Menu

దేవుడా! ఓ మంచి దేవుడా!

కాపీ కొట్టిన సన్నివేశమే అయినా ‘ నువ్వు నాకు నచ్చావ్’ లో వెంకటేష్ లా నాకూ ఒక ప్రార్థన ఉంది.

దేవుడా ! ఓ మంచి దేవుడా ! మాకు నువ్వు సిగ్గులేని హీరోయిన్లను ఇచ్చావ్ , నరంలేని హీరోలను ఇచ్చావ్ , ఇంగ్లీషు బూతులను వదిలి తెలుగు చెడ్డమాటలను కట్ చేసే సెన్సార్ ఇచ్చావ్ , పది రూపాయలకు దొంగ సీడీలు చూసి మేము కరెక్టే అని వాదించే ప్రేక్షకులను ఇచ్చావ్ , సినీ గ్లామర్ అడ్డం పెట్టుకునీ నాయకులయ్యే గుంటనక్కలను ఇచ్చావ్ , కథలను కాపీ కొట్టే స్వాతంత్ర్యం ఇచ్చావ్ , మంచి టాలెంట్ ఉన్న కొందరు కళాకారులనూ ఇచ్చావ్… ఇవన్నీ తమిళ్, మళయాళం, ఫ్రెంచి వాళ్ళకూ ఇచ్చావ్. అంటే ఎగ్జాక్ట్లీ ఇవే కాకపోతే….. బూతులు తీసేవాళ్ళు , వ్యభిచరించేవాళ్ళూ , ఉన్మాదులులూ…అందరికీ సమానంగా ఇచ్చావ్. కానీ పట్టుమని పది మందినయినా మంచి ప్రొడ్యూసర్లను మాకెందుకు ఇవ్వలేదు ? మంచి ప్రొడ్యూసరుకు మంచి దర్శకుడిని ఎందుకు కలపడం లేదు ? నువ్వు మంచి దేవుడివేనా ??

godసినిమా అంటే పిచ్చి, వ్యామోహం, ప్రేమ, ప్రాణం, ధ్యానం,బంధం…ఉన్నవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నా… మనల్ని మాత్రం ఇక్కడ కలుసుకునేట్లు చేసింది మన “భాష”. మనం తెలుగువారం. సినిమా ప్రేమికులం. ఇక్కడ కూర్చుని మనం ఎన్నెన్నో గొప్ప సినిమాలనూ దర్శకులను నటులను కథలను గురించి ఎన్నెనో చెప్పుకుంటున్నాం….అంటే ప్రపంచ సినిమాను మనం గుర్తించి మనకూ దానికీ యేదో సంబంధం ఉందని మాట్లాడుకుంటున్నం… కానీ… ప్రపంచ సినిమాలో అసలు మనం ఎవ్వరని?

తలుచుకున్నకొద్దీ వేదనే.

మనలోనూ గొప్ప సినిమాలూ , దర్శకులు (పేర్లు వద్దులెండి…ఒక్కొక్కరు ఒక్కో లిస్టు చెబుతారు ) ఉన్నాయని అప్పుడప్పుడు మనల్ను మనం ” మోసం ” చేసుకోవడమే కానీ…. ఇన్ని సంవత్సరాల తెలుగు సినిమా… దేశంలో హిందీ తర్వాత అత్యధిక చిత్రాలు నిర్మిస్తున్న భాష , దేశంలోని ఎక్కువ థియేటర్లు ఉన్న రాష్ట్రం…. ప్రపంచ సినిమా చిత్రపటంలో మాత్రం శూన్యం.

నన్ను తిట్టుకోకండి. ఈ విషయంలో నాకు మన జాతి / భాష మీద ద్వేషం లేదు, బాధ తప్ప. ఎవరైనా తన బాధను అర్థం చేసుకుంటారు అనుకునేవారితోనే పంచుకుంటారు. అందుకే ఇక్కడ పంచుకుంటున్నా.

నేనేమీ లేని అవమానాన్ని ఉన్నట్లు ఊహించుకుని వేదన చెందట్లేదు. ఒక్కసారి ఈ లింక్ చూడండి. ఇక్కడ తెలుగు సినిమా ఊసే లేదు. మన సినిమాను వికీపీడియానో్ , తెల్లవాళ్ళో గుర్తించేది యేమిటి మనకు మనమే గొప్ప అని అనుకుంటె ఇక నే రాయబోయేది చదవక్ఖర్లేదు.

