Menu

అరుంధతి(A) బాధితుల సంఘం

మీకు అరుంధతి సినీమా మాయాబజారు తరువాత అంతటి గొప్ప చిత్రం అనిపిస్తే మీరు దయచేసి ఈ టపా చదవద్దు. ఇది మీకు పరుషంగా అనిపించవచ్చు. చదివింతరువాత “మీ నవతరంగం ఇంతే, ఇక్కడ రచయితలు ఓర్వలేనితనంగా వ్రాస్తారు, ఈ రచయితని అది చేయండి ఇది చేయండి, ఇది రివ్యూ కాదు, సీరియస్ సైటులో వుండాల్సింది కాదు”, వంటి వ్యాఖ్యలు చేస్తే నాది కాదు పూచి. “ఎంత గొప్ప సినిమా అయినా అందులో మెఱుగులకు అవకాశం వుంటుంది, అసలే ఇదంత గొప్ప సినిమా కూడా కాదు”, అన్న విశాల దృక్పదం గలవారైతే చదవండి.

నిన్న మొత్తానికి అరుంధతి సినిమా చూడడం జరిగింది. అసలైతే మొన్నొక సారి పాతిక కి.మి వెళితే, ఆ హాలులో ఈ సినిమా ఆ ముందు రోజే తొలగిపోయిందని చెప్పారు. అప్పుడు బిల్లా చూసి వచ్చి, ఛీ పెంట సినిమా అనుకున్నా. కానీ ఆనాడు ఎంత అదృష్టమో ఈనాడు తెలిసివచ్చింది. కానీ ఏం చేస్తాం నిన్నరాత్రే ఘోరం జరిగిపోయింది. అరుంధతి గాత్రంపై జరగాల్సిన అత్యాచారం, నా మనస్సుపై జరిగిపోయింది.

నిన్న కష్టపడి నలుగురు పిల్లలతో అప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్న ఆనందంలో ముగ్గురం పెద్దవాళ్ళం అరుంధతి సినిమాకి వెళ్ళాం. అవును. ఈ విషయమై మీరు నన్ను ఎంత తిట్టినా నేను ఒప్పుకుంటాను, ఓర్చుకుంటాను. మఱీ సిబిఎప్సి రేటింగు చూడకండానే సినిమాకి ఎలా వెళ్ళిపోతారు అని మీరు అడగవచ్చు. ఏం చేస్తాం, అందరూ సూపర్ సినిమా సూపర్ సినిమా అనడమే గాని, ఇది పెద్దలకు మాత్రమేనని ఎవరూ చెప్పలేకపోయిరి. పైపెచ్చు, పిల్లలందరూ తమ తమ సహాధ్యాయులు ఈ సినిమా చూసారని, తమకు కథ చెప్పియున్నారనీ, కథ ఎంతో నచ్చిందనీ అంటూవున్నారు. అప్పటికీ నేను మఱీచిన్న పిల్ల వుంటే దానికి వద్దన్నాను గానీ, మారాం చేస్తుందని ఎక్కించుకున్నారు. మన వెనకబడిన దేశంలో పిజి-10 లు పిజి-13 లు వుండవు కదా మరి. గమ్మత్తేంటంటే ఆ ఏడేళ్ళ పిల్ల కూడా నాకు కథ తెలుసు బస్సులో మా ప్రెండు రోజూ చెబుతుంది అంటూవుంది. మొత్తానికి థియేటర్ కి వెళ్ళాం. అది మావూరి డొక్కు థియేటరి – కేబుల్ టీవీ వచ్చాక, డొక్కు బారిపోయిన బాపతు. దాని లోపల గబ్బిలాలు కూడావున్నాయి. సినిమాలో గబ్బిలాలకు ఇవి మాంచి జతనిచ్చాయి. థియేటర్ కూడా ఏదో కంపు కొడుతూ వుంది. కానీ సినిమాతో పోల్చుకుంటే థియేటర్ స్వర్గమని తరువాత తేలింది.

కథలోనికి వద్దాం.

