సత్యజిత్ రాయ్ వ్యాసావళి “Our films, their films” తెలుగు అనువాదం లో భాగంగా వస్తున్న ఈ వ్యాసం “The odds against us” అన్న ఆంగ్ల వ్యాసం అనువాదం.
సినిమా తీసేవాడికి కావాల్సినవి సరిగ్గా ఇవీ – అని ఓ జాబితా ఏదీ ప్రచారంలో లేకపోయినా కూడా సినిమా తీయడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు అన్న జ్ఞానం అయితే అందరికీ ఉంటుంది. నిజానికి కొన్ని బాలీవుడ్ బ్లాక్బస్టర్లు ఈ విషయాన్ని అలాగే చూపించేస్తూ ఉంటాయి. యుద్ధాలూ, తగాదాలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, ఊరేగింపులు – ఇవన్నీ ఊరికే చేతుల్తో క్లిక్ కొడితే జరిగేవి కావని ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను. డబ్బు, సామగ్రి, మనుషులూ ఉన్నాక హాలీవుడ్ లో ఓ “స్పార్టకస్”, సోవియట్ రష్య్యా లో ఓ “వార్ అండ్ పీస్” తీయడం పెద్ద కష్టమేమీ కాదనే చెప్పాలి.మాడ్రిడ్ లో అయితే ఇతర సినిమాల కోసం వేసిన రోం, మాస్కో మరియు పెకింగ్ వంటి నగరాల సెట్లు అలాగే పర్యాటకులను ఆకర్షించేందుకు కూడా ఉంటాయి.
కానీ, భారతదేశంలో, పైగా బెంగాల్ లో ఇలా మహా ప్రాజెక్టుల గురించి ఆలోచించే సాహసం కూడా చేయలేము. మొదటగా, మనకు అంత డబ్బు ఉండదు. డబ్బున్నా ఇక్కడ అలాంటివి చూసేవారు ఉండరు. అలాగే, హాలీవుడ్ తో పోటీ పడేంత వ్యాపార జ్ఞానం కూడా ఉండదు. ఈ కారణాల వల్ల మన సినిమాల్లో మనం వాతావరణం, మనఃస్థితి వంటి విషయాల ఆధారంగా తీస్తాము కానీ ఆర్భాటాలను పెట్టి కాదు. మనకేమీ అలా తీయాలన్న కోరిక లేక కూడా కాదు. ఇలాంటి బ్లాక్బస్టర్ల పబ్లిసిటీ కోసం వాడే “రెండేళ్ళు నిర్మాణం లో ఉన్నది” వంటి ట్యాగ్‌లైన్లు నేను కూడా నా “పథేర్ పాంచాలి” సినిమాకు వాడుకోవచ్చు. అయితే, ఇక్కడ అది దీనత్వాన్ని చూపిస్తుంది కానీ గొప్పని కాదు. ఎందుకంటే మేము చాలా సార్లు రోజుల తరబడి డబ్బులు లేకో, వచ్చిన డబ్బులు చాలకో ఖాళీగా కూర్చున్నాము. ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పటి ఆర్థిక ఇబ్బందులు అప్పట్లోలా భయంకరంగా లేవు. అంటే, ఇప్పుడు సినిమా తీయడం తేలికైందనా? ఎంతమాత్రం కాదు. ఇక్కడి సమస్యలన్నీ ఇక్కడికే ప్రత్యేకం. ఇవన్నీ మన జీవితాల్ని నిర్దేశించే సూచనలూ, మన భవిష్యత్తును తీర్చి దిద్దే సూత్రాల వల్ల కలిగినవి.
మొదట్నుంచీ మొదలుపెడదాము. సినిమాలెలా తీస్తారు? మొదటి అడుగు ఏమిటి? జవాబు: కథ కావాలి, వెదకాలి. అది దర్శకుడి పని అని ఊహించుకుంటే (నిజానికి అలాగే ఉండాలి కనుక), అలాగే, ఆ దర్శకుడు ఏదో కాలక్షేపానికో, త్వరగా డబ్బు సంపాదించడానికో వచ్చినవాడు కాకపోతే, అతని కథ ఎంపిక రెండు విషయాలపై ఆధారపడి ఉంటుందని అనుకోవచ్చు.
