Menu

ఈ పంథా మార్చకపోతే ప్రేక్షకులు సమ్మె చేస్తారు! జాగ్రత్త

రచయిత: కన్నా చలపతిరావు
ప్రచురణ: రూపవాణి

“ఏన్నాళ్ళో యీ బందిఖానా” అని కారాగార విముక్తులైన మన నాయకులతోపాటు మనముకూడా స్వతంత్ర మందమారుతములను మేయు సమయములలో కూడా మన తెలుగు డైరక్టర్లలో మార్పేమీ కనుపించదు. “నీవే దిక్కు ఆపద్భాంధవా” అన్నట్లు సి.య.ఆర్, అద్దంకి, బందా, ఆరణి, కన్నాంబ, పుష్పవల్లి కోటిరత్నం. బ్రతికియుంటే పాపం రామతిలకం తప్ప మెరవరూ మోక్షమివ్వరుకాబోలు మనదర్శకులకు. యమా యమీలనుకొన్న పాదుక తారాగణమే వీళ్ళ పసచాటింది.

నేడు హిందీ ఫిల్ములు అభివృద్ధి చెందుతున్నాయంటే ఆ దర్శకులేమి Born geniousలు కాదు London Returnedలు కాదు. నవ నటీనటులతో ‘ కళ ‘ పొషణార్థము ఫిలిం తీసేది వారు, పాతరాతి యుగపువారితో ‘ కడుపు ‘ పోషణార్థం ఫిలిం తీసేది మనవారు. అంతేనండీ తేడా. తెలుగుఫిలిం పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే నవీన యాక్టర్లను, స్టార్లను యేకాలేజీలలోనో, యేనాట్యమండలోవారినో బుక్‌చేయాలి. విదేశాలలో దర్శకులు షూటింగులతో నిమగ్నులైయుంటే వేరే ఒక గ్రూప్ వూరూరు తిరిగి Emden యాక్టర్లను బుక్‌చేస్తారు. మన డైరక్టర్లలో టూరింగ్ అనేది వుందండీ? కాకపోతే తమ ప్యాలస్‌లో వుండే యాక్టర్లకు ఫోన్ చేయడం. బుక్ చేయడం, అడ్వాన్సు, యే బ్యాంకులో చెక్కు వ్రాయడం పాత యాక్టర్లు అయినా చవకగా దొరుకుతారు అనుకోవడానికి వేల సంఖ్యేగాని, వందల సంఖ్య వాళ్ళ డిక్షనరీలో చూద్దామన్నా కనపడదు.

జై హింద్ ప్రొడక్షన్‌వారు ‘Quit India’ లో ప్రధాన పాత్రకు మన Snuff Brother తప్ప మరొకళ్ళు దొరకలేదు కాబోలు పాపం! మన ఫిలింపరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఒక Tour బయలుదేరి F.A.లు B.A.లు తప్పివూరకున్న విద్యార్థులు, విద్యార్థినులను బుక్‌చేస్తే వారేమి పెర్సనాలిటిలో, సంగీతములో, నటనా, వాక్ చాతుర్యములలో ప్రస్తుతము సినిమా రంగములోయున్నవారికన్న కించిత్ మాత్రం తగ్గరుగదా? అన్ని విధాలా మెరుగేయని చెప్పవచ్చు.

అలారంలాగే మ్రోగే గడియారానికి – కామాలు, ఫులుస్టాపులు లేని సూరిబాబుకు తేడా ఉందంటారా? ఏమనుకున్నాడేమో గగ్గయ్యమామ పులిమీసముతో సినిమా రంగంలోనుండి విరమించుకున్నాడే. అద్భుతమైన పెర్సనాలిటీతో యేవిద్యావంతుడైన యువకుడు Various Poses తో దర్శకులకు ఫిలింలో చేర్చుకోమని రిజిష్టరు కవర్లు పంపినా బుట్టదాఖలేగాని Reply యిచ్చిన పాపాన పోరుగదా యీ A,B,C,Dలు తెలియని దర్శక మహనీయులు. ఆంధ్ర ఫిలిం ఫీల్డుకు సి.యస్.ఆర్ అధ్యక్షులట. పాపం! ఆంధ్రలోకం గొడ్డుపోయింది కాబోలు. ఒక్కయాక్టరు నచ్చుతాడండీ వీరికి? అధవా ఒకవేళ ఎవడైనా ఏమండీ ! నేను సినిమాలో జేరతానండీ అని ఓ పద్యమో, పాటోపాడితే అరె! Mike సూటుకాదోయి నీ టోను. చాలా మంచి స్వరమే పాపం! ఏం చేద్దాం? అని స్వస్తిచెప్పడం.

రైల్వే కార్మికులు సమ్మె నోటీసు యిచ్చారంటే తప్పేమిటి? కార్మికులు సమ్మెచేస్తున్నారంటే నేరమేమిటి? అడిగిన కోర్కెలను నెరవేర్చకపోవుటే.

ఇకనుండైనా దర్శకులు పాత యాక్టర్లను Retire కాండి భాయ్ అని స్వస్తిచెప్పి కొత్తయాక్టర్లను బుక్ చేయకపోతే ఆంధ్ర సినిమా ప్రేక్షకులు సమ్మెజేసి క్రొత్తగా రిలీజు అయిన ఫిల్ములను యే పేపరు ఎడిటర్లో మాగజైన్ ఎడిటర్లో తప్ప మరోముఖము సినిమా హాలులో కనపడకుండావుండే క్లిష్టపరిస్థితులు తేబోతున్నారు. జైహింద్.

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో భాగంగా చందూగారిద్వారా నవతరంగప్రవేశం చేస్తున్న ఈ వ్యాసాలను వారానికొక్కటి చొప్పున ప్రచురిస్తున్నాం. చదివి ఆనందించండి. ’

ఈ వ్యాస పరంపరలో వచ్చిన మిగతా వ్యాసాల కోసం ఇక్కడ చూడండి.

One Response