Menu

ఉంబర్తా

ఉద్యోగస్తురాలయిన మహిళ జీవితంపైన, ఆమె ఈ వ్యవస్థలో ఎదుర్కొంటున్న సమస్యలు, అనుభవిస్తున్న సంఘర్షణలపైన భారతీయ చలనచిత్ర సీమలో నిర్మితమైన అతి కొద్ది చిత్రాల్లో “ఉంబర్తా” ప్రముఖమైంది. వర్కింగ్ ఉమన్ జీవన స్థితిగతులపైన సరైన దృక్కోణంలో మరాఠీలో నిర్మితమయిన చిత్రమిది. ఇటీవల ‘డాక్టర్ అంబేద్కర్’ చిత్ర నిర్మాణంతో ప్రముఖ దర్శకుల జాబితాలోకి చేరిన డాక్టర్ జబ్బర్ పటేల్ 1982 లో ‘ఉంబర్తా’ కి దర్శకత్వం వహించారు. శాంతా మిసాల్ రాసిన మరాఠీ నవల ‘బేఘర్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ‘ఉంబర్తా’ ఆ తర్వాత ‘సుభా’ గా హిందీలో కూడా నిర్మించబడింది.

కుటుంబ వాతావరణంలో నాలుగు గోడల మధ్య నివసిస్తున్న సులభా ఆ ఇంటి గడప (ఉంబర్తా) దాటి విశాలమయిన సమాజంలోకి ఉద్యోగినిగా అడుగు పెడ్తుంది. తనదైన ఆలోచనతో, వ్యక్తిత్వంతో బయటి ప్రపంచాన్ని పరిశీలించినప్పుడు అక్కడ ఆమె ఎదుర్కొన్న సమస్యలు, అక్కడి నుంచి తిరిగి ఇల్లు చేరుకున్నప్పుడు తన వాళ్ళనుకున్న వారి నుంచి ఎదురయిన నిరాదరణ. ఈ రెండూ భిన్నమయిన స్థాయిల్లో ఉండడాన్ని ఈ చిత్రం నిజాయితీగా చిత్రిస్తుంది.

కుటుంబ సంబంధాల్లో వేళ్ళూనుకుని ఉన్న పితృస్వామ్య ఆధిపత్యమూ, సామాజిక సంబంధాల్లో నిలువెత్తుగా పెనవేసుకుని ఉన్న రాజకీయార్ధిక సంబంధాల్ని ‘ఉంబర్తా’ చర్చకు తెస్తుంది. భిన్నంగా కనిపించే ఈ రెంటిలోనూ అంతర్లీనంగా ఉండే అణచివేత లక్షణాల్ని అనుభవించి చైతన్య భరితమైన సామాజిక జీవనం వైపు మొగ్గు చూపించిన సులభా జీవితావిష్కారమే ఈ చిత్రం.

భారతీయ నవ్య సినిమా రంగానికి మరాఠీ సినిమా అందించిన మంచి దర్శకుడు జబ్బార్ పటేల్. వృత్తిరిత్యా డాక్టర్ అయిన పటేల్ కి మరాఠీ భాషలో ఉండే సొగసు, అక్కడి సాహిత్యం, సంగీతం ఎక్కువ ఇష్టం. జానపద రంగంలో విశేషంగా పని చేసిన ఆయన తొలిరోజుల్లో నాటక రంగంపైన అధికంగా కృషి చేశారు. ఆ తర్వాత విశాలవేదికగా భావించి సినిమా రంగంవైపు దృష్టి మరల్చారు. ఆయన మొదట సామ్నా జైత్ రేజైత్, సిహాసన్ చిత్రాలు నిర్మించారు. ఆయన దర్శకత్వం వహించిన అని చిత్రాల్లోనూ సామాజికాంశాలే కథాంశాలయ్యాయి.

‘ఉంబర్తా’ విషయానికి వస్తే సులభ పెళ్ళైంతర్వాత సోషల్ వర్క్ లో డిప్లొమా పూర్తి చేస్తుంది. అప్పటికే సామాజిక సేవారంగంలో లబ్ద ప్రతిష్టురాలయిన సులభ అత్తగారు ఆమెను తన కార్యకలాపాల్లోకి రమ్మని, తనకు చేదోడు వాదోడుగా ఉండమని ఆహ్వానిస్తుంది. కాని సులభ తన జీవితం పట్ల, అభీష్టాలపట్ల అప్పటికింకా సందిగ్ధావస్థలో ఉంటుంది. అందుకే ఇతమిద్దంగా ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఆమెకు ఆమె భర్తపైనా, తమ అయిదేళ్ల కూతురు పైనా అమితమయిన ప్రేమ. కాని ఆమె కూతురును ఆమె బావగారు, ఆయన భార్య అత్యంత ఇష్టంగా చూసుకుంటారు. పిల్లల్లేని వారికి సులభ కూతురంటే అభిమానం. ఈ స్థితిలో సులభకు దూరంగా ఉన్న పట్టణంలో పనిచేస్తున్న మహిళాశ్రమం ఉద్యోగావకాశం కల్పిస్తూ అపాయింట్‌మెంట్ ఆర్డర్ వస్తుంది. ఆ మహిళాశ్రమం అనాధలయిన మహిళల్ని రక్షించి ఉపాధి కల్పించేందుకు శిక్షణా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఉద్యోగానికి వెళ్తానని సులభ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో ఇంట్లో ఒక విభ్రాంతికరమయిన వాతావరణం నెలకొంటుంది. బయటకు వ్యక్తం గాని ఒక తీవ్ర వ్యతిరేకత పొడసూపుతుంది. ఆమె ఇళ్లు వదిలి వేరే పట్టణానికి ఉద్యోగానికి వెళ్లడాన్ని ఇంట్లో వాళ్లెవరూ హర్షించలేరు. సులభ భర్త మాత్రం అయిష్టంగానే ఆమె ఒత్తిడి మీద అంగీకరిస్తాడు. కుటుంబంలో అప్పటిదాకా ఒక రకమయిన జీవితాన్ని గమనించిన సులభకి మహిళశ్రమంలో నెలకొని ఉన్న తీవ్రమయిన పరిస్థితులు అందోళనకు గురిచేస్తాయి. అక్కడ జరుగుతున్న చీకటి కార్యక్రమాలు, లంచగొండి తనం ఆమెకు ఊపిరి సలపనివ్వవు. మహిళాశ్రమం నిర్వాహకుల అసలు రంగు ఆమెకు తెలిసి పోతుంది. అమాయకులు, నిరాశ్రయులు, దగాపడిన స్త్రీలు అయిన ఆశ్రమ వాసులపై జరుగుతున్న దోపిడి సులభని కలిచివేస్తుంది. అక్కడ బలవంతంగా జరుగుతున్న వ్యభిచారం, దొంగరవాణా, దారితప్పిన సెక్స్ సంబంధాలు, ఫలితంగా ఆశ్రమ వాసుల ఆత్మహత్యలు, ఉన్మత్తత ఆమెను దిగ్భ్రమకు గురిచేస్తాయి. మహిళాశ్రమం మేనేజింగ్ కమిటీ సభ్యుల ఆడంబరం, అత్యాశ ఆమెకు అర్ధమవుతాయి. ఇవన్నీ ఒకవైపుంటే మరోవైపు ఆశ్రమంలోని మహిళలు ఆమెపట్ల చూపిన ప్రేమ, దగ్గరితనం వరికి మరింత చేరువ చేస్తాయి.

