Menu

ఇండియా క్యాబరే

india-cabaretఅత్యంత ప్రతిభావంతమైన దృశ్య శ్రవణ మాధ్యమమైన ‘ సినిమా ‘ తెరపైన స్త్రీని వినియోగ వస్తువుగానూ, వినోద సాధనంగానూ చిత్రించడం మొదట్నించీ వస్తుంది. అనేక సామాజిక, ఆర్ధిక కారణాల నేపధ్యంలో వ్యభిచార వృత్తిలోనూ, డాన్సింగ్ గర్ల్ గానూ, కోఠేవాలీగానూ మారిన స్త్రీల జీవిత ఇతివృత్తాలతో భారతీయ సినిమా రంగంలో అనేక సినిమాలు వచ్చాయి. మూకీయుగం నుంచి కూడా ఆ ఒరవడి మనకు కనిపిస్తుంది. ‘ మొగల్ ఎ అజం, పాకీజా, దేవదాస్ ‘ లాంటి సినిమాల్లో ఉదాత్తమయిన పాత్లల్ని సృష్టించారు. ప్యాసా లాంటి సినిమాల్లో వ్యభిచార స్త్రీ పాత్రని అత్యున్నత స్థానమిచ్చి నిర్మించారు. కాని స్త్రీ పాత్రని వ్యాంప్‌గా, సెక్స్ డ్యాన్సర్లుగా లెక్కలేనన్ని సినిమాల్లో చొప్పించి వారిని వేరొక ప్రత్యేకమయిన జీవులుగా చిత్రించే ప్రయత్నమూ జరిగింది. అంతే కాదు క్లబ్ నృత్యాలు చేయడం కోసం, అంగాంగ ప్రదర్శనలు చేయడం కోసం కొంతమంది డ్యాన్సర్లను కూడా మన సినిమా రంగం తయారు చేసింది. పాశ్చాత్య దేశాల్లోనూ, మహనగరాల్లోనూ, క్లబ్బుల్లో కనిపించే క్యాబరే డాన్సర్లు బార్ రూముల్లో సెక్సీగా నృత్యాలు చేయడానికి బాస్‌లకు, డాన్‌లకు విందు వినోదాల్ని అందించడానికి ఉపయోగపడే జీవులుగానే మన సినిమా రంగం చూపిస్తూ వచ్చింది. అంతే తప్ప నిజజీవితంలో క్యాబరే డాన్సర్ల జీవన రీతుల్ని జీవిత సమస్యల్ని, మనుషులుగా వారి మనోభావాల్ని పట్టించుకోవడానికి గాని, సినిమాల్లో ప్రదర్శించడానికి గాని అతి స్వల్ప ప్రయత్నాలే జరిగాయి. క్యాబరే డాన్సర్ల వాస్తవ స్థితుల్ని, మనోభావాల్ని, సమాజంలో వారికిచ్చే స్థానాన్ని అధ్యయనం చేసి క్యాబరే డాన్సర్ల జీవన చిత్ర పైన సాధికారికమయిన సినిమాని మీరానాయర్ 1986 లో నిర్మించారు.

‘ సలాం బాంబే ‘ చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న మీరానాయర్ నిజానికి తన ‘ ఇండియా క్యాబరే ‘ తోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆర్ధిక కారణాలతో తమ శరీరాల్నే తమ జీవనాధారంగా చేసుకొని అత్యంత దయనీయంగా బ్రతుకుతున్న ఆ స్త్రీ లోకాన్ని అతి దగ్గరగా చూసి సజీవ పాత్రల్లో మీరానాయర్ నిర్మించిన ఈ సినిమా 1986లో హైదరాబాదులో ఫిల్మోత్సవ్ సందర్భంగా ఉమెన్స్ సినిమా కార్యక్రమంలో ప్రారంభ చిత్రంగా ప్రదర్శించబడింది. సనాతనంగా పురుషాధిపత్యంతో కొనసాగుతున్న మన సమాజంలో క్యాబరే డాన్సర్లను వినోదం కోసం, సంతోషం కోసం ఎంతగా వినియోగించుకుంటారో తర్వాత వెలుతురు ప్రపంచంలో వారికి ఏ స్థానం ఇస్తారో కూడా ఇండియా క్యాబరేలో దర్శకురాలు చర్చకు పెడుతుంది. అర్ధవంతమయిన విమర్శనాత్మకమయిన చర్చను లేవదీసిన ‘ ఇండియా క్యాబరే ‘ కేవలం 60 నిమిషాల నిడివిగల చిత్రం. దీని చిత్రీకరణ పద్ధతి విలక్షణంగా సాగింది. డాక్యుమెంటరీ మరియూ ఫీచర్ ఫిల్మ్ నిర్మాణ పద్ధతుల్ని రెండింటినీ సమన్వయం చేసి ‘ డాక్యుఫీచర్ ‘ గా ఈ సినిమాని రూపొందించారు మీరానాయర్.

ఇండియా క్యాబరే లో కనిపించే స్త్రీ పాత్రలు సాధారణంగా భారతీయ సినిమాల్లో కనిపించే అమ్మ, చెల్లి, ప్రేయసి, భార్య లాంటి సాధారణ స్త్రీలు కాదు. వారు విలక్షణమయిన జీవులు. మన దేశంలో అంత ఎక్కువ సంఖ్యలో లేకున్నప్పటికీ ఆ క్యాబరే డాన్సర్ల జీవన చిత్రణలో మొత్తంగా మన సమాజంలో స్త్రీకి ఉన్న స్థానాన్ని గురించిన చర్చను లేవదీసింది దర్శకురాలు మీరానాయర్.

