Menu

Monsieur Morimoto

morimoto1999,జపాన్. నలభై ఏళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైరయిన ఒక ముసలాయన రిటైరయ్యాక కృష్ణా,రామా అనుకుంటూ మూల కూర్చుని ఉంటే నేనీ పోస్ట్ రాయడం ఇక్కడే ఆగిపోయుండేది. కానీ ఆయనలా చెయ్యలేదు. మిగిలిన జీవితాన్ని తనకిష్టమొచ్చినట్టు గడపాలనుకున్నాడు. అంతే జపాన్ టు అమెరికా. అమెరికా టు Tahiti. అక్కడ్నుంచి ఇంకెక్కెక్కడికో. చివరిగా ఫ్రాన్స్ లోని పారిస్ చేరుకున్నారు.

2001, ప్యారిస్. ప్రపంచ కళల (కలల) రాజధాని చేరుకున్న ఆ పెద్దాయన ప్యారిస్ తో ప్రేమలో పడిపోయాడు. ప్యారిస్ ఆయనలోని కళాకారుణ్ణి నిద్రలేపింది. పెయింటింగ్ చెయ్యడం మొదలుపెట్టాడు. జపాన్ లో ఉన్న తన కుటుంబానికి ఫోన్ చేసి తను ఎనభైల్లోకి చేరగానే జపాన్ తిరిగొస్తానని చెప్పేశాడు. ఆయన పేరు Kenichi Morimoto.

2007, ప్యారిస్. దాదాపు పదేళ్లు గడిచినా Kenichi కన్న కలలు నిజం కాలేదు. పెద్ద ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందలేకపోయాడు. అయినా సరే అక్కడే ప్యారిస్ వీధుల్లో ఏ రోజుకారోజు జీవిస్తూ కాలం గడిపేస్తూ ఉన్నాడు.

2007,ప్యారిస్. Nicola Sorgana అనే యువ దర్శకుడు తన రెండో సినిమా కోసం స్రిప్ట్ కోసం తంటాలు పడుతున్నాడు. అనుకోకుండా ఒక రోజు ఆయనకు ప్యారిస్ వీధుల్లో ఒక జపనీస్ వ్యక్తి తారసపడ్డాడు. ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. కానీ ఆ జపనీస్ ఆయనకి ఒక్క ముక్క ఫ్రెంచ్ రాదు. ఈయనకు జపనీస్ లో ఎబిసిడి లు కూడా తెలియవు. అయినప్పటికీ ఆయన పేరు Morimoto అనీ పారిస్ లో ఆర్టిస్ట్ గా నిరూపించుకోవడానికి వచ్చాడని తెలుసుకున్నాడు Nicola.

2008, ప్యారిస్.Nicola Sorgana మరోసారి Morimoto ని ఒక ఆర్ట్ మ్యూజియంలో చూశాడు. తను తీయాలనుకున్న సినిమా ఈ జపనీస్ వ్యక్తి గురించి తీస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో పడ్డాడు. ఆలోచన వచ్చిందే ఆలస్యం ఆ జపనీస్ పెద్దాయన్ని ముఖ్యపాత్రలో పెట్టి ఒక సినిమా తీసేశాడు Nicola Sorgana.

2౦౦8, Cannes. ఇక్కడ జరుగుతున్న చలనచిత్రోత్సవంలో Monsieur Morimoto అనే ఒక చలనచిత్రం ప్రదర్శింపబడింది. చూసిన వాళ్ళు చాలా తక్కువమందే అయినా ఆ కొద్ది మంది మాత్రం మొరిమొటో పాత్రలో అద్భుతంగా నటించిన Kenichi Morimoto గురించి తెలుసుకుని అబ్బురపడ్డారు.

2009, Bucharest. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుగుతుందంటే మిస్సవ్వలేక ఒక రోజు ఆఫీసుకి శెలవు పెట్టి కొన్ని సినిమాలు చూశాను.ఈ చలన చిత్రోత్సవంలో చూసిన అన్ని సినిమాలు నాకు చాలాబాగా నచ్చాయి. కానీ ఒక్క సినిమా గురించి మాత్రం నచ్చిందనీ నచ్చలేదని చెప్పలేకున్నాను.ఆ సినిమానే Monsieur Morimoto. ఇక్కడ ప్రదర్శించిన అన్ని సినిమాలకంటే వైవిధ్యమైన సినిమా ఇది. అందుకు కారణం ఈ సినిమా ఎక్స్పెరిమెంటల్ కావడమే. ఈ సినిమాకు అసలు స్క్రిప్ట్ లేకపోవడం ఒక విషయమైతే ఈ సినిమా దర్శకుడు స్క్రిప్టు లేకుండా సినిమా తీయడం గురించి చెప్తూ “…we worked against a dictatorship of the script” అనడం నాకు బాగా నచ్చింది.

