Menu

తీవ్రవాదం నేపథ్యం లో సినిమాలు-1

ఒకానొక రోజు…

కాలచక్రంలోన ఎన్నో రోజులలో అదీ ఒకరోజు…

ప్లేస్‌ ఎక్కడైనా, ఏదైనా కావచ్చు. న్యూయార్క్‌… లండన్… ముంబాయి… అహ్మదాబాద్‌, హైద్రాబాద్‌…

ఎప్పట్లానే ఆ రోజు కూడా ప్రజలంతా ఎవరి పనుల్లో వారు బిజీగా పరుగులు పెడుతూ ఉన్నారు…

పిల్లలు, పెద్దలతో పాటు అన్ని వయసుల వారూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు..

వాళ్లలోనే భర్తలు, భార్యలు, తండ్రులు, తల్లులు, అన్నలు, సోదరులతో పాటు సమస్త బంధువర్గాలు… ఏ వెలుగుల కోసమో, ఏ జీవన సాఫల్యం కోసమో పెడ్తున్న పరుగులున్నాయి…

హఠాత్తుగా ఓ విస్ఫోటం, బాంబ్‌ బ్లాస్ట్‌…

సీన్‌ కట్‌ చేస్తే…

విలయం, విధ్వంసం, వినాశనం, విపరీతం…

కలలు ఆవిరైన దృశ్యం…

స్వప్నాలు కూలిపోయిన చిత్రం..

ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సన్నివేశం..

ఒక్క ఉలికిపాటు… ఒక్క గుండెపోటు…

ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఉగ్రవాద విశ్వరూపం….

తీవ్రవాద బీభత్సం…

ఈ తీవ్రవాదం, తీవ్రవాద సమస్య, తీవ్రవాద పర్యవసానాలు నేపథ్యంగా మనవాళ్లు ఎన్నో సినిమాలు తీశారు.

దేశంలోనూ… ప్రపంచమంతటా వేయినాల్కలు చాచి ఉగ్రవాదం ఉరకలెత్తుతోంది. కోటి కోరలతో తీవ్రవాదం వెంటపడుతోంది. ఇలాంటి ఏ సామాజిక సందర్భాన్ని అయినా కళ,సాహిత్యం, సినిమా డాక్యుమెంట్‌ చేయడం సహజం. వీటకి స్పందనగా కవులు కవిత్వం రాస్తారు. నిర్మాత, దర్శకులేమో ఇంతటి విధ్వంసానికి కారణమైన టెర్రరిజం నేపథ్యంతో ఎన్నెన్నో సినిమాలు తీశారు…తీస్తున్నారు.

టెర్రరిజం విజృంభించడానికి కారణాలు ఎన్ని ఉన్నా… ఏవైనా ఈ సినిమాలు మాత్రం ప్రజల్లో , ప్రేక్షకుల్లో టెర్రరిజం పట్ల… టెర్రరిస్టుల పోరాటాలు, సిద్దాంతాల పట్ల అవగాహనను కల్పించడంలో మాత్రం సక్సెస్‌ అయ్యాయి. అవుతున్నాయనే చెప్పాలి. అయితే ఎన్నెన్నో రకాల నేపథ్యాలతో ఇప్పటికీ వందలాది సినిమాలు సృష్టించిన బాలీవుడ్ సినీ నిర్మాత, దర్శకులు గత కొంతకాలంగా తమ సినిమా కథలకు టెర్రరిజం నేపథ్యాన్ని ఎంచుకోవడం అనేది ట్రెండ్‌గా మారింది… ఈ టెర్రరిజం నేపథ్య సినిమాల గురించి తెల్సుకునే ముందు మన దేశంలో టెర్రరిజం యొక్క విశృఖుల విహారాన్ని తెల్సుకోవడం అవసరం.

గ్లోబల్‌ టెర్రరిజం డేటాబేస్ అనే అంతర్జాతీయ సంస్థ నివేదిక ప్రకార మనం దేశంలో 1970 నుంచి ఇప్పటివరకూ మొత్తం 4140 వరకూ వివిధ ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడులన్నింట్లో 12వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ సమస్య ఇంకా ఆరు రెట్లు అంటే 72వేలకు పైగానే ఉంది. కాగా, SIMI, లష్కర్‌, దక్కన్‌ ముజాహిదీన్‌లతో పాటు మన దేశంలో దాదాపు 58సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నాయి.

న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై సెప్టెంబర్‌11, 2001 నాటి ఆత్మాహుతి దాడులు గ్లోబల్‌ టెర్రరిజంలోని బీభత్సాన్ని ప్రపంచానికి తెలియచెప్పాయి. టెర్రరిజం ఇప్పుడు ప్రాపంచిక సమస్య అయింది. మాడ్రిడ్‌, లండన్, బాలి నగరాలు దీనికి బలైపోయాయి. మనదేశంలో ముంబాయి, బెంగళూరు, హైద్రాబాద్‌, సూరత్‌, అహ్మదాబాద్‌ నగరాలు ఉగ్రవాద అగ్నికి సమిధలయ్యాయి. ఇటీవలి వరుస బాంబుపేలుళ్లతో…, తాజ్‌, ట్రైడెంట్ హోటళ్లు ఉదంతంతో టెర్రరిజం ‘టాపిక్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా మారింది. సినిమాలలో కూడా అదే ప్రతిబింబించింది.

