Menu

6 డేస్ ఇన్ ffwd>>

ముందుగా,ఈ మధ్యనే నవతరంగంలో ప్రచురింపబడిన ’7 days in slow motion” సినిమా పరిచయం లాగా ఈ వ్యాసం కూడా అలాంటిదే మరో సినిమా పరిచయం అనుకోకండి. ఇది ఈ మధ్యనే, అంటే మే 28 నుండి జూన్ 3 వరకూ, చెన్నై లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో జరిగిన ఆరు రోజుల స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ గురించిన సారాంశం. సమయాభావం వల్ల ఇక్కడ అసలేం జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఏమేం చెప్పారు లాంటి విషయాలు మాత్రమే తెలియచేసే ప్రయత్నం చేస్తాను. త్వరలో, వీలైతే, వివరణాత్మకమైన వ్యాసాలు ప్రచురించే (ఈ వర్క్ షాప్ కి హాజరైన ఇతర తెలుగు వారి సహకారంతో) ప్రయత్నం చేస్తాను.

మీకందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్యనే ప్రఖ్యాత నటుడు, దర్శకుడు కమల్ హాసన్ తన సినీ నిర్మాణ సంస్థ అయిన ’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ తరపున చెన్నై లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్జ్ టెక్నాలజీ వారి ఆద్వర్యంలో దకిణ భారతదేశంలో తొలిసారిగా ఒక అంతర్జాతీయ స్రీన్ రైటింగ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కోసం వచ్చిన 1600 దరఖాస్తులను పరిశీలించి వాటిలో అర్హత కలిగిన 250 మందిని ఎన్నుకొన్నారు.

పాల్గొన్నవారు:

ఈ వర్క్ షాప్ కోసం ఎంపిక కాబడ్డ 250 మంది ఔత్సాహిక సినీ రచయితలతో పాటు మన దేశం నుంచి మరియు ఇతర దేశాలనుంచి వచ్చిన ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం నిర్వహణలో ముఖ్యపాత్ర వహించిన కమల్ హాసన్ ప్రతి రోజూ అందరి కంటే ముందే వర్క్ షాప్ జరిగే స్థలానికి చేరుకోవడమే కాకుండా చివరి వరకూ వుండడంతో పాటు అన్ని ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించబడడంలో దగ్గరుండి చూసుకోవడం ఎంతో నచ్చింది.

ఈ వర్క్ షాప్ నిర్వహణ ముఖ్యంగా ముగ్గురు వ్యక్తుల ద్వారా జరిగింది. వారు:

 • హరిహరన్
 • అంజుమ్ రాజ్ బలి
 • అతుల్ తివారి

హరిహరన్: ఈయన పూనే లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి. మణి కౌల్, కుమార్ సహానీ ల శిష్యుడు. గతంలో కాశీరాం కొత్వాల్, దుభాషి లాంటి సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి డైరక్టర్ గా పని చేస్తున్నారు.

అంజుమ్ రాజ్ బలి: ముంబాయి నుంచి వచ్చిన అంజుమ్ కూడా పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థే. ఈయన ప్రస్తుతం పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మరియు విజ్లింఘ్ వుడ్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో స్క్రీన్ రైటింగ్ విభాగంలో అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. గతంలో గులామ్, ద్రోహ్ కాల్, షాహిద్ భగత్ సింగ్లాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు.

అతుల్ తివారి: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో విద్యార్థి అయిన అతుల్ తివారి ఎనో హిందీ సినిమాలకు స్క్రీన్ ప్లే మరియు మాటల రచయితగా పని చేశారు. ఈ మధ్యనే దశావతారం హిందీ వర్షన్ కు మాటలు సమకూర్చారు.