అందరూ చూసిన సినిమానే కాబట్టి. కథలోతుల్లోనికి వెళ్ళను (మా మేనఁగోడలి సహాధ్యాయిని బస్సులో చెప్పినన్ని వివరాలు ఇక్కడ వుండవు).ఎప్పుడో ఎనకటి కాలాన, ఇప్పటి తరానికి మూడుతరాలు వెనుక, అంటే నాలాంటి వాళ్ళ జేజమ్మల తరంలో ఒకానొక మహా సంస్థానంలో ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పేరు అరుంధతి. ఈ పేరు పెట్టడానికి రెండు కారణాలు వున్నాయి. ఒకటి రాజసం వుట్టిపడే ఆడపేరు ఇది. ముని భార్య పేరు. రెండు, అటు ఫ్యామిలీ ప్రేక్షకులకూ, ఇటు మాస్ ప్రేక్షకులకూఁ సైతం సుపరిచయమైన పేరు. పెళ్ళిళ్ళలోనందరికీ అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. అరుంధతి కంటే అహల్య అని పెడితే బాగుండేది, పెళ్ళిళ్ళకంటే అక్రమసంబంధాల గుఱించి ఎక్కువున్న సినిమా కాబట్టి.

కానీ అందరూ ఆ పిల్లని జేజమ్మ అని పిలుస్తూంటారు. దీనికీ రెండు కారణాలు వున్నాయి. మొదటిది, ఈవిడ చచ్చి మళ్ళీ పుడుతుంది, ఆ పిల్లకూ అరుంధతి అని పేరు పెడతారు, కాబట్టి సగటు మాస్ ప్రేక్షకుడు తికమక పడకుండా ఈవిడను పిలవడానికి ఒక పాత కాలపు పేరు ఎంచుకుంటే బాగుంటుంది. అలాంటి పేరులోఁ అమ్మా వుండాలిగా. ఇక ఆ పిల్లకీ ఈ బామ్మ గారికీ సంబంధం కూడా సగటు ఫ్యామిలీ ప్రేక్షకురాలు గ్రహించడానికి తేలికగానుండాలని జెప్పి, పిల్లకు జెజమ్మయిన బామ్మగారికి ‘జేజమ్మ’ అనే పేరునే పెట్టారు. డెట్ సబ్బుకు డెట్ అని పేరుపెట్టినట్టు. జేజమ్మ తఱచూ గ్రామ దేవతలకు గల పేరు కూడా కాబట్టి, ఆవిడ లాగా వుంటుంది అని వంక పెట్టి ఈ రెండవ పేరును బామ్మగారికి పెట్టుకోవచ్చని రచయితలు అభిప్రాయపడ్డారు.  ఇలా సినిమా తీసినవారు పలు రకాలూ ఆలోచించి పేర్లు పెట్టడం జరిగింది.

జేజమ్మ (అరుంధతి అంటే సగటు నవతరంగం పాఠకులు తికమకపడతారని ఇలా పిలవడం జరుగుతుంది) జేజమ్మ అక్క మొగుడు వట్టి కిరాతకుడు.  ఆడవారిని అనుభవించి చంపడం వాడికి సరదా. వీడి గుఱించి మా మేనఁగోడలి  స్నేహితురాలు ముందే చెప్పియుండడం వల్ల, నా మేనఁగోడలు నాతో “మధ్యలో వాడు అమ్మాయిల్ని చెంపేస్తాడు, ఆ కొంత సేపు సినిమా బాగుండదు” అని చిలక్కి చెప్పినట్టు చెప్పిందది. అందుకే మాకు వాణ్ణి చూస్తున్నంత సేపు, మెక్‌డావెల్ మూర్తిని చూస్తున్నట్టనిపించిందంటే నమ్మండి.  వాడిచేతిలో నిత్యం మెక్‌డావెల్ సీస వుండడం దీనికి ఎంతో తోడ్పడింది. వాడి పేరు పశుపతి, ఈ పేరుకు కూడా కొన్ని బలమైన కారణాలు వున్నాయి. వాడు వట్టి పశువువంటి వాడు అని సగటు-వడ్లగింతంత బుఱ్ఱ వున్న సగటు తెలుఁగు ప్రేక్షకురాలికి అర్థమవ్వాలని చెప్పి పేరులో పశువు వచ్చేడట్టు పెట్టాడు రచయిత. మహిషాసురుని తరువాత, దుర్యోధనుని తరువాత, దౌష్ట్యం ఉట్టిపడే ప్రతినాయకుని పేరు ఇదేనని రచయిత సంబరపడ్డాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ ఆవగింజంత బుఱ్ఱవున్న రచయితకు అర్థంకాని విషయం – పశుపతి అద్వైత స్వరూపుడైన మాహాశివువి పేరు! ఆ పేరులో పశువు అంటే సకల జీవరాసులని అన్వయించుకోవాలని ఆ ఆవగింజలో వ్రాసిలేదేమో!