ప్రతి భాషలోనూ కమర్షియల్ / మెయిన్ స్ట్రీం సినిమా ఉన్నట్లే పారలెల్ /అసలు సిసలైన కళాత్మక విలువలు ( మళ్ళీ ఇవి నిర్దేశించేదెవరని అడగకండి….ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్శకులు , విమర్శకులు,  ఫోటొగ్రాఫర్ల కన్నా నేను మాత్రం మేధావిని కాదు ) ఉన్న సినిమాలు ఉంటాయి.

రాక్షసబల్లులు , అనకోండ పాములు , గ్రహాంతర వాసుల విధ్వంసాలు , సెక్సులో మగాడిని చంపే హంతకురాలు ఇలాంటి కథాంశలతో సినిమాలు తీసే ధనిక దేశాల్లో కూడ జాత్యాహంకారలకు గురికాబడుతున్న మనుష్యుల గురించీ , మానవ సంబంధాలలోని అతి సున్నిత పార్శ్యాల గురించి , భయాలు , కలలు , మానవత్వం గురించీ సినిమాలు వచ్చి ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతున్నయి.

సెన్సారు నిబంధనలు తక్కువైన దేశాలు ఆడదాని స్వేచ్చ గురించి ,శారీరిక కాంక్షల గురించీ ఎంతో హృద్యంగా చెప్పగలుగుతుంటే , బురఖాల్లో స్త్రీలను మూసేసే దేశాలనుంచి అత్యుత్తమమైన పసి మనసుల దృశ్యకావ్యాలు ఎగసిపడుతున్నాయి. డబ్బు పెట్టే మనుష్యులున్న దేశలవాళ్ళు చరిత్రను తిరిగి సృష్టించి మరీ కాలగర్భంలో కలిసిపోయిన మానవ జీవితాలను గురించి చెప్పగలుగుతుంటే , అలాంటి ఆర్థిక వ్యవస్థ లేని దేశాలనుంచి…సందు చివర్లలో , ఇరుకు గదుల్లొ నలిగిపోయే జీవితాలనే తెరకెక్కిస్తున్నారు.

పేర్లు ఇవి అని నేను చెప్పకపోయిన ప్రపంచ సినిమాతో పరిచయం ఉన్న వారందరికి ఇప్పుడు నే చెప్పిన భాషల్లోని సినిమాల గురించి స్ఫురించి ఉంటుందని ” నమ్ముతున్నాను ” కానీ మన రాష్ట్రంలోనే ఎందుకు ఈ నిరాదరణ ? మంచి సినిమాను తీయాలి అనుకునే ప్రొడ్యూసర్ ఎవరు ?

కూచిపూడి , భరతనాట్యల గురించి కొన్ని , దాసి అమ్మాయి గురించి , భూమి కోసం బడుగు జీవుల గురించి కొన్ని , బాలల కష్టాల గురించి కొన్ని…ఇటువంటి కథాంశాలతో మనలోని కొన్ని మంచి సినిమాలు తీసారని తృప్తి పడడమే కానీ…..ఒక్కసారి ప్రపంచ సినిమా దిగ్గజాల దృష్టితో చూస్తే…. టెక్నికల్`గా మన నాట్య-సంగీత చిత్రాలు వాళ్ళ చిత్రాల ట్రైలర్ల కన్నా బీదగా , మన కష్టాల-కన్నీళ్ళ చిత్రాలు ఎదో అవార్డు కోసమే తీసినట్లు గానీ కనిపిస్తాయనేది వాస్తవం. ఏ వర్ణ వివక్షతోనూ మన సినిమాలను ఎవరూ తొక్కిపెట్టడం లేదు. కన్నడ , తమిళ, మళయాళ , బెంగాలు భాషలమీద లేని వివక్ష కేవలం ఒక్క తెలుగు మీదే ప్రపంచ సినిమా చూపుతోంది అంటే…. అసలు నేను అయితే అలా అనను.. తప్పు మనలోనే ఉంది. కానీ… ఎవ్వరిని తప్పుబట్టగలను ఇక్కడ ?

ఖచ్చితంగా నమ్ముతున్నాను… మన తెలుగులోనూ ఐసన్‍స్టీన్ , గొదార్ద్ , త్రుఫో ,రే, ఏంటోనియోని , అదూర్ , కురుసోవా , బెర్గ్మన్ , ఫెల్లినీ ,గిరీష్ కాసరవెల్లి , కిం కి డుక్ , మజిద్ మజిదీ , వంగ్ కర్ వాయి .,రిత్విక్ ఘటక్ …..లాంటి ఎందరూ దర్శకత్వ ప్రతిభ ఉన్నవారు ఉండే ఉంటారు.

