Menu

Ed Wood (1994)

Ed_Woodఏదైనా సినిమా చూస్తున్నప్పుడు నటీనటుల పనితనం వీధినాటకాల వాళ్ల నటనకంటే తీసి కట్టుగా అనిపించిందా?, సెట్టింగుల్లో డొల్లతనం కళ్ళు మూసుకున్నా కనిపించిందా? నాసిరకం నిర్మాణ విలువలు అడుగడుగునా విసుగెత్తించాయా? ఇలాంటి సినిమాలకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచన కలిగిందా? .హాలీవుడ్ వాళ్ళు అలాంటి వాటిని ఎడ్‍వూడ్స్ పిల్మ్స్ అని ముద్దుగా పిల్చుకుంటారు. ఈ ఎడ్‍వూడ్ ఎవరా అనుకుంటున్నారా? అయితే మీరు టిమ్ బర్టన్ సినిమా ఎడ్‍వూడ్స్ చూడాల్సిందే. ఆత్మ విశ్వాసం, పట్టుదల, స్నేహితుల తోడ్పాటు ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని చాలా కధల్లో చదివేసి, ఎన్నో సినిమాల్లో చూసేసిన మనకు ఇవన్నీ ఉన్నా అనుకున్నది సాధించలేని ఓ నిజ జీవితాన్ని ఆవిష్కరించే ఈ చిత్రం చేదుగుళిక వంటిది. అయినా దానికి సరైన హాస్యన్ని రంగరించి వైఫల్యంలోని విజయాల్ని వెతుక్కొమ్మంటుందీ ఎడ్‍వూడ్స్ కధ.

