Menu

తీవ్రవాదం నేపథ్యం లో సినిమాలు-2

టెర్రరిస్టుల పోరాటం… విధ్వంస కార్యకలాపాలలోని యుక్తాయుక్తతల పైనా పూర్తి రియాలిస్టిక్‌ దృక్కోణంతో వచ్చిన సినిమాగా ద్రోహకాల్‌… ప్రముఖ కళాత్మక చిత్రాల దర్శకుడు గోవింద్‌ నిహలానీ దర్శకత్వంలో నసీరుద్ధీన్‌షా, ఓంపురి, ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ సినిమా… మిలటరీలో జరిగే కోవర్ట్‌ ఆపరేషన్‌ అనే అంశాన్ని వెలికి తెచ్చింది. తీవ్రవాద నాయకుడిగా ఆశిష్‌ విద్యార్థి చెప్పే వాదనలోని అసలు విషయాన్ని తేటతెల్లం చేసింది.

ఈ తరహా సినిమాల విషయానికొస్తే.. జాన్‌ మాధ్యుమత్తన్‌ దర్శకత్వంలో వచ్చిన సర్పరోష్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అంతవరకూ మన సినిమాలో టెర్రరిజానికి కారణం విదేశీ శక్తులే అని అన్యాపదేసంగా పాకిస్థాన్‌ను గుర్తు చేసేవారు. కానీ ఈ సినిమాలో మాత్రం తొలిసారిగా దేశంలోని ఉగ్రవాద కార్యకలాపాలపై పాకిస్థాన్‌నే స్ట్రైట్‌గా వేలెత్తి చూపారు. అమీర్‌ఖాన్, నసీరుద్ధీన్‌షాలు నటించిన ఈ సినిమా.. జాతీయసమగ్రతకు భంగం కల్గిస్తున్న టెర్రరిస్ట్‌ కార్యక్రమాలను చక్కగా చూపించింది. ఇలాంటిదే తెలుగులో వచ్చిన ఖడ్గం కూడా.

ఇక సంతోష్‌ శివన్‌ దర్శకత్వంలో వచ్చిన ది టెర్రరిస్ట్‌ సినిమాది మరో కథ. ఈశాన్య తీవ్రవాద ఉద్యమం నేపథ్యంగా వచ్చిన ఈ సినిమాలో ఓ యువతి ఆత్మాహుతి దళంగా మారడం ప్రధానాంశం. మహేష్‌భట్‌ దర్శకత్వంలో వచ్చిన ధోకా… సినిమా కూడా మహిళా టెర్రరిస్ట్‌ జీవన నేపథ్యంగా వచ్చిందే. అయితే ఈ సూసైడ్ బాంబర్‌ కథలన్నింటికీ వెనుక రాజీవ్‌గాంధీని హత్య నేపథ్యం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

వీటికి భిన్నంగా కునాల్‌ కోహ్లీ దర్శకత్వంలో వచ్చిన ఫనాహ్‌ సినిమా మేల్‌ సూసైడ్‌ బాంబర్‌ కథతో నిర్మాణమైంది. ఇందులో అమీర్‌ఖాన్‌ ఆత్మాహుతి దళ సభ్యుడిగా, కరడు గట్టిన టెర్రరిస్ట్‌గా కనిపిస్తాడు.

మణిశంకర్‌ డైరక్షన్‌లో వచ్చిన డిసెంబర్‌ 16 సినిమా భారత్‌పై పాకిస్తాన్‌ అణు బాంబు ప్రయోగానికి సంబంధించిన స్ట్రేటజీతో కూడిందని చెప్పొచ్చు. అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన టాంగో చార్లీ సినిమా ఈశాన్య రాష్ట్రాల్లోని టెర్రరిస్టుల ఏరివేతలో ఆర్మీ సైనికుల వీరోచిత పోరాటాల నేపథ్యంగా వచ్చింది. సన్నిడియోల్‌ హీరోగా వచ్చిన జోబోలే సోనిహాల్‌ సినిమా… ద హీరో సినిమాలు సరిహద్దు తీవ్రవాదం గురించి ప్రస్తావించాయి.