కనీసం అలా ఎదగగలిగే మనసు ( టాలెంట్ కాదు… చదువుకున్నా నేర్చుకున్నా ప్రావీణ్యం రావచ్చు , మనసు రాదు ) ఉన్నవాళ్ళు ఉంటారు. మరి యేమై పోతున్నారు వాళ్ళు.. శాపగ్రస్థులు . తెలుగువాడిగా పుట్టడమేనా వారి పాపం ? ఖచ్చితంగా అటువంటివారిని చుట్టూ ఉండే సామాన్యులు అర్థం చేసుకోలేరు. చేసుకున్నా వారి ఆశయానికి యే విధంగానూ సహాయపడలేరు. యెందుకంటే… ఎంత మనసు ఉన్నా కళా పిపాస ఉన్నా… ఎటువంటి సినిమా తీయాలి అన్నా కావల్సింది ” డబ్బు “. మహారాజుల అనుగ్రహం లేనిదే…. కాళిదాసు కవిత్వం అయినా గుర్తింపులోకి రాదు. కేవలం…అటువంటి కళా పోషకులు అయిన రాజులు లేకనే ఈనాటివరకూ మన తెలుగులో సినిమా ఎదగలేదు.

ఒకనాటి రాజులు మహా కర్కోటకులు .యుధ్ధాలు చేసి తలలు నరికినా , స్త్రీలను చెరిచినా… తన ఆస్థానంలో కవులను , చిత్రకారులను , సంగీత కోవిదులను , నాట్యకారులను…. పోషించేవరు. ఆ రాజులు లేనిదే భారత దేశానికి హిందుస్తానీ , కర్నాటిక్ , భర్తనాట్యం , శిల్ప కళ ఇవేవీ ఉండేవి కావు. నిజానికి ఆ కళలన్నిటిలో వాళ్ళు చేసేది కళాకారులను పోషించడమే.

కవికి సరి అయిన ఇల్లు , వసతులు సమకూర్చితే అతనే కవిత్వం రాసేందుకు వీలు చిక్కేది. మంచి కవిత రాస్తే బహుమానాలు. ఈనాడు సినిమా ఎదగాలి అంటే అలా కళకారులను పోషించాల్సిన అవసరం లేదు. సినిమాను పోషిస్తే చాలు. కవికి వ్రాసేందుకు ఒక సుద్ద ముక్క చాలు. సంగీతకారుడిని తన స్వరం చాలు. నాట్యగత్తెకు మహా అయితె అందెలు .

కానీ సినిమాకు యెన్ని కావాలి ? ఈ నాటి పరిస్థితుల్లో… ఒక 35MM నాణ్యమైన సినిమా తీయాలంటె కనీసం రోజులు యాభై అరవై వేల నుంచి లక్షన్నర దాక ఖర్చు అవుతుంది . ఇక్కడ ” నాణ్యమైన” అనేది అవసరం. నిజానికి తొడలు కొట్టే హీరోలతో , నడుము తిప్పే ఆడాళ్ళతో తీసే సినిమాల్లో రోజుకు రెండు లక్షలు అవుతుండవచ్చు. (తొడ కొట్టెవాడి వెనక పదిమందిని జై కొట్టెందుకు , నడుము తిప్పే ఆమె వెనక గంతులేసేందుకు పాతిక మందిని పెడతారు కాబట్టి )

ఈ లెక్కన తను సినిమా ద్వార ప్రపంచానికి చెప్పదల్చుకున్న విషయన్ని దృశ్య కావ్యంగా మార్చాలి అనుకునే ప్రతివాడి దగ్గరా… కనీసం ..ఈనాటి ఆర్థిక పరిస్థితుల్లో పదుల లక్షల నుంచి కోటి వరకూ డబ్బులు ఉండగలగాలి… ఉండటం కాదు…ఆ డబ్బు మొత్తం వెచ్చించగలగాలి…ఇక పోయినట్లే అనుకుని. ఆ డబ్బు నుంచి ధన లాభం ఆశించరాదు. అంటే ఖచ్చితంగా రాజు కాగలిగినవాడే తను అనుకున్న సినిమా తీయగలడు.

