Menu

భూమిక

ఆమె జీవితాన్ని ప్రేమించింది. ప్రేమకోసం తపించింది. గాఢమయిన ప్రేమ కోసం ఆమె జీవితాంతం పరుగులుతీసింది. కాని ఆమె ఆశించినంత గొప్ప ప్రేమ, గొప్ప ఆలంబన ఆమె జీవితయాత్రలో తారసపడలేదు. కాని సినిమా తెరపైన మెరుపులు మెరిపిస్తూ అసలు జీవితంలో అనంతమయిన దుఃఖాన్ని, ఒంటరితనాన్ని, నిరాశ నిస్పృహల్ని తోడుగా చేసుకొని గడ్డిపరకలాంటి ఆలంబన లభించినా ఆశగా, ఉద్వేగంగా అందుకుంది. కాని ఆమె ఆశలకు, స్వేచ్చాభిలాషకు, వాస్తవ అనుభవానికి మధ్య అగాధం లాంటి అంతరంతో ఆమె తన జీవితాన్ని గడిపింది. ఇదంతా ఏదో కథలోనో, నవలలోనో జరిగింది కాదు. ఇది ప్రముఖ నటి హన్సా వాడేకర్ జీవితంలో అనుభవించిన యదార్థం. ఆమె గురించి ఎంతో మంది మరెంతో రాశారు. ఆమె ఇల్లూ, ఆమె జీవించిన పరిసరాలూ పరిశీలించి రిసెర్చ్ చేసి ఆమె జీవితాన్ని గురించి ఎన్నో కథలు రాశారు. అయితే హన్సావాడేకర్ ఆత్మకథ “సంగ్‌తే ఆమ్‌కా” లోంచి మౌళిక కథాంశాన్ని తీసుకొని శ్యాం బెనెగల్ ‘ భూమిక చిత్రాన్ని 1976 లో నిర్మించారు. అది సరిగ్గా హన్సా ఆత్మను ప్రతిఫలించలేదు. కాని అత్యంత నిజాయితీగా ఆమె జీవితాన్ని ఉషగా స్మితా పాటిల్ అత్యద్భుతంగా పోషించింది. ఒక నటి యదార్థ జీవితాన్ని తెరపైన ఆవిష్కరించడంలో స్మితా పాటిల్ మరచిపోలేని మందస్మిత వదనంతో నటించింది. ఉష పాత్రలో కాలానుగుణంగా, అనుభవాల పర్యవసానంగా పెల్లుబికిన భావావేషాల్ని పలికించడంలో స్మితాపాటిల్ అద్వితీయమైన నటనని ప్రదర్శించారు. గిరీష్ కర్నాడ్, సత్యదేవ్ దుబేలు రచన చేసిన ఈ సినిమాకి పనిచేసిన వాళ్లంతా మహామహులే.

ఒక యదార్థ కథని ఆధారం చేసికొని ఓ స్త్రీ అంతరంగ జీవితాన్ని అనుభవాల పరంపరని అల్లిక చేసి దృశ్యకావ్యంగా మలచడంలో శ్యాంబెనెగల్ పరిమళంతో కూడిన ప్రతిభని కనబర్చారు. ‘ భూమిక ‘ కు బలం చిత్ర కథాంశమూ, ముఖ్యనటి స్మితాపాటిల్ నటనా కాగా, వాటిని ప్రతిభావంతంగా నిలబెట్టడంలో శ్యాంబెనెగల్ అవగాహన, ప్రతిభ ప్రతి

ఫ్రేమ్ లో గోచరిస్తాయి. ముఖ్యంగా చలన చిత్ర జీవితానికి సంబంధించిన అతి చిన్న అంశాలు కూడా ఈ సినిమాలో బెనెగల్ దృష్టినించి జారిపోలేదు. ప్రధానంగా మరాఠీ జీవితమూ, సినిమా రంగమూ గొప్ప నేపధ్యంగా ఈ సినిమాకి అండగా నిలిచాయి.

కథాంశం విషయానికి వస్తే 1920ప్రాంతంలో ఓ కొంకణి గ్రామం. ఉష తండ్రి తాగుబోతు. తల్లి తనను అమితంగా ఇష్టపడే ప్రియుడు కేశవ్ సహకారాన్ని పొందుతూ ఉంటుంది. ఉషకి ఆమె అమ్మమ్మ అన్నివిధాలా తోడుగా ఉంటుంది. ఆమె ఉషకి సంగీతం నేర్పిస్తుంది. అందమయిన యువతిగా ఎదిగిన ఉష సినీ రంగాన్ని చేరుతుంది. అందమూ, సంగీతమూ, నృత్యమూ, నటనా ప్రదర్శించడంలో ప్రతిభ గల ఉష అతి తక్కువ సమయంలోనే ప్రముఖ నటిగా ఎదుగుతుంది. ఆమె సహ నటుడు రాజన్ ఆమెని ప్రేమిస్తాడు. కాని చిన్ననాటినుండి తనకూ తన కుటుంబానికి అనేక విధాల సహకరించిన కేశవ్‌ని ఉష పెళ్ళాడుతుంది. వారిద్దరికీ ఓ పాప పుడుతుంది. కాని కేశవ్ కొంత కాలానికే తన దుబారాతో పనికిరాని వ్యక్తిల మారిపోయి భార్య నుండి దూరమవుతాడు.

