Menu

పెడ్రో ఆల్మడోవర్-ఒక పరిచయం

స్పెయిన్ దేశపు సాంస్కృతిక ప్రతినిధి-పెడ్రో ఆల్మడోవర్

almodovarపెడ్రో ఆల్మడోవర్ ప్రజాస్వామ్య స్పెయిన్ దేశపు సాంస్కృతిక ప్రతినిధిగా విశ్వవిఖ్యాతి గాంచాడు. లూయిస్ బునియల్ తర్వాత అంతటి ఖ్యాతిని, ఆమోదాన్ని, ఆదరణని పొందిన సినిమా దర్శకుడు ఆల్మడవోర్. నాలుగు దశాబ్దాలు మిలిటరీ నిరంకుశ పాలనను చవిచూసిన అనంతరం ప్రజాస్వామ్య బావుటాను ఎగరవేసిన స్పెయిన్ నుంచి ప్రపంచ సినిమా యవనిక పైన తనదైన సొంత చలన చిత్రబాణి, వాణిలతో అలరిస్తున్నాడాయన.

చలన చిత్రకారుడుగానే కాకుండా ప్రజాస్వామ్య వాదిగా కూడా ఆల్మడోవర్ వినుతికెక్కాడు. 2003 లో మాడ్రిడ్ లో పెద్ద ప్రదర్శన జరిగింది. ఇరాక్ పై జరిగిన దాడిలో స్పెయిన్ ప్రమేయాన్ని నిరసిస్తూ జరిగిన ఆ ప్రదర్శననుద్దేశించి ప్రసంగించిన ముగ్గురు వ్యక్తుల్లో పెడ్రో ఆల్మడోవర్ ఒకరు. అంతే కాదు 2004 లో జరిగిన స్పెయిన్ ఎన్నికలకు మూడు రోజుల ముందు, అదీ ఆల్మడోవర్ సినిమా ’బ్యాడ్ ఎడ్యుకషన్’ విడుదలకు 15 రోజుల ముందు అతిపెద్ద బాంబ విస్ఫోటనం జరిగింది. రైళ్లలో ప్రయాణిస్తున్న 191 మంది ప్రయాణికులు మృతి చెందారు. స్పెయిన్ లో జరిగిన అతి పెద్ద విధ్వంసం ఇది. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షం విజయం సాధించింది. ఆ ఫలితాల్ని మొదటగా స్వాగతించిందీ, అభినందించిందీ ఆల్మడోవర్. అలా తన ప్రజాస్వామ్య ఆకాంక్షను ఎల్లవేళలా ప్రకటిస్తూ వస్తున్న సినీ దర్శకుడు ఆల్మడోవర్. అనేక సార్లు పాలకుల్నించీ, రైట్ వింగ్ కార్యకర్తల్నించీ వ్యతిరేకత ఎదురైనా మడమతిప్పని ప్రజాస్వామ్య వాది ఆల్మడోవర్.

ఆస్కార్ అవార్డులతోపాటి అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకున్న సినిమాల్ని తీసిన ఆల్మడోవర్ 1951లో స్పెయిన్ లోని దక్షిణ మధ్యప్రాంతానికి చెందిన లామంచా లో జన్మించాడు. అతి పెద్ద రైతు కుటుంబంలో జన్మిమ్చిన ఆయన చిన్ననాటి అనుభవాలు, సామాజిక స్థితిగతులో అనంతరకాలంలో ఆయన తీసిన సినిమాల్లో స్పష్టంగా ఆవిష్కృతమయ్యాయి. ఆయన అనేక సినిమాల్లో తన తల్లిని ప్రతీకాత్మకంగా ప్రధానపాత్రను చేస్తూ వచ్చాడు.

ఆల్మడోవర్ తీసిన పలు చిత్రాల్లో ప్రధానపాత్రధారులు తాము నివసించే పట్టణాలు మహానగరాలు విడిచి నాస్టాల్జిక్ గా తమ పూర్వీకుల ఊళ్ళకు, ఇండ్లకు వెళ్ళడం చూస్తే ఆల్మడోవర్ సృజనలో ఆయన బాల్యంనాటి స్మృతులు ఎంతగా ప్రతిబింబించాయో అర్థం అవుతుంది.

