Menu

చక్ర

chakraమహానగరాల్లో భవంతుల నీడన విస్తృతంగా పరుచుకున్న మురికివాడల్లో నివసించే జనజీవితాన్ని సూటిగా, స్పష్తంగా రికార్డు చేసిన చిత్రం “చక్ర”. ఆ మురికివాడల్లో నివసించే ప్రజల మధ్య సజీవంగా నిలిచి ఉన్న సంబంధాల్ని కుహనా విలువలకు తావులేని వారి స్త్రీ పురుష సంబంధాల్ని “చక్ర” అత్యంత నిజాయితీగా విశదం చేసింది.ముఖ్యంగా “చక్ర”లో స్మితాపాటిల్ పాత్ర (అమ్మ) అన్ని ముసుగుల్ని తగులబెడ్తుంది. జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా జీవించడాన్ని ఆ పాత్ర అనుసరిస్తుంది. జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా భుక్తికోసం జీవనం కోసం తన ఒళ్లు అమ్ముకోవడాన్ని ఆమె పాపంగా భావించదు. అంతే వాస్తవంగా చిత్రంలో స్మిత పాత్ర చుట్టూ అల్లుకుని ఉన్న అన్ని పాత్రలు మురికివాడల ప్రపంచాన్ని మన కళ్ల ముందుంచుతాయి. “చక్ర” ను కళాత్మకంగానూ, ఉన్నది ఉన్నట్టుగానూ చిత్రీకరించడంలో దివంగత దర్శకుడు రవీంద్ర ధర్మరాజ్ విజయం సాధించారు.

“చక్ర” చిత్రంలో ప్రధానంగా మురికివాడల జీవితాన్ని యదార్ధ దృక్పధంతో చిత్రించడం ఒక స్థాయిలో ప్రధానాంశం అయినప్పటికి మరో స్థాయిలో మానవ సంబంధాల్ని అక్కడి స్త్రీల జీవితాల్లోని పలు కోణాల్ని వివరించడం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా చక్రలో మురికివాడల వాతావరణాన్ని ఆమూలాగ్రం అత్యంత శ్రద్ధతో చిత్రించడం జరిగింది. అక్కడ నివసించే ప్రజల జీవితాలకు సంబంధించిన ఏ చిన్న వివరమూ వదిలిపెట్టకుండా చిత్రంలో పొందుపరిచారు. అక్కడ డబ్బు సంపాదించేందుకు సినిమా థియేటర్ల వద్ద బ్లాకులో టిక్కెట్లమ్మడం, రైల్వే వ్యాగన్లలోంచి సామాన్లు దొంగిలించడం ఎంత సులువుగా చేస్తారో అంతే సామాన్యంగా వ్యభిచారం జరుగుతుంది. భుక్తికోసం డబ్బు సంపాదించే క్రమంలో వ్యభిచారం అక్కడ సాధారణ విషయంగానే పరిగణిస్తారు. అనేక సార్లు వీధులు ఊడ్చే మున్సిపల్ సిబ్బందికి చెత్తకుండీల్లో గుర్తు తెలీని పసిబిడ్డలు దొరుకుతుంటారు. అలా దొరికిన రోజున,ఆ మరుసటి రోజున దానిమీద చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అంతా మామూలే. అలాంటి వాతావరణంలో అమ్మ అని పిలువబడే ఓ అందమైన స్త్రీ తన కొడుకుతో జీవిస్తూ ఉంటుంది. ఆమె ఈ లోకంపైన ధిక్కారంతో బతుకుతుంది. ఎవరికీ దేనికీ బెదరక్కుండా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. పొట్టకూటికోసం ఆమె పలువురితో సంబంధాలు ఏర్పరచుకుంటుంది. అయితే ఆమె గుడిసెలో పురుషుడితో ఉన్నప్పుడు ఆమె కొడుకు మౌనంగా బయట పడుకుంటాడు. కాని ఆమె మాత్రం తన కొడుకుఎలాంటి చెడుకీ లోనుకాకుండా ఇజ్జత్‌తో బతకాలని ఆశిస్తుంది. అదే మురికివాడలొ నివసించే అంజలి దినమంతా మామూలు జీవితం గడుపుతూ రాత్రిళ్లు రెడ్ లైట్ ఏరియాకి వెళ్లి తెల్లారేసరికి గుడిసె చేరుతుంది. తనకూ తన తండ్రికీ సరిపడ డబ్బును ఆమె సంపాదిస్తుంది. అలాంటి ఆమెకు పుట్టిన చిన్నారిని చెత్తకుండీలో వేసి తన వేదనను దుఃఖాన్ని దిగమింగుతుంది.

