Menu

యం.యస్.సత్యూ-ఒక పరిచయం

sathyuస్వాతంత్ర్యానంతరం దేశ విభజన కాలంలో ముస్లిం ప్రజల మానసిక స్థితి, ఆ సమయంలో తాము పుట్టి పెరిగిన ప్రాంతాలను వదిలిపోవడంలో వారు పొందిన బాధ, స్వార్థ రాజకీయపు ఎత్తుగడలకు బలయిపోయిన ఆనాటి ముస్లింల జీవన స్థితిగతులు, వారి సంస్కృతి అన్ని కలగలిసి ఆనాటి చారిత్రక సంఘటనల్ని వాస్తవంగా హృద్యంగా మన కళ్ళ ఉమ్దుంచుతుంది ఉర్దూ చిత్రం ’గరమ్ హవా’. ఆనాడు ప్రజలందరిలోనూ కదలాడిన సమైక్యతా భావాన్ని ’గరం హవా’ ఆద్యంతమూ చూపిస్తుంది. ఉర్దు రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ రాసిన కథ ఆధారంగా నిర్మింపబడింది ఈ చిత్రం. 1974 లో జాతీయ అవార్డును అందుకున్న ఈ చిత్రం ఆధునిక చిత్ర ప్రపంచంలో ఒక మంచి ప్రయత్నం. దానికి యం.యస్. సత్యూ దర్శకత్వం వహించాడు.

యం.యస్. సత్యూ సినీ రంగానికి రాకముందు చిత్ర లేఖనం, నాటకాల్లోనూ విస్తృత అనుభవం కలిగివున్నాడు. ఆయన నాటక రంగంలో అనేక ప్రయోగాలు చేస్తూ తనదంటూ ఒక శైలిని సాధించాడు. ఇండియన్ లిటిల్ థియేటర్ సత్యూ ఆధ్వర్యంలో నడిచేది. నాటకాల పట్ల ఎక్కువ మక్కు కలిగిన సత్యూ దిగజారుతున్న నాటకాల స్థితి పట్ల, అవి కోల్పోతున్న ప్రజాభిమానం పట్ల వ్యధ చెందేవాడు. సత్యూ హిందీ లోకి అనుసరింపజేసిన ’ది కాకేసియన్ చాక్ సర్కిల్’ నాటకం విస్తృత ప్రజాభిమానం పొందింది. సత్యూ అటు నాటకాల అభివృద్ధి కోసం విపరీతంగా శ్రమిస్తూనే ఇటు సినీరంగ ప్రవేశం కూడా చేశాడు.

ఆయన మొదట 1969 లో ’గాలిబ్’ అనే డాక్యుమెంటరీ చిత్రం చేశాడు. ’గాలిబ్’ చిత్రం విజయవంతమయి సత్యూకి మంచి పేరు సమూపార్జించింది. దాంతో ఆయన నాటక రంగం కంటే సినిమాల్లోనే వివరంగా చెప్పవచ్చని, సినిమా విస్తృతమయిందని గుర్తించి పూర్తిగా సినిమా వైపు దృష్టి సారించాడు. 1974 లో నిర్మించిన ‘గరం హవా’ తరవాత 1977 లో ’కన్నేశ్వర రామా’ చిత్రాన్ని నిర్మించాడు సత్యూ. కర్ణాటక రాష్ట్రంలో స్వాతంత్ర్య పోరాటకాలంలో కన్నేశ్వర రామా అనే యోధుడు భూస్వాములకు వ్యతిరేకంగా జరిపిన పోరాట యధార్థ కథే ఈ చిత్రం. ఆ తర్వాత 1979 లో సత్యూ నిర్మించిన ’చితే గూచింటే’ చిత్రాన్ని ప్రభుత్వం నిషేధించింది. విడుదలయిన రెండు వారాల్లోనే నిషేధం అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకూ ఆనాడు స్వాధీనం చేసుకున్న ప్రింట్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు. దేశ రాజకీయ నాయకుల అవినీతి, అసంస్కృతి, ఛండాలమయిన వ్యక్తిత్వం, అన్నీ వ్యంగంగా చూపించాడీ చిత్రంలో. వాస్తవాల్ని చూడలేని, భరించలేని రాజకీయ ప్రభుత్వం ఆ చిత్రాన్ని నిషేధించి ఆ చిత్రం విలువేమిటో చాటి చెప్పింది.

సత్యూ నిర్మించిన తదుపరి చిత్రం ’బర’. 1981 లో నిర్మించబడ్డ ’బర’ 1982 ఇండియన్ పనోరమా చిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. మన దేశంలో కరువు, వరద తుఫాన్ లు అన్నీ రాజకీయాల చేతుల్లో ఇరుక్కుని ప్రజలెలా గిలగిలా కొట్టుకుంటున్నారో చూపిస్తుందీ చిత్రం. ఈ చిత్రం ’సూఖా’ పేర హిందిలో కూడా విడుదలయింది. ’సూఖా’ చిత్రానికి నర్గీస్ దత్ సమైక్యతా అవార్డు తెచ్చిపెట్టింది. ఇలా తన చిత్రాల ద్వారా దేశ పరిస్థుతుల్ని, కుళ్ళిన రాజకీయాల్ని, విశ్లేషించే సత్యూ టి.వి కోసం హిందూ సిక్కుల సఖ్యతని చూపించే సీరియల్ ని నిర్మించాడు. కర్తార్ సింగ్ దుగ్గల్ రచన ఆధారంగా వచ్చిన ఈ సీరియల్ పేరు ’చోలీ దామన్’. హిందీ కన్నడ భాషల్లో హుడ్కో వారి సహకారంతో మురికి వాడల పైన ’అవేశ్’ అనే టెలీ ఫిలిం రూపొందించారు సత్యూ.

సత్యూ శ్రీమరి షమా వైదీ విద్యాధికురాలు. ఆమె సత్యూకి స్క్రీన్ ప్లే రచనలో తోడ్పడుతూ ఉంటుంది.

1930లో జన్మించిన సత్యూ తన తొలి దినాల్లో కళా దర్శకుడిగా,ఛాయాగ్రహకుడిగా, స్క్రిప్ట్ రైటర్ గా అనేక శాఖల్లో ఆరితేరారు. ఆయన పిల్లల కోసం ’ఇర్షాద్’ అనే బాలల చిత్రం కూడా నిర్మించాడు.

ఆయన గొప్ప సామాజిక స్పృహతో నిర్మించిన సూఖా, చితెగు చింతే, కహా కహా సె గుజర్ గయా లాంటి చిత్రాలు ఆయనకు ఎన్నో అవార్డులతో పాటు ఎన్నో ఇబ్బందుల్ని కూడా తెచ్చిపెట్టాయి.

1995 లో సత్యూ దర్శకత్వం వహించిన ‘గలిగె’ లో మతంలో మౌలిక పరమయిన సత్యం, ప్రేమ, స్నేహ సౌభ్రాతృత్వాలు గాఇలి ఎగిరిపోయి, మతం సమైక్యతకు భంగకరమయిందిగా ఎట్లా మారిందో చూపిస్తాడు. ఎన్.ఎఫ్.డి.సి దూరదర్శన్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం 1995 ఇండియన్ పనోరమాలో ప్రదర్శితమయింది.

5 Comments