బాల్యమంతా పల్లెల్లో గడిపిన ఆల్మడోవర్ 1967 లో మాడ్రిడ్ చేరుకున్నాడు. దానికి ముందు కొంతకాలం లండన్లో, ఇబిజాలోనూ హిప్పీగా కాలం వెళ్లదీశాడు. మాడ్రిడ్ లోని జాతీయ టెలిఫోన్ కంపెనీ ’టెలిఫోనిక్’ లో క్లర్క్ గా చేరాడు. పదేళ్ళు ఆ ఉద్యోగం చేశాడు ఆల్మడోవర్. స్వతహాగా కళాకారుడు అయిన ఆల్మడోవర్ కి అనుభవంలోకి వచ్చిన టెలిఫోన్లు, టెలిఫోన్ టవర్లు, ఆ కాలంలో తను కలిసి పనిచేసి స్త్రీల భావాలు అనేకం ఆయా చిత్రాల్లో మనకు కనిపిస్తాయు. ఆయనే ఒక చోట చెప్పుకున్నాడు “తన చుట్టూ పనిచేసే స్త్రీల సంభాషణల ద్వారా ఎంతో నేర్చుకున్నాను” అని.

ఆల్మడోవర్ నాటకాలతో పాటు రాక్ గ్రూప్ లోనూ, గ్రాఫిక్ నావల్స్ రాయడంలోనీ కృషి చేశాడు. ఆ తర్వాత సూపర్-8 కెమెరా ఒకటి కొనుక్కొని సీరియల్ గా చిత్రీకరణ మొదలుపెట్టాడు.

1980 లో తన మొట్టమొదటి సినిమా Pepi, Luci, Bom and Other Girls on the Heap చిత్ర నిర్మాణం ఆరంభించాడు. మాడ్రిడ్ లో రాత్రులు తాను గమనించిన మహిళల జీవన ఇతివృత్తాల ఆధారంగా ఈ చిత్రం నిర్మించారు. కాని తొలి ప్రయత్నం అంత సాఫీగా సాగలేదు. ఆర్థిక ఇబ్బందులు, సాంకేతిక కారణాలు అనేక ఇబ్బందులకు గురిచేసి 18 నెలల ఆవిశ్రాంత కృషితో తన తొలి చిత్రాన్ని పూర్తి చేసిన ఆల్మడోవర్ తిరిగి తన తెలిఫోన్ ఎక్స్ఛేంజి ఉద్యోగంలో చేరిపోయాడు. అనేక అవాంతరాలు, పరిపక్వత లేని ఫిలిం మేకింగ్ లతో కూడిన ’పెపీ, లూసీ…’ చిత్రం ఆ కాలంనాటి జీవన వాస్తవికతకు అద్దం పట్టింది. సాంస్కృతిక స్వ్వేచ్చ, స్త్రీ పురుష సంబంధాల్లో స్వేచ్ఛని ఆ చిత్రం వాదనకు పెట్టి సమర్థించింది. దాంతో ఆల్మడోవర్ సినిమా రంగంలో పలువుర్ని ఆకర్షించాడు.

రాజకీయ దృక్పథాలకు సంబంధించి ఆల్మడోవర్ పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికి ఆయన స్పానిష్ సాంస్కృతిక వారసత్వం నుండి ఎదిగిన వాడన్నది సత్యం. అయినప్పతికీ హాలీవుడ్ చిత్రాల ప్రభావం అమితంగా వుందన్న విమర్శనూ ఆయన ఎదుర్కొన్నాడు. వాస్తవానికి ఆల్మడోవర్ పై నార్త్ అమెరికన్ సినిమా ప్రభావం ఆయన తొలి సినిమాల్లో ఉమ్దనే చెప్పుకోవచ్చు.జాన్ వాటర్స్ మరియు ఆండీ వార్హోల్ ల ప్రభావం ఆల్మడోవర్ పై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంతే కాదు హిచ్ కాక్ ఛాయలీ ఆయనలో కనిపిస్తాయి. ఇలా ఎన్ని ప్రభావాలు ఎంతమంది సినిమాల స్ఫూర్తి ఉన్నప్పటికీ ఆల్మడోవర్ తనదైన, స్పానిష్ సినిమా ఒరవడిని ఏర్పరుచుకున్నాడు.

ఆయనకు ప్రధానంగా స్త్రీ పాత్రల దర్శకుడిగా పేరుంది. ఆయన అనేక సినిమాల్లో స్త్రీలు ప్రధాన భూమికలు అయితే పురుషులు ప్రొటాగనిస్టులుగా ఉన్న సినిమాలూ తీశాడు. వాటిలో ప్రధానంగా లుక్ టు హర్, లైవ్ ఫ్లెష్, మాటడోర్, లా ఆఫ్ డిజైర్ లు చెప్పుకోవచ్చు.

