Menu

గోడలు బద్దలు కొట్టేవారు కావాలి.మీరేమంటారు?

wallsఈ వ్యాసం రాయడానికి కారణాలు:

 • టీ వీ ల లో సినిమా ట్రయలర్స్ గురించి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి గౌరవ ప్రధాన కార్య దర్శి శ్రీ టీ .వి. డి. ప్రసాద్ గారు ఇచ్చిన ప్రకటన
 • ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టిమరీ లోక్ సత్తా పార్టీ జాయప్రకాష్ నారాయణ మీడియా ని దుమ్మెత్తిపోయడం
 • యుధ్ధం లొ పాలుపంచుకోండి అని నేను రాసిన వ్యాసం.
 • గత కొన్ని నెలలుగా మా మిత్రుల మధ్య జరిగిన సంఘటనలు చర్చలు
 • అప్పుడేప్పుడో రాష్ట్ర స్థాయి నాటకాల సంధర్భంగా కలిసిన వారితో టీ తాగుతు జరిగిన చిన్న చర్చ

మూడునెలల క్రితం ఒక రోజు:

దర్శకరంగములో అభిరుచి ఉండి సినిమా కష్టాలు పడుతున్న ఒక మిత్రుడిని ఎంతకాలం ఇలా? కనీసం ఒక చిన్న సినిమా మొదలెట్టవచ్చుకదా అని మేము ఉచిత సలహా ఇస్తే…

చిన్న సినిమా చేయ్యదలుచుకొలేదు , చిన్న సినిమాను మీడియా సరిగా పట్టించుకోదు , దానికి సొంత ప్రచారం కోసం మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టాలి.అదో పేద్ద తలనొప్పి. అంతెందుకు చిన్న సినిమా లు ఎన్నో వచ్చిపొతున్నాయి. అందులో కొన్ని మంచి సినిమాలు కూడ ఉన్నాయి కాని షూటింగ్ వివరాలు లేదా అవి ఏ థియేటర్లో వస్తున్నయో, అందులో తారాగణం ఎవరో , జనాలకు అస్సలు తెలియకుండానే ఆ బాక్సులు తిరిగి మూలకు వెల్లిపోతున్నాయి.ఎందుకు? అన్నాడు

అవును నిజమే. రోజు సినిమా పేజీలు చూస్తూనే ఉన్నాం కాని ఈ దృష్టి తో చూడలేదు సరే అని పాత పత్రికలన్ని ముందేసుకొని తిరగేసినాము. ఉహూ….చిన్న సినిమాల కవరేజి చాల చాల తక్కువగా ఉంది. ఒకటి రెండు చిన్న సినిమాల షూటింగ్ కు సంబంధించినవి ఉన్నా కాని ఏదో ఒక మూలన చిన్నగా….అంతే. అప్పుడనిపించింది నిజంగా మన మీడియా నిష్పక్షపాతంగా ఉందా అని.

సినిమా ని ప్రాణం గా ప్రేమించి , సినిమా అంటే పిచ్చితో ఊర్లో అన్ని అమ్మేసి నగరానికి వచ్చిఎలాగోలా సినిమా తీసే నిర్మాతలు, కృష్ణా నగర్ సినిమా కష్టాలు వాస్తవంగా అనుభవిస్తూ, మరో వైపు చిన్న సినిమా అయినా తమ పాత్రలకు న్యాయం చేస్తూ నటిస్తున్న వారు…ఇలా చాలా మంది ఉన్నారని అందరికి తెలిసిందే. కాని వారి గురించి మాత్రం ఎవరికీ తెలియదు.

అనుక్షణం, ప్రతినిత్యం నిజాలు రాస్తున్నాము,పేద,సామన్య ప్రజల వెంట వున్నాము అని చెప్పుకునే పత్రికలు ఈ చిన్న సినిమాల గురించి ఎందుకు సరిగా ప్రచురించవు ? ఎందుకు సినిమా పేజిల్లో చిన్న సినిమా గురించి, చిన్న సినిమా కళాకారుల గురించి రాయరు?