ఆరు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మొదటి నాలుగు రోజులు పైన పేర్కొన్న ముగ్గురు ప్రముఖుల ఉపన్యాసాలతో గడిచింది. చివరి రెండు రోజుల్లో కూడా వీరు నిర్వహించిన కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈ రెండు రోజుల్లో ముఖ్యంగా జాతీయ మరియు అంతర్జాతీయ సినీ పరిశ్రమల నుంచి వచ్చిన ప్రముఖ సినిమా దర్శకులు, రచయితలతో కూడిన చర్చా కార్యక్రమాలే ఎక్కువ చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుల వివరాలు:

 • శేఖర్ కపూర్ (బండిట్ క్వీన్, ఎలిజిబెత్)
 • శ్రీ రాం రాఘవన్ (ఏక్ హసీనా థీ, జానీ గద్దార్)
 • రీతూ పర్ణో ఘోష్ (రైన్ కోట్, దోసర్)
 • శ్యామ ప్రసాద్ (ఒరె కడల్, అగ్ని సాక్షి)
 • కె బాలచందర్
 • బాలూ మహేంద్ర
 • గొల్లపూడి మారుతి రావు
 • భరత్ బాల (హరి ఓం)
 • రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా (రంగ్ దే బసంతి)
 • Jean Calude Carriere (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. స్క్రిప్ట్ రైటర్ :That Obscure Object of Desire, The Unbearable Lightness of Being)
 • Olivier Lorelle (స్క్రిప్ట్ రైటర్: Indigenes)
 • David Scarpa (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. స్క్రిప్ట్ రైటర్ : The Day Earth Stood Still, The Last Castle)

వీళ్ళు మాత్రమే కాకుండా తమిళ చిత్ర రంగానికి చెందిన చాలా మంది దర్శకులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కన్నడ సినీ రంగానికి చెందిన రమేష్ అరవింద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏమేం చెప్పారు?

నిజానికి ఆరు రోజుల్లో చాలానే విషయాలు ఇక్కడ చర్చించారు. మొదటి రోజు, అంటే 28 న కమల్ హసన్ ప్రసంగంతో కార్యక్రమం మొదలయింది.

మొదటి రోజు:

ఆ తర్వాత హరి హరన్, అంజుం రాజ్ బలి, అతుల్ తివారి ల పరిచయం జరిగింది. వీరిలో అంజుం చాలా యాక్టివ్ గా ఉంటూ సరదాగానే చాలా సీరియస్ విషయాలు చెప్పే రకమని అర్థమైంది. హరిహరన్ గురించి మనకంతగా తెలియదేమో కానీ చెన్నై లో ఆయన ఉపన్యాసాలంటే చెవికోసుకుంటారు. ఫిల్మ్ థియరీ పై ఆయనుకున్న పట్టు దక్షిణాదిలో మరెవరకీ లేదేమో. చదువుకునే రోజుల్లోనే హరి హరన్ ని చూసి తోటి విద్యార్థులు “అతనే హరిహరన్” అని చెప్పుకునే వారట. ఇక అతుల్ తివారి చాలా సరదా అయిన మనిషి. హరి హరన్, అంజుం రాజ్ బలి ప్రపంచ సినిమా నుంచి ఎక్కువ ఉదాహరణలు కోట్ చేస్తుంటే అతుల్ తివారి అచ్చమైన్ హిందీ సినిమాల గురించి చెప్పే రకం. వారి వారి పరిచయాల ద్వారా వారు చెప్పబోయే విషయాలతో పాటు ఆయా వ్యక్తుల గురించి కూడా కాస్తా తెలిసొచ్చింది.

పరిచయం కార్యక్రమం తర్వాత అంజుం రాజ్ బలి స్క్రీన్ ప్లే లోని వివిధ అంశాల గురించి ఉదాహరణలతో ఉపన్యాసం ఇచ్చారు. ముందుగా Premise అనేది స్క్రీన్ ప్లే కి ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం తర్వాత Character/Characterization/Characteristics అనే అంశాల గురించి హరి హరన్ ఎంతో ఆసక్తి కరంగా వివరించడమే కాకుండా స్క్రీన్ ప్లే రచనలో ఆయా అంశాలను ఎలా ఉపయోగించాలో తెలియచేశారు.

రెండో రోజు:

స్క్రీన్ ప్లే లోని వివిధ అంశాలయినPremise, Plot, లాంటి అంశాల గురించి చర్చించాక స్క్రీన్ ప్లే కి ఒక structure అవసరమా? ఒక వేళ అవసరమయితే అది ఎలా ఉండాలి? అన్ని స్క్రీన్ ప్లే లు ఇదే structure అనుసరించాలా? లాంటి ప్రశ్నలు లేవనెత్తుతూనే structure అనేది ఒక ఫార్ములా కాదని ఇక్కడ నేర్పించిన అంశాలను దష్టి లో పెట్టుకుని వాటి ఆధారంగా స్క్రీన్ ప్లే రచన కొనసాగించారాదని చెప్పుకొచ్చారు అంజుం. కాకపోతే స్క్రీన్ ప్లే structure తెలుసుకోవడం ద్వారా మనం చెప్పాలనుకున్న కథను ఒక పద్ధతి ప్రకారం కొనసాగించడానికి అవకాశం ఉంటుందని ఈ ఉపన్యాసం యొక్క ముఖ్య సారాంశం.

