Menu

మన కాలపు మహా దర్శకుడు-ఆర్సన్ వెల్స్-రెండవ భాగం

ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ చదవండి

welles-1
లేడీ ఫ్రం షాంగై
ఆర్సన్ వెల్స్ నిర్మించిన చిత్రాల్లోకెళ్ళా గొప్ప థ్రిల్లర్ సినిమాగా పేరొందింది. సినిమా యావత్తూ కన్ఫ్యూజన్ గానే కనిపిస్తూ అనూహ్యమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. వెల్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రిప్ట్ కూడా రాశాడు. ఇందులో ఆయన హీరో పాత్ర పోషించగా ఆయన భార్య రీటా హేవర్త్ హీరోయిన్ గా నటించింది. చిత్రంలో ఏ ఒక్క డిటేయిల్ ని విడిచిపెట్టకుండా అత్యంత జాగురుకతతో నిర్మించాడు వెల్స్. ముఖ్యంగా హాల్ ఆఫ్ మిర్రర్స్ దృశ్యం ప్రపంచ చరిత్రలో మిగిలిపోయింది. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఆర్థర్ బానిస్టర్ కు చెందిన ఓడలో మైఖేల్ హారా కూడా ప్రయాణమవుతాడు. దారిలో బానిస్టర్ కి భాగస్వామి అయిన గ్రిస్బీని కూడా షిప్ లోకి ఆహ్వానిస్తారు. బానిస్టర్ భార్య రొసాలీ గొప్ప అందగత్తె. అయితే ఆమె గ్రిస్బీని ఇష్టపడుతుంది. ఓడ సానాలిటోలో ఆగగానే మైఖేల్ తో గ్రిస్బీ మైఖేల్ తో జతకట్టి తనను చంపినట్టు నటించమంటాడు. అయిదు వేల డాలర్లు ఆశ చూపిస్తాడు. తను చనిపోయినట్టు భ్రమ కల్పించిన తర్వాత రోసాలీతో వెళ్ళిపోవాలని ప్రణాళిక వేసుకుంటాడు. కాని చిత్రంగా గ్రిస్బీ నిజంగానే హత్యకు గురవుతాడు. ఎలా జరిగింది? ఎవరు చంపారు? లాంటి అంశాలతో ఆసక్తికరంగా సాగుతుందీ చిత్రం.

ది మాగ్నఫిసెంట్ అంబర్సన్:అధ్బుతమైన లైట్ అండ్ షేడ్ తో కూడిన ఫోటోగ్రఫీతో ఈ చిత్రం వెల్స్ ప్రతిభను మన కళ్ళ ముందుంచుతుంది. అనూహ్యమైన, అందమైన చిత్రంగా ఇది పేరు గడించినప్పటికీ నిర్మాతలయిన ఆర్.కే.ఓ సంస్థ చేసిన అన్యాయమయిన ఎడిటింగ్ లకు గురై సినిమా ఛిద్రమయిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా అనేక వెర్షన్లుగా మార్కెట్ లో అందుబాటులో ఉంది.

పెద్ద ధనవంతుల కుటుంబానికి చెందిన అందమైన అంబర్సన్ ఇసాబెల్ ను పెళ్ళాడాలని యూగిన్ మోర్గన్ భావిస్తాడు. కాని ఆమె విల్‍బూర్ ని పెళ్ళాడుతుంది. వారిద్దరి కుమారుడు జార్జి తిరుగుళ్ళకు అలవాటుపడి పనికిరాకుండా పోతాడు. కొన్ని ఏళ్ళ తర్వాత యూగిన్ తన భార్యను కోల్పోయి తిరిగి వస్తాడు. మంచి ఆటోమొబైల్ మెకానిక్ గా ఎదిగిన యూగిన్ విల్‍బూర్ మరణం తర్వాత ఇసాబెల్ ని పెళ్ళాడమని ఆర్థిస్తాడు. ఆమె అంగీకరిస్తుంది. కాని ఆమె కుమారుడు జార్జి వీరి సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. మేనత్తతో కలిసి వీరిద్దరి నడుమ సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. అంబర్సన్ యూగిన్ లు తీవ్రంగా ఇబ్బందులు పడతారు.