ఎందుకంటే కవర్లెవరు (నోట్లు) ఇస్తే మరుసటి రోజు వారి గురించి కొద్దో గొప్పో రాస్తారు అని ఒకతను చెప్పాడు. అది పూర్తిగా నిజం కాదు అని నేను వాదించాను.

తరువాత చివరకు అందరం ఒక నిజం ఒప్పుకున్నాం.?

గత వారం :

ఇది అందరికి తెలిసిన విషయం. మందు,డబ్బు ఇచ్చి లారీలకు లారీలు జనాలను బలవంతంగా బహిరంగ సభలను లాక్కోని వస్తే ఆ సభలు సూపర్ హిట్ అని పేద్ద పేద్ద పార్టీల గురించి ప్రచారం చేసే మీడియా కి, మొన్నీ మధ్య వైజాగులో, మందు పోయించకుండా, డబ్బు పంచకుండా , జనాలను బలవంతంగా తరలించకుండా,ఒక బహిరంగ సభ నిర్వహిస్తే నీతి నిజాయితి గా పదివేల మందితో సక్సెస్ అయిన మా సభ కనిపించలేదా అని  మరుసటి  రోజు లోక్ సత్తా రాజకీయ పార్టీ జయప్రకాష్ నారాయణ గారు ప్రెస్ మీట్ పేట్టి మరీ మీడియా ని దుమ్మేత్తి పోసారు.

పోయిన సారి రాస్ట్ర స్థాయి నాటక పొటిలు జరిగినప్పుడు ఒక రోజు:

“గత పాతిక సంవత్సరాలు గా దేశం మొత్తం మీద 250 నాటకాల వరకు వేస్తూ వస్తున్నాం” అని ఓ ముగ్గురు సీనియర్ నాటక నటులు తొలి పరిచయం లో అన్నప్పుడు. సరిగా అలోచించనుకూడ చించకుండా వెంటనే నేను “అవునా నేనెప్పుడు పేపర్లలొ చూడలేదు క్షమించండి” అంటే..”అబ్బే దానిదేం ఉందండి మా గురించి పేపర్లు కాని , టీ వీలు కాని చేప్తే మీకు తెలుస్తుంది వాటికేమో పెద్ద పెద్ద హీరోల తో హీరోయిన్ ల బికిని బొమ్మలు వెయ్యడానికే పేజీలు సరిపోవడం లేదు, అయినా మేము ఏదైనా క్లబ్బులో ఎప్పుడైనా ఏదైనా పార్టీ చేసుకున్నామా? మా ఫోటో కలర్ లో పేజి త్రీ లో ప్రచురించడానికి” అని వ్యంగంగా అనేసరికి నాకు విషయం అర్ధమైంది

యాధృచ్చికం: ఈ మధ్య కూడ ఒక హీరోయిన్ బికిని వేసిందని దాదాపు అన్ని పత్రికలు తమ తమ సినిమా పేజీలలో ఆమె బొమ్మలు ప్రచురించి తమవంతు కళా పోషణ చేసాయి. (ఇక్కడ బికిని వెయ్యడం తప్ప ఒప్పా అనే చర్చ కాదు . )

సత్య జగదీష్ గారి యుద్ధం సినిమా మీద ఆర్టికల్ రాసాక:

కామెంట్ల రూపములో ఎన్ని విమర్శలు సద్విమర్శలు వచ్చాయో మీకు తెలుసు. ఐతే వ్యక్తిగతముగా కూడా నాకు తెలిసిన మిత్రులు కూడ విమర్శించారు అలానే వారు పరిచయం చేసిన మరి కొంతమంది కూడ అలానే విమర్శగా మాట్లాడారు.అందరి బాధ ఏంటంటే..సత్య జగదీష్ అనబడే వ్యక్తి సినిమా చెయ్యకముందే ఒక ప్రముఖుడిలా ఇంటర్వ్యూ రాయడం ఏంటి అని. మరి కొంత మంది అన్నదేంటంటే…ఎదైనా పెద్ద సంస్థ సినిమా వేడుకకు వెళ్ళావు.కడుపునిండా బిర్యాని తిని, ప్యాంటు జేబులో వాళ్ళిచ్చిన కవరు తీసుకొచ్చి రాసావంటే ఒక అర్థం ఉంది కాని ఇలాంటి వారి గురించి రాయడం ఏంటి? అనవసరంగా నువ్వు అతని కి ప్రచారం చేస్తున్నావ్ అన్నారు.