బాలివుడ్‌ కమర్షియల్‌ సినిమాల్లోని ఒకప్పటి ముగాంబో…. జమీందార్‌ వంటి విలన్ల స్థానంలో క్రమంగా టెర్రరిస్టులు కూడా కొత్త విలన్‌లుగా అవతారం ఎత్తారు. అందుకే ఇటీవలి బాలీవుడ్‌ యాక్షన్‌ ధ్రిల్లర్‌ సినిమాల్లో టెర్రరిస్ట్‌లే ప్రధాన విలన్‌లుగా ఉంటున్నారు. అయితే ఈ తరహాలో కథలు అల్లుకోవడానికి ప్రస్తుత పరిణామాలే కారణం చెప్పాలి.

బాలీవుడ్‌ సినిమాల్లో వాస్తవికంగా జరిగిన టెర్రరిస్ట్‌ దాడుల నేపథ్యాన్ని స్వీకరించడం ఎక్కువైంది. అంటే రియల్‌ లైఫ్‌ ఇన్సిడెంట్‌లను రీల్‌లైఫ్ కథలుగా మలచుకోవడం అనే ట్రెండ్‌ విస్తరించిందన్నమాట. రోహిత్‌ షెట్టి దర్శకత్వంలో అజయ్‌ దేవగన్‌-అభిషేక్‌ బచ్చన్‌ హీరోలుగా వచ్చిన జమీన్‌ సినిమా అలాంటిదే.

అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్‌లో కాందహార్‌లో హైజాక్‌ గురైన భారతీయ విమానం వాస్తవిక సంఘటన ఆధారంగానే ఈ సినిమాను నిర్మించారు. అలాగే జాన్‌ అబ్రహమ్‌-అర్షద్‌వార్సీ నటించిన కాబూల్‌ ఎక్స్‌ప్రెస్‌ సినిమాకు ఆఫ్ఘనిస్తాన్‌ టెర్రరిస్ట్‌ పోరాటాలే నేపథ్యం. అపూర్వ లఖియా దర్శకత్వంలో వచ్చిన మిషన్‌ ఇస్తాంబుల్‌ అయితే ఆల్‌ఖైదా ఆపరేషన్‌ ఇతివృత్తంతో రూపొందిందే.

సామాజిక శాస్త్రవేత్తలను, సైకాలజిస్టులను, ఇతర నిపుణులను వేధిస్తున్న ప్రశ్న ఒకే ఒక్కటి. ఇటీవలి కాలంలో లెక్కకు మిక్కిలిగా వస్తున్న ఈ టెర్రరిజం నేపథ్య సినిమాలు టెర్రరిజాన్ని గ్లోబల్‌ చేస్తున్నాయా? టెర్రరిస్టులకు ప్రేరణనిస్తున్నాయా? వారికి కొత్త వ్యూహనిర్మాణానికి ఏవైనా క్లూలు ఇస్తున్నాయా? ఇప్పుడు అందరి మదిలో ఇవే ప్రశ్నలు.

కొన్ని సందర్భాల్లో రియల్ లైఫ్ సంఘటనలు… సినిమా రీల్ లైఫ్‌ని అనుకరిస్తున్న దాఖలాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. దీనికి ఈ సంవత్సరం జూలై 26న జరిగిన అహ్మదాబాద్‌ బాంబు పేలుళ్లే చక్కని ఉదాహరణ. ఈ విధ్వంసం జరగడానికి ముందు జూలై 18న దేశవ్యాప్తంగా ‘కాంట్రాక్ట్‌’ అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా కథ మాఫియా-టెర్రరిజం మధ్య ఏర్పడ్డ అవినీతి.. అందులో భాగంగా భయోత్పాతం కల్గించడం కోసం బాంబుపేలుళ్ల స్ట్రాటజీని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తారు. ఈ ప్లాన్ అంతా కాంట్రాక్ట్‌ సినిమాని పోలి ఉండటం… ఇంటెలిజెన్స్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