కథలోనికి తిఱిగి వస్తే,

జేజమ్మకి ఒక గురుణి వుంటుంది, ఆమె అంధురాలు అందఁగర్తె క్షత్రియనాట్య ప్రావీణురాలు, ఆవిడ నేర్పే విద్య నేర్చుకున్నవారి చేత పైటకొంగు సైతం వజ్రాయుధం.  కానీ అంతటి ప్రవీణురాలు, మెట్టెల సవ్వడి వినపడకపోయిన, సీసానుండి మద్యం వాసన వస్తున్నా లోనికి వచ్చింది చిట్టి జేజమ్మే అనుకుంటుంది గానీ, పశుపతి అనుకోదు. అలా వచ్చినవాడు  దుర్భాషలాడుతున్నా, ఆవిడ నిస్సహాయురాలవుతుందే గానీ, ఆవిడ చేతిలోనున్న కోకలతో నతనిని చంపుదామనుకోదు. గొప్ప విద్య నేర్చినా వట్టి బాదరాయణరాలు అన్నమట. ఆ గొప్ప విద్య గొప్పదనం మనకు ఎఱుకవడం కోసం తరువాత జేజమ్మ అదే పద్ధతిలో వాడిని చంపేయడం జరుగుతుంది. అప్పుడు మనకు జేజమ్మ అవతారస్త్రీ అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆవిడి ఆమె గురుణి దగ్గర నుండి ఆ విద్య నేర్చుకోక ముందే పశుపతి ఆమెపై అత్యాచారం చేసిచంపేస్తాడు. (ఇక పై అతనిని సోనూ సూద్ అని వ్యవహరిద్దాం, పశుపతి అంటే బాగోలేదు.) సోనూ సూదుని నీచత్వం తట్టుకోలేని అతని భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. అరుంధతికి కోపంవచ్చి, ఊప్స్ జేజమ్మకు కోపం వచ్చి అతనిని నలుగురి చేతా చావబదిస్తుంది. గుఱ్ఱానికి కట్టి ఈడ్చి లాగిస్తుంది. పదమూడేళ్ళ యువరాణికి నేటితరం తెలుఁగు దర్శకులకు మాత్రమే తట్టేంత కౄరమైన చిత్రహింసలు తట్టడం గమనార్హం. కానీ వాడు నేటితరం తెలుఁగు సినిమా ప్రతినాయకుడిలా బ్రతికి బట్టగడతాడు. వాడు కట్టే ‘బట్ట’ చాలా చిన్న బట్ట ఎందుంటే, వాడిని బ్రతికించింది అఘోరీలు కాబట్టి. ఎత్తుకు పోయి వాడికి వారు క్షుద్రవిద్యలు నేర్పుతారు.

{ఇక్కడ మనం తంత్ర విద్యలు గుఱించి కొంత మాట్లాడు కోవాలి. తంత్రం అంటేనే నేడు చాలా మందికి చెడు అభిప్రాయం వుంది. మీదగ్గరకు అంకెలు లెక్కించలేనివాడొకడొచ్చి సాపేక్ష సిద్ధాంతం తప్పు  అంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు గానీ, నాకైతే పిచ్చ కోపం వస్తుంది. మన భారతీయ విద్యలను కించ పరచడానికి, మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికీ, ఇతర మతాల ప్రచారకులూ, చదువుకున్న తెల్లవారు, వారి  మానసాక్రమసంతానమైన మన దేశస్థులూ చాలా కృషి చేసి ఎన్నో విజయాలను సాధించారు.  అలాంటి ప్రయత్నాలకు మన సహాయం అక్కరలేదు. అయినా మన  సినిమా రచయితలు వారికి ఎంతో అద్భుతంగా తోడ్పడ్డారు.  గుఱ్ఱమైనా గాడిదైనా రెండు పశుపతియొక్క పశువులేనని .. యఱ్‌ఱ్ శివుని యెక్క పశువులేనని భావించి – శవాలను సైతం పూజించేవారిని తప్పుడు కోణంలో చూపించడమెందుకు. వారి సిద్ధాంతాలను ప్రజలను భయపెట్టి సొమ్ముచేసుకోవడానికి వాడడమెందుకు? పరిశోధించని వాడు పరిశోధించనివానిలా వుండడం మానేసి.}