1) అతనికి ఆ కథా వస్తువు పై ఉన్న మక్కువ
2) ఆ కథ మంచి సినిమాగా తీయొచ్చని అతనికి నమ్మకం ఉండటం
అతను కాస్త హెడ్డులో తలున్నవాడైతే ప్రేక్షకుల్ని కూడా దృష్టిలో ఉంచుకుంటాడు. అది అతని మంచికోసమే అని అతనికి తన అనుభవం చెబుతుంది. తీసిన సినిమా పెట్టిన డబ్బులైనా ఇవ్వకపోతే ఇక అతనిపై నమ్మకం ఉండేదెలాగు? నమ్మినవారిలో ఒకరు వెనక్కితగ్గారంటే ఇక తక్కినవారూ అదే బాట పడతారు. అప్పుడిక ఆ దర్సకుడిపై ఓ ముద్ర పడిపోతుంది “బ్యాడ్ రిస్క్” అని. కనుక, తెలివైన దర్శకుడు కాస్త వాస్తవికంగా ఉంటాడు. అంటే, ఇక్కడ అతను Alain Resnais లాగా ఉండలేడు. Avant garde ఆలోచనలకి మన దేశం సినిమాల్లో ఇంకా చోటు దక్కలేదు. మనం గిట్టుబాటయ్యేంతలో చేయగలిగిందల్లా కొత్త కథా వస్తువులని అన్వేషించడం, సమాజంలో కొత్త కోణాల్ని చూపడం, మానవ సంబంధాల్లోని భిన్న కోణాల్ని సినిమాల్లో చూపడం. కానీ, ఇదంతా కొంత సీరియస్ గా చేయాలి అనుకుంటే మన సినిమాకి మాస్ కోసమనిచెప్పి చక్కెర పాకం అద్దలేము. వారు అసలే తెరపై చూపే కలలలోకాలు తీపి గుళికలకి అలవాటు పడ్డవారు. ఉన్న కొద్దిమంది ప్రేక్షకులతోనె సంతృప్తి పడాలి. అంటే, మన బడ్జెట్ అంతా పకడ్బందీగా ఉండాలి.
బడ్జెట్ తయారు చేసి దానికి కట్టుబడి ఉండటం కష్టమే కానీ, సీరియస్గా సినిమాలు తీసేవారి సమస్యలు ఇంకా ఉన్నాయి. కథావస్తువు ఎంపికలోనే ఇక్కడ వేరే దేశాల్లో ఎదురుకాని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి పూర్తిగా శృంగారభరితమైన కథలు మన సాహిత్యం లో లేకపోలేదు. కానీ, అలాంటివి తెరపై చూపే ప్రయత్నం చేయడం ఇక్కడ ఊహించలేనిది.నా “దేవి” లో ఓ జంట ముద్దులు పెట్టుకునే దృశ్యం తీశాను కానీ, అదొక లాంగ్ షాట్ లో ఓ దోమతెర వెనుక నీడల్లో మాత్రమే కనిపించే దృశ్యం. అంతకు మించి ముందుకెళ్ళడానికి నేను సాహసించలేదు. ఇంకాస్త ముండుకెళ్ళి తీసుంటే వచ్చే ఈలలూ అవీ ఆ దృశ్యం యొక్క మూడ్ ని పాడు చేసి ఉండేవి అనడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. అందుకే మన సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు – కలిసిన చేతులూ, విరహం నిండిన చూపులు, “ప్రేమతో” అనబడే సంభాషణలు – వీటితో నిండి ఉంటాయి, అసహజమైన రొమాంటిక్ పాటల్ని వదిలేస్తే. ఇదంతా గతకాలపు విక్టోరియాన్ సంప్రదాయపు అస్థికలు. ఇవే ఉత్తమ దర్సకుల చేతులు కట్టేసేవి. నన్నడిగితే, ప్రేమని మరింత గాఢంగా చూపాల్సిన కథని వదిలేయడాన్ని ఎంచుకుంటాను కానీ, ఇలా నీరుగార్చేసే కథనాన్ని ఎంచుకోను.
