Menu

Valkyrie

valkగతవారం వాల్కైరీ చూట్టానికి బయలుదేరేముందు అదొక సినిమా వచ్చిందన్న విషయం తప్ప, అందులో టాం క్రూజ్ ఉంటాడన్న విషయం తప్ప మరేమీ తెలీదు నాకు. అయితే, ఎవరో చెప్పగా అది హిట్లర్ పై హత్యా యత్నం టైపు కథని వినేసరికి కాస్త కుతూహలం కలిగింది. సినిమా చూసొచ్చాక మరీ “వావ్!” ఫీలింగ్ కలక్కపోయినా కూడా ఓ historical thriller చూసిన భావనలోని “వావ్” ను అనుభవించగలిగాను.

కథ: ఈ కథ రెండో ప్రపంచ యుద్ధం నాటి జర్మనీ లో తీసినది. జులై 20, 1944 న హిట్లర్ ను చంపడానికి అతని ఆర్మీ అధికారులే కొందరు పథకం వేస్తారు. ఆ తరువాత ఆపరేషన్ వాల్కైరీ అన్న జాతీయ అత్యవసర స్థితి కి సంబంధించిన చట్టాన్ని ఉపయోగించి దేశాన్ని అదుపులోకి తీసుకుని, హిట్లర్ లేని తమ కలల జర్మనీని నిరంఇంచుకోవాలన్నది వీళ్ళ ఆలోచన. ఈ పథక రచయిత రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా గాయపడి వెనక్కి స్వదేశానికి వచ్చేసిన కొలొనెల్ Claus von Stauffenberg (టాం క్రూజ్). ఇతను, మరికొంత మంది హిట్లర్ గురించి అసంతృప్తిగా ఉన్న అధికారులు కలిసి హిట్లర్ ని చంపడానికి పథకం రూపొందిస్తారు. దానికోసం ఆర్మీ లోని ఇతర అధికారుల్లో కావాల్సిన వారిని, అనుకూలంగా మారే అవకాశం ఉన్న వారిని తమలో చేర్చుకుంటారు.

హిట్లర్ తో జరిగే ఓ మీటింగ్ లో పాల్గొనేల స్టాఫెన్‌బర్గ్ పరిస్థితుల్ని సృష్టిస్తాడు. ఆ సమావేశంలో బాంబులు పెట్టి హిట్లర్ ను చంపేయాలన్నది పథకం. అయితే, యుద్ధంలో ఓ చేయి, రెండో చేతి చివరి రెండు వేళ్ళూ పోగొట్టుకున్న అతను అక్కడ రెండో బాంబు నాటడంలో విఫలుడై దాన్ని తన సహాయకుడి వద్దే ఉంచేసి, ఒకే బాంబుతో సమావేశంలోకి అడుగుపెడతాడు. సరిగ్గా అది పేలే సమయానికి స్టాఫెన్‌బర్గ్ బయటకు వచ్చేస్తాడు. అయితే, బాంబు ఉన్న సూట్‌చేసును అక్కడున్న ఇంకో అధికారి కాస్త పక్కకి జరపడంతో ఈ దాడిలో హిట్లర్ పెద్ద గాయాలేమీ కాకుండానే బయటపడతాడు. చివర్లో ఈ కుట్రదారులందర్నీ హిట్లర్ సేన రకరకాలుగా వధిస్తుంది. ఇదీ క్లుప్తంగా దీని కథ.

నచ్చినవి:
కథనం. మనకి ఎలాగో తెలుసు హిట్లర్ ఇందులో చనిపోడు అని. అయినా కూడా యమ టెన్షన్ తో చూస్తూ ఉంటాము. తర్వాతేమౌతుంది? తర్వాతేమౌతుంది? అన్న కుతూహలం ఆద్యంతమూ నిలిచే ఉంటుంది. చరిత్ర పాఠం గా బాగానే పనికొస్తుంది. ఈ సంఘటన తరువాత సాఫెన్‌బర్గ్ పిల్లలు కొన్నాళ్ళు ఆ ఇంటిపేరు వాడుకోనేలేదట..అంత రాజద్రోహి లెవెల్లో చూశారట అతన్ని అప్పట్లో. హిట్లర్ పై జరిగిన హత్యా యత్నాల్లో చరిత్రలో రికార్డు కాబడ్డ పదిహేనింటిలో ఇది చివరిదట. పాత్రధారులందరూ బాగా సూటయ్యారు. టాం క్రూజ్ ఒక్కడే నాకు నచ్చలేదు. ఆ ఒంటికన్ను గెటప్ లో పైరేట్ లా అనిపించాడు కానీ సైనికుడులా కాదు. కథా కథనాల పరంగా ఇది నిజమైన హిస్టారికల్ థ్రిల్లర్. నాకైతే సినిమా ఆద్యంతమూ నచ్చింది.

నచ్చనివి: ఆ టాం క్రూజ్ ను ఆ గెటప్ లో చూడటం కష్టమైంది. 🙂 ఇంకా, ఈ సినిమా లో హిట్లర్ పాత్ర చిత్రణ ఎలా ఉందంటే అది చూస్తే మీకు అతనో grumpy old man అన్న భావన కలుగుతుంది కానీ, ఆ కాలాన్ని గడగడలాడించిన నియంత అనిపించదు. కథ స్టాఫెన్‌బర్గ్ వైపు నుండి కనుక హిట్లర్ పాత్ర నిడివి చాలా తక్కువైనా కూడా నాకు ఓకే అనే అనిపించింది. ఎటొచ్చీ, ఆ పాత్ర చిత్రణ కాస్త శ్రద్ధగా చేసి ఉండాల్సింది అనిపించింది.

5 Comments
  1. hero. April 7, 2009 /
    • shree April 8, 2009 /
  2. shree April 8, 2009 /