1993లో ముంబయిలో సంభవించిన సీరియల్‌ బాంబ్ బ్లాస్టుల నేపథ్యం… పూర్తి రియలిస్టిక్‌ పంథాలో నిర్మించిన సినిమా ‘బ్లాక్‌ ఫ్రైడే’. అనురాగ్ కశ్యప్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టెర్రరిజం విచ్చలవిడిగా విస్తరించడంలో రాజకీయాలు.. పోలీసుల పాత్రను ప్రధానకారకంగా చూపించడం వివాదాస్పదమైంది. ఎన్నో సెన్సార్‌ సమస్యల తర్వాత ఈ సినిమా విడుదలైంది.

ఇక మరో విషయం ఏమంటే… బాలీవుడ్ సినిమా చరిత్రలో 2008 సంవత్సరం ‘టెర్రరిజం స్పెషల్‌’ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చిన చాలా సినిమాలకు నేపథ్యం అంతా టెర్రరిజమే. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘కాంట్రాక్ట్‌’… మిషన్ ఇస్తాంబుల్‌ సినిమాలు ఈ ఏడాది విడుదలైనవే. అలాగే సుభాష్‌ఘాయ్‌ దర్శకత్వంలో వచ్చి “బ్లాక్‌ అండ్‌ వైట్‌” సినిమా – ఢిల్లీలో బాంబు పేలుళ్ల ద్వారా విధ్వంసం సృష్టించాలని ప్రయత్నించే సూసైడ్‌ బాంబర్‌ కథాంశమే. అలాగే షైనీ అహూజా నటించిన “హైజాక్‌” సినిమా టెర్రరిస్టుల వల్ల ఏరోప్లేన్ హైజాక్ అయ్యే కథాంశంతో కూడినదే. అలాగే సమీర్ దత్తానీ హీరోగా వచ్చిన ‘ముఖ్‌బీర్‌’ సినిమా టెర్రరిస్టులలో, పోలీసులలో ఉన్న ఇన్‌ఫార్మర్ల వ్యవస్థ మీద తీసిన కథే.

2008 సంవత్సరం బాలీవుడ్‌ టెర్రరిస్ట్ స్పెషల్ సంవత్సరం కాగా, UTV ప్రొడక్షన్స్‌ సంస్థ టెర్రరిస్ట్‌ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరుపొందింది. ఈ నిర్మాణ సంస్థ ఈ సంవత్సరం ఇప్పటికే ‘అమీర్‌’… ‘ఎ వెడ్‌నెస్‌ డే’ , ‘ముంబయ్‌ మేరీజాన్’ అనే మూడు టెర్రరిస్ట్ నేపథ్య సినిమాలను తీసింది. అనుకోకుండా టెర్రరిస్టుల వలయంలో చిక్కుకుపోయిన సాధారణ పౌరుని అంతరంగ మథనాన్ని ప్రతిబింబిస్తుంది అమీర్ సినిమా. నీరజ్‌పాండే అనే నూతన దర్శకుడి దర్శకత్వలో అనుపమ్‌ఖేర్‌, నసీరుద్దీన్‌షాలు ప్రధాన పాత్రలుగా వచ్చిన ‘ఎ వెడ్‌నెడ్‌ డే’ సినిమా టెర్రరిజంలోని విభిన్నకోణాల్ని థ్రిల్లర్‌ తరహాలో ప్రజెంట్ చేసింది. ఇక మాధవన్-సోహాఅలీఖాన్‌ జంటగా వచ్చిన ‘ ముంబయ్‌ మేరీ జాన్‌’ కూడా బాంబు పేలుళ్ల నేపథ్య కథాంశమే.

–మామిడి హరికృష్ణ

7 Comments
    • harikrishna mamidi June 13, 2009 /
  1. venkat June 13, 2009 /
    • harikrishna mamidi June 13, 2009 /
  2. గీతాచార్య June 13, 2009 /
  3. Dhanaraj Manmadha June 14, 2009 /