ఈ సినిమా క గురించి చెప్పాలంటే….సినిమాకు స్క్రిప్టు లేనప్పుడు పెద్ద కథ వుంటుందని ఎలా ఆశించగలం. అదీ ఎక్స్పెరిమెంటల్ సినిమాలో 🙂 కాకపోతే అసలేమీ లేదని కాదు. ఈ కథ Morimoto పారిస్ లో గడిపిన (గడుపుతున్న) జీవితం ఆధారంగా రూపొందించబడింది. సినిమా మొదలయ్యే సమయానికి Morimoto అద్దె ఇవ్వని కారణంగా ఒక అపార్ట్మెంత్ ఫ్లాట్ నుంచి గెంటివేయబడతాడు. తనతో పాటు ఒక భారీ పెయింటింగ్ ని మోసుకుంటూ తను నిద్రపోవడానికి ఏదైనా చోటుకావాలంటూ వచ్చీ రాని ఫ్రెంచ్ లో అందరినీ అడుగుతూ తిరుగుతుంటాడు. ఇలా తిరిగుతుండగా తనలాంటి వాళ్ళని చాలామందిని కలుస్తాడు Morimoto. ఇలాంటి పరిస్థుతుల్లో అతని పెయింటింగ్ దొంగలించబడుతుంది. ఆ తర్వాత నుంచీ తన పెయింటింగ్ వెతుక్కుంటూ తిరుగుతుంటాడు Morimoto. ఇంతకంటే పెద్ద కథేమీ లేదు సినిమాలో.

ఈ సినిమా కంటే సినిమా తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలోనాకు ఎదురైన అనుభవం మాత్రం నాకు చాలా ఆనందం కలిగించింది. ఈ సినిమా ప్రదర్శన ముగిసాక స్టేజి మీద దర్శకుడు Nicola Sorgana తో పాటు Morimoto కూడా వచ్చి నిల్చున్నారు. అక్కడున్న చాలా మంది ప్రేక్షకులకు ఇంగ్లీషు రాదు. స్టేజి పైనున్న దర్శకుడికి రొమానియన్ రాదు, ఇంగ్లీషు అంతంత మాత్రమే ఇక జపనీస్ సంగతి చెప్పక్కర్లేదు. Morimoto కి జపనీస్ తప్ప మరే భాషా రాదు. ఇక చూడండి. ఎవరేం అడుగుతున్నారో, ఏ భాషలో అడుగుతున్నారో, ఎవరేం సమాధానం చెప్తున్నారో, ఏ భాషలో చెప్తున్నారో తెలియదు. అయినా కూడా అంత గందరగోళంలోనూ అక్కడ అందరిలోనూ ఒకే రకమైన అనుభూతి. అదేంటో చెప్పడం కష్టం కానీ నేనైతే మూవీ మ్యాజిక్ అంటే ఇదేనేమో అనుకున్నాను. ఎవరికొచ్చిన భాషలో వాళ్ళు మాట్లాడే విషయాలు పూర్తిగా అర్థం అయ్యుండొకపోవచ్చు కానీ. ఏవేవో కలలు కంటూ జపాన్ వదిలి ప్రపంచం చుట్టి తిరుగుతున్న ఒక 70 ఏళ్ళ వృద్ధుని కలలు నిజమయ్యాయని అందుకు ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడని అక్కడున్న వాళ్ళందరికీ మాత్రం సులభంగానే అర్థమైంది. ఆ సమయంలో Morimoto మొహంలో ఆనందం చూసినప్పుడు నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.

మొత్తానికి, ఇది మస్ట్ సీ మూవీ అని చెప్పను కానీ కాస్త ఆఫ్ బీట్, ఎక్స్పెరిమెంటల్ సినిమాలు ఇష్టముంటే ఈ సినిమా చూడొచ్చు.

5 Comments
  1. రాజశేఖర్ April 1, 2009 /
      • రాజశేఖర్ April 2, 2009 /
  2. కొత్తపాళీ April 2, 2009 /