Menu

మన కాలపు మహా దర్శకుడు-ఆర్సన్ వెల్స్-మొదటిభాగం

orson-1అమెరికన్ జీవితపు లోతుల్ని ఆవిష్కరిస్తూ విస్తారంగా ఎదుగుతున్న వస్తు ప్రపంచపు వికృత రూపాన్ని వివరించిన సినిమా ’సిటిజన్ కేన్’. ఆరు దశాబ్దాల క్రితం నుంచి అమెరికాలో అంతరించిపోతున్న పాతతరం జీవనరీతుల్ని, కొత్తగా రూపొందుతున్న నియోరిచ్ జీవన విధానాల్ని, వాటి పర్యవసానాల్ని మన కళ్ళ ముందుంచిన సినిమా సిటిజన్ కేన్.

మొట్ట మొదటిసారి చూసినపుడు అంతా గందరగోళంగానూ, అపసవ్యంగానూ, కంటిన్యూటీ పట్ల కన్ఫ్యూజన్ గానూ కనిపించే సిటిజెన్ కేన్ లో తరచి చూస్తే పొరలు పొరలుగా ఆవిష్కృతమయ్యే జీవన వాస్తవాలు అబ్బురపరుస్తాయి. ప్రస్తుతానికీ, ఫ్లాష్ బ్యాక్ కీ మారితూ ఉండే చిత్రీకరణను అర్థం చేసుకున్న కొద్దీ కొత్త లోతులు అవగతమవుతూ ఉంటాయి.

బ్రిటీష్ ఇన్స్టిట్యూట్ పత్రిక ’సైట్ అండ్ సౌండ్’ ప్రతి ఐదేళ్లకొకసారి చేసే పోల్ లో అత్యుత్తమ స్థానాన్ని పొందుతూ, అమెరికన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఎంపిక చేసిన వంద గొప్ప చిత్రాల వరసలో ప్రధమ స్థానాన్ని పొందడమే కాకుండా అమెరికాకు చెందిన నేషనల్ ఫిలిం రిజస్ట్రీలో భద్రపరిచేందుకు ఎంపికయిన చిత్రం ’సిటిజన్ కేన్’.

ఇంతలా ప్రపంచ వ్యాప్త కీర్తిని, గుర్తింపును పొందిన ’సిటిజన్ కేన్’ దర్శకుడు ఆర్సన్ వెల్స్. అద్భుతమైన దర్శకుడే కాదు గొప్ప నటుడు, స్క్రీన్ ప్లే రచయిత. సినిమా మాధ్యమానికి సంబంధించి గొప్ప క్రాఫ్ట్స్ మన్ అయిన ఆర్సన్ వెల్స్ కు సినిమా నిర్మాణ రీతులకు సంబంధించి గొప్ప అవగాహన, నూతన ఒరవడి కలిగినవాడు. కేవలం 25 ఏళ్ళ వయస్సులోనే సిటిజన్ కేన్ లాంటి చిత్రాన్ని రూపొందించాడంటేనే ఆయన ప్రతిభను మనం అంచనా వేయొచ్చు. సినిమా నిర్మాణంలో ఆయన కెమెరాను వినియోగించిన విధానం వైవిధ్యభరితంగా ఉంటుంది. పాత్రల్ని మనో చిత్రాల్ని తెరపై ప్రతిఫలంచేసే విధానంలోనూ వెల్స్ ప్రతిభ ప్రస్ఫుటమవుతుంది. ఆయన సినిమాల్లో కనిపించే పాత్రలు వాసనలేని పువ్వులా ఉండవు. అవి సజీవంగా ఉండి అయితే ఇష్టపడడమో లేదా వ్యతిరేకించడమో చేస్తాం. వాటి పట్ల మనం ఉదాసీనంగా మాత్రం ఉండలేము. అదీ ఆర్సన్ వెల్స్ ప్రతిభ. ఆయనే ఒక చోట అంటాడు “కెమెరాలో యంత్రశక్తి కాదు గొప్ప మంత్ర శక్తి ఉంది. అది కేవలం రికార్డు చేసే పరికరం కాదు మనను గురించిన మనో ప్రపంచాన్ని మన ముందుకు తెస్తుంది. నిజానికి సినిమా ఒక కలల రిబ్బన్”.

ఆర్సన్ వెల్స్ 1915 లో ఓ ఉన్నత కుటుంబంలో జన్మించాడు. ఆయనకు 12 ఏళ్ళ వయసున్నప్పుడే పరిశోధకుడయిన తండ్రిని, పియానో కళాకారిణి అయిన తల్లిని కోల్ఫోయాడు. 1931 వరకు తన చదువును కొనసాగించిన వెల్స్ చిన్ననాటినుండే నాటకరంగంపట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. అనేక నాటక రంగ సంస్థల్లో పనిచేస్తూ షేక్స్పియర్, బెర్నార్డ్ షా, చెకోవ్ రచనల్న ప్రదర్శిస్తూ మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు.

1939 లో హాలీవుడ్ చేరుకున్న వెల్స్ అర్.కె సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 1941 లో సిటిజన్ కేన్ నిర్మించాడు. ఆ తర్వాత స్వతంత్రంగా ది స్ట్రేంజర్ (1946), ది లేడీ ఫ్రం షాంగై (1948) లు తీశాడు. అనంతరం వెల్స్ యూరప్ కు వెళ్ళి ఒథెల్లో (1951), మిస్టర్ ఆర్కాడిన్ (1955) లు తీశాడు. అదే క్రమంలో టచ్ ఆఫ్ ఇవిల్ (1958), ది ట్రయల్ (1962), చైమ్స్ ఆఫ్ మిడ్ నైట్ (1968) లు నిర్మించాడు.

