Menu

రిహాయీ

rihaeeవర్తమాన పితృస్వామ్య సమజంలో స్త్రీలు రోజూ ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో లైంగిక హింస చాలా ఉంటుంది. కుటుంబంలోనూ, సమాజంలోనూ మొత్తంగా రాజ్యంలోనూ మాటల ద్వారా , సంజ్ఞల ద్వారా, చర్చల ద్వరా స్త్రీని కట్టడి చేసేందుకు తమ ఆధీనంలో ఉంచుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి.. అందులో లైంగిక అంశం ప్రధానమయిన విషయంగా ముందుకువస్తుంది. ఊపిరి తీసుకోవడం నించి మొదలు ఊర్లో నివసించడం వరకు ‘ క్యారెక్టర్ ‘ అన్న ఒక్క మాటలో స్త్రీపై తన నియంత్రణను అమలు చేస్తుందీ సమాజం. అంతేకాదు స్త్రీ సమానత్వం, స్వేచ్చ అనే మాటలు వినగానే అవి లైంగిక స్వేచ్చను మాత్రమే డిమాండ్ చేస్తున్నాయని భావిస్తుందీ సమాజం. అంతే తప్ప స్త్రీ స్వేచ్చ ఎజెండాలో వారి ఆలోచన, అనుభవం, స్పందన, స్నేహం లాంటివి ఉంటాయన్న భావనని ఈ సమాజం ప్రోత్సహించదు.

అంతేకాదు లైంగిక పరమైన అవసరాలు జీవరసాయనిక ఆవశ్యకతలుగా ఈ సమాజం గుర్తించదు. ఆ అవసరాల్ని కేవలం వ్యక్తిగతమయిన కోణంలోంచి పరిశీలించడమే జరుగుతున్నది. అందునా లైంగిక పరమయిన అవసరాల విషయంలో స్త్రీ, పురుషులిద్దరికీ అమితమయిన తేడాల్ని నిర్దేశిస్తుందీ సమాజం. కట్టడిలేని స్వేచ్చాయుతమయిన స్థితిని పురుషుల కోసం అట్టిపెట్టిన ఈ లోకం స్త్రీ విషయానికి వచ్చినప్పుడు భిన్నమయిన గొంతుతో మాట్లాడుతుంది. విచిత్రంగా ప్రవర్తిస్తుంది.

కుటుంబాన్ని మన సమాజానికి ఒక యూనిట్‌గా తీసుకున్నప్పుడు ఇతరత్రా అన్ని విషయాల్లోలాగే లైంగిక పరమయిన అవసరాల విషయంలో భార్యాభర్తలిద్దరూ సమబాధ్యులే . కాని భర్త అందుబాటులో లేనప్పుడు, భర్త నుంచి పొందలేనప్పుడు ఒక స్త్రీ తన లైంగిక అవసరాన్ని తీర్చుకుంటే ఈ సంఘం ఆ భార్యను అనేక పేర్లతో పెట్టి హింసిస్తుంది. కాని అదే తరహాలో పురుషుడు పరాయి స్త్రీతో తన అవసరాలు తీర్చుకుంటే సంఘం అంత తీవ్రంగా ప్రతిస్పందించదు. అనేక సందర్భాల్లో తన మౌనంతో అంగీకార ముద్రను కూడా వేస్తుంది. ఈ స్థితి మన సమాజంలోని ఉన్నత, మధ్య, కింది తరగతికి చెందిన అన్ని స్థాయిల్లో కొద్దో, గొప్పో తేడాలతో విలసిల్లుతూనే ఉంటుంది.

సరిగ్గా ఈ విషయాన్నే మౌళికాంశంగా తీసుకుని ప్రముఖ మహిళా దర్శకురాలు అరుణరాజె ‘ రిహాయీ ‘ చిత్రం నిర్మించారు. భర్తలు పనికోసం నెలలకొద్దీ నగరాలకు వెళ్లినప్పుడు ఊర్లలో ఉండే స్త్రీల శారీరక ,మానసిక అవసరాల్ని, వాటిని తీర్చుకోవడానికి వారికి ఏర్పడే వివాహేతర సంబంధాలు, ఆ సందర్భాలకి సమాజం ప్రతిస్పందించే తీరు ఈ చిత్రంలో నిజాయితీగా చర్చించబడింది. అదే నగరాల్లో భర్తలు వ్యభిచార గృహాలకు వెళ్లిన విషయాల్ని ఈ సమాజం ఏ విధంగా స్పందించిందీ కూడా ‘ రిహాయీ ‘ చిత్రం చర్చిస్తుంది. భారతీయ ప్రధాన స్రవంతి చిత్ర ప్రపంచంలో ఇలాంటి అంశాన్ని తీసుకుని చిత్రం నిర్మితమవడం ‘ రిహాయీ ‘ తోనే మొదలు. నిజానికి రిహాయీ అటు ప్రధాన స్రవంతి తరహాకూ, ఇటు నవ్య చిత్ర తరహాకు చెందని మధ్యేవాద చిత్రం. ఇందులో నాలుగు పాటలు, మేలానృత్యమూ ఉన్నాయి. హేమామాలిని, నసీరుద్దీన్ షా, వినోద్‌ఖన్నాలు ప్రధాన భూమికలు పోషించిన ఈ చిత్రం గుజరాత్ రాష్ట్రానికి చెందిన సులూర్ గ్రామాన్ని బేస్ చేసుకుని నిర్మితమయింది.

