ఆనంద తాండవం

ananda-tandavam“సినిమాని డిఫరెంట్ గా తీయాలని ప్రయత్నించారు..” నా స్నేహితుడి మాటలు గుర్తు చేసుకుంటూ థియేటర్ లోకి అడుగు పెట్టాను. ప్రేమలో విఫలమైన ఓ కుర్రాడు ఆత్మహత్య చేసుకోవడం కోసం జలపాతం లోకి దూకడంతో సినిమా మొదలయ్యింది. కుర్రాడు దూకుతూ ఉండగానే కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇంజనీరింగ్ చదివిన రఘుపతి (కథానాయకుడు, కొత్తనటుడు రిషబ్) ఓ ఇంటర్వ్యూ కి వెళ్లి ఉద్యోగం రాకపోవడం తో నిరాశగా తన తండ్రి దగ్గరకి మదనపల్లి వస్తాడు. తండ్రి (కిట్టి) ఓ ప్రాజెక్ట్ లో ఇంజినీరు గా పనిచేస్తూ ఉంటాడు. పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకున్న రఘుపతిని తల్లి, తండ్రి తానే అయి పెంచుతాడు అతను.

ఇంటికి వెళ్తుండగానే కథానాయిక మధుమిత (తమన్నా) పరిచయమవుతుంది. ఆమెకి వయసు పెరిగినా ఇంకా పసితనం పోదు. బాగా అల్లరి చేస్తూ ఉంటుంది. కొద్ది కాలానికే రఘుపతి, మధుమిత ప్రేమలో పడతారు. చీఫ్ ఇంజినీర్ అయిన మధుమిత తండ్రి వాళ్ళ పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం పెట్టకపోగా, రఘుపతి కి పూణే లో ఓ ఉద్యోగం ఇప్పిస్తాడు. పెళ్ళికోసం మదనపల్లెకి వచ్చిన రఘుపతికి, మధుమిత పెళ్లిని అమెరికాలో ఉంటున్న రాధాకృష్ణ (మరో కొత్త నటుడు రిషి) తో ఏర్పాటు చేసి షాక్ ఇస్తారు ఆమె తలిదండ్రులు.

తల్లిదండ్రుల మాటకి ఎదురు చెప్పలేనంటుంది మధుమిత. అదే సమయంలో రఘుపతి తన తండ్రిని అపార్ధం చేసుకుని, జీవితం మీద విరక్తితో జలపాతంలో దూకుతాడు. ఫ్లాష్ బ్యాక్ ముగియగానే విశ్రాంతి. రక్షింపబడ్డ రఘుపతిని పై చదువుల కోసం న్యూయార్క్ పంపుతాడు అతని తండ్రి. అక్కడ తెలుగమ్మాయి రత్న (రుక్మిణి) పరిచయమవుతుంది. రత్న రఘుపతితో ప్రేమలో పడుతుంది, ఇంతలో రఘుపతికి మధుమిత కనిపిస్తుంది. రఘుపతి రత్నతో పెళ్ళికి సిద్ధ పడేసరికి, మధుమిత భర్త మంచివాడు కాదని తెలుస్తుంది. సరిగ్గా రత్నతో నిశ్చితార్ధం జరిగే సమయానికి తనని పెళ్ళిచేసుకోమని కోరుతుంది మధుమిత. తర్వాత ఏం జరిగిందన్నది ముగింపు.

ఆస్కార్ రవిచంద్రన్ కేవలం డబ్బింగ్ సినిమాగా కాక ఉభయభాషా చిత్రంగా తీయాలని ప్రయత్నించినప్పటికీ తమిళ వాసనలు బాగానే తగిలాయి. తమిళ రచయిత సుజాత (ఎస్. రంగరాజన్) నవల ఆధారంగా తీసిన ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అతిపెద్ద బలహీనత. సినిమా ప్రారంభం ఏంటో ఆసక్తి కరంగా ఉన్నప్పటికీ విశ్రాంతికి వచ్చేసరికి ఆ ఆసక్తి రాను రాను సన్నగిల్లుతూ వస్తుంది. ప్రధమార్ధంలో అనవసరపు సన్నివేశాలతో స్క్రీన్ టైం వృధా చేశారు.