నాకు తెలిసి మన తెలుగు వాళ్ళలో ఈనాటికీ రాజులంత డబ్బులున్న వాళ్ళు లేకపోలేదు. యెన్నెనో చోట్ల డబ్బులు విసిరేస్తారు. కానీ సినిమాలో మాత్రం ఎవరి దయా లేదు. ఆనాటి రాజులు స్వచ్చమైన కళా హృదయులు కాకపోయిన కీర్తి కాంక్ష కోసమో , కళా బంధు అనిపించుకోవలనే దుగ్ధ కోసమో అయినా కళాఆను పోషించేవారు.. అదేమి విచిత్రమో ఈనాడు అలా కీర్తికాంక్షతో ఆలోచించే ధనవంతులే లేరు మన తెలుగులో.

కేవలం అభిరుచి గల ప్రొడ్యూసర్ అనే పేరు కోసం అయినా .. (ఆ కీర్తీ కూడా లాభమే కదా…పరపతి పెరుగుతుంది. డబ్బులిచ్చి సన్మానాలూ , అవార్డులు ఎలాగూ కొనుక్కుంటారు )… కళాత్మక విలువలు ఉన్న సినిమాను నిర్మించేందుకు యే తెలుగు ధనవంతుడూ సిద్ధంగా ఉన్నట్లు లేడు. కృష్ణదేవరాయలు లేనిదే ధూర్జటి లేడు. నువ్వొక ప్రబంధం రాస్తే నేను అక్షర లక్షలిస్తాను , కానీ ఆ అక్షరంతో నా ధనాగారంలోఈ రత్నాలు రెట్టింపవుతాయా అని రాయలు అడిగి ఉంటే ???? ఈ నాటి సినీ రాజులు… తాము కోటి పెడితే ఎన్ని కోట్లు వెనక్కు వస్తాయనే అంటారు. అది వ్యాపరమే కానీ కళా పోషణ ససేమిరా కాదు. ధన లాభం ఆశించక ఒక సినిమాను పోషించాలి అనుకునేంత మన్సున్న ధనికులు రానంతకాలం మన తెలుగు సినిమా పరిస్థితి ఇంతే. ఇంతే. ఇంతే.

దేవుడనేవాడుంటే నేను కోరుకునేది :

ఒకటి…. అసలు సిసలు తెలుగు మహరాజును ఎవరినైనా పుట్టించి వారిద్వార తెలుగు సినిమాకు ప్రపంచ గుర్తింపు ఇప్పించు లేదా…. ఆ మహారాజుగా నన్నే మార్చు లేదా…. మరే జన్మలోనూ తెలుగువాడిగా , అందునా సినిమా ప్రేమికుడిగా పుట్టించకు. నా భాష , జాతి తల్లి వంటివే… అయితే ఈ తల్లికి నేను అక్ఖర్లేదులా ఉంది మరి.

P.S :యేదో తెలుగు సినిమా ద్వారా నేను కొన్ని విషయాలను తెర మీద చూపిద్దామనే వెర్రి ఆశ , ఆశయంతో బ్రతికాను కొన్ని రోజులు … ధనం లేనిదే సినిమా రాదని అర్థం అయినా దింపుడు కళ్ళం ఆశతో ( పాడె మీద శవాన్ని ఆఖరుగా పూఢ్చేముందు ఒకసారి పిలిచి లేప ప్రయత్నిస్తారు… పొరబాటున ప్రాణం వస్తుందేమో అని)… వేచి చూసా. యెనభై యేళ్ళ తెలుగు సినీ జగత్తులో ఎవరికీ దక్కని మహరాజు నాకు కనిపిస్తాడనే నమ్మకం ఇక లేక…. వెళ్ళిపోతున్నాను…. కుదిరితే గౌరవనీయమైన వేరే పని చూసుకుంటాను…. లేకపోతే మనసు చంపుకుని తొడ కొట్టించి , నడుములూపించి వ్యభిచరిస్తాను…బ్రతకాలి కదా మరి..

–ఒక సినీ ప్రేమికుడు

11 Comments
  • soul June 12, 2009 /
 1. rayraj June 10, 2009 /
  • soul June 12, 2009 /
 2. askr June 12, 2009 /
  • రాజశేఖర్ June 12, 2009 /
  • soul June 12, 2009 /
 3. soul June 12, 2009 /
 4. chandramouli June 12, 2009 /
  • soul June 12, 2009 /
 5. love cinema June 16, 2009 /