సులభ క్రమంగా మహిళాశ్రమ కమిటీ అక్రమాలపై ఎదురు తిరుగుతుంది. తన చాకచక్యంతో, పనితనంతో కమిటీని లొంగదీస్తుంది. క్రమంగా ఆమె కృషి ఫలితంగా ఆశ్రమంలో మంచి రోజులు మొదలవుతాయి. ఇలా రెండేళ్ల కాలం గడిపిన సులభ తిరిగి ఇల్లు చేరుతుంది.. కాని ఇంట్లో వాళ్లకు తనకు మధ్య పెరిగిన దూరం ఆమెను కలిచివేస్తుంది. తిరిగి వారితో ఆమె ఎప్పట్లాగే కలవలేకపోతుంది. ఇంట్లో వారి నుంచి అవమానాలు, తిరస్కారాలు చవి చూసింతర్వాత ఇక తనకా ఇంట్లో స్థానం లేదని తెలుసుకుంటుంది. తాను ఆశించిన ప్రేమ, అభిమానం వారినించి అందుకోలేనన్న వాస్తవం ఆమెని కలచివేస్తుంది. ఇంట్లోవారికి అనుకూలవతి అయితే తప్ప అక్కడ తనకు స్థానం లేదని తేలిపోతుంది. వ్యక్తిత్వంతో ఆలోచించడం, ఆచరణలోకి దిగడాన్ని కుటుంబ సభ్యులెవరూ హర్షించలేరని ఆమెకు తెలిసి వస్తుంది. ఇక ఆ ఇంట్లో తనకు స్థానం లేదని ఆమెకు అవగతమవుతుంది. నిశ్చలమయంగా కనిపించే ఆ కుటుంబంలో తన అవసరం తన భర్తకు, తన కూతురుకు కూడా లేదని గమనించిన సులభ తిరిగి కుటుంబం గడప దాటుతుంది. తనకు తానుగా నిర్మించుకున్న చైతన్యవంతమయిన జీవితం వైపు పయనమవుతుంది. మరింత ప్రేమతో, అంకిత భావంతో ఆపన్నులకు సేవ చేసేందుకు సులభ ‘ఉంబర్తా’ దాటుతుంది. విశాల సమాజంలోకి ఒక సంపూర్ణ వ్యక్తిగా, శక్తి సంపన్నురాలిగా అడుగుపెడుతుంది.

ఇలా వ్యక్తిగతమయిన అనుభవాలకూ, చైతన్యాలకూ పితృస్వామ్య రాజకీయానికి మధ్య ఉన్న సంఘర్షణని ఉంబర్తా ప్రతిభావంతంగా ఆవిష్కరిస్తుంది. ఇంటి ‘గడప’కు లోపలా బయటా ఉన్న భిన్నమయిన విలువలూ, ఆధిపత్యాలు వాటితో చైతన్యశీలి అయిన స్త్రీ చేసే సంఘర్షణ ఈ చిత్రానికి ఆయువుపట్టు. ఇతివృత్త కథనాల పరంగా ఈ చిత్రం విజయవంతమయింది. కాని సినిమా నిర్మాణ పరంగా లిరికల్ సెన్సిబిలిటీని , సినిమాటిక్, ఈస్థటిక్స్ ని ఈ చిత్రం అందుకోలేకపోయింది. నాటక రంగం నుంచి వచ్చిన జబ్బర్ పటేల్ చిత్ర నిర్మాణ రీతిలో స్టేజీ ప్రభావం స్పష్టంగా గోచరిస్తుంది. కథ, కుటుంబ, సామాజిక స్థితిగతుల పరంగా భిన్నమయిన స్థాయిలో ఉన్నప్పటికీ కథనం సాఫీగా సాగిపోతుంది. సులభ గృహిణిగానూ, తనదైన వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమం ముఖంలో స్పష్టంగా కనిపిస్తాయి. దుఃఖమూ, చైతన్యమూ రెండూ ఆమె ముఖంలోనూ, కదలికల్లోనూ సాధికారికంగా ఆవిష్కృతమవుతాయి. స్మితాపాటిల్ చలన చిత్ర యాత్రలో ‘ఉంబర్తా’ ఓ మైలురాయి.

ఉంబర్తా (మరాఠీ)

  • కథ – శాంతామిసాల్
  • సంగీతం – హృదయనాథ్ మంగేష్కర్
  • స్క్రీన్ ప్లే – విజయ్ టెండుల్కర్
  • దర్శకత్వం – జబ్బర్ పటేల్
  • నటీనటులు – స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, ఆశాలత మొ..
2 Comments
  1. శ్రీ లక్ష్మీ కళ March 15, 2009 /