లక్నో పేరు వినగానే గత కాలపు సంస్కృతి, సంగీతపు ఘుమఘుమలు, నృత్యాలూ, కవితావేశాలూ స్ఫురిస్తాయి. నవాబులూ, “పహలే ఆప్ పహలే ఆప్” అంటూ ముందుకు సాగే వారి గుర్రపు బగ్గీలూ, వారి మర్యాదలూ అన్ని గుర్తుకొస్తాయి. అంతే కాదు లక్నో అనగానే అక్కడ సాగే గజల్లూ, అభిమానుల వహ్వాలు గుర్తొస్తాయి. ఇంతగా గత కాలపు సంస్కృతి చిహ్నంగా కనిపించే లక్నోను నేపధ్యంగా తీసుకొని ముజఫర్ అలీ నిర్మించిన సంగీత నృత్య రసాత్మకమయిన చిత్రం “ఉమ్రావ్ జాన్”. ఒక మామూలు బాలిక స్థితి నుండి భావుకత నిండిన విజ్ఞురాలైన పరిపూర్ణ మహిళగా ఉమ్రావ్ జాన్ ఎదిగిన వైనాన్ని ఈ చిత్రం మన కళ్ల ముందుంచుతుంది.
సౌందర్యమూ, సున్నితత్వమూ నిండా కలబోసిన ఉమ్రావ్ జాన్ మానసిక స్థితిని ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని ఈ చిత్రంలో అత్యంత కళాత్మకంగా చిత్రీకరిస్తాడు దర్శకుడు. ఆమె జీవిత చరిత్రని స్త్రీ కోణం నుంచి ఆవిష్కరిస్తూ ఆనాటి సామాజిక పరిస్థితిని, మానవ సంబంధాల్ని , స్త్రీని విలాసవస్తువుగా పరిగణించిన వైనాన్ని చిత్రం అంతర్లీనంగా చెప్పుకుంటూ పోతుంది. చిత్రంలో సంగీత నృత్యాంశానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత గజదొంగ ఫైజ్ అలీ ఆమె జీవితంలోకి వస్తాడు. వీటన్నింటి మధ్యా ఆమె తన బంధనాలన్నింటినీ చేదించుకుని లక్నో నుంచి పారిపోవడానికి యత్నిస్తుంది. భిన్నమయిన మనుషులు, విభిన్నమైన మనస్తత్వాలు, చిత్రమయిన అనుభవాలూ అన్నీ కలగలిపి ఆమెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. చిత్రం మొత్తం ఆమెపైనే కేంద్రీకరించబడి ముందుకు సాగుతుంది. ఉమ్రావ్ జాన్ సంగీతం, కవిత్వం తోడుగా పరిపూర్ణమైన మనిషిగా ఎదుగుతుంది. ఉమ్రావ్‌గా రేఖ ప్రతిభావంతంగా నటించింది. చిత్రంలో ఆనాటి సామాజిక స్థితిగతులు, వేశ్యా సంస్కృతి అత్యంత కళాత్మకంగా చిత్రించబడ్డాయి. ఈ చిత్రం జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవడంతోపాటు 1982లో పెనోరమా ఎంట్రీగానూ, మనీలా, తాష్కెంట్ చిత్రోత్సవాల్లోనూ పాల్గొంది. ఇందులో నటించిన రేఖకు జాతీయ ఉత్తమ నటి అవార్డు రాగా ఇంకా ఈ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు, ఉత్తమ కళాదర్శకుడి అవార్డు లభించాయి.
వేశ్యా జీవితాల గురించి చలన చిత్ర రంగంలో మొదట్నించీ మొగల్ ఎ అజాం నుండి మొదలు ప్యాసాలాంటి చిత్రాల దాకా వేశ్యలను ఉదాత్తంగా చిత్రించడం మనకు తెలుసు. మరోవైపు “మండి”, గిద్ లాంటి చిత్రాలు వేశ్యల సాంఘిక స్థితి గతుల్ని విశ్లేషిస్తూ నిర్మితమయ్యాయి. కాని ఉమ్రావ్ జాన్ లాంటి సినిమాలో వేశ్యావాటికలో ఎదిగిన ఉమ్రావ్ పైకి కనిపించినప్పటికీ మౌళిక స్థాయిలో స్త్రీ కోణం నించి జీవితాల్ని విశ్లేషించడమే ఈ చిత్రం ఇతివృత్తం. స్త్రీ జీవితాన్ని బాధ్యతాయుతంగా చలన చిత్రాలుగా రూపొందించడం ముజఫర్ అలీకి చాల ఇష్టమైన విషయం. ఆయన నిర్మించిన మొదటి చిత్రం “గమన్” 1978 లో నిర్మితమయిన ఈ చిత్రంలో గ్రామీణ ప్రాంతాల నించి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చిన ప్రజల జీవితాల్ని ముఖ్యాంశాలుగా చేసుకున్నారు. అందులో స్మితా పాటిల్ నటన మరువలేనిది. ఆ తర్వాత ముజఫర్ అలీ నిర్మించిన రెండవ చిత్రం “ఉమ్రావ్ జాన్”. ఈ చిత్రంలో 19 వ శతాబ్దంలో లక్నో వాతావరణం, సంగీతం, కవిత్వం, సంస్కృతీ అన్నీ కలబోసుకున్నాయి. లక్నోలోని వేశ్యావాటికలో పెరిగిన ఉమ్రావ్ జాన్ జీవిత చరిత్రే ఈ చిత్రం.
