Menu

అలిసింటే అన్వేషణమ్

alicinte-anveshanamవిడిపోవడం, దుఖఃపడడం, వేచి చూడడం, వెతుకులాడడం ఇవాళ్టి జీవితాల్లో అంతర్భాగమైపోయాయి. ఏ ఇద్దరు మనుషుల మధ్యా సంపూర్ణ స్నేహమూ, పరి పూర్ణ ప్రేమ ఆశించడం ఈ రోజుల్లో అత్యాశే అవుతుంది. చివరికి జీవితాంతం కలిసి జీవించనున్నామనుకునే భార్యాభర్తల నడుమా పూడ్చలేని అగాధాలూ, అందుకోలేని దూరాలు ఇవాళ వాస్తవాలై ఉంటున్నాయి. సంక్షోభాలతో నిండిపోయిన బతుకులు సంక్లిష్టమై ఒకరినొకరు అర్ధం చేసుకోవడం అటుంచి తమని తాము అర్ధం చేసుకోలేని స్థితి నేటి జీవిత విధానమై కూర్చుంది. ముక్కలు చెక్కలుగా విచ్చిన్నమవుతున్న జీవన శకలాల్ని ,మనుషుల్ని అంది పుచ్చుకుని పునర్ నిర్మించే యత్నాల్ని ఏ కొద్దిమంది కళాకారులో చేస్తున్నారు. ఆ క్రమంలోవారు సంపూర్ణంగా విజయవంతులు అయినా కాకున్నా సామాజిక లక్షణాల్ని మనుషుల మనస్తత్వాల్ని కళాత్మకంగా మన ముందుంచడంలో సఫలీకృతులు అవుతూనే ఉన్నారు.

ఇలాంటి ప్రయత్నమే “పాంతన్ మాడ” సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్న చలన చిత్రకారుడు టి.వి.చంద్రన్ చేశారు. ఆయన 1989 లో నిర్మించిన “అలిసింటే అన్వేషణమ్” చిత్రంలో చెప్పాపెట్టకుండా, ఎలాంటి సూచనా లేకుండా తమ నుంచి దూరమయిన భర్తను వెతుకుతూ సాగిన ఓ మహిళ అనుభవసారాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. భర్తను దూరం చేసుకున్న స్త్రీ పాత్రను ముఖ్యాభినేతగా చేసి ఆమె కోణంలోంచి ఈ సమాజాన్ని అర్ధం చేయించడానికి దర్శకుడు టి.వి.చంద్రన్ విజయవంతమయిన ప్రయత్నం చేశారు. కొన్నేళ్లపాటు కాపురం చేసి, ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత కూడా భర్తే తనకు పూర్తిగా అర్ధం కాని స్థితిలోంచి ఆమె సమాజంలోకి అడుగుపెడుతుంది. ఇక తన చుట్టూ ఉన్న ప్రపంచమూ, మగవాడి స్వార్ధమూ, ఆధిపత్యమూ, అవకశవాదమూ ఆమెను కలవరపెడతాయి. తీవ్రమయిన గందరగోళంలోకి పడవేస్తాయి. వాటన్నింటిని అర్ధం చేసుకుంటూ ముందుకు సాగిన ఆమె చివరికి తనకోసం తాను తన కాళ్లపై నిలబడేందుకు నిర్ణయించుకుంటుంది. ఆ మొత్తం పరిణామ క్రమాన్ని టి.వి.చంద్రన్ లయబద్ధమయిన చిత్రీకరణతో సినిమాను నడిపించాడు. మహిళా కోణం నుంచి విభిన్న వ్యక్తుల మనస్తత్వాల్ని వివరించడంలో “అలిసింటే అన్వేషణమ్” విజయవంతయమయిన ప్రయత్నంగా నిలిచింది.

చిత్ర కథాంశం విషయానికి వస్తే ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న కాథలిక్ థామస్ కుట్టి ఓ రోజు అర్ధాంతరంగా తన భార్యను, ఇద్దరు చిన్నపిల్లలను వదిలేసి వెళ్లిపోతాడు.ఎటు వెళ్లిందీ, ఏమయిందీ ఎవరికీ తెలియదు. ఎన్నడూ భార్యతో పోట్లాడనివాడు, ఆమెను అమితంగా ప్రేమించేవాడు. కుట్టి అదృశ్యం కావడం అందరికీ ఆశ్చర్యం గొలుపుతుంది. ప్రధానంగా ఆయన భార్య అమీన్ తీవ్రంగా మధనపడుతుంది. అతని రాక కోసం ఎదురు చూసిన ఆమె తన భర్తను వెతుకుతూ బయలు దేరుతుంది. భర్త ఎందుకిలా చేశాడో? ఆమెకు ఎంత ఆలోచించినా అర్ధం కాదు. భర్త గురించి ఆమెకు తెలిసిందల్లా అతను పెద్ద పెద్ద పుస్తకాలు తెచ్చి చదువుతూ ఉంటాడని, అంతకు మించి అతని గురించి ఆమెకేమీ తెలియదు. ఇద్దరి మద్య మానసికంగా అంతకుమించి సాన్నిహిత్యం లేదన్నది ఆమెకిపుడు అర్ధమవుతుంది. నిజానికామె అంత ఇంటలిజెంట్ కూడా కాదు. ప్రేమ కథలూ, సినిమాలూ చూసి కలల్లో విహరించే మనస్తత్వమూ ఆమెదికాదు. ఆమె అతి సాధారణమయిన స్త్రీ. మేధావి అయిన తన భర్తతో సర్దుకుపోవాలనే ఆలోచనలో ఉన్న ఆమెకు భర్త దూరం కావడం ఏ రకంగానూ అర్ధం కాదు. అయినా భర్త కోసం వెతకడం ఆరంభిస్తుంది. థామస్ కుట్టికి మంచి స్నేహితుడయిన విశ్వం ఆమెకు అండగా నిలుస్తాడు. వారిద్దరూ కాలేజీ చదివే రోజుల్లో సహోధ్యాయులు. ఇప్పుడు వారిద్దరూ కలిసి కుట్టీని వెతకడానికి బయలుదేరి అనేకమందిని కలుస్తారు. వారు చెప్పిన అనేక విషయాలు అమీన్‌ను కలవరపెడతాయి. ఉన్నతుడని విశ్వసించిన తన భర్త గురించి చెడుగా వినాల్సి రావడం ఆమెకు ఇబ్బంది కలిగిస్తుంది. మరో పక్క విశ్వం తనపట్ల కనబరుస్తున్న ఆదరణ ఆమెకు సంతోషం కలిగిస్తుంది. అతనికి తనపైన కాలేజీ రోజుల్నించి ప్రేమాభిమానాలు ఉన్నాయని గమనించి ఆశ్చర్యపడుతుంది. విశ్వం తన మిత్రుడిని వెతకడానికి కాకుండా అమీన్ పట్ల తనకున్న ప్రేమాభిమానాల పర్యవసానంగానే ఆమెకు తోడుగా నిలుస్తాడు.