వెల్, మొత్తానికలా పరమకౄరునిగా మారిన సోనూ సూదుడు అరుంధతి ఉరఫ్ జేజమ్మ మీద కక్ష్య సాధించడానికి వస్తాడు. కానీ జేజమ్మని చూడగానే వాడికి కామ కోఱిక పుడుతుంది. ఇక్కడ దర్శకత్వాన్ని మెచ్చుకోవాలి.  జేజమ్మ అందాన్ని సౌమ్యంగా కాకుండా పరమ మొఱటుగా ఆవిష్కరించినందుకు. ఏ అస్లీలత చూడాల్సివస్తుందోనని ఫ్యామిలీ ప్రేక్షకులు భయపడుతూ, ఏమి ‘లీలత ‘ చూపిస్తాడోనని మాసు ప్రేక్షకులు చూస్తుంటే, ఈ పరస్పర విరుద్ధ మనోభావాలను ఒకేసారి ఆవిష్కరించగలిగిన కూర్పునేర్పులకు జోహార్లు పలకాల్సిందే. అఘోరీ సన్యాసం పుచ్చుకున్న వాడికి ఒక్కసారిగా ఆపుకోలేని కోరికలు కలుగుతాయంట, అదీను ఆఱేండ్లగా దాహంతోనున్నాడంట – అంటే ఆఱేండ్లగా కోరికలు కలుగుతూనేవున్నాయంట. ఇలా సన్యాసానికి సైతం కొత్త నిర్వచనం ఇచ్చారు కథకులు.

కానీ అలా పశువై వచ్చిన సోనూ సూదుడు తన బట్టులు విప్పుతున్నా ఎం చేయదు జేజమ్మ, తండ్రిని చంపుతున్నా ఏం చేయదు. మనం అంతా అయిపోయిందనుకున్నప్పుడు. అవతార స్త్రీ అయిన జేజమ్మ, తన గురుణి తనకు ‘నేర్పకుండా చనిపోయిన‘ విద్య, తన గురిణి స్వయంగా నేర్చినా  పెరుమాళ్ళకే తెలిసిన కారణం చేత సమయానికి ఉపయోగించని విద్యా వాడి ఆ దుష్టుడను చంపినంత పనీ చేస్తుంది, కోకలతోనే!

చంపేస్తే సినిమా అయిపోతుందని  ఎఱిఁగిన సినీ ప్రేక్షక స్పృహ గలిగిన యొక వేదపండితుడైన బాపనాయన వచ్చి “వద్దమ్మ వీణ్ణి చంపవద్దు, సజీవసమాధి చేయి” అంటాడు. అలానే చేస్తుంది అరుంధతి యఱ్‌ఱ్ జేజమ్మ. పాపం బాపనాయనకు వేదజ్ఞానం అయితే వుంది గాని గురుణిలా వట్టి బాదరాయణుడు, రచయితలు చదువుకున్న వాడికంటే చాకలివాడు నయం అని ఎఱిఁగి అతనికి కామన్ సెన్స్ ఇవ్వలేదు. సమాధిలోపల సోనూసూదుడు మూడుదినముల తరువాత చనిపోవడం మనకు పరమ ఆశ్చర్యం కలిగిస్తుంది. “అఱె అన్నోదకాలు లేక రక్తం కారుతున్న గాయాలు గలవాడు మఱీ మూడురోజుల్లోనే చచ్చిపోవడం ఏంటి ముప్పైఏళ్ళుండక” అని. అతని ప్రేతాత్మ శ్రీ,బుద్ధాది చక్రాల వలన బయటకు రాలేకపోతుంది గాని, అతని శక్తులు మాత్రం బయటకు పనిచేస్తాయి.  అతను బయట చూడగలడు సైతం. అలా శ్రీబుద్ధాది చక్రాల గొప్ప మహిమను మనకు తెలియజేస్తాడు రచయిత. మీ మేధస్సుపై జరిగిన ఈ దాడికి మేము చింతిస్తున్నాము.