1950ల నాటి కాలంలో జయాపజయాలతో పనిలేకుండా వారానికో సినిమాని జనాలమీదకి వదిలేసిన ఓ మహద్దర్శకుని జీవితగాధ ఈ చిత్రం. నాటకరంగంలో విమర్శకులు తన సామర్ధ్యాన్ని సరిగ్గా గుర్తించడంలేదన్న అసహనంతో హాలీవుడ్డే తనకి సరైన చోటని నిర్ణయించుకొని ఎడ్ అక్కడ ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఈ సినిమా ప్రారంభమౌతుంది. జార్జ్ అనే రెండవ రకం సినిమాలు నిర్మించే నిర్మాతను ఒప్పించి ’ఐ ఛేంజ్డ్ మై సెక్స్’ అనే వినూత్న (వాళ్ళిద్దరి దృష్టిలో) చిత్రానికి శ్రీకారం చుడతాడు. ముప్పైవ దశకంలో డ్రాకులా చిత్రాల ద్వారా ఓ వెలుగు వెలిగి చివరి రోజుల్లో చావుకోసం ఎదురు చూస్తున్న బెల లుగొసి అనే ఘనాపాటిని మచ్చిక చేసుకొని తన సినిమాలో నటించేందుకు కుదుర్చుకుంటాడు. బెల లుగొసి జతవ్వడంతో సినిమాకి స్టార్ వాల్యూ వచ్చేసింది కాబట్టి ప్రధాన పాత్రను తనే పోషించేసి, తన ప్రేయసిని హీరోయిన్గా నటింపచేసేస్తాడు. నిర్మాతగారు పోస్టర్ రెడీ చేసుకొని మరీ సినిమా నిర్మాణం మొదలుపెట్టీనా, తన చాకచక్యంతో షూటింగ్ పూర్తయ్యేప్పటికి అనుకున్న కధని రకరకాలుగా మార్చేసి టైటిల్ని ’గ్లెన్ ఆర్ గ్లెన్డా’ అని మార్చేస్తాడు. కేవలం నాలుగు రోజుల్లోనే సినిమాని పూర్తిచేసి గొప్పగా విడుదలచేసి విమర్శకుల ఛీత్కారానికి గురవుతాడు. అయితే ఆర్సన్ వేల్స్ తర్వాత మొదటి సినిమాలోనే రచయిత, నటుడు, దర్శకుడు మొదలైన భాద్యతలు స్వీకరించిన గొప్పవాడిగా తనను తాను అభివర్ణించుకుంటాడు.
జార్జ్ తను చెప్పినట్టుగా కాకుండా అన్నీ మార్చేయడం వల్లే సినిమా ఫలితం వికటించిందని కోపగించి ఎడ్‍ని బయటకి పంపేస్తాడు. చేసేది లేక తన ’గ్లెన్ ఆర్ గ్లెండా’ని వార్నర్ బ్రదర్స్‍కి చూపించి తర్వాతి సినిమాకి ఆర్ధిక సహాయం అడుగుతాడు. తమ జీవితంలో ఇంతటి కళాఖండాన్నీ ఎప్పుడూ చూసుండని ఆ సంస్ధవారు ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఎడ్‍లోని టాలెంటుకు తాము సరితూగలేమని నచ్చ చెప్పి ఇలాంటి సినిమాల్ని తెరకెక్కించాలంటే ఇండిపెండెంట్ ప్రొడక్షన్స్ మొదలు పెట్టుకోవడం ఒకటే మార్గమని సలహా ఇస్తారు. దాంతో తన రెండవ సినిమాగా ’బ్రైడ్ ఆఫ్ ఆటమ్’ అనే సినిమాని మొదలు పెడతాడు. షరా మామూలుగానే లుగొస్‍ని, తన ప్రేయసిని ఇందులో కూడా నటింపజేస్తాడు. ప్రధాన పాత్రకు మాత్రం ఫేడవుటైపోయిన ఒక ఫైటర్ని తీసుకుంటాడు. కష్టపడి సినిమా పూర్తి చేసి ప్రివ్యూ వేస్తే, ప్రేక్షకులందరూ వెంటపడి రాళ్ళతోనూ, చెప్పులతోనూ దాడి చేసి తమ వ్యధను వ్యక్తం చేస్తారు. ప్రియురాలు కూడా ఎడ్ వింత ప్రవర్తన భరించలేక చెయ్యిచ్చేస్తుంది. ఈ అవమానం నుండి తేరుకోక ముందే లుగొస్ అనారోగ్యంతో చనిపోతాడు. ఉన్న ఒక్క స్టార్ని కూడా కోల్పోయి అసహనంతో తర్వాతి సినిమాకి నిధులు వెతుక్కుంటుండగా ఇంటి ఓనర్ అద్దె కోసం వస్తాడు. తనతో ఒక సినిమా తీస్తే వచ్చే డబ్బులతో పన్నెండు క్రైస్తవ సినిమాల్ని తెరకెక్కించొచ్చని బరోసా కల్పించి ఇంటి ఓనర్ని బుట్టలో పడేస్తాడు. అలా మొదలైందే ’ గ్రేవ్ రోబర్స్ ఫ్రం ఔటర్ స్పేస్’ అనే సైంటిఫిక్ రొమాంటిక్ థ్రిల్లర్ . అలవాటు ప్రకారం పూర్తయ్యేప్పటికి టైటిల్ కాస్తా ’ ప్లాన్ 9 ఫ్రం ఔటర్ స్పేస్‍గా’ రూపాంతరం చెందుతుంది. ఈ సినిమా ప్రివ్యూ రోజు తన రెండో గర్ల్ ఫ్రెండ్‍ని పెళ్ళిచేసుకోవడంతో సినిమా ముగుస్తుంది .
ఎడ్‍వూడ్స్ గురించి సినిమా అనగానే మొదట చాలామంది టిమ్‍బర్టన్‍ని రకరకాలుగా వారించారంట. అయినా సరే తనకున్న పలుకుబడినంతా ఉపయోగించి మరీ ఈ సినిమాని పూర్తిచేసాడు టిమ్‍బర్టన్‍. తాను ఎడ్ అభిమానిని అని చెప్పుకునే టిమ్, ఎడ్ వ్రాసిన కొన్ని ఉత్తరాలు చదివి ఆశ్చర్యపోయాడంట. తన ఉత్తరాల్లో సినిమాల గురించి వ్రాస్తూ తానేదో సిటిజెన్ కేన్ సినిమా తీస్తున్నంత గొప్పగా పీలయ్యేవాడంట ఎడ్. చాలాసార్లు తన తరంవారిలో ఆర్సన్ వేల్స్ తర్వాత తానే సినిమాకి సంబంధించిన అనేక శాఖల్ని నిర్వహించిన ప్రతిభావంతుడిగా పేర్కొన్నాడు కూడా ఎడ్. ఇక ఇంతటి మితిమీరిన స్వాభిమానాన్ని ప్రదర్శించే ఎడ్‍గా నటించింది జానీడెప్. తనకి జోడీ సారా జస్సికా పార్కర్ ( సెక్స్ అండ్ ది సిటీ ఫేం). జానీ డెప్ ఎంతగా ఈ పాత్రకి సరిపోయాడంటే, మీరు కనుక గ్లెన్ ఆర్ గ్లెండాలో నిజమైన ఎడ్‍ను ఈ సినిమాలో గ్లెన్ ఆర్ గ్లెండా షూటింగ్ సీన్లలోని జానీడెప్‍ను ప్రక్కప్రక్కన పెడితే ఎవరెవరో పోల్చుకోలేరు. కేవలం అలంకరణ మాత్రమే కాదు, పూర్తిగా ఎడ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసాడు జానీ డెప్. తర్వాత చెప్పుకోవాల్సిన పేరు బెల లుగొసిగా చేసిన మార్టిన్ లాండౌ గురించి. వీళ్ళిద్దరి మధ్యా సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. ముఖ్యంగా లుగొసి ఆత్మహత్యా ప్రయత్నాలు చేసే సన్నివేశాలు. 1950ల నాటి అనుభూతి రావడం కోసం సినిమా అంతా నలుపు&తెలుపులలోనే చిత్రీకరించారు. ఇక ఎడ్‍తో ప్రతి సినిమాకి పనిచేసేవారితో ఉన్న సన్నివేశాలు కూడా చాలా నవ్వు తెప్పిస్తాయి. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడ కోసం ప్రతిషాట్‍ను ఒకే టేక్‍లో ఒకే చెసెయ్యడం, సెట్టింగులు పడిపోతున్నా పట్టించుకోకుండా చిత్రీకరించేయడం, లుగొసి చనిపోయాక అతనికి డూప్ పెట్టి కవర్ చెయ్యడం కోసం చెయ్యి ముఖానికి అడ్డు పెట్టుకొని నటింపచేయడం, సినిమాకి పనిచేసేవాళ్ళు కూడా ఒక్కోసారి కెమెరాలో కనిపించేయడం, ప్రపంచ యుద్ధానికి సంబంధించినవి, ఎవరో సాహస యాత్రికులు తీసిన ఆక్టోపస్ వంటి raw footageని అవసరం ఉన్నా లేకున్నా అక్కడక్కడ తన సినిమాల్లో చొప్పించేయడం వంటి మొదలైన అంశాలని చాలా ఆహ్లాదంగా చిత్రీకరించారు.

