Menu

జానకి గారికి జన్మదిన శుభాకాంక్షలు

janakiనేను మళ్ళీ జానకి గారి గురించి రాస్తున్నా. 🙂 ఏప్రిల్ 23 ఆవిడ పుట్టినరోజు. కనుక ఇది శుభాకాంక్షల వ్యాసం అనమాట. తెలుగు,తమిళ,కన్నడ, మలయాళం సినిమాల పాటలు వినేవరెవరికైనా ఈ పేరు పరిచయమక్కర్లేనిది. అంటే, అక్కడికి జాబితా ఐపోయిందనుకునేరు – హిందీ, ఒరియా, కొంకణి, బెంగాలి, తుళు వంటి మనభాషలే కాక, సింహల, జర్మన్, బడుగ భాషల్లో కూడా ఆవిడ పాటలు పాడారంటే ఇక అర్థం చేసుకోండి ఆవిడ నేర్పును. ఇంకోరు పాడలేరని కాదు, భాషరాకుండా ఆ భాషలో పాడే గాయనీ గాయకులెంతమంది లేరు? అయినా కూడా, ఇన్ని భాషల్లో పాడటం మామూలు సంగతేమీ కాదు. సినిమా, సినిమేతర గీతాలు కలిపి దాదాపు 30000 పాటలు పాడారట ఇప్పటికి. ఇంకా అప్పుడప్పుడూ పాడుతూనే ఉన్నారు ఈ వయసులో కూడా.

నాకైతే ఆవిడలో ఏవి నచ్చుతాయి అని ఆలోచిస్తే – ఏ మూడ్ పాటనైనా అవలీలగా పాడేయడం ప్రధానంగా నాకు నచ్చుతుంది. “సిరిమల్లె పూవా” అని కలలు కన్నా, “సూరీడు పువ్వా” అని వేదన పడ్డా, “నీలీల పాడెద దేవ” అన్నా, “నరుడా ఓ నరుడా” అని కవ్వించినా, “ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకం లో” అని విరుచుకుపడ్డా, “గోవుల్లు తెల్లన” అని చిన్నపిల్లైపోయినా, “మామి పేరు మానే” (Tamil) అని మగగొంతుక ధరించినా, “సన్నజాజి పడక” అంటూ వెంటనే తానే గొంతుతో నేపథ్య సంగీతం సృష్టించినా, “సిరిమల్లె పూవల్లె నవ్వు” అన్నప్పుడు నిజంగా పువ్వు ఇలాగే నవ్వుతుందేమో అనిపించేలా నవ్వినా, ఏ మానసిక స్థితినైనా ఒకే ఈజ్ తో పలికీంచగల సామర్థ్యం ఆమె సొంతం. ఇక, ఆవిడలో ఉండే energy levels చూస్తే వావ్ అనిపిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆవిడ మొహం చూస్తే ఎంత రిలాక్సింగా అనిపిస్తుందో! ఏ వయసులోనైనా తరగని యవ్వనం ఆమె మనసుది.

ఇటీవలే ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన “ఉదయ” సినిమాలోని “అంజనం” అన్న పాటను విన్నాను (ఎస్.జానకి యాహూ గ్రూప్ పుణ్యమా అని) – ఆ పాటలో నేపథ్య సంగీతమే ప్రధానంగా అనేకానేకమైన విధాలుగా కదులుతూ ఉంటుంది. దానికి తోడు జానకి గారు, ఎస్పీబీ గారు అద్భుతంగా గొంతుకలు మాడ్యులేట్ చేయడం ఒకెత్తు, జానకి గారు ఇందులో నాలుగు దక్షిణాది భాషలూ వాడటం మరో ప్రత్యేకత. అలాగే, “దండాలు సామీ” అంటూ ఈటీవీ వారి ఝుమ్మంది నాదంలో నాలుగు వయసుల గొంతుకలతో పాడిన పాట, కృష్ణుడు-యశోధ గా తానే ఉండి “గోపాల కృష్ణుదు” ఆల్బం కోసం పాడిన పాట – ఇవన్నీ ఆవిడలోని వైవిధ్యాన్ని తెలియజేస్తాయి. ఆవిడ పారిన త్యాగరాయకృతులు కూడా అంతే అద్భుతమైన భావన కలిగించాయి నాకు. ముఖ్యంగా “దయరాని..” పాడుతున్నప్పుడు “కనుగొనానందమై..కన్నీరు నిండినే రామా..” అన్న వాక్యం రెండు మూడు రకాలుగా పాడుతున్నప్పుడు ఆ భావన లోని గాఢత వినేవారు కూడా అనుభవిస్తారు. ఇళాయరాజా-జానకి కాంబో పాటలైతే వావ్ అని పదిసార్లనుకున్నా కూడా సరిపోనంత మైమరిపిస్తాయి.