అలా వాడి ఆత్మ సమాధి లోనించే గద్వాలులో (గద్వాలు జనులు నన్ను క్షమిస్తారని నమ్ముతున్నాను, నేను విమర్శకునిగా నా బాధ్యత నిర్వహిస్తున్నానంతే, గద్వాలు బదులు రాజమండ్రి అంటే మరీ పాఠకులు తికమకపడతారని లేకుంటే మావూరి పేరే నేను వాడేవాడిని) గద్వాలులో తీవ్ర కరువు, దారుణ మైన కలి, వ్యాధి వ్యాపింపఁజేస్తుంది ప్రేతాత్మ. కానీ గద్వాలు జేజమ్మ ఆశీస్సులవలననుకుంట, వేంటనే కోలుకుంటుంది. వారు మనకు నేటి గద్వాలు చూపిస్తారు, అది నిక్షేపంగానుంటుంది. అంత దారుణంమైన వ్యాధులు వ్యాపిస్తే వూరు రూపుమాసిపోవాలిగానీ, ఇలా ఇంత తొందరగా కోలుకొని తిరిగి పట్టణంగా ఎలా మారిందా అఱవై ఏళ్ళలోనని మనం ముందు ఆశ్చర్యపోయినా తరువాత అది జేజమ్మ గొప్పతనం అని మనం గ్రహిస్తాం.  గ్రహించని వారు ఇప్పుడు గ్రహించగలరు.

ఇక అరుంధతి మీద పగతో వాడి ప్రేతాత్మ అలానే బ్రతికి వుంటుంది. వాడి ప్రేతాత్మ ఉనికి నిరర్ధకం చేయడానికి అరుంధతి (జేజమ్మ) లేకపోతే సరిపోతుంది. జేజమ్మ కూడా ఎక్కడో దూకి చస్తే సరిపోయేది. కానీ సినీస్పృహతోనలా చేయదు. దానికి బదులు మహాయోగుల వేట పేరిటఁ వివిధ గొప్ప దేవాలయాల వాల్ పోస్టర్ల ముందు నించుని మనకు దర్శనమిస్తుంది. (ఇక్కడ గ్రీన్ స్క్రీను వాడి నిర్మాత డబ్బు ఆదా చేసుకొన్నాడు). తంత్ర శక్తులకంటే యోగశక్తి గొప్పదంటారు, ఎలాంటి ‘దుష్టతాంత్రికుడ’నైనా హరినామంతో హరించవచ్చంటారు. కానీ మన మహా యోగిగారు అలా తేలికపాటి పద్ధతులెందుకని చెప్పి. దధీచి వెన్ను నుండి వజ్రాయుధం తయారు చేసిన మాదిరి మనం కూడా ఎముకల నుండి ఒక కత్తి తయారు చేద్దామని ఉచితసలహా పారేస్తాడు. వెల్, ఈ అంశం మీద ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పాఠకులు అనవసరమైన కోడిగుడ్ల మీద అనవసరమైన ఈకలు పీకుతున్నానని పిర్యాదు చేయవచ్చుఁ.