ఇక రాజకీయ కథల విషయానికి వద్దాం. మనం ఇక్కడ Advice and consent, Dr Strange Love, A judgement at Nuremberg వంటి సినిమాలు తీయగలమా? తీయలేమనుకుంటాను. ఒక అవినీతిపరుడైన కాంగ్రెస్ నేతను చూపగలమా? ప్రయత్నించి తెలుసుకోవాలి ఈ విషయం. కానీ, చూపలేమనుకుంటాను. ఓ బీద బ్యాంకు గుమాస్తా అవినీతితో ధనవంతుడై తన బట్టతలని గాంధీ టోపీతో దాచుకున్నట్లు చూపగలమా? ఇది చేయగలము కానీ, సెన్సార్ వాళ్ళు తెరపై ఆ టోపీకి నల్లరంగు వేయమంటారు – నన్ను అడిగినట్లు. ఒక సంకుచిత మనస్తత్వం గల అధికారి తన కింద పనిచేసే ఆంగ్లో ఇండియన్ ని ఏవో మాటలన్నట్లు చూపిస్తూ, మన కథ ఆ ఆంగ్లో ఇండియన్ పక్క నుంచి చూపిస్తే మనల్ని ఆ అధికారి వంటివారని తేల్చేస్తారు. తరువాత అదే ఇది డిల్లీ లో మన సినిమా ఏదో అవార్డుకని వెళ్ళినపుడు వాడుకుంటారు. ఇక ఏదో ప్రముఖ కథని తీసుకుని కాస్తలో కాస్త పక్కదారి పట్టారంటే దైవమే కాపాడాలి మిమ్మల్ని. ఎందుకంటే, మీకోసం “మేధావులు” చాలా మంది కాచుకుని కూర్చుని ఉంటారు, మిమ్మల్ని చీల్చి చెండాడడానికి. ఇంతకీ సారంశమేమిటంటే కథాపరంగా మిగిలిన రంగం చాలా చిన్నది. మీ ఆశయాలు సరైన సమయం కోసం ఆగాల్సిందే.
సరే, మీవద్ద ఓ మంచి స్క్రిప్టు ఉందనీ, అది మంచి సినిమా అవుతుందనీ – మీరూ, మీ మద్దతుదార్లూ ఇద్దరూ నమ్మకంగా ఉన్నారనుకోండి. తరువాత? ఈ కథని తెరకెక్కించే తతంగంలో తొలి అడుగు – కాస్టింగ్. ఏ పాత్రకి ఎవరో నిర్ణయించుకోడం. కొన్ని పాత్రలు ముందే నిర్ణయమైపోయి ఉంటాయి. కథ చదువుతున్నప్పుడే ఒక “ఎక్స్” ను భర్తగా, ఒక “వై” ని భార్యగా, ఒక “జెడ్” వారి చిన్నారి కూతురుగా – ఇలా ఊహించేసుకుంటారు. మరి, ఎనభైయేళ్ళ పళ్ళులేని ఆ పిల్ల తాత సంగతి? ఇక ఈ కథలో కనబడే చిన్న చిన్న పాత్రలు – ఆడవారు, మగవారు, పిల్లలు, రైతులు, దుకాణదార్లు, అధ్యాపకులు, వేశ్యలు మొదలైన వారో? ప్రపంచంలో ఏ మూలైనా కూడా “ఎక్స్‌ట్రాలు” అనబడే పెద్ద పెద్ద జాబితాలు పెట్టుకునే ఏజెంట్లు కనబడతారు. వారి పేజీలు తిప్పి కావాల్సిన వారిని ఎన్నుకోవడమే మన పని. కొత్తవారు కావాలనుంటే పేపర్లో ప్రకటన ఇవ్వడమో, టాలెంట్ హంట్ వంటి చేయడమో చేయాలి ఇక. కానీ, మనకి ఇక్కడా ఏజెంట్లూ, టాలెంట్ హంట్లూ ఉండవు. (గమనిక: ఇదంతా అరవైల్లో రాసినదని గమనించాలి – అనువాదకురాలు) పేపర్లో ప్రకటన ఇవ్వొచ్చు కానీ, నా అనుభవంలో తెలిసింది ఏమిటంటే, అసమాన ప్రతిభ ఉన్న చాలామంది ఎక్కడ తిరస్కరింపబడతామో అన్న భయం కొద్దీ ఈ ప్రకటనలకి స్పందించరు.మనకొచ్చే జవాబులు నేరుగా చెత్తకుండీ లోకి వెళ్ళే రకానివై ఉంటాయి. కనుక మీకు మిగిలిన దారి రోడ్లపై తిరుగుతూ మనుష్యుల్ని గమనిస్తూ ఉండటమే. లేకుంటే, రేసులకో, పార్టీలకో, పెళ్ళిళ్ళకో, రిసెప్షన్లకో – ఇవన్నీ మీరు గుండేలోతుల్లోంచి ద్వేషించేవే అయినా వెళుతూ ఉండటం.
