Menu

కత్తెర కథ

“the great editing skill will protect the director from committing suicide”
– Sean penn, Actor/Director

editor“కట్” అనే మాట సినిమా ప్రారంభమై రోజుల్లో అస్సలుండేదే కాదు. రైలు ప్రయాణించడమో, ఫ్యాక్టరీ నుంచీ వర్కర్లు బార్లుబార్లుగా బయటికి రావడమో లాంటి నిత్యజీవిత దృశ్యాల్ని ఆ దృశ్యం అయిపోయేవరకో లేక  కెమరాలో ఫిల్మ్ అయిపోయేంతవరకో అట్టాగే పెట్టేసి తెరకెక్కించి జనాలకు చూపించేసేవాళ్ళు. ఇందులోని వైవిధ్యం కొంతే. కదులుతున్న నిత్యజీవితంలోని బొమ్మల్నే, వీధుల్లో సందుల్లో కనిపించే దృశ్యాల్నే డబ్బులిచ్చిమరీ తెరమీద  ఎన్నాళ్ళని చూస్తారూ! అందుకే సినిమా ఒక పనికిరాని భవిష్యత్తేలేని సాంకేతిక  ప్రయోగంగానే మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడొచ్చాడు కత్తెర తీసుకుని మన ప్రప్రధమ ఎడిటర్ ఎడ్విన్ పోట్టర్.

ఎడ్విన్ పోట్టర్ తన కత్తెరతో “ఇంటర్ కట్” అనే ఒక అద్వితీయ ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. ఒకే సమయంలో జరుగుతున్న రెండు వేరు వేరు పరస్పర సంబంధమైన ఘటనల్ని మార్చిమార్చి చూపించడం ద్వారా ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఒకవైపు మంటల్లో రగులుతున్న భవనం. మరోవైపు గుర్రబ్బళ్ళలో మంటల్ని ఆర్పడానికి వస్తున్న ఫైర్ మెన్. వచ్చారా…రక్షించారా…ఏమయ్యింది అని ఉత్కంఠంతో ప్రేక్షకులు ఊపిరిబిగబట్టి సినిమా చూశారు. 1903 లో సినిమాల్లో ఎడిటర్ జన్మించాడు. దానితోపాటూ ఒక కొత్త భాష, కొంగ్రొత్త కళ ఉద్భవించాయి. ఒక్క కనురెప్ప మూసిన క్షణంలో దిగంతాలనుంచీ అనంతాలవరకూ, మానవ ముఖకవళికలనుంచీ తన బుర్రలోని అధోలోకాలవరకూ తెరమీద ఆవిష్కరించగల కళారూపం సృష్టించబడింది.

ఏడిటింగ్ సమయాన్ని నిదానించగలదు. సమయాన్ని వేగవంతం చెయ్యగలదు. ఒక్క కట్ తో ప్రేక్షకుల్ని కుర్చీల్లోంచి లేచి నుంచోపెట్టగలదు. ఆశ్చర్యపరచగలదు. భయపెట్టగలదు. షాట్ నిడివి, సీన్ నడవడికను నిర్ణయించి కథన రీతిని నిర్దేశింగలదు.  ప్రేక్షకులభావేశాన్ని నియంత్రించగలదు. బహుశా తన జీవితాన్ని నిర్దేశించాలనుకునే మనిషిలోని అంతర్లీన కోరికకు ఎడిటింగ్ ప్రతీకలాగా అనిపిస్తుంది. ప్రతి మనిషీ తన జీవితంలోని బోరుకొట్టే చెడ్డభాగాలను కత్తిరించి పారెయ్యాలనుకుంటాడు. ఆసక్తికరమైన భాగాలను నిదానంగా,లోతుగా తరచి చూసి ఆనందించాలనుకుంటాడు. ఆవేశాన్నీ కోపాన్నీ ఉద్వేగాన్నీ వేగంగా ముగించెయ్యాలనుకుంటాడు. అదే సౌలభ్యం ఎడిటింగ్ లో ఉంది. బహుశా ఎడిటింగ్ వలనే మనిషికి సినిమా నచ్చుతుంది. ఎడిటింగ్ లేకపోతే సాధారణ జీవితంలాంటి సినిమా బోర్ కొట్టదూ!