మొత్తానికలా అరుంధతి చచ్చిమళ్ళాపుడుతుంది. ఇప్పటివఱకూ మనం చెప్పుకున్న కథలో రెండే రెండు పాత్రలు వున్నాయని గమనించగలరు. బాదరాయణ పాత్రతో సహా నాలుగు. రెండో జన్మలో కథ చాలా సంక్లిష్టమయిపోతుంది. ఎందరో కొత్త పాత్రలు, అందులోనొక ముసలమ్మ, ఆవిడకు జేజమ్మ కథ మొత్తం తెలుసుఁ, జేజమ్మకు తనకూ మాత్రమే తెలిసిన అతిరహస్యాలు కూడా వున్నాయి, నేననుకోవడం ఈవిడ సోనూ సూదుని భార్య అయిన జేజమ్మ అక్క రెండో జనమో, లేదా గురుణి రెండో జనమో అయివుండాలి. కానీ అలా కూడా కుదరదు, వాళ్ళు చచ్చింతరువాతి కథ కూడా ఈమెకు తెలుసు. మొత్తానికి ఆ ముసలిది అప్పటినుండీ ఇప్పటి వఱకూ బ్రతికే వుంది, సుమారుగా ఒక ౫౦౦ ఏండ్లు. ఇంకా ఒక పకీరు వుంటాడు. ఒక బాయ్‌ప్రెండ్ వుంటాడు. ఒక కుటుంబం వుంటుంది. ఒక పెద్ద తాత వుంటాడు, ఇతను దెయ్యమయిపోతాడు. ఎందుకో ఎవరికీ తేలియదు, నా వుద్దేశం ఇంతటి తలాతోకా లేని కథలో పాత్రగా బ్రతికినందుకుగాను ఆత్మశాంతి లేక అతనలా దేయ్యం అయివుంటాడు. ఇక పరమ విడ్డూరం ఎంటంటే, ఏజెంట్ స్మిత్ కూడా వుంటాడు ఈ సినిమాలో. నిజ్జం!

ఇక రెండో జనమ గుఱించి చెప్పే ఓపిక నాకు లేదు.

వ్రాసేదీ చదివేది ఎలాగూ బాధితులం కాబట్టి, అంత అవసరమూ మనకి లేదు. రవ్వట్టులో వున్నన్ని చిల్లులున్నాయీ సినిమాలో! నేను చెప్పేది మళ్ళీ జన్మలూ, తాంత్రిక శక్తుల గుఱించి కాదు. కథవ్రాసేటప్పుడు పాటించాల్సిన కనీస నియమాల గుఱించి. ఉదాహరణకు కొన్ని చెప్పుకుందాం.

౧) మానవాతీత శక్తుల గుఱించి కథ చెప్పేటప్పుడు చాలా నియమాలకు లోబడి కథ చెప్పాల్సివుంటుంది. ఎవరి శక్తుల నైజం ఎటువంటిది. ఎవరు ఎవరిని చంపగలరు అని ముందే ఏర్పరచుకోవాలి. మహా అఘోరి సాధువయితే, అతని శక్తుల ఎలా ఎప్పుడు ఉపయోగించవచ్చు, అతను తన వైపు వస్తున్న చాండిలియర్ గాలిలో ఆపగలగలేకపోవడమేమిటి అని సందేహాలు మనకు వస్తాయి. పోల్చి చెప్పాలంటే – పతి సేవలో వుండడం వలన భీక్షమేయడం ఆలస్యమయిన ఇల్లాలి మీద భిక్షం గోరి వచ్చిన కౌశిక ముని ఆగ్రహం తో శపిస్తాడు, కానీ శాపం ఆమె మిదఁ పనిచేయదు. ఆమె ధర్మపాలనలో ఆమె వున్నది కాబట్టి. ఇలా మీరు ఎంత మానవాతీతంగా వెళితే అన్ని నియమాలు పెరుగుతాయి, తగ్గవు. నేను హ్యారీ పోటరు చదవలేదు గానీ, దానికి గుఱించి కొత్తపాళీగారు చెబుతూ, ఆ కథలు నిర్దిష్టమైన నియమాలననుసరించి వ్రాయబడినవి అని చెప్పియున్నారు. అలాంటి నియమాల గుఱించే నేను మాట్లాడుతున్నాను – రాబర్ట్ మెక్‌కీ తన స్టోరీ పుస్తకంలో దీనిఁ గుఱించి ప్రత్యేకంగా చెప్పారు.

౨) శాండీరియర్ విషయమై, వెనకటి కాలంలో జనాల వేష భాషలు సరిగా ప్రతిబింబించలేదనే చెప్పాలి. ఈ విషయంలో రెడి సినిమాలో చిట్టినాయని పాత్ర ఎంతో వుచితంగానుంటుంది.