చివరగా వారిద్దరూ కుట్టీకి మంచి మిత్రుడయిన గోవిందన్‌ని కలుస్తారు. కుట్టి గోవిందన్ లిద్దరూ గతంలో రాడికల్ భావాల్తో కలిసి పనిచేసినవారే. గోవిందన్ పేదలకోసం ఇప్పటికీ పనిచేస్తూ ఉండగా కుట్టీ తన సౌఖ్యవంతమయిన జీవితం కోసం వెళ్లిపోయాడని గోవిందన్ చెబుతాడు. ఇంకా అమీన్‌తొ పెళ్లికి ముందే కుట్టీకి భార్యా , ఒక కూతురూ ఉన్నారని గోవిందన్ చెబుతాడు. అమీన్ ఆశ్చర్యపోతుంది. గోవిందన్ అమీన్‌నికుట్టి పురాతన గ్రామానికి తీసుకెళ్లి కుట్టి మొదటి భార్యను, కూతురిని చూపిస్తాడు.

వాస్తవాలు తెలుసుకున్న అమీన్ దుఖంతో ఇంటికి తిరుగుముఖ్యం పడుతుంది. ఇన్నేఈల కాపుతంలో అర్ధంకాని భర్త ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్ధమయినట్లు అనిపిస్తుందామెకు. ఇక తన భర్తను చూడాలనే అభీష్టం ఆమెలో అంతరించి పోతుంది. చూడాలనీ, చూడకూడదనీ ఏమీ అనిపించని స్థితికి ఆమె చేరిపోతుంది.

ఇంతలో ఓ రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మనిషి ఎవరో చనిపోయాడని విని అది ధామస్ కుట్టీ కావచ్చునని అమీన్, విశ్వంలు పోలీస్ స్టేషన్‌కు వెళతారు. కాని శవం ఫోటోలు చూసి చనిపోయింది కుట్టీ కాదని, గోవిందన్ అని గుర్తుపడతారు. గోవిందన్ మరణం అమీన్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అతనే ఆమెకు జీవితంలో మొట్టమొదటి సారిగా జీవితాన్ని గురించి, పెళ్లి గురించి ఆవగాహన కలిగించినవాడు. అంతే కాదు పెళ్లికంటే మించిన బతుకుని గురించి, అర్ధవంతమైన మనుగడ గురించి బోధించిన వాడు. అందుకే ఆమె గోవిందన్ మరణాన్ని అంత సులభంగా జీర్ణం చేసుకోలేకపోతుంది. తర్వాత్ ఆమీన్ తన భర్త కోసం వెతకడం మానేస్తుంది. తన కాళ్లపై తాను నిలబడాలని నిర్ణయించుకుంటుంది. ఓ స్కూల్లో టీచరుగా చేరి తన పిల్లల్ని వెంట తీసుకొని కొత్త ఇంట్లోకి మారుతుంది. కొత్త వ్యాపకంతో జీవితంలోకి ఆమె పయనమవుతుంది. అర్ధం కాని బతుకులోంచి సువిశాలమయిన ప్రపంచంలోకి అర్ధవంతమయిన జీవితాన్ని గడపడానికి ఆమె నిశ్చయించుకుంటుంది. భావుకుడయిన టి.వి.చంద్రన్ బాధ్యతాయుతంగా నిర్మించిన “అలిసింటె అన్వేషణమ్” విలక్షణ చిత్రంగా నిలిచింది.

అలిసింటే అన్వేషణం (మళయాళం)

కెమెరా – సన్నీ జోసెఫ్

నిర్మాత, దర్శకుడు – టి.వి.చంద్రన్

నటీనటులు – జలజ, నెడుముడి వేణు, రవి మొ…

3 Comments
  1. venkat May 11, 2009 /
  2. Chandritha May 15, 2009 /