే బర్గర్లోని బీఫ్ ద్వారా రోగాలు అంటుకునే ప్రమాదం ఏర్పడింది. ఆహారం విషయంలో అబద్రత ఏర్పడింది. తినేతిండి ఎంత సురక్షితమో ప్రశ్నార్థకం అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు మూల కారణం వెతకాలని తన వీడియో కెమెరాతో బయల్దేరాడు.

ఆనంద్ రామయ్య భార్య కుటుంబీకులు ఒకప్పుడు పశువుల పెంపకం వృత్తిగా కలిగినవారు. వారందరినీ కలిసి మాట్లాడాడు. తెలిసిందేమిటంటే పశువుల పెంపకం కుటుంబ వృత్తిగా ఉన్నంతవరకూ బాగానే ఉండేదని, కొన్ని కార్పొరేషన్లు/కంపెనీలు మాంసం ఉత్పత్తిని ఏకీకృతంచేసి గుత్తాధిపత్యం చెలాయించే స్థితికి వచ్చేసరికీ రైతుకు తీవ్రమైన నష్టాలువచ్చి, పశువుల పెంపకంకూడా కార్పొరేట్ల ఆధీనంలోకి వెళ్ళిపోయిందని తెలిసింది. మ్యాడ్ కౌ వ్యాధి మూలాలు ఇక్కడ్నించే మొదలయ్యాయనే నిజం ఆనంద్ కు తెలిసొచ్చింది.

కంజ్యూమర్/కస్టమర్ కు అతితక్కువ ధరకు బీఫ్ (పశుమాంసం) అందించి అధిక లాభాల్ని సంపాదించే వ్యూహంలో భాగంగా కారొరేషన్లు పశువుల దాణాలో వ్యర్థంగా మైగిలిపోయిన పశుమాంసాన్నే పౌడర్ రూపంలో కలిపే విధానానికి శ్రీకారం చుట్టారు. పశువుల ఆరోగ్యంతో సంబంధం లేకుండా శాఖాహారులైన పశువులకు పశువుల్నే తినిపించే ఘోరమైన పద్ధతిని అవలంభించారు. ‘మ్యాడ్ కౌ’ రోగం ఈ హేయమైన వ్యాపారపద్ధతికి మూలమయ్యింది.

ఒకవైపు రైతులు మరొక వైపు ప్రజారోగ్యం కారొరేషన్ల ధనదాహానికి బలైపోయాయి. తినేతిండి విషతుల్యమైపోయింది. అనే విషయం తెలుసుకున్న ఆనంద్ కు చాలా బాధకలిగింది. అదే సమయంలో తన పూర్వజులు భారతదేశంలో పశువులకున్న ప్రాధాన్యత గురించి, పవిత్రత గురించీ చెప్పిన విషయాలు మనసులో మెదులుతున్న ఆనంద్ ‘మ్యాడ్ కౌ’ (పిచ్చి పశువు) కు వ్యతిరేకమైన ‘సేక్రెడ్ కౌ’ (పవిత్ర పశువు)ను వెతుక్కుంటూ కేమెరా భుజాన వేసుకుని భారతదేశం వచ్చాడు.

ఏ పవిత్రమైన పశువు కోసం ఆనంద్ వెతుకుతూ తన పూర్వజుల భూమికొచ్చాడో ఆ నేలలోనూ ఆధునిక నాగరికత మధ్య ప్రశ్న చిహ్నమౌతున్న పశువును కనుగొన్నాడు. సాంప్రదాయక పంటలు, వృత్తులూ వ్యాపారాత్మకతను సంతరించుకుని పశువులకు నిలువ నీడలేకుండా చేశాయనే నిజం తెలిసొచ్చింది. దాదాపు అరవై ఐదు శాతం ప్రజలకు జీవనోపాధిలో నిలిచిన పశువు, సంక్షోభంలో ఉందనే సత్యం ఎరుకయ్యింది.

ఒకవైపు వ్యవసాయ రంగంలో సంక్షోభం, ఒకవైపు పర్యావరణ సంక్షోభం, కుటుంబాల్లో సంక్షోభం, పవిత్రమైన పశువు పేరుమీద మతంపేరుతో సంక్షోభం. ఇలా ఎన్నో సంక్షోభాల నడుమ పశువు భారతదేశంలో కూడా చీల్చిచండాడబడుతోందనే నిజాన్ని తెలుసుకుని, ప్రపంచీకరణ పవిత్రమైన పశువుల్ని కూడా పిచ్చి పశువులుగా చేసి వ్యాపారసంస్థూ, రాజకీయ పార్టీలూ, పారిశ్రామకవేత్తలూ మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారనే నిజాన్ని గ్రహించిన ఆనంద్ భారంగా కెనడా తిరుగు ప్రయాణం అవుతాడు.

ఈ డాక్యుమెంటరీ చిత్రం చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో చూపించబడింది. రెండు గోల్డెన్ షీఫ్ అవార్డుల్ని పొందింది. హైదరాబాద్ కు చెందిన ఫిల్మ్ మేకర్ ఫర్హతుల్లా బేగ్ ఈ చిత్రానికి చేసిన పరిశోధనకుగాను అవార్డుని పొందారు.

ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.

7 Comments
  1. గీతాచార్య June 23, 2009 /
  2. సుజాత June 23, 2009 /
  3. సుజాత June 23, 2009 /
  4. మేడేపల్లి శేషు June 24, 2009 /