ఇలా ఎన్నో…

నాకు అస్సలు సమజ్ గాని విషయం ఏంటంటే (కనీసం మీరైనా నాకు అర్థం చేపించండి)

ప్రముఖ నటీనటుల కుమార్తెలు,కుమారులు సినిమాలు ప్రారంభం కాకముందే అభిమాన సంఘాలతో వారిని పొగిడే సంస్థలు, పత్రికలు, వెబ్ సైట్లు వాళ్ళు ప్రచురించేవన్నీ మనం సహిస్తాం చదువుతాం, చూస్తాం.కాని కొత్త టాలెంటు ని మాత్రం మనదైన పధ్ధతిలో, మన స్థాయిలో అణిచివేసే ప్రయత్నం చేస్తుంటాము. కనీసం మాటల మధ్యలో అయినా కొత్త టాలెంట్ గురించి పాజిటివ్ గా ఊహించం, ఒక మాట మాట్లాడం. ముఖ్యంగా సినిమా రంగం లొ ఈ పాజిటివ్ కోణం అస్సలు కనిపించడం లేదు సరికదా ఇన్సెక్యూరిటీ భావనతో ప్రతి ఒక్కరిని నిరాశ పరచడం ఎక్కువగా జరుగుతుంది.

వీళ్ళ దృష్టి లో…బట్టతల అయినా రావాలి, గడ్డమైనా తెల్లబడాలి అప్పుడు కాని ఇక్కడ అవకాశం కాని గుర్తించడం కాని చెయ్యరు. పిల్లకాయలు మీకేం తెల్సు.అనుభవం సంపాదించండి అంటుంటారు.

ఏ అనుభవం ఉందని వాల్మికి రామాయణం రాసాడు.వీళ్ళు ఆలోచించరు?

సత్య జగదీష్ గారు రెండు సంవత్సరాలనుంచి సినిమా ఎందుకు కావడం లేదు అనే వ్యాఖ్య రాసే బదులు, నేనేమైనా మీకు సహాయం చేయ్యగలనా? అని రాయరెందుకు?

చెయ్యలేరు,అసంభవం,కుదరదు,నీవళ్ళ కాదు, భ్రమ లో ఉండకు, అని ఇలా విమర్శించడం కాకుండా మనసారా, “అలా కాదు ఇలా చేసి చూడండి” అని సద్విమర్శ చేయమెందుకు? మీడియా లాగానే వ్యక్తులు కూడా.

ఇప్పుడు కొన్ని సందేహాలు?

ఎన్నో చిన్న సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి జనానికి తెలియడం లేదు. నీతి గా నిజాయితిగా ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ 1/3 సైజు లో బికిని కలర్ ఫోటోలు ప్రచురించి ఒక నటిని, ఆమె నటనను ప్రోత్సహించి ప్రచారం చేస్తున్న కొన్ని పత్రికలవారు చిన్న సినిమాలు, నటులు, టెక్నీషియన్ల  గురించి అందులో సగం వంతు అయిన ఎందుకు ప్రొత్సాహించడం లేదు

న్యాయంగా రిపోర్టింగ్,ఎడిటింగ్,ఉద్యోగాలు చేసే కొంతమంది చిన్న సినిమా విషయాలను సమాన స్థాయిలొ కాక పొయినా, కనీసం గౌరవంగా నైనా ఎందుకు రాయరు ?