నిజానికి ఆల్మడోవర్ తానుగా ఏ ఫిల్మ్ స్కూల్ లో చదువుకోలేదు. సినిమా నిర్మాణానికి సంబంధించి ఎలాంటి శిక్షణనూ ఆయన పొందలేదు. అంతే కాదు 1970 ల నాటి ఫ్రాంకో ప్రభుత్వ కాలంలో స్పెయిన్ లో సినిమాను బోధించే స్కూళ్ళు మూతడ్డాయి. అయితే ఆల్మడోవర్ 1972-78ల మధ్య తీసిన లఘు చిత్రాలు ఆ తర్వాత పెల్లుబికిన ’లామొవిడా’ ప్రత్యామ్నయ సాంస్కృతిక ఉద్యమం నుండి ఆయన ఎదిగి వచ్చాడు. తన మొదటి చిత్రం 16 ఎం.ఎం లో తీసి 35 ఎంఎం కి బ్లో అప్ చేసిన ఆల్మడవోర్ ఆ తర్వాత తన సోడరుడు ఆగస్టిన్ తో కలిసి ఎల్డిసిఓ అన్న సొంత నిర్మాన సంస్థను నెలకొల్పాడు. దాని వెలుగున ఆయన తీసిన సినిమాలు ఆయన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాయి.

ఆల్మడోవర్ చిత్రాల్లో సాంస్కృతిక అంశాలతో పాటు ’ఐడెంటిటీ’ కూడా ఓ ప్రధాన ఇతివృత్తంగా మనకు కనిపిస్తుంది. ఆల్మడోవర్ తొలి చిత్రాల్లో 1980 ల నాటి మాడ్రిడ్ నగరపు జీవితం అక్కడి ప్రజల జీవితాల్లోని కామెడీ ప్రధానాంశంగా మనకు ద్యోతకమవుతుంది.

ఆల్మడోవర్ సినిమాల్ని అర్థం చేసుకోవడానికి స్పెయిన్ దేశంలోని మానవ సంబంధాలు, వాటిలోని సంక్లిష్టతలు మనకు ఎంతగానో తోడ్పడతాయి. ఆ దేశంలో కనిపించే హోమోసెక్సువల్, హెటరో సెక్సువల్ సంబంధాలు ’What have I done to deserve this?’ లాంటి చిత్రాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతాయి.

ఐడెంటిటీ విషయం వచ్చినప్పుడు ఆల్మడోవర్ ప్రధానంగా శారీరక ఐడెంటిటీ గురించి పలు చిత్రాల్లో చర్చిస్తాడు. ’The Flower of my secret’ లాంటి సినిమాల్లో మానవ శరీరంలోని అవయవాల దానం గురించి వివరిస్తూ గుండెకాయలాంటి ఒకే అవయవం గురించి చర్చిస్తాడాయన. అట్లాగే క్లోనింగ్ గురించి ’Labyrinth of Passion’ సెక్స్ మార్పిడికి సంబంధిమ్చి ’What have I done to deserve this?’ లోనూ చర్చిస్తాడు.

ఇలా తాను నిర్మించిన ముప్ఫైకి పైగా చిత్రాల్లో అనేక వైవిధ్యభరితమైన అంశాల్ని ఇతివృత్తాలుగా తీసుకున్న ఆల్మడోవర్ ప్రపంచ వ్యాప్తంగా అనేక అవార్డుల్ని, గొప్ప గుర్తింపొను అందుకున్నారు. బునియల్ తర్వాత స్పెయిన్ నుంచి ఎన్నదగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఆయన తీసిన చిత్రాన్ని ఒకసారి అవలోకిస్తే…

Dark Habits:1983 లో నిర్మితమయిన ఈ చిత్రం పలువురు ఆడవాళ్ళ జీవితాలు, ఆసక్తులకు సంబంధిమ్చిన అంశాల్ని ఇతివృత్తంగా తీసుకుందీ సినిమా. సంక్లిష్టమయిన వారి జీవితాలు, సంక్షోభాలు అన్ని ఈ చిత్రంలో గొప్పగా ఆవిష్కరిస్తాడు ఆల్మడోవర్.

What have I done to deserve this?: ఈ చిత్రంలో స్పానిష్ లో వెలువడ్డ బ్లాక్ కామెడీని ఆధారంగా చెసుకుని రూపొందింది. ఇందులో సంఘర్షణకు గురౌతున్న ఓ మహిళ, టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఆమె భర్త, హెరాయిన్ వర్తకుడు అయిన పెద్ద కొడుకు, చిన్న కొడుకు, నగరాన్ని ద్వేషించే నానమ్మలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు.

Law of Desire: 1987 బెర్లిన్ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, 1988 బొగోటా ఫిలిం ఫెస్టివల్ లోనూ ప్రశంసలు పొందిన ఈ చిత్రం సంక్షుభితమయిన సెక్స్ సంబంధాల్ని చర్చిస్తుంది.