౩) “గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, పలానా రెడ్డి గారు గ్రాఫిక్స్ నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు, అంతర్జాతీయ స్థాయిలో వున్నాయి” అని విని వెళ్ళాను. హ్యారీ పోటరు వంటి సినిమాలతో పోల్చుకుంటే ఇందులో గ్రాఫిక్సు పరమ అధోస్థాయిలోనున్నాయని మనం వేరే చెప్పుకోనక్కరలేదు. ఆ కోట నల్ల బడడం వంటివి అస్సలు నప్పలేదు. ఈ గ్రాఫిక్సులేకుండానే దీని తాతలాంటి పౌరాణికాలు ౫౦లలోనే మనవారు తీసియున్నారు. కాబట్టి బడ్జెట్టు వంకలు కూడా వినిపించవద్దు. టెక్నాలజీ ఒక పరికరం మాత్రమే, సృజనాత్మకతకు బదులు కాదు, కాలేదు.

౪) మిగిలిన సాంకేతిక పరికరాలు – ఆధునిక కూర్పు పద్ధతులు, నాన్ లీనియర్ నేరెటివ్, సరౌండ్ సౌండు వంటివి వాడడం, కోతి చేతన కొబ్బిరి చిప్ప చందంలోనుంది. ఇక కోతేనయమేమో, ఆడపడచు నెత్తిమీద వేసి కొట్టదు కొబ్బరి టెంకను. సినిమా మొత్తం ఎక్కడా నిశ్శబ్దంగా లేదు. మీ దృశ్యశ్రవణేంద్రియాల మీద ఎవరో యుద్ధం ప్రకటించినట్లుగా నుంటుంది ఎంతసేపూను. హారర్ సినిమాల్లో శబ్దం ఎంత అవసరమో నిశ్శబ్దం కూడా అంతే అవసరం. అప్పుడే వాటి మధ్యనున్న అంతరంలోనుండి ప్రేక్షకులకు ఉలిక్కిపాటు పుడుతుంది. ఈ సినిమాలో అలా ఒక్కసారే జరిగింది, అదీ దర్శకుల ప్రమేయంలేకుండానే.

౫) అన్నిటికంటే ముఖ్యమైనది, “రేంటింగు చూడని మేనమాఁవ బాధిత చిన్నారుల” సంఘం తరుఫున. దయచేసి దయచేసి ఇలాంటి సినిమాలను పిల్లలకు చూపించడం మానండి. అలాంటి సినిమాలు వారు చూసారనగానే వారిని కథ చెప్పమనడం మానేసి వారిని అలాంటి సినిమాలు చూడకుండా నిరుత్సాహపఱచండి. మన సెన్సారు వాడు కూడా వారు తింటున్న జీతానికి అనుగుణంగా పని చేసి, యాభై ఏళ్ళనాటి పద్ధతులను సవరించాల్సివుంది. ఏదో నామమాత్రానికి U, A అని రెండు వర్గాలు కాకుండా ఇంకా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అలా ఇచ్చిన రేటింగులను థియేటర్ యాజమాన్యం పాటించేడట్టు చూడాల్సిన అవసరం కూడా ఎంతైనా వుంది.

ఇక సినిమా క్లైమాక్సుకు వచ్చేసరికి నేను సెల్లు తీసి అందులో పామాట ఆడడం మొదలుపెట్టాను, కొంత సేపటికి యింద్రియాలపై దాడి తీవ్రాస్థాయికి చేరుకున్నాక, చెవులూ కళ్ళూ మూసుకుని కూర్చోవలసివచ్చింది. మస్కా, బిల్లా, శశిరేఖ పరిణయం, వంటి చెత్తసినిమాలు సైతం నచ్చుతున్న నేటి పిల్లలే ప్రపంచ సినిమా పరిచయం వున్న నాలాంటి దురదృష్టవంతునికంటే ఈ సినిమాలని ధైర్యంగా చూసి ‘ఆస్వాదిస్తున్నారని’ చెప్పాలి.  అది నేటి తరం! అంతెందుకు లెండి నవతరంగంలోనే దీనికి మంచి సమీక్షనిచ్చారు (1, 2).

చివరిగా రెండుమాటలు,

౧) నాలాంటి వారెవరైనా – ఈలాంటి సినిమాలకు స్ఫూపు తీసి సినీపీడితసమాజానికి విరుగుడువేయ దలచితే, వారికి నా యావదాస్తి (వేలం వేస్తే ఒక లక్షరుపాయలు రావచ్చు) దారపోసి, ఆ సినిమాకొఱకై ఉచితంగా పనిచేస్తానని మాటిస్తున్నాను.