‘ ఇండియా క్యాబరే ‘ స్త్రీలు బొంబాయిలోని మేఘరాజ్ అనే రాత్రి క్లబ్‌లో నృత్యం చేసేవారు.. ఆ క్లబ్‌కు వచ్చే ఉన్నత, మధ్య తరగతి పురుష కస్టమర్లకు వినోదాన్ని అందించడమే వరి వృత్తి. వారు నిర్వహించేది వృత్తే అయినప్పటికీ రాత్రిపూట నృత్యం వేళ వారికిచ్చే విలువ, తెల్లారేసారికి వారిని సాంఘికంగా ఎంత హీనంతో చూస్తారో వారికి తెలుసు. ఆ స్థితిని వారు ఎట్లా స్వీకరిస్తారో, వారు వారి వృత్తిపట్ల, జీవితం పట్ల ఏ దృక్పధంతో ఉంటారో ‘ ఇండియా క్యాబరే ‘ లో అతి సన్నిహితంగా చూపిస్తారు. ఇందులో క్యాబరే డాన్సర్ల సాధారణ నిజజీవితమూ, వారిని మేకప్ గదులు ఎంతలా మార్పునకు గురిచేస్తాయో, బికినీల్లోనూ, గౌన్లలోనూ వారు రాత్రి రాణులుగా ఎట్లా మారిపోతారో ఈ చిత్రంలో స్పష్టంగా చిత్రీకరించబడింది. సినిమా నిర్మాణ రీతి ప్రధానంగా ఇంటర్వ్యూల రూపంలో సాగినందువల్ల క్యాబరే డాన్సర్లు తమ గతాన్ని, తమ చరిత్రని, తాము డాన్సర్లుగా మారిన పరిస్థితుల్ని వారి కుటుంబ సంబంధాల్ని, తమ కళల్ని, ఊహల్ని, భవిష్యత్ పట్ల వారి భయాల్ని వివరిస్తారు. మొత్తంగా ఫస్ట్ హాండ్ సమాచారంలో సినిమా సాగుతుంది. క్లబ్‌కు వచ్చే అనేక మంది కస్టమర్లలో విజయ్ ప్రతిరోజూ క్రమం తప్పకుండా వస్తాడు. అతను వ్యాపారవేత్త. సినిమా క్రమంగా ఆయనను ఫాలో అయి ఆయనతో పాటు ఆయన ఇంటికి వెళుతుంది. రంగం క్లబ్ నుంచి విజయ్ ఇంటికి మారుతుంది. కుటుంబ వ్యవస్థలో ఉన్నత స్థానం పొందినట్టుగా కనిపించే భార్య, తల్లి, కోడలు తదితర పాత్రల వాస్తవ స్థితిగతుల్ని క్రమంగా మనకు చూపిస్తుంది. కుటుంబం, విలువలు, అనుబంధాలు అన్న నేపధ్యంతొ సమాజంలో స్త్రీలు కూడా ఎంత అణచివేతకు, నిరాదరణకు గురౌతున్నారో ఇండియా క్యాబరే చూపించే ప్రయత్నం చేస్తుంది. విజయ్ భార్య కుటుంబంలోనూ, భర్తవద్ద తనకున్న పరిమితుల్ని స్పష్టంగా ఎరిగి ప్రవర్తిస్తూ ఉంటుంది. అలా సామాజిక వాస్తవాల్ని సినిమా మనముందు పరుస్తుంది. ఇండియా క్యాబరేలో ప్రధాన పాత్రలయిన అమీనా, రేఖలు నేరుగా ప్రేక్షకులతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు.

ఈ చిత్రంలో మీరానాయర్ స్పష్టమైన స్త్రీ దృక్పథంతో స్త్రీ సమస్యని ముఖ్యాభినేతగా చేసి సామాజిక దగుల్బాజీ లక్షణాల్ని ప్రతిభావంతంగా చిత్రీకరించారు.

‘ఇండియా క్యాబరే ‘ న్యూయార్క్ లో జరిగిన గ్లోబల్ విలేజి ఫిలిం ఫెస్టివల్‌లో డాక్యుమెంటరీ అవార్డును, ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ ఎధెనా అవార్డును, అమెరికన్ ఫిలిం ఫెస్టివల్‌లో బ్లూ రిబ్బన్ అవార్డును గెలుచుకుంది.

మీరానాయర్ ఆ తర్వాత నిర్మించిన సలాం బాంబే, మిసిసిపి మసాలా తదితర చిత్రాలకి ‘ఇండియా క్యాబరే’ ఓ ప్రిల్యూడ్‌గా ఉంటుంది. క్యాబరే జీవితాలపై నిర్మితమయిన సాధికారిక డాక్యుఫీచర్ ఫిల్మ్ ” ఇండియా క్యాబరే “..

ఆనంద్ వారాల పుస్తకం ’సినీ సుమాలు’ నుంచి ఈ వ్యాసాన్ని సేకరించి తెలుగు యూనికోడ్ లోకి మార్చినందుకు జ్యోతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.