ఇక రెండో సగంలో అమెరికన్ యునివర్సిటీ లో తుపాకులు, అక్కడి వివాహ వ్యవస్థ, గ్రీన్ కార్డ్ కోసం భారతీయులు పడే పాట్లు ఇలా రకరకాల అంశాలను స్ప్రుశించడంతో స్క్రీన్ టైం సరిపోలేదు. అసలు కథ వేగంగా ముగించేయాల్సి వచ్చింది. ఐతే ప్రధమార్ధం కన్నా, ద్వితీయార్ధం బాగుంది. సినిమాని స్క్రీన్ ప్లే ఎలా పాడు చేయగలదు అన్నదానికి ఈ సినిమా ఓ ఉదాహరణగా మిగులుతుంది.

నటీనటుల నటన విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది తమన్నా గురించి. మధుమిత పాత్రను తీర్చి దిద్దడంలో స్పష్టత లేకపోవడం కొంత అయోమయం అనిపిస్తుంది. అమాయకంగా కనిపించే సన్నివేశాల్లో ‘వసంత కోకిల’ లో శ్రీదేవిని గుర్తు చేసింది. అలాగని మధుమిత మానసిక ఎదుగుదల లేని అమ్మాయి కాదు. మధుమిత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియకపోవడం ఓ పెద్ద కన్ఫ్యూజన్. తమన్నాకూడా తనవంతు కన్ఫ్యూజ్ చేసింది ప్రేక్షకులని.

కొత్త కుర్రాడు రిషబ్ పర్వాలేదు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక రాధాకృష్ణ పాత్ర పోషించిన రిషి తమిళ్ హీరో అజిత్ ని అనుకరించాడు. ఇటు మోడరన్ అమ్మాయిగా అటు క్లాసికల్ డ్యాన్సర్ గా రత్న పాత్రలో రుక్మిణి మెప్పించింది. సహాయ పాత్రల్లో చెప్పుదగినది కిట్టి గురించి. రఘుపతి తండ్రి పాత్రలో గుర్తుండిపోయే నటనను ప్రదర్శించాడు. హాస్యం అంతా తమిళ వాసనతో ఉంది.

జి.వి. ప్రకాష్ సంగీతంలో పాటలేవీ గుర్తుపెట్టుకునేలా లేవు. చాలా సార్లు రెహ్మాన్ గుర్తొచ్చాడు. ముఖ్యంగా జీన్స్, గురు సినిమాల్లో ట్యూన్స్ చాలా చోట్ల నేపధ్య సంగీతంగా వినిపించాయి. సాంకేతికంగా కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి సగంలో పచ్చని ప్రకృతి, జలపాతాలు, రెండో సగంలో న్యూయార్క్ అందాలు కనువిందు చేస్తాయి. జీవా శంకర్ ఎక్కడా నిరాశ పరచలేదు. శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ లో కొన్ని చోట్ల లిప్ సింక్రనైజేషన్ కుదరలేదు. స్క్రీన్ ప్లే, సంగీతం, ముగింపు విషయాల్లో దర్శకుడు ఏ.ఆర్. గాంధీ కృష్ణ శ్రద్ధ తీసుకుని ఉంటే ‘ఆనంద తాండవం’ ఓ డిఫరెంట్ సినిమా అయి ఉండేది. సినిమా నుంచి తిరిగి వస్తూ నా స్నేహితుడి కామెంట్ గుర్తు చేసుకున్నాను.

-మురళి

Filed Under: featuredleadతెలుగుభారతీయ సినిమాసమీక్ష

Tags:

Comments (3)

Trackback URL | Comments RSS Feed

  1. You expressed exactly my opinions. I wanted to write a review, but couldn’t write the other way.
    “సినిమాని డిఫరెంట్ గా తీయాలని ప్రయత్నించారు..”
    That’s all. I felt the same.

  2. avatar vishali says:

    very good job.

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.

Powered By Indic IME