Menu

అమెరికా! అమెరికా!! (కన్నడ) – పరిచయం

america-americaశశాంక్ (అక్షయ్ ఆనంద్) : “పక్షి లాగా ఆకాశం లో ఎగిరిపోవాలి, ప్రపంచాన్ని చుట్టిరావాలి. ఆనందాల్ని అనుభవించాలి”
సూర్య (రమేష్ అర్వింద్): మహావృక్షంలా వేళ్ళూనుకుని ఆకాశాన్ని అంటేలా ఎదగాలి. వేర్లు బలంగా నేలలో ఉంటూనే ఆకాశాన్ని ఏలాలి. పక్షిలాగా ఎంత ఎగిరినా ఏం లాభం ఎప్పుడో ఒకప్పుడు నేలని చేరాల్సిందే. కానీ వృక్షమైతే నింగికీ,నేలకూ,నీడనిచ్చే ప్రజకూ అందరికీ ఉపయోగం.”
భూమిక (హేమ) : “ఏమిటో బాబూ! మీ ఇద్దరి మాటలూ ఎప్పటికప్పుడు సరైనవే అనిపిస్తాయి. ఇద్దరూ నాకు ముఖ్యమే. ఇద్దరి ఆలోచనలూ నాకు అవసరమే.”

శశాంక్ అంటే చంద్రుడు. సూర్య సూర్యుడికి ప్రతీక. భూమిక ఈ ఇద్దర్నీ సమానంగా ప్రేమించే భూమి. ఇవి “అమెరికా! అమెరికా!!” అనే కన్నడ చిత్రంలోని పాత్రలు. ఈ ముగ్గురు స్నేహితుల స్నేహం మధ్యా ప్రేమ-పెళ్ళి-అమెరికా అనే గ్రహణాలు పడితే ఎలా ఉంటుందనేదే ఈ చిత్ర కథ.

1996 లో వచ్చిన ఈ చిత్రాన్ని రచించి దర్శకత్వం వహించింది నాగత్తిహళ్ళి చంద్రశేఖర్ అనే నవలా రచయిత. అప్పుడప్పుడే కర్ణాటకలో అమెరికా ఆశలు కళ్ళలో నింపుకుని విమానమెక్కే సాఫ్ట్ వేర్ జనాల ఉధృతి పెరిగింది. బ్రెయి డ్రెయిన్ అనే ఆలోచనల్ని పడికట్టుపదాలుగా out dated ideology గా మార్కెట్ ఎకానమీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. అమెరికాకోసం పనిచేసి డాలర్లు సంపాదించడం భారతదేశానికి మంచిదనే బలమైన నమ్మకాలు ఏర్పడటం మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ పరిణామం యొక్క భవిష్యత్ దర్శనం చేసి, ఏవిధంగా మనం rootlessness దిశగా, emotional deprivation in an alien land దిశగా అడుగులు వేస్తున్నామేమో అనే విషయాన్ని ఒక ప్రేమకథ ద్వారా చెప్పిన చిత్రం ఇది. It was a film way ahead of its time. But still a crowd puller at the time of its release. ఈ రోజు మనం ఆ సినిమా చూస్తే భవిష్యత్తుని ఎంత బాగా రచయిత,దర్శకుడు ఊగించాడా అనిపిస్తుంది.

70 శాతంపైగా అమెరికాలో చిత్రీకరించబడిన ఈ సినిమాలోని మిగతా భాగం కేరళ అందాల్ని తలదన్నే కర్ణాటకలోని ఉడిపి,చిక్ మంగుళూరులో చిత్రీకరించారు. సూర్యగా రమేష్ అర్వింద్ నటన మరుపురానిది.  ఈ నటుడి నటనని కమలహాసన్ నటనతో  పోలుస్తారు. కమల హాసన్ కూడా అర్వింద్ నటనని అభిమానిస్తాడు. శశాంక్ గా అక్షయ్ ఆనంద్ అనే ఉత్తరాది నటుడు పాత్రోచితంగా నటించాడు. భూమికగా హేమకు ఇది మొదటి,ఆఖరి చిత్రం. కానీ ప్రతిభ మాత్రం అమోఘం. మనో మూర్తి సంగీతం చిత్రానికి మరో హైలైట్. ముఖ్యంగా “ఏ లోకపు మోహన మురళి విని దూరతీరాలకు తరలిపోతున్నావో” అనే దరా బేంద్రె భావగీతాన్ని చిత్రంలో వాడిన తీరు హృద్యంగా ఉంటుంది. అప్పుడూ ఇప్పుడూ ఖచ్చితంగా అందరూ చూడావలసిన చిత్రం.

ఈ సినిమా ఇప్పుడు DVD రూపంలో విరివిగా దొరుకుతోంది కాబట్టి ఇంకా చెప్పుకోవడంకన్నా సినిమా చూసెయ్యడం బెటర్. బెంగుళూరులో ఉన్నవాళ్ళు మిగతావాళ్ళకు సహాయపడాలి. హైదరాబాద్ లో నేనెలాగూ ఉన్నాను. ప్రవాస భారతీయుల్లో ముఖ్యంగా కన్నడ కుటుంబాలలో ఈ చిత్రం ఖచ్చితంగా లభ్యమవుతుంది. మరెందుకాలస్యం… కానివ్వండి!
.

5 Comments
  1. రవి June 30, 2009 /
  2. మేడేపల్లి శేషు June 30, 2009 /
  3. Venkata Ganesh. Veerubhotla July 1, 2009 /
  4. deepasikha June 3, 2010 /