విచ్చిన్నమయిన కుటుంబ స్థితి కొంత, తను స్వేచ్చను ఆశించి కొంతా ఉష క్రమంగా సినిమా దర్శకుడు సునీల్ వర్మకు దగ్గరవుతుంది. వారి సాన్నిహిత్యం మరింత దగ్గరై ఉష గర్భవతి కావడం , అది అబార్షన్ కావడమూ జరిగిపోతాయి. అనంతరం ఇద్దరిమధ్యా పొరపొచ్చాలు లేచి ఇద్దరూ ఒకరి నొకరు మోసగించారని ఆలోచించుకుంటూ విడిపోతారు. ఇంతలో ధనవంతుడయిన కాలె ఉషని చేరదీస్తాడు. తన భార్య స్థానాన్ని ఇచ్చి గోవాలోని తన భవంతిలొ ఉంచుతాడు. ఇక ఆమెకు ఆ ఇల్లే సర్వస్వంగా మారుతుంది. చివరికి భవంతి అవతలికి వెళ్లేందుకు సైతం స్వేచ్చ లేని స్థితి ఏర్పడుతుంది. ఆ స్వేచ్చ లేనితనాన్ని ఆమె అసలు భరించలేదు. విచిత్రమయిన పరిస్థితిలో తన మాజీ భర్త కేశవ్ సహకారంతో ఆమె అక్కడినుంచి పారిపోయి బాంబే చేరుతుంది. హోటల్ చేరిన ఆమె ముందర అనేక దారులు గోచరిస్తాయి. అప్పటికే ఎదిగిన ఉష కూతురు ఓ ధనవంతున్ని పెళ్లాడి సంతోషకరమయిన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఆమె తల్లికి సరిపడినంత ధనంతోపాటు స్వేచ్చగా జీవిచే స్థితి కల్పిస్తానంటుంది. మరోవైపు సినీ నటుడు రాజన్ ఉష పట్ల తన ప్రేమనింకా దాచుకున్న స్థితిలొ అమెకోసం ఏమైనా చేయడానికి ముందుకు వస్తాడు. నటిగా వృత్తి పరంగా గాని, వ్యక్తిగా, బ్రతుకుపరంగా గాని రాజన్ సంపూర్ణంగా ఆమెకు సహకరించడానికి సిద్ధపడతాడు.

ఇంకోవైపు ఉష భర్త కేశవ్ తమ వైవాహిక జీవితం పునః ప్రారంభిద్దామంటాడు. కాని ఉష వీటన్నింటినీ తోసి రాజంటుంది. తన ఇన్నేళ్ల జీవితంలో ఏ స్వేచ్చ కోసమయితే, ఏ ప్రేమ కోసమయితే పరుగులు తీసిందో దాన్ని పణంగా పెట్టి మరొకరి పంచన పడివుండటానికి ఆమె అస్సలు అంగీకరించదు. వ్యక్తిగా, కళాకారిణిగా ఆమె తన అభీష్టానికి వ్యతిరేకంగా జీవించడానికి అంగీకరించదు. గొప్ప ఆర్తితో, తపనతో తన సర్వశక్తులూ ఒడ్డి జీవితకాలమంతా సంఘర్షించిన ఉష జీవితం ముగింపును దర్శకుడు శ్యాం బెనెగల్ అనేక బహిరంగ ప్రశ్నలతో వదిలేస్తాడు.

హన్సావాడేకర్ యదార్ధ జీవితాన్ని ఆలంబనగా చేసుకొని ‘ భూమిక ‘ ను రూపుదిద్దిన శ్యాం బెనెగల్ స్త్రీ స్వేచ్చ గురించి సమాజంలో ఆమె భూమిక గురించి ఆమె చుట్టూరా ముసురుకుని ఉండే పురుష భావజాలం ఆమెను ఎంతగా వత్తిడికి గురి చేస్తుందో సవివరంగా చూపించి కళాత్మకంగా వివరిస్తాడు. చిత్రంలో ఉష పాత్రలో స్మితాపాటిల్ నటన అద్వితీయమయింది. భావవేశాల్ని, ఉద్రేకాన్ని ప్రదర్శించదంలో స్మితా పాటిల్ చూపిన ప్రతిభ ఎనలేనిది. గొప్ప నటి పోషించిన మరో గొప్ప నటి జీవిత చిత్రం. ‘ భూమిక ‘ భారతీయ చలనచిత్ర చరిత్రలో గొప్ప మైలు రాయిగా మిగిలిపోతుంది.

 • భూమిక..(హిందీ)
 • దర్శకత్వం – శ్యాం బెనెగల్,
 • స్క్రిప్ట్ – గిరీష్ కర్నాడ్, సత్యదేవ్ దుబే
 • కెమెరా – గోవింద్ నిహలానీ
 • సంగీతం – వనరాజ్ భాటియా
 • నటీ నటులు – స్మితా పాటిల్, అనంత్ నాగ్, అమోల్ పాలేకర్, నసీరుద్ధిన్ షా, అమ్రిష్ పురి, కుల్ భూషణ్ ఖర్బందా మొ..
6 Comments
 1. మేడేపల్లి శేషు April 2, 2009 /
  • venkat April 2, 2009 /
 2. bhavani April 2, 2009 /
 3. Manjula April 3, 2009 /
 4. Sowmya October 17, 2011 /