మీకు చైనీస్ ఎక్స్‌ట్రాలు కవాలనుకుంటే (నాకు అపరాజితోలో అవసరం వచ్చినట్లు), ఆ దృశ్యం ఒక నిముషమున్నరదే అయినా అది మిమ్మల్ని ఓ చైనీస్ వేశ్యావాటిక వద్దకు తీసుకురావొచ్చు. అక్కడ మీరు ఓ రాతియుగం గుహలా ఉన్న చీకటి గదిలో కూర్చుని, నల్ల మందు ఘుంఘుమలు మీ ముక్కుపుటాలు అదరగొడుతూ ఉంటే, “మేడం” తన పసుపు పచ్చ పళ్ళు బైటపెట్టి నవ్వుతూ తన ఆహ్వానాన్ని అందిస్తూ లోపలికీ బైటకీ తిరుగుతూ ఉంటే చూడాల్సి వస్తుంది. వస్తామన్న ఎక్స్ట్రాలు రావడానికి కొన్ని గంటలు పడుతుంది. కానీ, మనమక్కడ నిలిచిపోయేది బయట కురుస్తున్న ఎడతెరిపి లేని వానల వల్ల కాదు. తీయాలనుకున్న దృశ్యం అనుకున్నట్లు రావాలన్న తపనతో. నాకు కావాల్సిన పాత్రధారులు దొరికే విషయంలో నెను అదృష్టవంతుణ్ణే కానీ, దొరకరేమో అన్న భయం ఉండనే ఉంది. ప్రస్తుతం కాస్త మధ్య వయసు దాటిన, బాగా నటించగల ప్రొఫెషనల్ నటీ నటుల కొరత ఉంది. కొన్ని పాత్రలకి కేవలం వారే ప్రాణం పోయగలరు. పథేర్ పాంచాలి ఇప్పుడు చస్తే నెను చేయలేను, ఎందుకంటే చున్ని బాల ఇప్పుడు లేదు కనుక. “జల్ సాగర్”, “దేవి”, “కాంచనగంగ” వంటి సినిమాలన్నీ ఛాబీ బిస్వాస్ ని దృష్టిలో ఉంచుకుని రాసినవే. అతను చనిపోయాక ఇక నేను అలా మంచి ప్రతిభ కావాల్సిన ఒక్క నడివయసు పాత్ర కూడా సృష్టించలేదు.
కాస్టింగ్ అయిపోయాక ఇక షూటింగ్లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నట్లే. కలకత్తాలోని ప్రతి స్టూడియో తన చరిత్రని ప్రతి గోడ సందుల్లోనూ, సీలింగ్ కప్పే కాన్వాసులోని ప్రతి చిల్లులోనూ చూపుతుంది. ఇక్కడ ఉండే కొన్ని ఎలుకల కుటుంబాలు పరిశ్రమ తొలినాళ్ళనాటి నుండీ స్థిర నివాసం ఏర్పరుచుకున్నవి. నేలలో గుంతలు, కెమెరా తిరిగిన ప్రతిసారి శబ్దం వస్తుంది. సూర్యాస్తమయం తరువాత వోల్టేజీ తగ్గిపోతుంది. ఇక పరిశుభ్రత సంగతి సరేసరి. ఐనా కూడా నేనివన్నీ పట్టించుకోను. ఇవన్నీ అడ్డంకులు అని అనలేము. మనదగ్గర సినిమా తీయడానికి కావాల్సిన సరుకుంది, సరిగ్గా తీస్తామా లేదా అన్నది మనమీదే ఆధారపడి ఉంది. సరైన సదుపాయాలు లేకపోవడం మనల్ని పొదుపరులుగానూ, ఉన్న పరికరాల్ని సరిగా ఉపయోగించడంలో సృజనాత్మకమైన వారిగానూ మారుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అందమైన సినిమాలు తీయడంలో ఉన్న మజాయే వేరు.
నిజం, నేను ఇక్కడ పనిచేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నాను.
1966.
****************************************************************************
Disclaimer:
The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is clearly non-profit. Please do get in touch with us in case you have any problem.