అరుణరాజె గుజరాత్ రాజస్థాన్ రాష్ఠ్రాల్లో కొన్ని ఆడ్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా జరిగిన ఒక యదార్ధ సంఘటనను విని ఈ సినిమాను రూపొందించారు. ‘ రిహాయీ ‘ ఆర్ట్ ఆండ్ క్రాఫ్ట్ పరంగా గొప్ప చర్చనీయాంశ చిత్రం కాకపోయినప్పటికీ ఆ సినిమా డీల్ చేసిన సబ్జెక్ట్ చర్చనీయాంశమయింది. చిత్ర కథాంశం విషయానికి వస్తే సులూర్ గ్రామంలో పురుషులంతా పనికోసం పట్నాలకు వెళ్తారు. వారి భార్యలు ఒంటరిగా ఆ గ్రామంలో నివసిస్తూ ఉంటారు. తోడులేక, సహచరుల్లేక, కష్టసుఖాలు చెప్పునే తనవాడు లేక ఆ గ్రామీణ మహిళలు తీవ్రమయిన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ముసలి వాళ్లను చూసుకోవడం, పిల్లల్ని పోషించడమే వారి ప్రధాన వ్యాపకంగా ఉంటుంది.

దుబాయిలో కొంతకాలం పనిచేసి తిరిగి వచ్చిన వడ్రంగి నసీరుద్దీన్ షా ఊర్లో షోగ్గా తిరుగుతూ ఉంటాడు. కాని ఆ ఊర్లోనే నివసిస్తున్న హేమామాలిని షాని వ్యతిరేకిస్తుంది. లొంగేందుకు అంగీకరించదు. కాని అతని తీవ్ర ప్రయత్నాల తర్వాత ఆమె కూడా లొంగిపోతుంది. ఆ ప్రాంతంలో ఆడపిల్లల్ని కనడం శాపంగానూ, మగపిల్లల్ని కనడం వరంగానూ భావిస్తుంటారు. హేమామాలినికి అప్పటికే ముగ్గురు ఆడపిల్లలుంటారు. ఆమె భర్త వినోద్ ఖన్నా పట్నంలో ఉంటాడు. హేమకి నాల్గవ సంతానం తప్పకుండా మగపిల్లవాడే పుడతాడని జ్యోతిష్కుడు చెబుతాడు. ఇంతలో భర్త ఇంటికి తిరిగి వచ్చే సమయం రానే వస్తుంది. సరిగ్గా అప్పుడే తాను గర్భవతినయినట్టు హేమా తెలుసుకుంటుంది. భర్త రాకముందే అబార్షన్ చేయించుకోమని మిత్రురాండ్లు చెబుతారు. కాని తన నాల్గవ సంతానం మగపిల్లవాడని ఒకపక్క, మరోపక్క తనలో భాగంగా ఎదుగుతున్న పిండాన్ని తానుగా చంపలేనని భావించిన ఆమె అబార్షన్‌కు అంగీకరించదు. భర్త ఇల్లు చేరతాడు. విషయం గ్రామపంచాయితీకి చేరుతుంది. ఆమెను వెలివేస్తామంటుంది పంచాయితీ. మహిళలంతా ఒకటయి ఆమెపై చర్యను వ్యతిరేకిస్తారు. భర్త వినోద్ ఖన్నా కూడా ముందుకు వచ్చి భార్యను స్వీకరిస్తాడు. మంచినీ, చెడునూ రెంటినీ స్వీకరిస్తానని ‘ మర్దాన్‌గీ ‘ అంటే అదేనని ప్రకటిస్తాదు. చిత్రం చివర్లో భర్త క్షమించడం, స్వీకరించడం వంటి అంశాలతో ‘రిహాయీ’ మళ్లీ మామూలు చిత్రం స్థాయికి జారిపోతుంది.

మన సమాజంలో వివదస్పదమయిన విషయాన్ని విజ్ఞతతో చర్చకు తెచ్చి ప్రతిభ కనబర్చిన అరుణరాజె చివర్లో మళ్లీ సాధారణ సినిమా స్థాయిలో ముగించి వేసింది. అది ఆమె వైఫల్యంగానే చెప్పుకోవచ్చు. అయితే సబ్జెక్టు ఎంచుకున్న తీరులోనూ చివరిదాకా నడిపించిన తీరులో అరుణరాజే మంచి ప్రతిభ కనబర్చారు. ఎన్.ఎఫ్.డి.సి ఆర్ధిక సాయంతో నిర్మితమయిన ఈ చిత్రంలో గుజరాతీ గ్రామీణ వాతావరణం, ఆ ప్రాంత మనుషుల తీరూతెన్నూ బాగా డాక్యుమెంట్ అయ్యాయి.

లైంగిక విషయాల్లో ఈ సంఘం స్త్రీ, పురుషుల మధ్య చూపించే భిన్న విలువల్ని ప్రస్ఫుటం చేసిందనే చెప్పుకోవచ్చు.

రిహాయీ ( హిందీ )

సంగీతం – షారంగ్ దేవ్

నిరమాణం – ఎన్.ఎఫ్.డి.సి

దర్శకత్వం – అరుణరాజె

నటీనటులు – హేమామాలిని, నసీరుద్దీన్ షా, వినోద్ ఖన్నా, నీనాగుప్తా, ఇలా అరుణ్, రీమాలాగూ, అచ్యుత్ పౌత్ దార్ మొ…