ఇదే రోజు మధ్యాహ్నం స్క్రీన్ ప్లే రచన చేసేటప్పుడు సీన్ ఎలా డిజైన్ చెయ్యాలి అనే అంశం గురించి చర్చిస్తూ సినిమా లో ఏ సీన్ కి ఆ సీన్ విడి విడిగా ఉన్నప్పటికీ ఒక సీన్ దాని ముందు వచ్చిన సీన్ మరియు తర్వాత రాబోయే సీన్స్ కి సంబంధించిన మూడ్ కి తగ్గట్టుగా ఉండాలని చెప్తూ దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు (సిక్స్త్ సెన్స్ లో కార్లో సీన్) చూపించారు. అలాగే ఒక సీన్ లోని సబ్ టెక్స్ట్ గురించి చెప్తూ గాడ్ ఫాదర్ ఓపెనింగ్ సీన్  ద్వారా ఆ విషయాలను వివరించారు.

ఆ తర్వాత హరిహరన్ సీన్ డిజైన్ గురించి మరిన్ని వివరాలు తెలియచేయడానికి చారులత లోని ఓపెనింగ్ సీన్ ని ఉదాహరణగా తీసుకున్నారు. దాదాపు అరగంట పాటు ఈ సీన్ గురించి వివరించాక జనాలు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు- ఒకటి హరిహరన్ ఆ సీన్ గురించి వివరించిన విధానం చూసి. రెండు సత్యజిత్ రే సీన్ డిజైన్ గురించి తెలుసుకుని.

మూడో రోజు:

ఈ రోజు ఉదయం అతుల్ తివారి స్క్రీన్ ప్లే రచన్ చేసేటప్పుడు డైలాగ్స్ ఎలా వ్రాయాలి అన్న విషయాన్ని ఉదాహరణలతో వివరించారు. అలాగే డైలాగ్స్ వ్రాసేటప్పుడు సహజంగా అనిపించేలా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలియచేశారు.

మధ్యాహ్నం హరిహరన్ రెండు లఘు చిత్రాలు  (లంచ్ డేట్, యునైటెడ్ వి స్టాండ్) ప్రదర్శించి వాటిని deconstruction చెయ్యడం ద్వారా ఆయా సినిమా రచయితలు  స్క్రీన్ ప్లే రచన ఎలా చేసుంటారన్న విషయాల గురించి తెలియచేశారు. అంతకుముందు రోజులాగే హరి హరన్ తన ఉపన్యాసంతో అందరినీ మెస్మరైజ్ చేశాడు.

నాలుగో రోజు:

ఈ రోజు అంజుం రాజ్ బలి ’హీరో విత్ థౌజండ్ ఫేసెస్” అనే పుస్తకంలో జోసఫ్ క్యాంప్ బెల్ అనే రచయిత ప్రస్తావించిన వివిధ అంశాలను స్క్రీన్ ప్లే రచనలో ఎలా ఉపయోగించవచ్చో చెప్పుకొచ్చారు. ఈ సెషన్ ఎంతో ఆసక్తికరంగా నడిచింది. అయితే గతంలో అంజుం వార్నింగ్ ఇచ్చినట్టే ఇక్కడ చెప్పిన అంశాలు మనసులో పెట్టుకుని ఒక బ్లూ ప్రింట్ లాగా లేదా ఒక ఫార్ములా లాగా ఉపయోగిస్తూ స్క్రీన్ ప్లే వ్రాయడం సరైన్ పద్ధతి కాదు అని నొక్కి వక్కాణించారు. ఈ విషయాలన్నింటినీ ఆకళింపు చేసుకుంటే మనకి తెలియకుండానే స్కీన్ ప్లే రచనలో ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారు.

