Menu

స్వర్గసీమ

ఐదున్నర దశాబ్ధాల క్రితమే సామాజిక విలువల గురించి, పురుషుడిలో పొడసూపే వివాహేతర సంబంధాల గురించి, కుటుంబ సంబంధ విలువల గురించి చర్చించి వివరించే కళాత్మకమైన చిత్రాన్ని బి.ఎన్.రెడ్డి నిర్మించారు. ఆ కాలంలో హీరోకి చెడు లక్షణాల్ని ఆపాదించి చిత్రం నిర్మించడమే పెద్ద సాహసం. అంతే కాకుండా ఒక స్త్రీ మంచి అవకాశాలు రావడం కోసం తన కెరీర్‌ను నిర్మించడం కోసం ఒక వ్యక్తిని నిచ్చెనగా వాడుకుని, ప్రేమించి, లాలించి, ఆ తర్వాత వదిలించిన వైనాన్ని స్వర్గసీమలో వి.ఎన్. అత్యంత ప్రతిభావంతంగా చిత్రించారు. వివాహేతర సంబంధాలలో అవకాశవాద ముంటుందని వివాహ సంబంధమూ అందులోని ప్రేమలే శాశ్వతమైన సత్యాలని ఈ చిత్రం ద్వారా బిఎన్. ప్రబోధిస్తారు. కాని ఆనాటి కాలానికంటే ఎంతో ముందుకాలాన్ని విజువలైజ్ చేసి పాత్రల్ని రూపొందించడంలో బి.ఎన్. గొప్పదనం ఇమిడి ఉంది. ఇందులో భానుమతి ప్రధాన పాత్రను పోషించి, విశేషమైన పేరు ప్రఖ్యాతుల్ని అందుకుంది. విమర్శకుల చేత గొప్ప ప్రశంసలందుకున్న ఆమె, ఆ తర్వాత తన కెరీర్‌లో తిరిగి వెనక్కి చూడలేదనడంలో అతిశయోక్తి లేదు. విషయ పరంగానూ, పాత్రల రూపకల్పన పరంగానూ మాత్రమే కాకుండా బి.ఎన్. ఈ చిత్రం తీసిన సమయం వ్యక్తిగా ఆయనకు ప్రతికూలమైన కాలం. అంతే కాదు. ఆనాటి సామాజిక ఆర్ధిక రంగాల్లో కూడా రెండవ ప్రపంచ యుద్ధపు ప్రభావాలచేత అతలాకుతలమవుతున్న కాలమది. ముడి ఫిలింతో సహా అన్నింటి దిగుమతుల విషయంలోనూ ఆంక్షలు, రేషన్లు అమలులో ఉన్న కాలమది. అందుకే కేవలం 11,000 అడుగుల లోపే చిత్ర నిడివిని కుదించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ బి.ఎన్. తన ప్రణాళికాబద్ధమైన నిర్మాణ రీతిలో ‘స్వర్గసీమ’ ను పూర్తి చేశారు.

బి.ఎన్.రెడ్డితో మమేకమై అప్పటిదాకా నిర్మించిన అన్ని చిత్రాల్లో చేదోడు వాదోడుగా ఉన్న రామ్‌నాధ్, శేఖర్‌లు ఇద్దరూ బి.ఎన్.రెడ్డి నుంచి విడిపడి ఎస్.ఎస్.వాసన్‌గారి జెమినిలో చేరిపోయారు. ఆ ఇద్దరూ లేకుండా బి.ఎన్. చిత్రం నిర్మించడం సాధ్యం కాదని అంతా భావించి అనుమానాలు వ్యక్తం చేయడంతో బి.ఎన్.తన ప్రతిభకు సవాల్‌గా తీసుకొని ‘స్వర్గసీమ’ చిత్ర నిర్మాణం చేపట్టారు. రచయితగా బి.ఎన్ తమ వాహిణీ సంస్థలోకి చక్రపాణి (ఏ.వి.సుబ్బారావు) ని చేర్చారు. అప్పటికే మంచి రచయితగా పేరున్న చక్రపాణి స్వర్గసీమతో వాహినికి వెన్నెముక అయి ఉండిపోయారు.

ఇక ఫోటో్‌గ్రాఫర్‌గా ఆంగ్లో ఇండియన్ మార్కస్ బార్‌ట్లే్‌ను స్వర్గసీమతోనే పరిచయం చేశారు బి.ఎన్. అంతే కాకుండా ఘంటసాలను కూడా స్వర్గసీమతోనే పరిచయం చేశారు. గాయకుడిగా ఘంటసాలకు స్వర్గసీమ చిత్రమే గొప్ప బ్రేక్‌ను ఇచ్చింది. ఇలా పలు ప్రయోగాలు, వినూత్న ముఖాలతో కూడి నిర్మితమైన స్వర్గసీమ గొప్ప విజయాని సాధించింది. ‘ఓ పావురమా’ లాంటి పాటలతో ఆ చిత్రం తెలుగువారి స్మృతిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

కథాంశం విషయానికి వస్తే అందమైన పేద యువతి సుబ్బి ఆ పట్టణంలో ఓ మూల నివసిస్తూ ఉంటునంది. ఆట పాటలతో పాటు చొచ్చుకుని పోగల ప్రతిభగల ఆ యువతి మంచి జీవితం పొందాలని భావిస్తూ ఉంటుంది. మూర్తి, కళ్యాణి ఇద్దరూ భార్యాభర్తలు. ఇద్దరు సంతానంతో సాఫీగా వారి జీవితం సాగిపోతు ఉంటుంది. మూర్తి సుబ్బిని కలిసి ఆమె ఎదుగుదలకు సహాయపడతాడు. ఆమె పేరు సుబ్బి నుంచి సుబ్బలక్ష్మి, సుజాత – సుజాతాదేవిగా మారే స్థితి వరకు ఆమె వెంటే ఉంటాడు. ఆమె కూడా మూర్తే సర్వస్వంగా ప్రవర్స్తిస్తుంది. మూర్తి తన భార్యాపిల్లల్ని వదిలేసి సుజాతాదేవితో ఉండిపోతాడు. భర్తను కలవడానికి వెళ్లిన కళ్యాణి అవమానానికి గురై కుమిలిపోతుంది. ఆకలి పేదరికం తోడుగా మిగిలిపోతుంది. కొంతకాలం గడిచాక సుజాతాదేవికి మూర్తిపట్ల మోజు తగ్గిపోతుంది. కొత్త మనిషిని, సరికొత్త ప్రేమికుడిని ఆమె కాంక్షిస్తుంది. క్రమంగా మూర్తిని తన జీవితంలోంచి తప్పిస్తుంది. కొత్త ప్రేమికుడితో సహజీవనం ఆరంభిస్తుంది. తన కాళ్ల క్రింది నేల కదిలిపోగా మూర్తి నిర్వీర్యుడైపోతాడు. కలలన్నీ భ్రమలైపోగా ఒంటరిగా మిగిలిపోతాడు. స్త్రీ పురుషుల నడుమ పెరిగే అవకాశ వాద బంధాల్ని చర్చిస్తూనే కుటుంబ బంధాలే శాశ్వతమైనవని ప్రభోదిస్తూ సినిమా సాగుతుంది.

మొత్తం మీద స్త్రీ పురుష సంబంధాల్ని చర్చించి ప్రభోదాత్మక చిత్రంగా నిలిచిన స్వర్గసీమ ఆ కాలంలో విశేష ప్రజాదరణని కూడా పొందింది. ఒక మంచి చిత్రంగా తెలుగు చలన చిత్ర చరిత్రలో మిగిలిపోయింది.

స్వర్గసీమ (1945)

  • కథ, మాటలు – చక్రపాణి
  • సంగీతం – నాగయ్య
  • కెమెరా – మార్కస్ బార్‌ట్లే
  • దర్శకత్వం – బి.ఎన్.రెడ్డి
  • నటీనటులు – నాగయ్య, భానుమతి, జయమ్మ, లింగమూర్తి, నారాయణరావు, శివరావు.

ఆనంద్ వారాల పుస్తకం ’సినీ సుమాలు’ నుంచి ఈ వ్యాసాన్ని సేకరించి తెలుగు యూనికోడ్ లోకి మార్చినందుకు జ్యోతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.