నటునిగా, రచయితగా, ఎడిటర్ గా, దర్శకుడిగా విశేషంగా కృషి చేసిన వెల్స్ కి అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు (1975), అమెరికా డైరెక్టర్స్ గిల్డ్ వారి గ్రిఫిత్ అవార్డు (1984) లు లభించాయి. 1999 లో సిటిజెన్ కేన్ సినిమా జ్ఞాపకంగా అమెరికాలో 33 సెంట్ల పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు.

ఆర్సన్ వెల్స్ తన మూడు దశాబ్దాల, సినీ ప్రస్థానంలో అనేక సినిమాలు తీసినప్పటికీ సిటిజన్ కేన్ మాస్టర్ పీస్ లా మిగిలిపోయింది. అది పెద్ద న్యూస్ పేపర్ అధినేత చార్లస్ ఫోస్టర్ కేన్ జీవిత చరిత్ర, కథనం గతానికి వర్తమానానికి మారుతూ ఉంటుంది. చిత్రం ఆరంభంలోనే కేన్ తన పెద్ భవంతిలో ’రోజ్ బడ్’ అటూ తనువు చాలిస్తాడు. రోజ్ బడ్ అంటే ఏమిటి? ఎవరు అనే ప్రశ్నలతో సినిమా ముందుకు సాగుతుంది. ఓ న్యూస్ రీల్ రిపోర్టర్ పరిశోధన ఆంభిస్తాడు. కేన్ నిర్మించి విశాల పత్రికా సామ్రాజ్య ఎదుగుదల మన కళ్ళ ముందుకొస్తుంది. తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ బంధువయిన ఎమిలి నార్టన్ ని కేన్ పెళ్లాడతాడు. ఆర్థిక సామ్రాజ్య నిర్మాణం తర్వాత కేన్ రాజకీయల వైపు దృష్టి పెడతాడు. కాని ఆయన ప్రత్యర్థులు కేన్ కి బార్ రూమ్ డాన్సర్ సుసాన్ అలెగ్జాండర్ ఉన్న సంబంధాన్ని బయటపెడతారు. ఫలితంగా కేన్ ఎమిలీకి విడాకులిస్తాడు. సుసాన్ ను పెళ్ళాడతాడు. ఏదో తెలియని బాధ, దు:ఖంలో కేన్ ఒంటరితనాన్ని ఫీలవుతాడు. సుసాన్ అతన్ని విడిచి వెళ్తుంది. కేన్ అదే ఒంటరి తనంతో మ్రగ్గుతూ తన భవంతిలో మరణిస్తాడు. ఈ చిత్రంలో కాలం ముందుకూ వెనక్కు ప్రయాణిస్తూ ప్రధానంగా నాలుగు ఫ్లాష్ బ్యాక్స్ లో కేన్ కు చెందిన బ్యాంక్ గార్డియన్, బిజినెస్ మేనేజర్, మంచి స్నేహితుడు మరియు సుసాన్ జ్ఞాపకాల ద్వారా కేన్స్ జీవితం ఆవిష్కృతవుతుంది. అన్నీ ఒకదానిలో ఒకటి కలగలసిపోయి కాంప్లెక్స్ సినిమాలాగా కనిపిస్తుంది. ఇక అయిదవ ఫ్లాష్ బ్యాక్ లో కేన్ ప్రజా జీవితం చిత్రించబడింది.

సిటిజన్ కేన్ లో ఫ్లాష్ బ్యాక్ లతో పాటు ఆర్సన్ వెల్స్ ఉపయోగించిన అద్దాల ప్రపంచం సినిమాకు గొప్ప వ్యాఖ్యానాన్ని అందిస్తుంది. సినిమా ద్వారా తను చెప్పదలుకున్న మనిషి అంతరంగ ప్రపంచాన్ని వెల్స్ అద్దాల ద్వారా చూపిస్తాడు. అద్దం కేవలం అలంకారం కోసం కాదు మనిషిలో అంతర్లీనంగా ఉండే ఉద్వేగాల్ని ఆవష్కరించేందుకు ఉపయోగించవచ్చునని వెల్స్ రుజువు చేస్తాడు.

ఇలా గొప్ప ప్రతభతో చిత్రాలు తీసిన వెల్స్ చుట్టూ అల్లుకున్న వివాదాలకూ కొదవేం లేదు. సిటిజన్ కేన్ తన జీవిత కథ మీద ఆధారపడి తీసిందని భావించిన అప్పటి మీడియా అధినేత విలియం రాండాల్ఫ్ హర్ట్స్ ఆ సినిమా పై తమ పత్రికల్లో పెద్ద దుమారమే లేవదీశాడు. దాంతో చిత్రం విడుదల ఆలస్యం అయింది. సినిమా పట్ల జరిగిన వ్యతిరేక ప్రభావం పట్ల కేవలం ఒక్క ఆస్కార్ అవార్డుకే పరిమితం కావాల్సి వచ్చింది. అంతే కాదు ఈ స్క్రీన్ ప్లే పైనా వివాదం చెలరేగింది. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఆర్సన్ వెల్స్ ప్రతిభకు ఎలాంటి మచ్చా రాలేదు. అనంతర కాలంలో సినీ ప్రపంచంలో కాలిడిన అనేకమంది దర్శకుల పైనా వెల్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా పట్ల ఆయనకున్న నిబధ్దతకు తోడు కథా కథన విధానాల్లో ఆయన చేసిన ప్రయోగాలు ఆర్సన్ వెల్స్ ని సినీరంగ చరిత్రలో ప్రముఖునిగా నిలబెట్టాయి.

–ఇంకా ఉంది

One Response
  1. Jonathan April 10, 2009 /