ఆర్కాడిన్:ఆర్సన్ వెల్స్ తీసిన మరో అసంపూర్ణ, అసమగ్రమయిన సినిమా ఆర్కాడిన్. గైవాన్ స్ట్రాటెన్ ఓ అమెరికన్ స్మగ్లర్. ఇటలీ జైలులోనుంచి విడుదలవతాడు. అతని మదిలో ధనవంతుడయిన గ్రెగరీ ఆర్కడిన్ పేరొక్కటే గుర్తుండిపోతుంది. ఆర్కాడిన్ ను వెతికి పట్టుకోవడమే పనిగా పెట్టుకుంటాడు. ఆర్కాడిన్ కూతురు రైనా ద్వారా ఆచూకీ తెలుసుకుంటాడు. గై నుంచి తప్పించుకోవడానికి ఆర్కడిన్ ’అమ్నెసీయా’ ఉన్నట్టు నటిస్తాడు. 1927 కు ముందటి తన జీవితాన్ని వెలికి తీయమని తాను మర్చిపోయానని గైని పురమాయిస్తాడు ఆర్కడిన్. గై పరిశోధన అనేక మలుపులతో, రకరకాలయిన మనుషులు తారసపడుతూ ఉండగా ముందుకు సాగుతుంది. ఆర్కడిన్ వివరాలకోసం గై అడిగిన ప్రతిమనిషీ అనంతరం హత్యకు గురౌతూ ఉంటాడు. చివరకి గై పైనా హత్యాప్రయత్నం జరుగుతుంది. గై తనని తాను రక్షించుకుంటాడు. ఆర్కడిన్ కు అమ్నీసియా ఉందా? లేక నటనా? లాంటి అంశాలతో చిత్రం ఆసక్తిగా సాగుతుంది.

ఎఫ్ ఫర్ ఫేక్: హాస్యమూ వినోదమూ సమ్మిళితమయినా సినిమా ఇది. ఇందులో ప్రధానంగా ఐదు పాత్రలుంటాయి. ఇద్దరు కళాద్రోహులు. ఒకతను జీవిత చరిత్రల రచయిత, మరొకతను అబధ్దాల కోరు, చివరివాడు మెజీషియన్. వారి కథలు ఒక దానిలో ఒకటి కలిసిపోయి గమ్మత్తుగా అనిపిస్తూనే వినోదాన్ని పంచుతాయి.

ఇలా అత్యంత ప్రతిభావంతంగానూ, పలు ప్రయోగాలు చేసినవాడుగానూ పేరుగాంచిన ఆర్సన్ వెల్స్ జీవితం చివరికి ఆసక్తికరంగా ముగిసింది. ఆయన నిర్మాణం పూర్తి చేసిన సినిమాల కంటే అసంపూర్తిగా వదిలేసిన సినిమాలే అధికంగా ఉన్నాయి. అవన్నీ ఆయన భవంతిలోనూ, అలమారల్లోనూ పడి మూలుగుతున్నాయి. నటుడిగా అనేక సినిమాల్లో సినిమాల్లో నటించిన వెల్స్ ఎడిటర్ గా కూడా విశేష ప్రతిభను కనబర్చాడు. తాను వేగవంతమయిన దర్శకుడిననీ, మందకొడి అయిన ఎడిటర్ని అని ఆయనే చెప్పుకొన్నప్పటికీ ఆయన తీసిన పలు చిత్రాల విషయంలో పెద్ద నిర్మాతలు ఎడిటింగ్ ద్వారా వాటిని నాశనం చేసిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. వెల్స్ కు చెందిన సినిమాలు అనేక వెర్షన్లు మనకు కనిపించడం అసలయిందేదో తెలీని స్థితిలో ప్రేక్షకుల్ని పడవేస్తుంది. అయితే షేక్స్పియర్ నాటకాల్ని తెరకెక్కించడంలో వెల్స్ తన ప్రతిభను లోకానికి చాటాడనే చెప్పుకోవచ్చు. ఆయన అసంపూర్తి సినిమాల్ని కొన్నింటిని గురించి చర్చించుకుంటే “ది అదర్ సైడ్ ఆఫ్ ది విండ్” -1975 లో అమెరికన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ప్రదర్శింపబడ్డ ఈ సినిమా వెల్స్ కు అత్యంత ఇష్టమయిన ప్రాజెక్టుగా చెబుతారు. ఇంకా ఆయన అసంపూర్ణంగా వదిలేసిన చిత్రాల్లో ది డ్రీమర్స్, మర్చెంట్ ఆప్గ్ వెనిస్ లతో పాటు మరెన్నో మిగిలోపోయాయి.

ఇలా వెల్స్ చలనచిత్ర జీవితం సిటిజెన్ కేన్ లాంటి మహోన్నత చిత్రంతో పాటు ఎన్నో సంపూర్ణ, అసంపూర్ణ సినిమాల కలయికతో కొనసాగింది. సినిమానే జీవితంగా భావించి రచన, నటనలతో పాటు పలు డిపార్ట్ మెంట్లలో తన ప్రతిభను చాటిన ఆర్సన్ వెల్స్ పై అనేక బయోగ్రఫీలు వచ్చాయి. అయినా ఇంకా ఆవిష్కృతం కావాల్సిన వెల్స్ సృజన మిగిలేఉంది.

అయినా ఆర్సన్ వెల్స్ మనకాలపు గొప్ప దర్శకుడు. ఆయన ’సిటిజెన్ కేన్’ సినిమా చరిత్రలో ఓ అధాయంగా మిగిలిపోతుంది.

2 Comments
  1. గీతాచార్య April 12, 2009 /
  2. Sowmya April 13, 2009 /