Menu

అవకాయ బిర్యానీ గురించి మరోసారి

‘దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్క మొరిగిందన్నట్టు’ డబ్బాలు తిరిగొచ్చిన యిన్ని రోజుల తరువాత, ఈ సినిమా గురించి, యిప్పటికే నవతరంగంలో రెండు వ్యాసాలు వచ్చేకా, యింకో టపా రాయడం అవసరమా అన్న విషయం పరిగణించాను. ఈ సినిమా గురించే కాక, ఈ తరహా సినిమాల గురించి కలిగిన అభిప్రాయాలకి నాకు స్పష్టత కలగడంకోసం టపా రాయచ్చని భావనతో, యిక్కడైతే కొంత చర్చ జరిగే అవకాశం వుండటం ఈ టపా ప్రచురించడంలో వుద్దేశ్యం.

సినిమాలో నాకు నచ్చిన అంశాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా హీరోయిన్ (లక్ష్మి) తండ్రి పాత్రా చిత్రణ, ఆ పాత్రధారి (కామేశ్వరరావు?) దాన్ని నిర్వహించిన తీరు చాలాబావున్నాయి. అలాగే దేవరకొండ – ఆ ఊళ్ళోనే షూటింగ్ చేసారో లేదో తెలియదు కానీ – ఏరియల్ షాట్స్, పల్లెటూరిలో సొంతంగా బతకాలన్న యిష్టంతో ఉన్న ప్రధాన పాత్రలు, కొన్ని సన్నివేశాలు, దృశ్యాలు చాలా మంచి ముద్రవేసాయి. నాకు మళ్ళీ మళ్ళీ గుర్తకొచ్చే ఒక దృశ్యం హీరో (అక్బర్) ఆటో టాపు మీద పడుకుని సేద తీరే దృశ్యం, యిన్ని వున్నా ఒక మంచి సినిమా చూసామన్న ఆనందం ఈసినిమా చూస్తే ఎందుకు కలగలేదు అన్నది ప్రశ్న.

ఒక కారణం, ఈ సినిమాలో క్లైమేక్స్ – అక్బర్ ముస్లిమ్ అని తెలిసిన తరువాత లక్ష్మి తండ్రి, వాళ్ళ వివాహానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో హీరో అక్కడనుంచి నిష్ర్కమించడం, ‘రెండు సంవత్సరాల తరువాత’ అనే బోర్డు, తరవాత పంచాయితీ ప్రెసిడెంట్ గా అక్బర్ ఉపన్యాసం విన్న లక్ష్మి తండ్రి వాళ్ళ పెళ్ళికి అంగీకరించడం – అసంతృప్తిగా అనిపించింది. ఆసక్తి కరమైన అశం ఏమంటే, నవతరంగంలో వున్న స్క్రీన్ ప్లే (4వ చిత్తుప్రతి) చూస్తే, అందులో ముగింపు అలా లేదు. వాళ్ళు పెళ్ళి చేసుకోలేదనీ, పరిణితిగల మనుషుల్లా ఎడబాటుని అధిగమించారని ఆ సూచనతో సినిమా ముగించాలని ఉంది. పెళ్ళి చేసుకోవడం రాజకీయంగా సరైన ముగింపు అవుతుందని భావించడం చేతో, సంతోషకరమైన ముగింపు వ్యాపారాత్మకంగా సినిమాకి మంచిదని భావించో ఆ తరువాత మార్చి ఉంటారు, నా వరకైతే, యిప్పుడు పరిస్థితులు అనుకులించక సాధ్యం కాలేదు కానీ భవిష్యత్తులో మరోచోట, మరో పరిస్థితుల్లో అలాంటి జంటలు ఏకమవగలిగే అవకాశం ఉందన్న సూచనతో ముగించడం యిలా నడిపించిన సినిమాకి సరిపోయేదోమో అనిపించిది. ఒకవేళ అక్బర్ లక్ష్మిని ఎలా పెళ్ళి చేసుకున్నాడో చెప్పడమే సినిమా ఉద్దేశ్యం అయితే, అక్బర్ పంచాయితీ బోర్డు ప్రెసిడెంట్ గా ఎన్నికవడంతో ప్రారంభించి, మిగతా కథంతా ఫ్లాష్ బ్యాక్ గా చెప్పి, పెళ్ళితో ముగించడం లాంటి విధానం అవలంభించి ఉడచ్చనిపించింది.

