Menu

మన సినిమాలోకం – ప్రగతి

రచయిత: కాశీనాథుని వీరభద్రశేఖరరావు
ప్రచురణ: రూపవాణి, మార్చి 1946

ప్రాక్తన మానవయుగమునుంచీ, భరతనాట్యముతోనూ, శ్రీనాథకవుల యుగమునుంచీ వీధినాటకములనూ చూచి ఆనందిపగలిగిన ప్రేక్షకులు – చలనచిత్రాలు మనదేశపు వెండితెరపై అగుపించేసరికి-మూగసినీమాలనుగూడ కరువుగా చూశారు. చిత్రచరిత్రను పరికిస్తే యీ చలనచిత్రాలు 1907లోనే మన తెరపై అవతరించినవని తెలుస్తూంది.

ఆర్థికపరిస్థితులనుబట్టిగాని, ధైర్య, ప్రోత్సాహములు లేకగాని 1923 వరకూ మన దేశీయులెవరూ యీ చలనచిత్రాలను నిర్మించ సాహసింపలేకపోయిరి. ఫాల్కే మొదలయిన ప్రఖ్యాత నిర్మాతలచే తీయబడిన ‘హరిశ్చంద్ర ‘ ప్రథమ భారతీయచిత్రము మన ప్రేక్షకుల దృష్టిని సినీమా హాళ్ళ వైపుకు మరలింప జేయగలిగింది. అప్పటి సాంఘిక పరిస్థితులను బట్టి పౌరాణిక చిత్రాలను ప్రజలు ప్రహర్షింపదగిన రోజుల్లో తొలిసారి ప్రయత్నించి కృతకృత్యులైన నిర్మాతలు చిత్రపరిశ్రమలో ముందంజ వేసేందుకు సాహసింపగలిగారు. ఈ విధంగా చిత్రజగతికి ప్రేక్షకులు పెట్టిన భిక్ష శ్లాఘనీయమనే చెప్పాలి. ప్రోత్సాహము నందుకొని ప్రేక్షకుల కష్టము (labour) ను తమ ధన సంచులలో పోసికొని స్టూడియోలో కుర్చీలలో ఆసీనులయిన యీ నిర్మాతలు కాలకర్మవశాత్తు ప్రేక్షకులను మరచిపోయారు. ఏ దేశముయొక్క కాల, పాత్రాదుల ప్రకారం తాము చిత్రాలను తీయాలన్న సంగతిని మరచారు.

ఈ కాలంలోని ఆధునిక ప్రొడ్యూసర్ మార్కెట్‌లో చౌకగా కథను సంపాయించి – తన స్నేహితునన్నా లేక ఆ తెరపై సువర్ణాక్షరములతో లిఖింపబడితే చాలని చూచి ఆనందింపగలిగే అమాయకపు నిరాశాపరులనన్నా పట్టి – వారిచే ‘ డైరక్టు ‘ చేయిస్తాడు. ఆ కథ వో నవీన ఘటాంచిత ‘ రొమాన్సు ‘. ఇక్కడ డైరక్టరుకు సందేహం వస్తుంది. తాను తీయబోయే యీ పాశ్చాత్య జీవితరంగంలో హాలీవుడ్ చిత్రాల్లా ముద్దులను చూపించాలా? అక్కర్లేదా అని. చూపిస్తే ఆ చిత్రం వెంటనే పతనమౌతుంది. ‘ ఇండియను స్క్రీను ‘ యీ ముద్దులను prohibit చేస్తుంది కాబట్టి. వో వేళ ‘ రూల్స్ ‘ను వ్యతిరేకించినా ఏ హిందూనారి యీ తెరపై ముద్దులను చూచి సహిస్తుంది? ఈ ఆలోచనలన్నీ డైరక్టరు బుర్రను వేధిస్తాయి. కథనెలాగో తన స్వంత సినేరియోతోనే బల్లపై పెడతారు. ఇహ నటీనటుల ‘ సెలక్షను ‘ వస్తుంది. ఈ ఎన్నికలలో మన హిందూ తెర సామెతప్రకారం పేరుపడ్డ వృద్ద నటీనటులు ముందుకొస్తారు. భవిష్యత్తుపై ఆశ పెట్టుకున్న నిర్మాత వారు demand చేసినంత డబ్బునొ యిచ్చి షూటింగు ప్రారంభిస్తాడు. నిజాన్ని చూస్తే నెలకు 30 వేలు తీసుకొనే నటుడు – ఏ 3 వందలో తీసుకుని నటించే నటునికన్న 100 రెట్లు నటించగలడా ( ఆ నటునికి వచ్చే demand యీ పత్రికలపైనే ఆధారపడి వుంది) తాము తీసే చిత్రానికి ఎటువంటి కథానాయకుడు కావాలో నిర్ణయించుకోలేని దర్శకుడు పేరుగడించిన వో పెద్దమనిషికి సరిపోలని పాత్రనిచ్చేసరికి – పేరుపోషణ ఎలావున్నా పాత్రపోషణ మాత్రం వుండబోదు. “పోతన”లో పొతనై ప్రజ్వరిల్లిన నటశేఖర నాగయ్య “దేవత” లో కథానాయకునిగా ఎలా రాణింపగలుగుతాడు? లేక పోతనలో శ్రీనాథుని పాత్ర చూరగొన్న గౌరీనాథం “భీష్మ” లో భీష్ముడవ్వగలడా? మాయామచ్చీంద్రలో రంజింపచేయగలడా? కథావస్తువుకు తగిన ఎన్నికలలో గూడ ఉత్తమచిత్రపు నటునికి ఆధారపడివుంటుంది. చివరకు చిత్రం తయారౌతుంది. ప్రేక్షకులు ఆదుర్దాపడి వున్న ఆ విడుదల తేదీ వస్తుంది. ఆదుర్దాపురుషులు వెళ్తారు. తిరిగివచ్చేసరికి నిరాశ మూర్తీభవించి వుంటుంది, ప్రతి ప్రేక్షకుని ముఖ విన్యాసంలోనూ. ఈ చిత్రాన్ని తీసిన కంపెనీ యింకోసారి మంచి చిత్రాన్ని తీసినా ప్రేక్షకులు చూడటానికే సాహసించలేరు. ఈ విధంగా ప్రొడ్యూసర్లు పతనమౌతారు. ప్రేక్షకులు నిరాశాపరులౌతారు. నటీనటులు తామార్జించిన డబ్బుతో అందల మెక్కుతారు. ఎంతకాలమునుంచియో తమ జీవితాన్ని చిత్రజగతికే ధారపోయాలని స్టూడియో గేట్లవద్ద రెప్పవాల్చకుండా నిరీక్షణ చేస్తూన్న క్రొత్తనటులు ఆశాభంగము చెందుతారు.