చిన్నతనంలోనే ఉమ్రావ్‌ని ఫైజాబాద్ నుంచి ఎత్తుకొచ్చి లక్నోలోని ఓ వేశ్యావాటికకు అమ్మేస్తారు. అప్పటినుంచి అక్కడే పెరుగుతూ చదువు, సంగీతం, నాట్యం నేర్చుకుంటుంది. ఎదిగిన ఉమ్రావ్ తన కవిత్వం, సంగీతాలతో మొత్తం లక్నో ప్రాంతవాసుల్ని ఓలలాడిస్తుంది. ఆ క్రమంలో ఆమె జీవితంలోకి నవాజ్ సుల్తాన్, , గౌహర్ మిర్జా, ఫైజ్ అలీలు ప్రవేశిస్తారు. మొదట ఆమె నవాజ్ సుల్తాన్‌తో ప్రేమలో పడుతుంది. కాని తన చిన్ననాటి సహచరుడు గౌహర్ మీర్జా సహచర్యంలో సాంత్వనని, రక్షణని ఫీలవుతుంది. ముఖ్యాభినేత పాత్రను ఉదాత్తమైన పాత్రగానూ, “దయ” అవసరమయిన పాత్రగానూ కాకుండా కళాత్మకమయిన అభినివేశంతో ఎదిగిన స్త్రీ పాత్రగా ఆద్యంతం రూపొందించాడు దర్శకుడు. ఆమె చుట్టూరా అల్లుకొని ఉన్న సామాజిక స్థితిగతుల్ని వివరిస్తూనే ఆమె వ్యక్తిత్వ వికాసాన్ని అద్భుతంగా అవిష్కరిస్తాడు. కళాత్మక వ్యక్తిత్వంగా స్త్రీ ఎదుగుదలని ఆవిష్కరించడంలో “ఉమ్రావ్ జాన్” గొప్ప విజయాన్ని సాధించింది. కళాత్మక సినిమా రంగ చరిత్రలో మంచి చిత్రంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
- ఉమ్రావ్ జాన్ (హిందీ)
- కథ : మీర్జా హది రిస్వా
- సంగీతం : ఖయ్యాం
- దర్శకత్వం : ముజఫర్ అలీ
- నటీనటులు : రేఖ, ఫారూక్ షేక్, నసీరుద్దిన్ షా, రాజ్ బబ్బర్ మొ…
ఆనంద్ వారాల పుస్తకం ’సినీ సుమాలు’ నుంచి ఈ వ్యాసాన్ని సేకరించి తెలుగు యూనికోడ్ లోకి మార్చినందుకు జ్యోతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
(ఒకరకంగా౦సంక్లిష్టకధాంశం అయిన ఈ సినిమాను చాలా సరళంగా,లోతుగా విశ్లేషించారు ఆనంద్ గారు,ధన్యవాదాలు
కె.మహేష్ కుమార్ says:
ఈ చిత్రంలోని సంగీతం గురించి మాత్రమే ఒక వ్యాసం రాసెయ్యొచ్చు.
Pradeep says:
మహేష్‌గారన్నట్టు, ఈ సినిమా పాటల మీద కూడా ఒక టపా రాసెయ్యొచ్చు. “ఇన్ ఆఖొకి మస్తీ మే..” పాటలో రేఖ నటన superoooo superu.. ఆషా భోంస్లే గాత్రం …. superu.
కొత్తపాళీ says:
ఒక గొప్ప సినిమాకి ఒక బుల్లి పరిచయం మాత్రమే ఇది.