టెర్రరిజం నేపథ్యంగా వచ్చిన సినిమాల విషయానికొస్తే మొదటిగా చెప్పుకోవాల్సిన సినిమా మాచిస్‌. మంచి సినిమాల దర్శకుడు గుల్జార్ దర్శకత్వంలో టబు-చంద్రచూర్‌ సింగ్ జంటగా ఈ సినిమా పంజాబ్ ప్రాంతంలోని సిక్కు టెర్రరిజం కథతో రూపొందింది. అయితే ఈ సినిమాలో పోలీసులు -ప్రభుత్వాల వల్ల సామాన్య పౌరులు టెర్రరిస్టుల ముద్రతో పడుతున్న కష్టాలనే చిత్రించడం జరిగింది. కాగా… కాశ్మీర్‌ ప్రాంతంలోని టెర్రరిజం నేపథ్యంతో వచ్చిన సినిమాలు సైతం చాలానే ఉన్నాయని చెప్పాలి. ఈ కోవలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమా “రోజా”. మణిరత్నం దర్శకత్వంతో అరవిందస్వామి-మధుబాల జంటగా వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌ పార్మాట్‌తో కాశ్మీర్‌ ప్రాంతంలోని టెర్రరిస్టు మూవ్‌మెంట్‌ని… జిహాదీ పోరాటాన్ని తెరకెక్కించింది. పురాణ కథ అయిన సావిత్రి-సత్యవంతుల కాలం నాటి కథకు… సమకాలీన సమస్య అయిన కాశ్మీర్‌ టెర్రరిజాన్ని జోడించి తీసిన ఈ సినిమా తమిళ, తెలుగు, హీందీ భాషలన్నింట్లో అపూర్వ విజయాన్ని సాధించింది. టెర్రరిస్టు కార్యకలాపాలను సైనికుల ఆపరేషన్స్‌ను వాస్తవిక కోణం నుంచి ఈ సినిమా ప్రాజెక్ట్‌ చేసింది.

ఇక, కాశ్మీర్‌లోని తీవ్రవాద సమస్య నేపథ్యంగానే విధు వినోద్‌చోప్రా ‘మిషన్‌ కాశ్మీర్‌’ అనే సినిమా తీశారు. సంజయ్‌దత్‌, హృతిక్‌రోషన్‌ హీరోలుగా నటించారు. ఓ మిలిటరీ ఆపరేషన్‌లో చనిపోయిన టెర్రరిస్ట్‌ కొడుకును సైనికాధికారి సంజయ్‌దత్‌ పెంచుకుంటాడు. ఎంతో ప్రేమతో పెరిగిన ఆ కుర్రాడు పెద్దయిన తరువాత తన తండ్రి తీవ్రవాదిగా మరణించాడని తెల్సుకుని… తను జీహాదిగా మారతాడు. అలాగే “యహాన్‌” అనే సినిమా … “యు హోతా తో క్యా హోతా” అనే సినిమా ప్యారడైజ్ ఆన్ ఎర్త్‌ అని పిలిచే కాశ్మీరం… కల్లోల ప్రాంతంగా మారుతున్న దృశ్యాలను చిత్రించారు.

అయితే, ఇప్పటివారంతా వచ్చిన టెర్రరిజం నేపథ్య సినిమాలలో విభిన్న కోణాల నుంచి వేర్వేరు సినిమాలు తీసిన క్రెడిట్ – క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నందే అని చెప్పాలి. ఆయన “దిల్‌సే” సినిమాలో ఈశాన్య రాష్ట్రాలలోని తీవ్రవాదాన్ని నేపథ్యంగా తీసుకున్నారు. షారూఖ్‌ఖాన్‌-మనీషాకొయిరాలా నటించిన ఈ సినిమాలో మనీషా హ్యూమన్‌బాంబ్‌గా నటించింది. అలాగే ఆయన తీసిన ‘అమృత’ సినిమాలో శ్రీలంకలోని తమిళ టెర్రరిస్టు వారి విముక్తి పోరాటల గురించి తీశారు. ఇవే కాకుండా, కాలిద్ మొహమ్మద్ దర్శకత్వంలో వచ్చిన “ఫిజా ” సినిమాను కూడా ప్రస్తావించుకోవాలి. కరిష్మాకపూర్-హృతిక్‌రోషన్‌-జయాబచ్చన్‌ ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ సినిమాలో తీవ్రవాదం మోజులో తప్పిపోయిన తమ్ముడి కోసం అన్వేషించే అక్క ఆత్మరోదన గుండెల్ని మెలిపెడుతుంది.

భారతీయ సినిమా ప్రధానోద్ధేశం ఎంటర్‌టైన్‌మెంట్‌… అయితే.. సమకాలీన సమస్యలను.. సామాజిక పరిణామాలను.. కథలుగా అల్లడంలో వెండితెర ఎప్పుడూ వెనకబడలేదు. ప్రయోగాలకు పెద్దపీట వేయడంలోనూ ముందే ఉంది.

టెర్రరిజం నేపథ్యంలో తీసిన సినిమాలన్నీ సీరియస్‌గా కమిట్‌మెంట్‌తో తీసినవి కావడం వల్ల పూర్తి స్థాయిలో పరిశోధన… వాస్తవిక సంఘటనల స్ఫూర్తితోనే ఈ కథలను అల్లుకున్నారు.

–ఇంకా ఉంది

–మామిడి హరికృష్ణ

7 Comments
  1. vinay June 12, 2009 /
  2. గీతాచార్య June 12, 2009 /
  3. రాజయ్య June 13, 2009 /
  4. sheela June 14, 2009 /
  5. TSRao June 18, 2009 /
    • harikrishna June 19, 2009 /