ఇలా చక్రలోని రెండు స్త్రీపాత్రలు భిన్నమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాయి. అమ్మ సంఘాన్ని ధిక్కరించి జీవితాన్ని గడిపితే అంజలి అందుకు భిన్నంగా సంఘానికి భయపడుతూ తన జీవితాన్ని గడుపుతుంది. జీవితంలోని రెండు భిన్నమయిన వాస్తవాలు చక్రలో అత్యంత నిజాయితీగా చిత్రితమయ్యాయి. ఇదిలా ఉణ్టే మరో స్థాయిలో మురికివాడ ప్రజల ఆర్ధిక స్థితిని ప్రవృత్తిని చక్రలో చర్చిస్తాడు రవీంద్ర ధర్మరాజ్. చిత్రంలో మరో ప్రధాన పాత్ర లూక (నసీరుద్దిన్ షా). అతను తాగుడు, వ్యభిచారం, బ్లాకులో టిక్కెట్లమ్మడం నుంచి అనేక పనులు చేస్తూ ఉంటాడు. చాలెంజ్ అయిన పనులు నిర్వహిస్తూ జల్సాగా కనిపించే లూకా ఆ మురికివాడల పిల్లలకు ఆదర్శంగా కనిపిస్తాడు. అన్ని రకాల పనులు చేసే లూకాకి టెన్హా అనే పిల్లాడు అతి సన్నిహితంగా మసలుతూ ఉంటాడు. టెన్హా అమ్మ కుమారుడు. టెన్హాను తనతో తిప్పుతూ తన ధోరణిలో తాను తెలుసుకున్న జీవిత సత్యాల్ని భోదిస్తుంటాడు. కాని అమ్మ తన కొడుకుకి ఇజ్జత్ తో బతకాలని చెబుతుంది. ఓ రాత్రి లూకా అమ్మతో గడుపుతాడు. అమ్మ ఆ తర్వాత లారీ డ్రైవర్ తో సంబంధం ఏర్పరుచుకుంటుంది. ఆమె గర్భవతి అవుతుంది. లారీ డ్రైవర్ తో జీవితాన్ని శాశ్వతంగా పంచుకుందామనుకుంటుంది. ఇంతలో లూకా తిరిగి వచ్చి తాగడానికి మందు కోసం ఓ కెమిస్ట్ ని చంపుతాడు. పోలీసులు అమ్మ ఇంట్లో తలదాచుకున్న లూకాని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. రకరకాల చెడు పనులకు వేదిక కావడంతో పాటు అనవసరమైన అల్లార్లకు పాల్పడుతూ ఉన్నారనే నెపంతో ఆ మురికివాడను బుల్ డోజర్లతో కూలదోయించి సువిశాలమైన మైదానంగా మార్చివేస్తారు అధికారులు. “చక్ర” మురికివాడల జీవితాల్ని అందులో ముఖ్యంగా అమ్మ, అంజలి లాంటి స్త్రీల వృదార్ధమైన జీవితాల్ని యదార్ధంగా చూపించింది.

 • చక్ర (హిందీ)
 • దర్శకత్వం – రవీంద్ర ధర్మరాజ్
 • నటీనటులు – స్మితా పాటిల్, నసీరుద్దిన్ షా, కులభూషన్ ఖర్బంధా.
12 Comments
 1. గీతాచార్య April 24, 2009 /
 2. మేడేపల్లి శేషు April 24, 2009 /
 3. సుజాత April 24, 2009 /
 4. రాజశేఖర్ April 24, 2009 /
 5. Marthanda April 24, 2009 /
 6. Dhanaraj Manmadha April 24, 2009 /
 7. Dhanaraj Manmadha April 24, 2009 /
 8. గీతాచార్య April 24, 2009 /
 9. రాజశేఖర్ April 24, 2009 /
 10. Dhanaraj Manmadha April 24, 2009 /
 11. Marthanda April 25, 2009 /