రాజశేఖర్ says:
బాగు౦ది మీ వ్యాస౦. మొత్త౦ మీద సత్యజిత్ రే గారి మనోభావాలను బాగానే ఔపోసన పట్టినట్టు ఉన్నారు. అ౦తటి మహనీయుని అ౦తర౦గాన్ని అలసట లేకు౦డా నవతర౦గానికి అ౦దిస్తున్న౦దుకు అభిన౦దనలు.
rayraj says:
మిగితా అంతా సొల్లు కానీ, మన వాళ్ళు అసలు ఆయన మనసులో ఉన్న ఈ ఆనందాన్ని సరిగ్గా చూడలేదు :
” సరైన సదుపాయాలు లేకపోవడం మనల్ని పొదుపరులుగానూ, ఉన్న పరికరాల్ని సరిగా ఉపయోగించడంలో సృజనాత్మకమైన వారిగానూ మారుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అందమైన సినిమాలు తీయడంలో ఉన్న మజాయే వేరు.
నిజం, నేను ఇక్కడ పనిచేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నాను.”
ఈ ఆటిట్యూడే మనలో కొరవడింది. “లేమి” నిజానికి బహు కలిమి! ఎన్నటికి తెలుస్తుంది?
మన సమస్యలకి సృజనాత్మకమైన ఆలోచనలు లేకుండా, అనుకరిస్తూ జీవిస్తున్నాం. అది కీ ఇష్యూ.
—————
౧.రెండో పేరాలో ’మనకి డబ్బు లేదు ’అనేది తప్పని ఇవ్వాళ తెలుసు.కానీ ఇందులో “హాలీవుడ్ తో పోటీ పడేంత వ్యాపార జ్ఞానం కూడా ఉండదు” అన్నారు చూశారూ – అదే అసలు విషయం. దీని గురించి పెద్ద పోస్టే వెయ్యొచ్చు.
౨.” కథ బాధ్యత దర్శకుడిదే” అన్నదాంట్లోనూ కొద్దిగా తప్పుంది. ప్రొడక్షన్ హౌసస్ కథల రైట్లు కొనుక్కొని కూర్చుంటాయి. అప్పుడు వాటిల్లోంచి ఓ కథను దర్శకుడు ఎంచుకోవచ్చు. కాబట్టి, కథ పూర్తిగా దర్శకుడి బాధ్యత కాదు.నిర్మాతల బాధ్యత కూడా. రచయితకి డబ్బులొస్తాయన్న నమ్మకం నిర్మాతలు కలిగించగలిగితే, కథలు దొరుకుతాయి. రచయితలు తేల్తారు.(వాళ్ళే డైరెక్టర్లూ అవ్వాలనే ప్రయత్నం విరమించుకోవచ్చు.)
౩.ఇప్పుడు శృంగారాన్ని చూపడానికి,అవినీతిని చూపడానికి ఐతే పెద్దగా ప్రాబ్లెమ్స్ ఏమీ లెవ్వు కదా!కానీ, సమస్యని జెనిరిక్‌గా చూస్తే,క్రియేటివ్ ఫ్రీడం కరువైందని భావించవచ్చు.కొన్ని రకాల కధాంశాలవల్ల కాంట్రవర్శీలే ఎక్కువయ్యి, సినిమా తీయలేం అనిపించవచ్చు.కానీ, ఇవ్వాళ్ళ ’47కి ముందు కాశీలో విధవల గురించే తీసి తీరతాను’ అని , శ్రీలంకలో సినిమా తీసి, కెనడాలో రిలీజ్ చేసుకోవడం – అవార్డులు పొందటానికీ, కీర్తికండూతికీ చిహ్నమే కానీ, ’సామజిక కళాదర్పణం’ ఎలా ఔతుందో అర్ధం కాదు. కాబట్టి, క్రియేటివ్ ఫ్రీడం గురించి తన్నుకోవడం వేస్టు. నాన్-కాంట్రవర్షియల్గా మెలగటం రావాలి. లేదా, ఏది కాంట్రవర్శీ చేసుకొని డబ్బు సంపాదించేలో తెలియాలి. ఈరోజు ఇండియా, క్రియేటివ్ ఫ్రీడంకి చక్కటి కండ్యూసివ్ వాతావరణాన్నే కలిగి ఉందని చెప్పవచ్చు.చరిత్రలో ఉండిందో లేదో అనేది అనవసరం.
కాస్టింగ్ ఈజ్ ఎ పెరెన్నియల్ ప్రాబ్లెం. కనీసం ఇప్పుడు టివిప్రోగ్రాముల ద్వారా టాలెంట్ పూల్స్ తయారు చేసుకునే ఓ మొకానిజం ఉంది. ఎంతవరకూ దాన్ని వాడుకుంటున్నాం అనేది “మన సమస్య”గా చూసుకోవాలి.