నేను ఆవిడ గురించి చదివిన వాటిలో నాకు బాగా గుర్తుండి పోయిన కథలు చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను.

  1. ఒక రికార్డింగ్ జరుగుతున్నప్పుడు జానకి గారు పాడుతూ ఉంటే, ఓ చరణం తరువాత ఆర్కెస్ట్రా లయ తప్పిందట. ఉన్నట్లుండి అంతా సంగీతం నిలిపేసారట. జానకి గారు అవాక్కయ్యారు అది చూసి. ఇళయరాజా గారికి కోపమొచ్చి ఆర్కెస్ట్రా వద్దకు వెళ్ళి కేకేస్తే వారు ఆవిడ గానంలో మైమరిచామని, ట్యూను మర్చిపోయామనీ చెబితే ఆయన నవ్వుతూ మళ్ళీ రికార్డ్ చేసారట – (మూలం ఇక్కడ).
  2. జానీ తమిళ సినిమాలో “కాత్రిల్ ఎందన్ గీతం” పాట గురించి – ఈ పాట ఏ గాయనికైనా కష్టమైన పాట అని ఇళయరాజా గారి అభిప్రాయం. ముందు ఒక గాయనితో ప్రయత్నించి, చివరికొచ్చేసరికి ఆమె నేను పాడలేనన్నపుడు రాజా జానకి గారు మాత్రమే ఈ పాటకు న్యాయం చేయగలరు అని ఆవిడ చేత పాడించారట.

సరే, ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కానట్లే ఏం చెప్పి ముగించాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా ఇంకా ఏదో చెప్పాలనిపిస్తూనే ఉంది. అరే, ఈ పాట భలే పాడారు కదా, ఆ పాట భలే పాడారు కదా – ఒక్కోటి క్షణానికోటి గుర్తొస్తూనే ఉన్నాయి. అయినా, ఇంతసేపుగా మీరు నన్ను భరిస్తున్నారు కనుక ఇక ఆపుతాను. ఆవిడ జీవిత చరిత్రా, అందుకున్న అవార్డులూ బహుమతులూ – ఇదంతా నేను మళ్ళీ మొదట్నుంచీ చెప్పనక్కర్లేదులే అన్న ఉద్దేశ్యంతో ఆ ప్రస్తావన తేలేదిక్కడ. వ్యాసంలో ఫిల్మోగ్రఫీ తో సహా మంచి పరిచయం రాసారు. అలాగే, ఇతర గాయనీగాయకుల అభిమానులకి, జానకి గారంటే నచ్చనివారికీ -రెండు వర్గాలకూ విజ్ఞప్తి: ఈ వ్యాసం కింద పోలికల ఆట మొదలుపెట్టవద్దని మనవి. మిగితా అందరి గురించి కూడా ఇక్కడ వ్యాసాలు రావాలన్నదే మా తాపత్రేయం కూడానూ. అందరి గురించి నేనే ఎలాగో రాయలేను కదా 😉

3 Comments
  1. sivaji April 23, 2009 /
  2. vinay chakravarthi April 23, 2009 /
  3. గీతాచార్య April 24, 2009 /