రచయితకు పదం లాగా. సంగీత విద్వాంసుడికి స్వరంలాగా. ఎడిటర్ కు “ఫ్రేం” అతి ముఖ్యం. సాధారణంగా రెండున్నర గంటల నిడివిగల సినిమా తియ్యాలంటే కనీసం రెండువందల గంటల ఫిల్మ్ ఎక్పోజ్ చెయ్యల్సొస్తుంది. ప్రతి సెకనుకు 24 ఫ్రేముల చొప్పున రెండొందల గంటల ఫిల్మ్ లో ఎన్ని ఫ్రేములుంటాయో ఒకసారి లెక్కెయ్యండి…హమ్మో! అనిపించదూ. కానీ ఈ కోట్లది ఫ్రేముల్ని కట్ చేసి వీనులవిందైన,కనులకు పసందన, మిగతా ఇంద్రియాలకు ఇంపైన సినిమా సంగీతాన్ని అందించే కళాకారుడే ఎడిటర్.

అలాంటి కత్తెర కళాకారుల్లో ఆదిగురువు ఎడ్విన్ పోట్టర్ అయినా, ఆధునిక ఎడిటింగ్ కళకు నిర్వచనం చెప్పింది మాత్రం డి.డబ్లూ. గ్రిఫిత్ అని చెప్పుకోవాలి. పోట్టర్ తో పది సంవత్సరాలు పనిచేసిన గ్రిఫిత్ ఎడిటింగ్ యొక్క ఓనమాల్ని సృష్టించాడని చెప్పొచ్చు. అలాగే షాట్ ల విభజన,జోడింపు ద్వారా ప్రేక్షకుల్ని ఎలా సమ్మోహితుల్ని చెయ్యాలో 1912 లో తను చేసిచూపిన తీరు ఎడిటింగ్ కు మూలమైన వ్యాకరణంగా ఈ నాటికీ నిలిచి ఉంది. అప్పటి వరకూ నాటకలలో కొంత దూరం నుంచీ మాత్రమే నటుల్ని కాళ్ళనుంచీ తలదాక చూసిన ప్రేక్షకులకు ఒక్కసారిగా ముఖాన్ని పెద్దగా క్లోజప్ లో చూపించి చకితుల్ని చేసాడు. ఇలా వివిధ సైజుల్లో షాట్లను కంపోజ్ చేసి కొత్త వ్యాకరణాన్ని సృష్టించాడు. క్లోజప్, లాంగ్ షాట్, మిడ్ షాట్ అంటూ మనం సాధారణంగా చెప్పుకునే సినీపదజాలానికి ఆద్యుడు గ్రిఫిత్. ఈ షాట్లను సృజనాత్మకంగా జోడించి ప్రేక్షకుల్లో రసస్పందనను కల్పించిన ఆధునిక కత్తెర మాంత్రికుడు గ్రిఫిత్.

1914 లో వచ్చిన “బర్త్ ఆఫ్ నేషన్” సినిమా ఇప్పటికీ ఒక అద్భుతమే అని చెప్పాలి. క్లోజప్ లు, ఫ్లాష్ బ్యాక్ లు, ప్యారలెల్ యాక్షన్లూ వంటి ఎన్నో విధానాల ద్వారా ఎడిటింగ్ కళను ముందుకు తీసుకెళ్ళిన సినిమా ఇది. ఈ చిత్రం ద్వారా ఎడిటింగ్ ప్రక్రియకు మూలమైన నియమం “invisible cut”- అదృశ్య కత్తెరను పరిచయం చేశాడు. ఒక షాట్ నుంచీ మరొక షాట్ కు మారేప్పుడు నటుల కదలిక కొనసాగింపుగా ఉండి ప్రేక్షకుడికి ఆ కత్తెర ప్రయోగం తెలీనట్టే ఉండేవిధం “కట్టింగ్ ఆన్ ది మూమెంట్” ను సృష్టించాడు. నేటికీ ఈ విధానం ఒక golden rule గా అనుసరింప బడుతోంది.