౨) పరమేశ్వర పూజ – నాయనా చంద్ర శేఖర కమ్ములా, ఆనందపశుపతి, గోదావరీతట త్రయంబకేశ్వర, హ్యాపీదినకరా, తియ్యవయ్యా ఇంకో సినిమా సెన్సిబిలిటీసహితంగా. కావాలంటే నీకు కూడా నా యావదాస్తీ దారవోసి, ఆ సినిమాకొఱకై ఉచితంగా పనిచేస్తాను.

—————————-

త.క – ఇప్పుడే భూమిక లో డా. స్వరూప గారి వ్యాసం చదివాను. ఆవిడ సంఘంపై ఈ సినిమా యొక్క దుష్ప్రభావాన్ని ఎత్తి చూపారు. తప్పక చదవి వారి పోరాటానికి తమ మద్దతు ప్రకటించగలరు. ఈ రోజుల్లో సంఘానికి మంచి చేసే సినిమాలేమున్నాయిలే అని నేను ఆ విషయం ప్రస్తావించలేదు. మొత్తం వ్యాసం చదివి అరుంధతి కథని మళ్ళీ వినే ధైర్యం లేకపోతే, చివరి పారా ఒక్కటి తప్పక చదవగలరు.

73 Comments
 1. Sowmya April 24, 2009 / Reply
 2. learner April 24, 2009 / Reply
 3. Marthanda April 24, 2009 / Reply
   • కొత్తపాళీ October 12, 2009 /
 4. Nishigandha April 24, 2009 / Reply
 5. nagamurali April 24, 2009 / Reply
 6. anand April 24, 2009 / Reply
 7. రాఘవ April 24, 2009 / Reply
 8. Chetana April 24, 2009 / Reply
 9. jyothi April 24, 2009 / Reply
 10. sunita April 24, 2009 / Reply
 11. ప్రసాదం April 24, 2009 / Reply
 12. Jagan April 25, 2009 / Reply
 13. Marthanda April 25, 2009 / Reply
 14. Ravi April 25, 2009 / Reply
 15. krishnarao jallipalli April 25, 2009 / Reply
 16. Neelaveni April 26, 2009 / Reply
 17. Venkat Uppaluri April 26, 2009 / Reply
 18. Venkat Uppaluri April 26, 2009 / Reply
 19. Venkat Uppaluri April 26, 2009 / Reply
 20. Marthanda April 26, 2009 / Reply
 21. akasaramanna April 26, 2009 / Reply
 22. Marthanda April 26, 2009 / Reply
 23. sivaji April 26, 2009 / Reply
 24. రాజశేఖర్ April 26, 2009 / Reply
 25. Pavan April 27, 2009 / Reply
 26. Marthanda April 27, 2009 / Reply
 27. naalo neu April 27, 2009 / Reply
 28. Marthanda April 27, 2009 / Reply
 29. Chetana April 27, 2009 / Reply
 30. SrInivAs April 27, 2009 / Reply
 31. Marthanda April 27, 2009 / Reply
 32. krishnarao jallipalli April 27, 2009 / Reply
 33. ravi kumar May 1, 2009 / Reply
 34. రాజశేఖర్ May 2, 2009 / Reply
 35. వెంకట్ ఉప్పలూరి May 2, 2009 / Reply
 36. రాజశేఖర్ May 2, 2009 / Reply
 37. రామ May 5, 2009 / Reply
 38. chaitanya May 7, 2009 / Reply
 39. Dhanaraj Manmadha May 7, 2009 / Reply
 40. Mauli May 15, 2009 / Reply
 41. GOWTHAMI May 16, 2009 / Reply
 42. విప్లవ్ June 1, 2009 / Reply
 43. ksv June 7, 2009 / Reply
 44. Chaithanya June 10, 2009 / Reply
 45. panipuri123 June 13, 2009 / Reply
 46. harish July 5, 2009 / Reply
 47. Mohanavamshi July 6, 2009 / Reply
 48. ravi July 13, 2009 / Reply
 49. Kishore February 25, 2011 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *