తెలుగు చిత్రాలు మారాలి

change

రచయిత: సి.హెచ్.వి.రామకృష్ణా రావు
ప్రచురణ: రూపవాణి, సెప్టెంబరు 1946

“అయ్యా! ఇది వ్యాపారం; సినిమా పత్రికల్లో వ్యాసాలు వ్రాయడం కాదు: ఈవ్రాసేవాళ్ళని వచ్చి ఒక పిక్చరు డైరక్టు చేయమంటే తెలుస్తుంది ఆ కష్టం. రూ 30,000 ఇచ్చినా పాతవాళ్లని ‘బుక్’ చేస్తేనే మాకు డబ్బొచ్చేది” ఇది శ్రీ కె.వి.రెడ్డిగారి ఉద్ఘాటన, ఒకాయన (పేరవసరం లేదు) ‘బుక్’ అవుదామని క్రిందటి వేసంగి శలవల్లో వెళ్ళితే తిన్న సమాధానం ఇది.

దీంట్లో శ్రీరెడ్డిగారు “సినీమాసత్యాన్ని” ఆవిష్కరణమొనర్చారు – థ్యాంక్స్!!

నిజంగా ప్రస్తుతం మనం తెలుగు డైరక్టర్లకు సినిమా ఒక “వ్యాపారం” గాని విజ్ఞానం ‘సంస్కృతి” వ్యాపింపచేయడానికి భగవంతుడు మానవునికిచ్చిన కళాపూరితమైన వరంమాత్రం కాదు.

వీరి కయినట్లుగా “హిందీ” వాళ్ళకుగాని “ఇంగ్లీషు” (చిత్రాలు తీసే) వారికి గాని ఇది నఖశిఖ పర్యంతం డబ్బుగుంజే సానివృత్తి మాత్రం గాదు. కొంతవరకైనా కళాపిపాస ఏ శాతారాంనో, జాతీయత ఏ సోహ్రాబ్‌మోడీలో ఆవరించే ఉంటుంది.

జై హింద్! ఇట్లా మన తెలుగుచిత్రాలుంటే కొద్దిరోజుల్లో అవి ‘శంకరగిరిమాన్యాలు ‘ తప్పక పట్టుతవి; అట్లా పట్టకుండా ఉండాలంటే సినీమాబృందం [దర్శకులూ నటులూ ప్రేక్షకులూ] జ్ఞాననేత్రం తెరచి సత్యాన్ని స్పృశించాలి- తప్పదు.

మొట్టమొదట ఫిల్ము తీసే ఇతివృత్తం [సెలెక్షన్ ఆఫ్ ది థీం] లోనే కొంచెం దీర్ఘంగా బుఱ్రనుపయోగించి “సెలెక్టు” చేసికోవాలి. ‘ఇక్ష్వాకుల బారసాల ‘వి, నాయనమ్మకథలు, ‘బుఱ్రకథలు ‘ ‘బొఱ్రకథలు ‘ తీసి మనల్ని ఊదరగొట్టడం మానేయాలి. పురాణాల్లో, చరిత్రల్లో, ప్రస్తుతం నవలల్లో జాతీయతల్లో పొంగులువారేవి, సౌశీల్యాన్ని, సుహృద్భావాన్ని వెన్నెలపోత పోసేవి, సంఘాన్ని విహంగయానం చేయించేవి, వ్యక్తుల్లో కుళ్ళును రహస్యంగా బయటపెట్టేవీ, అయిన కథ లెన్ని వున్నవి. వాటిని ఇతివృత్తాలుగా వీళ్ళెందుకు స్వీకరించరు?

కాళిదాసులాటి మహనీయుని నాటక కావ్య రత్నాల్నిగాని, రుద్రమనాటి రక్తం పొంగులువారే వీరచిత్రాలుగాని సంఘోద్ధరణకు పాటుపడ్డవారి జీవితాలుగాని తీయడానికి మనవారు యత్నించరు; ఒకవేళ ఎప్పుడన్నా చేస్తే అసమర్థత బయలుపెట్టి – వాల్మీకిలాగ వంపు కంపో, మాయలోకంలాగ “గారడీ” గానో చేస్తారు. బుద్ధిపూర్వకంగా – వీళ్ళు ఏరే ఇతివృత్తంలో నీతి వున్నా, ఉండకపోయినా, సంఘానికో, దేశానికో, లేక ప్రపంచానికో ఒక సందేశం ఇవ్వాలి. అట్లా ఉండాలి.

ఆ తర్వాత, మంచి ఇతివృత్తం స్వీకరించి, ఏం చేయాలి? మేథా సంపత్తి, విజ్ఞానం గల యువకునిచేతనైనా “స్క్రిప్టు” వ్రాయించాలి. ఏ చెత్తో వ్రాసి ఫిల్మును ముండమోయించగల అసమర్థులేకాక మంచివాళ్ళు ఉన్నారు: వారినాహ్వానించాలి. అట్లాగే మంచి కవిచేత మాటలూ పాటలూ వ్రాయించాలి. భాషే ఫిల్ములో ప్రాణంగాదా మఱి!

తర్వాత “సెలెక్షన్ ఆఫ్ ది స్టార్స్” – ప్రత్యేకంగా క్రొత్త నటీనటుల్ని – అందంగా ఉండి ఆక్టుచేయగల వారిని వెదికేందుకో “ఆఫీసరు”ను నియమించుకోవాలి: అతను “టూర్” చేస్తూ – సంగీతం మాట దేవుడెరుగు – ముందు నటనాసామర్థ్యం, “పెర్సనాలిటీ” ఉన్న నటీనట బృందాన్ని తాను క్రోడీకరించాలి: పాతవాళ్ళందరికీ “ప్రావిడెంటు ఫండు” లాగా రెండువేలో మూడువేలో ఇచ్చి క్రమేణా తగ్గిస్తే చిత్రాలు అభ్యున్నతికి వస్తవి – రావడాని కవకాశాలున్నయి! మన తెలుగుచిత్రాల్లో పాతస్టార్లను చూచిచూసి విసుగెత్తే చిత్రాలకెవరూ వెళ్ళటంలేదేమో! ఈ విషయం మన హిందీ సోదరులను చూసి నేర్చుకుందాము.

చిత్రజగతిలో తన కీర్తికి ప్రేక్షకులు దివిటీలు పట్టాలంటే, శాశ్వతంగా తానొక ఉత్తమ తారాపథంలో విహంగయానం చేసే కోయిల కావాలంటే, ప్రతి నటీమణి ప్రతి నటకుడు కళాదృష్టితో నటించాలి. ఆదర్శజీవితం నడపాలి! డబ్బు కళావైదగ్ధతను బట్టే వస్తుంది. డబ్బుకోసం పడుపువృత్తికో దర్శకుని పాదసంవాహనానికో దిగాల్సిన అవసరం ఏముంది? తన సెల్‌ఫ్ రెస్‌పెక్ట్కూ, తన కీర్తికీ భంగం గల్గించే పాత్రలు వేయకుండా ఉంటేనే “కళ” మీద – ‘నాట్యకళ ‘లో విలువ పరిచయం ఉన్నట్లు [ఉదా. శ్రీ సి.యస్.ఆర్. గారు "మాయలోకం" లో నటించకూడదు-!]

కేవలం “పరనిందో – పరరంధ్రాన్వేషణమో” ముఖ్యాశయంగాదు – దర్శకులదీ, నటకులదే గాక ఈ బాధ్యత ప్రేక్షకులదిన్నీ. సంస్కృతిగల ప్రతి వ్యక్తీ “వల్‌గర్” ఫిల్ములకు వెళ్ళరాదు. ఇదే ప్రతి ప్రేక్షకుని ప్రతి ప్రేక్షకురాలి విధి! అంతే “మంగమ్మ”లకూ “గృహలక్ష్ములకూ” వెళ్ళకూడదు అన్నమాట. స్త్రీలకు అవమానం తెచ్చే చిత్రాలను బహిష్కరించాలి!

చిత్రాలు తీయటంలో మంచి నటీనట వర్గాన్ని ఏరుకొని ఊరుకోక, మంచికవిచేత పాటలు రాయించి ఊరుకోక నవ్యరీతుల్లో ఆనందం ఇచ్చే అందమైన ట్యూన్లతో సంగీతం ఫిల్ములు ప్రవహించాలి! సంగీతం ఇచ్చినంత “ఎఫెక్ట్” చిత్రానికి మరేమీ ఇయ్యలేదు. అందుకే ‘స్వర్గసీమ ‘ సంగీతదర్శకులు ధన్యులు, ఇందుకు సంగీత దర్శకులు ఏ “బోరల్” జీ అక్కర్లేదు. కర్దార్ ప్రొడక్షన్స్ – ‘జీవన్” సంగీతం ఎంత ఉద్వేగంగా ఉంది! నవ్యరీతులు తెల్సిన సంగీతం బాగా వచ్చిన యువకుడు చాలు! – అనుకరణమాత్రం మానేయాలి.

ఈ “చిత్రాలమార్పు యజ్ఞం” లో దర్శకులు నటీనటులూ, ప్రేక్షకులూ గూడ ఒక్కొక్క ఇంధనం సమర్పించాలి! అందుకు ఆందోళన చేయాలి – వాళ్ళు వినరూ “వాళ్లగడ్డి వాళ్ళే తింటారు” – మన సినీమాలకు డబ్బేరాదు. కళాదృష్టి ప్రాకాలి! ధనాశ తగ్గాలి! జాతీయత పెరగాలి!

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో భాగంగా చందూగారిద్వారా నవతరంగప్రవేశం చేస్తున్న ఈ వ్యాసాలను వారానికొక్కటి చొప్పున ప్రచురిస్తున్నాం. చదివి ఆనందించండి. ’

ఈ వ్యాస పరంపరలో వచ్చిన మిగతా వ్యాసాల కోసం ఇక్కడ చూడండి.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

1 Comment to “తెలుగు చిత్రాలు మారాలి”

  • meeru mottam ga telugu cinee charitra study chesi maatladandi… its not a passion …..(criticising the telugu film industry)…ee madhya prati okkaru edooo rastunnaru…mundu anni teliste rayandi bosss enduku maaa mind tintaru

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories