Menu

ప్రయోగాత్మకత ప్రయోజనమెంత?

mn_lab-filmరెండు సంవత్సరాల క్రితం FTII, పూణే వారు చేసిన కొన్ని లఘు చిత్రాలు చూడటం తటస్థించింది. అంత క్రితం దూరదర్శన్ లో ఇలాంటి సినిమాలు చూసినా, ఆ సినిమాలు తీసిన వారితో చర్చించే అవకాశం ఇప్పుడు కలగడంతో , నా అక్కసు వెళ్ళగక్కుకున్నాను.

ఆ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు తీసిన ఒకటొఅరా సినిమాలు తప్ప మిగతావన్నీ నా మెట్టబుర్రకు అర్థం కాని చిత్రాలు. విషయవస్తువులు abstract గా ఉండటం, కథన రీతులు పాత్రల తీరుతెన్నుల మీద మాత్రమే కాకుండా వారికి నేపధ్యంలో జరుగుతున్న action, ప్రతిఫలిస్తున్న రంగులు, నేపధ్యసంగీతం లేదా ఏడిటింగ్ గ్రామర్ లో మార్పులు చేర్పులతో కథాగమనాన్ని, అర్థాల్నీ నిర్ణయించే ప్రయత్నాలు చెయ్యడంతో నాకు కొంత కలగాపులగంగా అనిపించింది. ఇవి పూర్తిస్థాయి ప్రయోగాలే అయినా, వాటివెనుక చాలా ఆలోచనలు పొందుపరచబడ్డాయని అనిపించే చిత్రాలు. ఇదే విషయాన్ని నేను సూటిగా ప్రశ్నించకుండా, వారి ప్రేరణకు సంబంధించిన విషయాలను కనుక్కునే ప్రయత్నం చేశాను.

చాలా వరకూ విద్యార్థులు ప్రపంచ సినిమా, ముఖ్యంగా యోరోపియన్ న్యూవేవ్ సినిమాతో ప్రభావితమై అందులోని రీతుల్ని అనుసరించి ఆ సినిమాలు తీసినట్లుగా చెప్పారు. మరీ ముఖ్యంగా సినిమాని సమాజం కోసం లేక ఒక కథ చెప్పడానికి కాకుండా, తమ భావాలను వ్యక్తపరిచే ఒక మీడియంగా వారు వాడుతున్నతీరు గురించి విని కొంత ఆశ్చర్యం అనిపించింది. ఇందులో నుంచీ రెండు ప్రశ్నలు ఉద్భవించాయి. ఒకటి నిజంగా యూరొపియన్ సినిమాలోని ప్రయోగాత్మక మూసలు మన సాంస్కృతిక-మానసిక రీతుల్ని represent చెయ్యగలవా? రెండు సినిమాని ఒక సామాజిక-సాంస్కృతిక అభివ్యక్తిగా కాకుండా, కేవలం వ్యక్తిగత అభివ్యక్తిగా చూస్తే ఆ శక్తివంతమైన మాధ్యమానికి న్యాయం జరుగుతుందా? అనేవి.

ఈ రెండు ప్రశ్నలకూ ఇప్పటి వరకూ సంతృప్తి కరమైన సమాధానం ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో నాకు లభించలేదు.ప్రపంచసినిమా (ముఖ్యంగా యూరోపియన్ న్యూవేవ్ ) పుట్టిన సామాజిక,రాజకీయ మరియు సైద్ధాంతిక పరిణామాల్ని కనుమరుగు చేసి,కేవలం అనుకరణ ద్వారా ఆ రీతుల ఆత్మను మనం సొంతం చేసుకోగలమా! ఒకవేళ సొంత చేసుకున్నా, అవి మన పరిస్థితులకు అనుగుణంగా ఒదుగుతాయా?  అనే skepticism బహుశా ఇప్పటికీ నాలో ఉందేమో. రెండవ ప్రశ్నకు సమాధానం ఒకప్పటి గురుదత్ సినిమాలు కొంత తీరిస్తే, ఈ మధ్య వచ్చిన అనురాగ్ కశ్యప్ ‘దేవ్ డి’, ‘గులాల్’ సినిమాలు కొంత తీర్చాయి. కథల్ని “సొంతం” చేసుకుని తమ వ్యక్తిగత భావాల బలాన్ని నింపి, అనువదించి ఆవిష్కరించడమే సరైన పద్ధతేమో అన్న నిజాన్ని అంగీకరించడానికి నేను సిద్ధపడుతున్నాను.

కానీ ఈ రెండు ప్రశ్నల నేపధ్యంలో నేను తెలుసుకున్న విషయం అత్యంత ప్రధానమైనది. అదే, ప్రయోగాత్మకతలోని ప్రయోజకత్వం. ‘శ్రీశ్రీ’ చెప్పినట్లు ప్రతి శాస్త్రం లోనూ “కృషి ద్విముఖంగా ఉంటుంది. ఒకటి పరిశోధన (pure science), రెండవది ఆ పరిశోధనా ఫలితాలను అనుభవయోగ్యం చెయ్యడం (applied science)…ఇదే విధంగా సినీమాల విషయంలో కూడా రెండు విభాగాలు ఉండాలంటాను. ఒకటి pure cinema, ఆ సినిమాలలోకూడా కేవలం ప్రయోగాలు మాత్రమే జరుగుతూ ఉంటాయి. రెండవస్థాయి సినిమాలు commercial cinemas ఆ ప్రయోగాత్మక చిత్రాల ఫలితాలవల్ల ప్రయోజనం పొందుతూ, ఉత్తమ స్థాయిని పొందుతూ ఉంటాయి.” కానీ బహుశా మన దురదృష్టం ఈ ప్రయోగాలు FTII తెరలు,గోడలు దాటి పరిశ్రమకు రాలేకపోవడం. అదేవిధంగా ప్రేక్షకుడివరకూ చేరకపోవడం ఈ సినిమాల దుస్థితికి కారణమేమో అనిపించక మానదు.

కమర్షియల్ సినిమా ప్రపంచంలో “ప్రయోగం” చాలా ఖర్చుతో,శ్రమతో కూడుకున్నది. అంతేకాక, అప్లయిడ్ సైన్సులో ప్రయోగాలు అనవసరం. కాబట్టి, ఈ ప్రయోగాల్ని చేసే లేబరేటరీల్లాంటి సినిమా institutions మనకు ఎంతైనా అవసరం. FTII వాళ్ళ సినిమాల్ని చూసి నేను అర్థంకాక తికమకపడ్డా, వాటి అవసరాన్ని మాత్రం కాదనలేమన్న ధృడనిర్ణయానికి రావల్సొంచ్చింది. అంతేకాక, మన తెలుగు పరిశ్రమ పరిస్థితికి ఇలాంటి film education సంస్థలు లేకపోవడం ప్రధాన కారణమేమో అనికూడా అనిపిస్తోంది. ముఖ్యంగా మన దక్షిణభారతదేశ సినిమాల సంగతి తీసుకుంటే, తమిళ సినిమాల స్థాయికి ఏ సినిమాలూ చేరుకోకపోవడానికి వారిదగ్గరున్న film institute ముఖ్యకారణం అనేది కాదనలేని సత్యం. కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త శైలి, కొత్త పంధా అక్కడినుండీ కమర్షియల్ సినిమాలోకి పాకినవే.

మన తెలుగు సినిమా పరిశ్రమ  ఫ్యూడల్  పోకడలకి తోడు, సరైన విషయపరిజ్ఞానం, ప్రయోగాలు చెయ్యగలిగే సినీఅకడమిక్ సంస్థలు లేకపోవడంతో, “పెద్దల” దయాదాక్షిణ్యాల మీదేతప్ప శక్తిసామర్ధ్యాలతో పరిశ్రమ పోకడల్ని మార్చే సత్తాతో ఎవరూ పరిశ్రమలోకి ప్రవేశించలేకపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రామానాయుడూ ఫిల్మ్ స్కూల్ తప్ప మిగతావన్నీ కనీసం గుర్తింపు పొందినవి కూడా కాదు. ఇక equipment మరియూ బోధకు విషయం సరేసరి. ఈ సంస్థ వయసుకూడా కేవలం ఒక సంవత్సరం మాత్రమే. మరి తమిళ “ట్యాలెంట్”తో తెలుగు పరిశ్రమ నడవటంలో ఆశ్చర్యం ఏముంది?

రెండో సమస్య, ఫిల్మ్ జ్ఞానం సంపాదించుకున్నోళ్ళు academiciansగా మిగిలిపోవడం లేక అవకాశాలు వెతుక్కుంటూ ముంబైకి వెళ్ళిపోవడం. FTII లో చదివిన తెలుగు వాళ్ళు కూడా, తెలుగు పరిశ్రమలోని కుల,బానిస ఫ్యూడల్ భావజాలాలకి వెరసి ఇక్కడికన్నా ముంబైలో “ఫ్రొఫెషనల్”గా పనిచెయ్యొచ్చని వెళ్ళిపోతున్నారు. మరికొందరు పరిశ్రమలో ఉన్న స్టార్ సిస్టం, ఫక్తు వ్యాపారధోరణి మధ్యన మేమనుకున్నట్లు ఎలాగూ సినిమాలు తియ్యలేం కాబట్టి, కనీసం సిన్సియర్గా సినిమా విద్యనైనా బోధించాలనే ఉద్దేశంతో బోధనవైపు మొగ్గుచూపుతున్నారు. అంటే నేర్చుకున్నవారు “మన”పరిశ్రమలోకి రాక, మిగిలినవాళ్ళు మళ్ళీ బోధనలోకి వెళ్ళిపోయి, ప్రయోగాల్ని పరిశ్రమ వరకూ తీసుకురాలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు. మరి “మార్పు” ఎక్కడి నుంచీ వస్తుంది?

ఈ పరిస్థితుల్ని అధిగమించే తరుణం ఎప్పుడు? మన పరిశ్రమ బాగుపడేదెప్పుడు?

7 Comments
  1. $h@nK@R! April 27, 2009 /
  2. కొత్తపాళీ April 28, 2009 /
  3. రాజశేఖర్ April 29, 2009 /
  4. రాజశేఖర్ April 29, 2009 /
  5. chaitanya May 7, 2009 /