మధ్యాహ్నం అంజుం writing process గురించి వివరించారు. అందరికీ సరిపడే ఒక ప్రాసెస్ అనేది ఏదీ లేకపోయినా కొన్ని టెక్నిక్స్ పాటించడం ద్వారా స్క్రీన్ ప్లే రచన ఎలా చెయ్యవచ్చో అంజుం తెలియచేశారు. ఇదే విషయం గురించి కమల్ హాసన్ చెప్పిన దాని ప్రకారం రచయితలకు క్రమశిక్షణ అవసరం అనీ, ప్రతి రోజూ ప్రచురణ కు అర్హమయిన ఏదో ఒక రచన చెయ్యడం ద్వారా మనలోని రచయితను  సజీవంగా ఉంచొచ్చని చెప్పారు.

ఆ తర్వాత హరిహరన్ celtx సాఫ్ట్ వేర్ ఉపయోగించి స్క్రీన్ ప్లే ఎలా వ్రాయొచ్చు అన్న విషయం మీద ఒక ప్రజెంటేషన్ చేశారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలో ప్రస్తుతం స్క్రీన్ ప్లే అంటే ఎలాంటి అభిప్రాయం ఉంది. అసలు మన సినిమా స్క్రీన్ ప్లే లకూ మరియు ఇతర దేశాల స్క్రీన్ ప్లేల కు తేడా ఏంటి? మన సినిమాలకు కథ వ్రాసే వాళ్ళు, స్క్రీన్ ప్లే వ్రాసే వాళ్ళు, డైలాగ్స్ వ్రాసే వాళ్ళు ఉన్నట్టు హాలీవుడ్ లో ఎందుకు ఉండరు లాంటి విషయాల గురించి చర్చిస్తూనే మన స్క్రీన్ ప్లే ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ఎవరైనా మన స్క్రీన్ ప్లే కాపీ కొడ్తే ఏం చెయ్యాలి? లాంటి అంశాల గురించి కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే రచయితల హక్కులు, బాధ్యతలు తెలియచేశారు.

ఐదో రోజు:

ఈ రోజు ఉదయం ఫ్రాన్స్ నుంచి వచ్చిన Olivier Lorelle అనే రచయిత Indigenes (ఆస్కార్ నామినేటెడ్) అనే సినిమా కు స్క్రీన్ ప్లే రచనలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించారు లాంటి అంశాలతో జరిగిన ఒక చర్చాకార్యక్రమంతో మొదలయింది.

ఆ తర్వాత హరిహరన్, అంజుం, అతుల్ ముగ్గురూ కలిసి గత నాలుగు రోజుల్లో చర్చించిన విషయాలను సమ్మరైజ్ చేశారు.

ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ Mythology as Framework అనే అంశం గురించి చర్చించారు. మనకున్న అధ్బుత సంపద మన పురాణ గాథలని, వాటిలోని ఎన్నో అంశాలను మంచి స్క్రీన్ ప్లే రచనకు ఉపయోగించవచ్చని శేఖర్ కపూర్ తెలియచేశారు.మానవుని అభివృద్ధి కథల ద్వారానే జరిగిందని  మన mythology ని మనం మర్చిపోయినప్పుడు అమెరికా ఇప్పుడు బిన్ లాడెన్ అనే mythic villain ని సృష్టించుకున్నట్టు మనకీ అదే గతి పడ్తుందని అభిప్రాయపడ్డారు. అయితే mythology ని మర్చిపోకూడదంటే పురాణ గాథల ఆధారంగా mythological సినిమాలు తియ్యడం కాదని కూడా చెప్పుకొచ్చారు.