కొంత అభిరుచితో, విలువలగురించిన పట్టింపుతో తీసిన ఈ తరహా వ్యాపారాత్మక చిత్రాల అవసరం తెలుగులో చాలానే వుంది. ఒక పని ఎలా చెయ్యాలో తెలుసుకోవడం జ్ఞానం అని, ఆ పని ఎందుకు చెయ్యాలో తెలుసుకోవడం విజ్ఞానం (wisdom) అని ఎవరో పెద్ద మనిషి అన్నారు. అనీష్ కథ చెప్పడానికి మంచి పాత్రలు ఎంచుకున్నారు కానీ, వాటిలోతు వ్యక్తమయ్యేలాంటి డ్రామా సృష్టించండంలో సఫలం కాలేదనిపించింది. లక్ష్మి ఉద్యోగం చేసుకోవాలని కాక, సొంతంగా ఏదో సాధించాలనుకున్న అణుకువ గల చదువుకున్న అమ్మాయి. ఆ పాత్ర ప్రధాన లక్ష్యం ‘విశ్వవిఖ్యాత రాజమండ్రి ఆవకాయ’ని మార్కెట్ చేయడం. అమెకి ప్రత్యర్ధులు ఎవరూలేరు. ఉన్న కొద్దిపాటి ప్రతికూలతకి సహనంగా ప్రయత్నం కొనసాగించమే పరిష్కారం. పరిస్థితుల వల్ల చిగురించిన ప్రేమకి తండ్రి ప్రత్యర్ధి అనుకున్నా ఆయనతో ఘర్షణ లేకుండానే ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. అక్బర్ పెద్ద ఆశలు వున్న కష్టపడే వ్యక్తి. అతని లక్ష్యం మంచి బతుకు సాధించడం, పెళ్ళి చేసుకుని కుటుంబ జీవితం గడపడం. పరిస్ధితుల వల్ల గ్రామ రాజకీయలలో పాలు పంచుకోవల్సి వచ్చింది. లక్ష్మి ప్రేమ అతని ఒక లక్ష్యమైన మంచి కుటుంబం ఏర్పరుచుకోవడానికి అవసరమైనా దానికి ప్రత్యర్ధి, లక్ష్మి తండ్రి, తో అతని మంచితనం వల్ల అతను ఘర్షణ పడలేడు. లక్ష్మి సాయంతో డిగ్రీ పాస్ అవడం, పోటీలో గెలిచి గ్రామంలోని ప్రత్యర్ధులని జైలుకు పంపడంతో ‘రెండేళ్ళ తరువాత’ అని చెప్పి అతన్ని గ్రామ నాయకుణ్ణి చేయడం తప్ప వేరే రకంగా కథ నడిపే అవకాశమూ కలగలేదు.

ఈ సినిమా ఆడియన్స్ యువత. వినోదం కోసం తీసే వ్యాపారత్మక సినిమాలలో సహజత్వంకన్నా జనరంజకత్వం ఉండాల్సిన అవసరం వాటికి వుంది. ఆటో పోటీ లాంటి అలాంటి అంశాలతో నాకేమి పేచీలేదు. నిజానికి సినిమాలో ఈ సీన్ కనపడలేదు కానీ, స్క్రీన్ ప్లేలో ఆ పోటీకి ముందు మాస్టర్ జీ హుక్కా తాగుతూ టి.వి.లో ‘నయదౌర్’ సినిమాలో ఎడ్లబండి పందెం చూస్తన్నట్టు ఒక నేపధ్యం కూడా సృష్టించాడు. కథనం విషయంలో ఈ సినిమా బృందం చాలా శ్రద్ధ పెట్టారనడానికి ఇలాంటి నిదర్శనాలు చాలానే వున్నాయి. అయినా ఈ సినిమా (శేఖర్ కమ్ముల ఆనంద్, గోదావరి కూడా) అసంతృప్తికరంగా అనిపించడానికి కారణం వాళ్ళకి సినిమా గురించిన జ్ఞానం లేకపోవడం వల్లకాదని కళాత్మక విలువలతో వ్యాపార చిత్రాలని సమర్ధవంతంగా నడిపిన బి.ఎన్.రెడ్డి, బాపు / రమణ వంటి వారికి వున్న మూలాలు, తాత్విక భూమిక వీళ్ళకి లేకపోవడమని అనిపిస్తుంది. సినిమాలు చూసి తీసిన సినిమాలకి, జీవితాన్ని అధ్యయనం చేసేక్రమంలో పాత్రలు సృష్టించి తీసే సినిమాలకి చాలా తేడా వుంటంది.

నచ్చారు కనకే శేఖర్ ని, అనీష్ ని మళ్ళీ మళ్ళీ విమర్శించాలి. రిఫరెన్స్ యివ్వడానికి నాదగ్గర పుస్తకాలు యిప్పుడు లేవు కానీ, బహుశా ఢిల్లీ తెలుగు సంఘం వాళ్ళు ప్రచురించిన ‘గురజాడ సంస్మరణ’ సంచికలో అనుకుంటా ఒక వ్యాసం, కన్యాశుల్కం నాటకంలో సారాకొట్టు అంకం రాసే రోజుల్లో, రోజు సాయంత్రం విజయనగరంలో వున్న సారాకొట్టు దగ్గర కండువా కప్పుకున్న ఒక పెద్దమనిషి చుట్టకాల్చుకుంటూ కూర్చునే వాడని. అది గురజాడ అప్పరావుగారే నని ఒకటి వుంది. చాదస్తంలా అనిపించేటి అంత నిబద్ధత లేకుండా రక్తమాంసాలతో చెమట వాసనలు వెదజల్లే పాత్రలు సృష్టించడం సాధ్యమవుతుందా? శేఖరూ అనీషూ అలాంటి చాదస్తం కూడా నేర్చుకుంటారని ఆశ నాకైతే యింకా కొంత వుంది.

రమణ

3 Comments
  1. గీతాచార్య June 16, 2009 /
  2. sirishasri July 1, 2009 /