అది రష్యన్ విప్లవ తరుణం. గ్రిఫిత్ సృష్టించిన మెలోడ్రామా ఎడిటింగ్ రష్క్యన్లకు బూర్జువాశైలిగా అనిపించింది.1929 లో జిగెరటోవా అనే రష్క్యన్ లఘుచిత్ర దర్శకుడు తన “మ్యాన్ విద్ ద మూఈ కేమరా” తొ ఎడిటింగ్ ను వేగవంతం చేసి సాధారణ దినచర్యను కూడా ఒక విప్లవంలా చూపించి ఎడిటర్ ను విప్లవంలో భాగం చేసి మురిపిస్తే, లెవ్ కుల్షేవ్ అనే నాటకకారుడు విభిన్నైన షాట్లను కూర్చి juxtaposition ద్వారా కొత్త అర్థాల్ని ప్రేక్షకులు అనువదించుకునేలా చేశాడు. ఒకనటుడి ఒకే ముఖకవళికను తీసుకుని ఒకసారి సూప్ బౌల్, మరొకసారి భర్త చనిఫొయి ఏడుస్తున్న మహిళ మరొసారి బొమ్మతో ఆడుకుంటున్న చిన్నారి పాప షాట్లతో జోడించి, ప్రేక్షకులను నటుడు వేరేషాట్లకు అనుగుణంగా స్పందించినట్లుగా భ్రమింపజేసాడు. ఈ ప్రయోగంతో ప్రేక్షకుల సైకాలజీని మ్యానిప్యులేట్ చేసే ఎడిటింగ్ ప్రారంభమయింది.

అంటే కనిపించే ఆ రెండు బొమ్మలకన్నా అవి ఉత్పన్నంచేసే మూడో భావన సినిమాకు ప్రధానంగా తయారయ్యే ప్రక్రియ  ఈ ఎడిటింగ్ తో ప్రారంభమయ్యింది. దాన్నే montage గా వ్యవహరించడం మొదలెట్టారు. సర్గీ ఐజిన్ స్టైన్ ఈ ప్రక్రియకు మార్కిజాన్ని అద్ది “బ్యాటిల్ షిప్ ప్టొంకిన్” తో సంచలనాన్ని సృష్టించాడు. అర్థాన్ని షాట్లద్వారా కాకుండా అవి ఒకదానితో ఒకటి పోటీపడే విధానం ద్వారా తెలపడం ఈ దర్శకుడి దార్శనికతోనే మొదయ్యింది. గ్రిఫిత్ కట్ అదృశ్యంగా ఉండాలి ఆంటే, ఆ కట్ చూపించడం ద్వారా రెండుషాట్లకూ మించిన మూడోఅర్థాన్ని కల్పించాలి అని ఐజిన్ స్టైన్ నమ్మాడు. కమ్యునిజాన్ని కమ్యూనికేట్ చేసే బలవత్తరమైన సాధనంగా సినిమాని చూశాడు. తన విప్లవం కలలు కాదుగానీఆ శైలివలన ఎంటర్ టైన్మెంట్ విప్లవం మాత్రం సినిమాల్లోకి దూసుకొచ్చేసింది.

ఆ తరువాత ఎందరో ఎడిటర్లు, ఎందరో దర్శకులు ఎడిటింగ్ కళను ముందుకు తీసుకెళ్ళి ఇప్పటి ఘనత స్థాయికి తీసుకొచ్చారు.

దురదృష్టవశాత్తూ ఒకప్పుడు  అదృశ్యకత్తెర సృష్టికర్తలైన ఎడిటర్ల పనిని చాలా ఏళ్ళు అదృశ్యంగానే ఉంచేసింది. సరైన గుర్తింపు లేకుండా చేసింది. ఫిల్మ్ ని కట్ చేసే కూలివాళ్ళుగానే ఈ ఎడిటర్లను గుర్తించారేగానీ సృజనాత్మక సినీసృష్టిలో భాగస్వాము గుర్తించడం జరగలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి దానికి విపరీతం. దర్శకుడు అత్యంత ఎక్కువ (ఒంటరి) సమయం గడిపేది ఎడిటర్ తోనే. షూట్ చేసిన రషెస్ ని objective గా చూసి దర్శకుడి ఎమోషనల్ అటాచ్మెంట్ ను తగ్గించి సినిమాను ప్రేక్షకులకు అనుగుణంగా కత్తిరించి దర్శకుడి ప్రతిభకు మెరుగులు దిద్దేది ఎడిటరే. అంటే మనం చూసే సినిమాని “సినిమా” చేసింది ఈ ఎడిటరే.

12 Comments
  1. jonathan June 17, 2009 /
  2. సాయి బ్రహ్మానందం June 17, 2009 /
  3. మేడేపల్లి శేషు June 17, 2009 /
  4. rayraj June 18, 2009 /
  5. Rajasekhar June 18, 2009 /
    • Dhanaraj Manmadha June 18, 2009 /
  6. Dhanaraj Manmadha June 18, 2009 /
  7. VEERNI SRINIVASARAO June 30, 2009 /