మొత్తంగా సినిమా వైవిధ్యమయిన సెక్స్ భావాలు, అనుబంధాలూ, ప్రేమలూ, ద్వేషాలూ అన్నింటినీ చర్చకు పెడుతుంది. ఆల్మడోవర్ విలక్షణమయిన చిత్రాల్లో ఒకటిగా ’Law of Desire’ మిగిలిపోయింది.

All about my Mother: ఆల్మడవోర్ చిత్రాల్లో అత్యుత్తమమయినదిగా పలువురు వమర్శకుల మన్ననలు అందుకొన్న చిత్రమిది. 2000 సంవత్సరంలో ఆస్కార్ అవార్డును, 1999 లో Cannes లో ఉత్తమ దర్శకుడి అవార్డునీ అందుకుందీ చిత్రం. ఈ చిత్రంలో మంచి మెలోడ్రామా, కొంత హాస్యమూ, సమ్మిళితమై ఉంటాయి. ఈ సినిమా నిండా విలక్షణమయిన పాత్రలు కనిపిస్తాయి. అన్ని ప్రధాన పాత్రలూ మహిళలే కాడం ఈ చిత్రం విశిష్టత. చిత్రంలోని ప్రధాన మాన్యుయెలా చిత్రంలోని అన్ని పాత్రలకి తల్లిగా రూపాంతరం చెందుతుంది. గొప్ప మానవీయ విలువల చిత్రంగా ఇది రూపొందింది.

ఈ చిత్రంలో మాన్యుయెలా పాత్ర గొప్ప ఉదాత్తతను ప్రోది చేసుకుంటుంది. అందరకీ మాతృ సమానమైన ప్రేమని పంచి పెడుతుంది. వ్యక్తులుగా వారెలాంటి వారయినా ఆమె అందించే ప్రేమలో, సేవలో భేదం చూపించదు. మాన్యుయెలా గొప్ప పాత్రగా నిలిచిపోతుంది. ఈ చిత్రం మాతృత్వానికి ఓ కానుకగా నిలుస్తుంది. నిర్మాణ పరంగా మంచి వేగంతో, గొప్ప కలర్ ఫుల్ షాట్ కంపోజషన్ తో అలరిస్తుంది.

Broken Embrace:ఆల్మడవోర్ నిర్మించిన ఇటీవలి సినిమా ఇది. ఈ చిత్రం డ్రామా, కామెడి, థ్రిల్లర్ లతో సమన్వితమై దర్శకుడి ప్రతిభకు ప్రతిరూపంగా నిలుస్తుంది. హాస్యం, మిస్టరీ ఎమోషన్ లు కలగలిపి సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ చిత్ర విజయానికి ప్రధానమయిన అంశం వివేకవంతమయిన స్క్రిప్ట్. ఈ చిత్రం గొప్ప రొమాంటిక్ సినిమా. నాలుగు ప్రధాన పాత్రల నడుమ మొలకెత్తే ప్రేమకు తోడు దర్శకుడికి ’సినిమా’ పట్ల ఉన్న ప్రేమ కూడా సినిమాలో ప్రధానంగా కనిపిస్తుంది. ఆల్మడవోర్ మాటల్లోనే చెప్పుకోవాలంటే ఈ చిత్రం ’సినిమాకు ఆయన రాసిన ప్రేమలేఖ’. బ్రోకెన్ ఎంబ్రేస్ లో ముఖ్య భూమిక ఈ సినిమా దర్శకుడు, విచ్చిన్నమయిన ఆ పాత్ర పయనమే బ్రోకెన్ ఎంబ్రేస్.

పెడ్రో ఆల్మడవోర్ ఫిల్మోగ్రఫీ:

Broken Embraces (2009)
Viva Pedro (2006)
Volver (2006)
Bad Education (2004)
Talk to Her (2002)
All About My Mother (1999)
Live Flesh (1998)
The Flower of My Secret (1996)
Kika (1994)
High Heels (1991)
Labyrinth of Passion (1990)
Tie Me Up! Tie Me Down! (1990)
Dark Habits (1988)
Matador (1988)
Women on the Verge of a Nervous Breakdown (1988)
Law of Desire (1987)
Trayler para Amantes de lo Prohibido (1985)
What Have I Done to Deserve This? (1985)
Dark Habits (1984)
Labyrinth of Passion (1982)
Pepi, Luci, Bom and Other Girls on the Heap (1980)
Folle, Folle, Folleme, Tim (1978)
3 Comments
  1. venkat May 8, 2009 /
  2. ravi May 10, 2009 /