ఎక్కడా విసుగు అనేది అనిపించకుండా నడిచిపోయే ఈ చిత్రం సరైనా ప్రచారం చెయ్యకపోవడం వల్ల అప్పట్లో అంతగా ఆదరణకు నోచుకోలేదు కానీ డివీడిల రూపంలో బాగానే నడిచింది. ఎడ్ జీవితాన్ని చూస్తే మనం అసహ్యించుకొనే ఎన్నో ( ముఖ్యంగా మనకు పరిచయమున్న చిన్న తెలుగు సినిమాలు ) సినిమాల వెనుక కూడా ఎంతో శ్రమ ఉన్నదన్న ఆలోచన కలిగి వాళ్ళపైన కూడా సానుభూతితో కూడిన గౌరవం కలుగుతుంది. ఎప్పుడూ విజయాన్ని రుచి చూడకపోయినా ఎడ్ ప్రతి సినిమాకి తప్పకుండా పనిచేసే కొంతమందిని సంపాదించుకోగలిగాడు. వీళ్ళంతా ఏం చూసి ఎడ్‍ని అంటిపెట్టుకొని ఉన్నారన్నది అంతుతెలియని ప్రశ్న. వీళ్ళంతా తెరవెనుక, తెరముందు కూడా చాలా సార్లు తమ శ్రమ దారపోసినవారే. కొంతమందంతే కష్టపడ్డం తెలుసు కానీ, సరైన విధానం తెలీదు. ఏదో చేసేస్తున్నాం అని కాకుండా చేసే పనిలో నాణ్యతని తరచి చూసుకోవాలన్న విషయాన్ని ఎత్తిచూపుతుంది ఎడ్ జీవితం.
అమెరికాలో కొన్ని ప్రముఖ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్లో ఎడ్ సినిమాలకి సంబంధించి ఒక ప్రత్యేకమైన సిలబస్ కూడా ఉంది. సినిమాలు తీసేప్పుడు ఎలాంటి తప్పులు చెయ్యకూడదో నేర్పడం కోసం ఎడ్ సినిమాల్ని విద్యార్ధులకి చూపిస్తారు. ఏదో ఒక విధంగా చలనచిత్ర రంగంలో తన పేరు నిలబెట్టుకున్న ఎడ్‍వూడ్స్ నిజంగా వైఫల్యంలో విజయం సాధించినట్టే.

3 Comments
  1. గీతాచార్య June 25, 2009 /
  2. మేడేపల్లి శేషు June 25, 2009 /