Menu

గుడ్డీ

ఒక స్కూలు విద్యార్థిని. అల్లరి పిల్ల. ఇద్దరన్నల ముద్దుల చెల్లెలు, కాస్త గారాబం. సినిమాలంటే పిచ్చి. అందునా ధర్మేంద్ర అంటే పడి చస్తుంది. ధర్మేంద్ర అంటే దేవుడు. అతనికంటే గొప్పవాళ్లు లేరు . అతని సినిమాలన్నీ శ్రద్ధగా చూస్తుంది. స్కూలు ఎగ్గొట్టి తోటి స్నేహితురాళ్లతో సినిమా షూటింగ్ కి వెళుతుంది. స్కూలు చదువు అయ్యాక బంధువుల అబ్బాయితో పెళ్లి చేస్తామంటే కాదంటుంది. కారణం తన జీవితంలో ధర్మేంద్ర తప్ప వేరే వ్యక్తికి స్థానం లేదంటుంది. ఇదే విషయం ఆ బంధువుల అబ్బాయికి చెప్తుంది. ఆ అమ్మాయిని ఇష్టపడ్డ ఆ అబ్బాయి చాలా బాధపడతాడు. కాని అసలు కారణం తెలుసుకున్న ఆ అబ్బాయి మేనమామ ఈ అమ్మాయి ధర్మేంద్ర పిచ్చి వదిలించాలని నిశ్చయించుకుంటాడు.

ఆ అమ్మాయిని సెలవుల్లో తన ఊరికి పిలిపించి తనకున్న పరిచయాలతో రోజూ స్టూడియోలకు తీసికెళుతూ సినిమారంగంలోని అసలు జీవితాన్ని చూపిస్తాడు. సినిమాల్లో చూసేవన్ని నిజాలు కావని తెలుసుకునేలా చేస్తాడు. అలాగే ఆమె ఇష్టపడ్డ ధర్మేంద్ర సినిమాలో ఉన్నట్టుగా నిజజీవితంలో ఉండడని కూడా తెలుసుకుంటుంది. అక్కడి సాధకబాధకాలు చూసి సినిమా లోకం అంతా ఒక మాయాలోకమని గ్రహిస్తుంది. కాని ధర్మేంద్రలా అందంగా లేకున్నా, మంచి మనసు కలిగి, పదిమందికి సహాయం చేసే గుణంతో పాటు తన మీద అపారమైన ప్రేమ ఉందని తెలుసుకున్న ఆ అమ్మాయి తమ బంధువుల అబ్బాయికే చేరువవుతుంది.

ఇప్పటికైనా ఈ సినిమా పేరు గుర్తొచ్చిందా ??? అదేనండి “గుడ్డీ”.. అద్భుతమైన నటిగా పేరుపొందిన జయాబాధురి నటించిన మొదటి సినిమా ఇది. అలాగే మన దక్షిణాది గాయని వాణీ జయరాం ని ఉత్తరాదివారికి కూడా పరిచయం చేసింది ఈ సినిమా ద్వారానే. గుడ్డీ అనగానే అందరికీ గుర్తొచ్చేది “బోలి రే పపీ హరా ” …. మొదటిసారి ఒక అబ్బాయితో బయటికెళితే అతని కోరికపై అందమైన సాయంత్రంలో వర్షం కురుస్తుంటే సిగ్గుతో , బిడియంతో గుడ్డీ అలియాస్ కుసుం పాడే అత్యద్భుతమైన పాట ఇది. అలాగే మరో పాట కూడా చాలా హిట్ ఐంది. “హం కో మన్ కి శక్తి దేనా “… ఈ పాటని ఈ సినిమా కోసమే గుల్జార్ రాసినా అది ఎన్నో పాఠశాలలో ప్రార్ధనా గీతంగా స్థిరపడిందని చెప్పుకుంటారు.

ఆనాడైనా, ఈనాడైనా కొందరు సినిమా తారలంటే అమ్మాయిలకు చచ్చేంత పిచ్చి. వాళ్లు ఏది చేసినా అద్భుతంగా చూస్తారు. ఆ హీరోని తమ జీవితంలో తోడుగా ఊహించుకునే అమాయకమైన ఆడపిల్లలు ఎందరో. ఆ హీరోనే పెళ్లి చేసుకోవాలి లేకుంతే తమను చేసుకునేవాడు ఆ హీరోలా ఉండాలి అని కలలు కంటారు అమ్మాయిలు.. కాని సినిమాల్లో మనం చూసేదంతా నిజం కాదు. అన్నీ అభూత కల్పనలే అని , సినిమాలోకంలోని కష్టనష్టాలు, ఆర్టిస్టుల బాధలు , కార్మికుల ప్రమాదాలు, విలేఖరుల తిప్పలు, ఇలా సినీ గ్లామర్ కు వెనకాల దాగి ఉన్న ముళ్లను మనకు చూపిస్తారు దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ.

ఈ సినిమాలో ధర్మేంద్ర ధర్మేంద్రలా కనిపిస్తాడు. కుసుం సినిమా పిచ్చి వదిలించడానికి తనవంతు నాటకమాడతాడు. అలాగే మరికొందరు నటీనటుల ప్రవర్తనను కూడా చూపిస్తారు. విలన్ గా సినిమాల్లో భయంకరంగా కనిపించే ప్రాణ్ సెట్స్‌లో అందరితో ఎంతో స్నేహంగా ఉంటాడు. అలాగే ఎక్కువ సినిమాల్లో పరమలోభిగా కనిపించే ఓం ప్రకాష్ సెట్స్ లో ఎంతోమందికి సహాయం చేస్తాడు. అలాగే మహానటులైన అశోక్ కుమార్, రాజేష్ ఖన్నా కూడా ఎన్ణో టేకులు వాటితో పాటు డైరెక్టర్ చివాట్లు తింటుంటారని కూడా మనకు తెలియచేస్తుంది ఈ సినిమా. లేదంటే మనకు సినిమా తెరపై కనిపించే ఆటలు, పాటలు, ఫైట్లు, స్వభావాలు నిజమని నమ్మేస్తాము.

స్కూలు యూనిఫార్మ్ లో ముద్దుగా,అల్లరిగా, అమాయకంగా కనిపించే గుడ్డీ ఒక్కో విషయం తెలుసుకుంటూ పరిణతి చెంది కుసుం గా తనను కోరిన వాడి అలక తీర్చి అతనిని చేరుకుంటుంది. సినిమారంగం ఒక ప్రచండమైన దీపంలా వెలుగుతుంటుంది. దానివలన వెలిగిపోయినవారు కొందరు, శలభాల్లా మాడిపోయినవారు ఎందరో.. ఈ మాయాలోకవిహారాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించే ఓ అందమైన చిత్రం “గుడ్డీ””

–జ్యోతి వలబోజు

One Response
  1. parimalam April 30, 2009 /