Menu

వాల్ట్జ్ విత్ బషీర్

హెచ్చరిక 1: ఈ సినిమాలో విపరీతంగా కలవరపెట్టే దృశ్యాలూ, అంతకన్నా కలవరపెట్టే ఆలోచనలూ ఉంటాయి.
హెచ్చరిక 2: సినిమాలో చివరికి ఏం జరుగుతుందో అనేది మీకు సస్పెన్సు ఐతే, మీరు సినిమా చూడాలని అనుకుంటున్నట్టైతే, ఈ సమీక్ష చదవకండి.

యుద్ధం ఎప్పుడైనా కలవర పరిచే ఘట్టమే. కానీ ఒక సారి ముగిశాక, ఆ ఘటనని వెనుదిరిగి చూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకానికి రకరకాల మనోభావాలతో రంగులద్దుకుంటారు మనుషులు. ఏదీ నిజం కాదు, ఏదీ సంపూర్ణం కాదు. కళ్ళ ముందు జరిగిన ఘాతుకాలు, తనకే అనుభవమైన ఘాతుకాలు .. మెదడు జ్ఞాపకాల వత్తిణ్ణి తట్టుకోలేక వాటి మీద పల్చటి వలిపెపు ముసుగు కప్పుతుంది. ఒక్కోసారి ఆ మసకదనం చాలక, గాఢాంధకారం కమంమేస్తుంది. జ్ఞాపకపు కళ్ళకి గంతలు కట్టేస్తుంది. మనిషి మెదడు బహు విచిత్రమైనది.

యుద్ధంలోని అమానుషత్వాన్ని ఆధునిక ప్రపంచ సాహిత్యం చాలా సార్లు చర్చకి పెట్టింది. Catch 22 వంటి గొప్ప నవలలు, ఇంకా కొన్ని వేల పాటలూ, పద్యాలూ వెలువడినాయి యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, యుద్ధంలో జరిగే దారుణాల్ని పైకెత్తి చూపుతూ. యుద్ధాల నేపథ్యంతో సినిమాలు కూడా చాలానే వచ్చినా, అందులో కొన్ని యుద్ధ వ్యతిరేక సందేశంతో ఉన్నా, యుద్ధం నిజంగా ఎంత ఘోరమో, ఎంత అమానుషమో, యుద్ధం పేరిట ఎలాంటి ఘాతుకాలు జరుగుతాయో చూపించడానికి సాహిసించిన సినిమాలు చాలా తక్కువే. అలాంటి గొప్ప సాహసం చేసిన సినిమా వాల్ట్జ్ విత్ బషీర్.

ఒక రాత్రి దర్శకుడు ఆరి ఫోల్మన్ని అతని స్నేహితుడొకతను ఒక బార్లో కలిసి, తనకొచ్చే ఒక పీడకల గురించి చెప్తాడు. అతన్ని 26 కుక్కలు అతి క్రూరంగా తరుముతుంటాయి. ప్రతీ రాత్రీ అదే కల, ప్రతీ సారీ సరిగ్గా అన్నే కుక్కలు, అవే కుక్కలు. ఎందుకూ అని తవ్వుకుంటూ వెళితే ఎప్పుడో ఇరవయ్యేళ్ళ క్రితం 1982 లో మొదటి లెబనన్ యుద్ధంలో ఆ స్నేహితుడి అనుభవాలకీ ఈ పీడకలకీ సంబంధం ఉన్నదని తెలుస్తుంది. అదే యుద్ధంలో పాల్గొన్న ఆరికి మాత్రం తన అనుభవాలు ఏవీ గుర్తు లేవు. ఆ సమయాన్ని, ఆ యుద్ధాన్ని గుర్తు చేసుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా అతనికి తనూ ఇంకో ఇద్దరు తోటి సైనికులూ సముద్రం నీళ్ళలోనించి వొడ్డుకి నడుస్తున్న దృశ్యం ఒకటి మాత్రం కళ్ళ ముందు మెదుల్తూంటుంది. ఈ జ్ఞాపకపు వీచిక ఒకసారి మెదిలినాక, అతనికి అసహనం మొదలవుతుంది. తన మెదడు ప్రయత్న పూర్వకంగా మరుగు పరిచిన ఆ సమయాన్ని గురించి తాను తెలుసుకోవాలి. ఏం జరిగిందో తెలుసుకోవాలి. తనని తాను తెలుసుకోవాలి. ఈ సత్యాన్వేషణలో కలలకన్నా, పీడకలలకన్నా వింతైన, విచిత్రమైన, విభ్రాంతికరమైన సత్యాలు వెలుగులోకి వస్తాయి. స్థూలంగా ఇదీ కథ.

జాన్ర వర్గీకరణల దృష్ట్యా ఈ సినిమాని ఒక మూసలో వేసి తూచడం చాలా కష్టం. ఇదులో కల్పితమైన కథేమీ లేదు. ఆ దృష్టిలో చూస్తే ఇదొక డాక్యుమెంటరీ. అసలు ఆ రెణ్ణెల్ల కాలంలో ఏమి జరిగిందీ అని తనతో పాటు అదే దళంలో పని చేసిన అనేకుల్ని, పాత మిత్రుల్ని వెదికి పట్టుకుని వాళ్ళ జ్ఞాపకాలన్నిటినీ పోగు చేస్తాడు ఆరి. వారిలో ఒకతను ప్రఖ్యాతి చెందిన టీవీ రిపోర్టరు. ఇంకొకతను నెదర్లాండ్స్ లో ఫలాఫల్ హోటలు నడిపే గంజాయి లోలుడు. మరొకతను యుద్ధమంటే ధైర్య సాహసాలని భావించే కరాటే నిపుణుడు. ఇంకొకడు యుద్ధమంటే ఏది ఎందుకు జరుగుతోందో అర్ధం పర్ధం లేని పైత్యకారి తనమని భావించే లాయరు. అందరూ తమతమ అనుభవాల్ని తమ తమ గొంతుల్లో చెబుతారు. ఎవర్ని నమ్మాలి, ఎవర్ని నమ్మకూడదు?

ఏ వివాదానికైనా రెండు పక్షాలుంటాయి. కొన్ని కొన్నిటికైతే అనేక కోణాలుంటాయి. మనం, మన అమాయకత్వంలో సత్యం అంటే నిష్పక్షపాతమైన దృక్కోణం నించే వస్తుందని అనుకుంటాం. ఎవరన్నా ఏదన్నా వివాదాస్పదమైన విషయం గురించి మాట్లాడ్డానికి ప్రయత్నిస్తుంటే, నిష్పక్షపాతంగా మాట్లడరేం అని దబాయిస్తాం. కానీ మన దృష్టి ఎప్పుడూ పాక్షికమే. ఎవరి దృష్టి అయినా పాక్షికమే. అది గుర్తించుకున్నప్పుడే మనకి సత్యం కొంచెమైనా గోచరించే అవకాశం ఉంది. ఇలా రకరకాల వ్యక్తుల పాక్షిక కథనాలతో, పాక్షిక దృక్కోణాలతో యుద్ధం యొక్క నిజస్వరూపాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు ఆరి. అది చూసి మనం తట్టుకోగలమా అన్నదే ప్రశ్న.

గొప్ప కళ పరమార్ధం మనకి స్పష్టంగా గోచరం కాని సత్యాన్ని ఆవిష్కరించడమే అనుకుంటే .. ఇది చాలా గొప్ప సినిమా. కానీ చాలా ఇబ్బంది పెట్టే సినిమా.

ఈ సినిమాని ఏనిమేషన్ గా ఎందుకు తీశాడు? దాన్ని గురించి ముచ్చటించుకోవాలంటే ఇంకో వ్యాసం అవసరమౌతుంది.

నవతరంగంలో ఈ సినిమా గురించి వచ్చిన వ్యాసాల లంకెలు

10 Comments
  1. ceenu March 8, 2009 /
  2. శంకర్ March 9, 2009 /
  3. కొత్తపాళీ March 9, 2009 /
  4. రాహుల్ March 10, 2009 /
      • రాహుల్ March 20, 2009 /
    • కొత్తపాళీ March 10, 2009 /
  5. రాహుల్ March 20, 2009 /