హైదరాబాదులోనే కాకుండా రాష్ట్రం నలుమూలలా ఏంతో మంది కళాకారులు ఎన్నో ప్రదర్శనలు ఇస్తుంటారు మెయిన్ ఎడిషన్ కాకపోయిన జిల్లా ఎడిషన్లోనైనా పేజి 3 క్లబ్ ఫొటో లను ప్రచురించే ఫుల్ పేజిలా కలర్ ఫోటో లు కాకపోయినా బ్లాక్ అండ్ వైట్ అయిన సరిగా మొహం కనిపించే లా ప్రచురించవు ఎందుకు? ఎందుకు టీ వీ లు ఇంటర్వ్యూలు ప్రసారం చెయ్యవు?

ఆస్కార్ వచ్చిందంటే గొప్ప గా రాస్తున్నయి. అలాంటి స్లం డాగ్ కళాకారులెందరో పబ్లిసిటి లేకపోవడం వలన ప్రపంచానికి కానరాకుండా పోతున్నారు.మండల గ్రామ జిల్లా స్థాయిల్లో ఏంతో మంది స్థానిక లోకల్ కేబుల్ కొరకు, వారి వారి స్థాయిలో వ్యయ ప్రయాసాలు పడి వీడియో ఫిల్ములు తీస్తుంటారు.వారు తియ్యడమే ఎక్కువ. పబ్లిసిటి కోసం వారు కవర్లు ఇవ్వలేరు, వీరే కాదు.ఇలా ఏన్నో రంగాల కళాకారులు మీడియా సరిగ పట్టించుకోక పోవడం వలన, ప్రాముఖ్యత ఇవ్వకపోవడం మూలాన ఈ దేశం కోల్పోతుంది

ప్రజల కోసం, ప్రజలకు జ్ఞానాన్ని ఇవ్వడం కొసం, కొత్త విషయన్ని ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా చెప్పడం కోసం తమ  పత్రిక, టీవి చానెల్, వెబ్సైట్ పెట్టినం అని గొప్పలు చెప్పుకునేటప్పుడు మరి చిన్న పెద్ద అందరిని ఎందుకు సమానంగా చూడరు?

ఇంతకీ చెప్పాలనుకున్న విషయం ఒక్కటే…

ప్రపంచములో ఏ దేశం లొ లేనన్ని పంటలు ఇక్కడ ఉన్నట్లు, లెక్కలేనన్ని నదులు ఇత్యాది ఉన్నట్లు,మన దేశంలో ఎన్నోరకరకాల కళలు కళాకారులు ఉన్నారు. వారిని వెలుగులోనికి తీసుకొచ్చే భాద్యత ఈ రోజు మీడియా మీద చాలా ఉంది. దౌర్భాగ్యం ఏమిటంటే, అందరూ ఒప్పుకోని విషయం,కాస్తో కూస్తో, కులతత్వం,మతత్వం ఉన్నవారు మీడియాలో కొన్ని ఉద్యోగాల్లో పునాదులు వేసుకోవడం కూడ దీనికి ఒక కారణం. వీళ్ళంతా భావి భారత దేశ బంగారు భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తుంటది.ఇన్ని కొత్త పత్రికలు, ఛానల్స్ వస్తున్నా జాతీయ స్థాయిలొఆ పని సిన్సియర్ గా చేసింది..దూరదర్శన్ మాత్రమే (“సురభి” గుర్తుందా? )

శ్రీ శ్రీ అన్నట్లు గోడల బద్దలు కొట్టేవారు రావడం లేదు. కనీసం ఇంటర్నెట్ రంగములో మన నవతరంగం ఐనా పేరుకుతగ్గట్లుగా చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాను.జయ హొ అని అప్పుడందాము.

10 Comments
 1. su April 1, 2009 /
  • YEAH IT'S ME: Chanti April 1, 2009 /
 2. అబ్రకదబ్ర April 2, 2009 /
 3. sivaji April 3, 2009 /
 4. నాగన్న April 6, 2009 /
 5. surya April 19, 2009 /
 6. రాజశేఖర్ April 19, 2009 /
 7. suree May 11, 2009 /