మధ్యాహ్నం ఫ్రాన్స్ కి చెందిన Jean Claude Carriere తన స్క్రిప్ట్ రైటింగ్ ప్రొసెస్ గురించి చెప్పుకొచ్చారు. ఈయన ప్రతిరోజూ షేక్స్పియర్ (ఘోష్ట్)తో ఎలా సంభాషిస్తాడో చెప్పుకొచ్చారు. ఇక్కడ మరో విషయం చెప్పాలి. అంజుం ఇలాంి విషయాన్నే ముందు రోజు ప్రస్తావించారు. మనం రచించి స్క్రీన్ ప్లే లోని పాత్రలను మన జీవితంలో భాగం కల్పించాలంటాడు అంజుం. నిద్రపో్యే ముందు తన బెడ్ రూమ్ లో మరో మంచం ఉన్నట్టు ఆ మంచం పై మన కథలోని పాత్ర ధారి పడుకుని ఉన్నట్టు ఊహించుకుని అతనితో రచయిత సంభాషించాలనీ అంజుం చెప్పుకొచ్చారు. Jean Claude Carriere గురించి ఈ వర్క్ షాప్ ముందు వరకూ నాకసలు తెలియదు. అయితే ఈయన సామాన్యుడు కాదు. Truffaut తో కలిసి ఈయన ఎన్నో సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు. అలాగే పలు అస్కార్ నామినేటెడ్ సినిమాలకూ ఈయన స్క్రీన్ ప్లే అందించారు.అంతే కాదు మహాభారతాన్ని పీటర్ బ్రూక్స్ తో కలిసి నాటకం గా రూపొందించిందీ ఈయనే. కమల్ తో కలిసి మరిదనాయగం స్క్రీన్ ప్లే రచిస్తున్నారీయన. ఈయన చెప్పిన అంశాలు ఎంతో ఆసక్తికరంగానే కాకుండా చాలా ఉత్తేజపరిచేలా ఉన్నాయి.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా Jean Claude Carriere తో చర్చా కార్యక్రమం ముగిసాక Regional Influences in Storytelling అనే అంశం మీద మన గొల్లపూడి మారుతీ రావు గారు ఒక పేపర్ ప్రెజెంటేషన్ చేశారు. డాక్టర్ చక్రవర్తి సినిమాని నవల నుంచి తెరకు అనువదించడంలో ఎదుర్కొన్న అడ్డంకులు వాటిని ఎలా అధిగమించారో తెలియచేశారు. గొల్లపూడి గారి ప్రసంగం మొదలవడం కాస్తా నెమ్మదిగా మొదలయినా పూర్తయిన తర్వాత స్టాండింగ్ ఒవేషన్ లభించింది.

ఈ రోజు సాయంత్రం శ్రీ రాం రాఘవన్ తో Writer as director: The writer-director conflict అనే అంశం పై ఒక చర్చా కార్యక్రమం జరిగింది. ఈ చర్చలో సినిమా నిర్మాణంలో రచయిత పాత్ర ఎంత? ఎక్కడి వరకూ ఉంటుంది? దర్శకుడే రచయిత అయినప్పుడు ఉండే సాధకబాధకాలు లాంటి విషయాల గురించి చర్చ జరిగింది.

చివరి రోజు:

ఐదు రోజుల పాటు ఉదయం 9 నుంచి రాత్రి 9 (ఒక్కో సారి 11 కూడా) వరకూ నడిచిన ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న వారిలో ఒక రకమైన అలసట కనిపించింది. అయితే చివరిరోజు కూడా ఎటువంటి రిలాక్సేషన్ లేకుండా నడించింది వర్క్ షాప్.

ఈ రోజు ఉదయం హాలీవుడ్ రచయిత David Scarpa తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక చర్చా కార్యక్రమం జరిగింది. Writing for the Hollywood Market అనే అంశం గురించి డేవిడ్ హాలీవుడ్ లో స్క్రీన్ ప్లే రచయితల గురించి, అక్కడి పరిస్థుతుల గురించి వివరించారు.

ఆ తర్వాత కె బాలచందర్, బాలూ మహేంద్రలు చలన చిత్ర పరిశ్రమలో తమ అనుభవాల్ని పంచుకున్నారు.

మధ్యాహ్నం భరత్ బాల మరియి Olivier Lorelle లతో కలిసి హరి హరన్ “Finding a Global Audience” అనే అంశం మీద చర్చించారు. వీరిద్దరూ ఏక కంఠంతో  గ్లోబల్ ఆడియన్స్ అంటూ ఎవరూ ఉండరని మన కథలో నిజాయితీ ఉంటే అది యూనివర్శల్ అపీల్ కలిగి ఉంటుందని చెప్పారు.

ఈ చర్చాకార్యక్రమం తర్వాత ఒరే కడల్ చిత్ర దర్శకుడు శ్యామ ప్రసాద్ మరియు బెంగాలీ దర్శకుడు రీతూపర్ణో ఘోష్ లు “Contemporary Indian Writing and Adaptations” అనే విషయం పై చర్చించారు.

సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో “They say it’s a great success. I’d say it’s a good start.” అని వ్యాఖ్యానించడంతో ఈ కార్యక్రమం దాదాపుగా ముగిసింది. ఈ కార్యక్రమం తర్వాత రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా, కమల్ హాసన్, అంజుం, అతుల్ మరియు హరి హరన్ లు పాల్గొన్న “Story, Screenplay and Direction of Indian Cinema : The next step” అనే కార్యక్రమం ద్వారా అంతం కాదిది ఆరంభం అనుకుంటూ అందరూ ఇంటి ముఖం పట్టారు.

ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న 250 మంది లో ముప్ఫై మందిని ఎన్నుకొని వారు రచించిన స్క్రీన్ ప్లే ల అధారంగా 30 లఘు చిత్రాలు రూపొందించడం తన తదుపరి లక్ష్యమని కమల్ చెప్పడంతో ఈ వర్క్ షాప్ కేవలం ఇంతటితో ఆగేది కాదని ఈ వర్క్ షాప్ ద్వారా రాబోయే రోజుల్లో కనీసం ఒక ఇద్దరు ముగ్గురైనా మంచి రచయితలు మన సినిమా పరిశ్రమకు పరిచయం అవుతారని నా నమ్మకం.

ప్రదర్శించిన సినిమాలు:

ఇది స్క్రీన్ రైటింగ్ వర్క్ షాపే అయినప్పటికీ ఇక్కడ దాదాపుగా ఒక మినీ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగిందని చెప్పొచ్చు. ఈ ఆరు రోజుల్లో మొత్తం పది సినిమాలకు పైగానే ఇక్కడ ప్రదర్శించారు. ఆ సినిమాల వివరాలు:

 • దోసర్
 • మేఘ దాక తార
 • Indigenes (ఫ్రెంచ్)
 • Cyrano de Bergerac (ఫ్రెంచ్. మన అల్లరి ప్రియుడు, సాజన్ సినిమాల దగ్గర్నుంచి మెరుపు కలలవరకూ అన్ని సినిమాల ఇక్కడనుంచే స్ట్రైట్ లిఫ్ట్ )
 • Groundhog Day
 • Johnny Gaddar
 • The Lunch Date (లఘు చిత్రం)
 • United We Stand (లఘు చిత్రం)

అవీ పోయిన వారం చెన్నై లో జరిగిన స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ వివరాలు. అయితే ఈ వర్క్ షాప్ ని అత్యున్నతంగా నిర్వహించిన కమల్ హాసన్ మరియు IIT గురించి చెప్పకుండా ఈ వ్యాసాన్ని ముగిస్తే పాపమే. ఇక్కడ ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్న కమల్ ని చూస్తే ఎంతో గౌరవం కలిగింది. అలాగే ఐఐటి విద్యార్థులు వాలంటీర్స్ గా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

తెలుగు వారు:

ఈ వర్క్ షాప్ కి హైదరాబాదు నుంచి చాలా మందే వచ్చారు కానీ వారందరూ తెలుగు వాళ్ళు కాదనుకుంటాను. వచ్చిన తెలుగు వాళ్ళలో నవతరంగం పాఠకుడు వి.బి, తోటి బ్లాగర్ అశోక్ తో పాటి రామానాయుడు ఫిల్మ్ స్కూల్ కి చెందిన రాజా, టివి 9 లో పని చేసే జలపతి ని కలుసుకునే అవకాశం దొరికింది. మరో తెలుగతన్ని కలిసాను కానీ పేరు గుర్తు లేదు. వీరు కాకుండా ఇంకా ఎవరైనా వచ్చారేమో తెలియదు.

చివరిగా, ఈ స్క్రీన్ రైటింగ్ వర్క్ షాప్ ద్వారా భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఉద్ధరించే రచయితలు అకస్మాత్తుగా తయారవ్వకపోవచ్చుకానీ మన దేశం గర్వపడే సినిమాలకు స్క్రీన్ ప్లే రచనలు చేసే రచయితలు ఆవిర్భవించడానికి ఇది ఒక తొలి అడుగు అని చెప్పొచ్చు.

14 Comments
 1. harikrishna mamidi June 9, 2009 /
 2. రాజయ్య June 9, 2009 /
 3. రాజశేఖర్ June 9, 2009 /
   • raghurichards June 17, 2009 /
 4. శంకర్ June 9, 2009 /
 5. venkat June 14, 2009 /