ప్రొడ్యూసర్లు వివిధరకాలు. కేవలం డబ్బుకోసరమే తీసేవారో తరగతి. దీనితోబాటు సినీమాకళాశిల్పాన్ని పాటిస్తూ చిత్రజగతి పరువు నిలబెట్టాలని చూసేదో తరగతి. ఇంకో తరగతి వున్నారు. వీరు కేవలము చిత్రజగతిని ఖూనీచేసేవారు. వారికి నచ్చిన వో వ్యక్తికి మంచి పబ్లిసిటీ యివ్వడానికే వీరు చిత్రాలను కల్పనచేసి ప్రేక్షకులను విసిగింపచేస్తారు. దీనికి వుదాహరణము శ్రీ ఫిల్మిండియా సంపాదకుడు బాబూరావు పటేలే! ఈయన తీసింది ద్రౌపది. నటీమణి సుషీలారాణి.

డబ్బుకోసరమే తీసేవారి box office hits అవ్వడం చాలాకష్టం. దీనితో మొదటితరగతి చిత్రాలు కానేరవు. ఇహ కళాశిల్పాన్ని పాటించే నిర్మాతలను పరిశీలిద్దాం. దీనికి ఉదాహరణం న్యూ థియేటర్సును తీసికునవచ్చును. వీరి చిత్రాలన్నీ ప్రఖ్యాత జీవిత తరంగాలనే చెప్పగలం. సంగీతం ఉత్తమస్థానాన్ని ఆక్రమించుకుంది. పంకజ్, బోరల్ వీరి సంగీత దర్శకులు. నటీనటులు క్రొత్తవారు గూడ ప్రోత్సహింపబడుతూ కళాశిల్పానికో క్రొత్తవన్నెను తెచ్చినది వీరేనని చెప్పగలము. అనవసరపు ఘట్టమెక్కడా – సంగీతంలో కాని, నటనాశిల్పాలలోగాని, టెక్నీషియన్లలోగాని వున్నట్లు కనిపించదు. కొద్ది లోపములున్నను మరువదగినవే! వీరి చిత్రాలు చాలావరకు మొదటితరగతి చిత్రాలే. బారువా తీసే చిత్రాలు ‘జనాబ్’ మొదలైనవి ఈ లోకానికి సంబంధించినవేనా అనిపిస్తుంది. కానీ నిజానికి సంఘానికి జవాబులు అనేకం వున్నాయి ఈ బారువా చిత్రాలలో, కానీ సామాన్యప్రేక్షకుని రుచికి అందుబాటులో వుండక కళ-కళకోసరమే అనే ధోరణిలో అగుపిస్తాయట.

ఇక బాంబేటాకీసు తీసేవి ప్రేక్షకులను మిక్కిలిగా ఆకర్షిస్తూ వచ్చినాయ్. వీరి చిత్రాలలో వున్న చవుక రకపు నాట్యప్రదర్శనలే ప్రేక్షకలోకపు హృదయాలను ఆకర్షించి రంజింపజేసినవి. ఇంగ్లీషు మాటినీలలోని ముద్దుతో మనదేశ వెండితెరపై బాంబేటాకీసువారి చౌక నాట్య ప్రదర్శనం తులతూగగలదని కొందరన్నారు. వీరి చిత్రాల కథలన్నీ ఒకే మోస్తరుగ వుంటాయి, మొదలో-మధ్యో-చివరో తీసి కలిపితే! వీరికి సాంఘికచిత్రాలయందే అభిమానం జాస్తి!

ముఖ్యముగా మనదేశాన్ని ఆకర్షించినవి సొహరాబ్ మోడీ తీసిన సికిందరు, పుకార్ లాంటి చిత్రాలు. ప్రస్తుతం మన బానిస సోదరుల హృదయాలను జాతీయవంతంగా చేయాలంటే యీ చిత్రాలు సహకారులనే చెప్పాలి.

దేశకాల పాత్రాదులనుబట్టి దేశంకోరే యిటువంటి జాతీయచిత్రాలను చూపగలిగితే ఏ నిర్మాత, పారిశ్రామికులు ప్రశంసనీయులు కారు? “చల్ చల్ రె నౌ జవాన్” తీసిన “ఫిలిం స్థాన్” యిటీవల తిలక్ జీవిత చరిత్రను తీయయత్నిస్తున్నదన్న వార్త నేటి ప్రేక్షకులను సంతృప్తిపరుస్తుంది…దేశం వాంఛించేది నిర్మాతలు యివ్వగలిగినవారౌతారు, సాంఘికచిత్రాలతో విసుగుచెందిన లోకానికి పౌరాణిక, చారిత్రాత్మకాలను ఎందుకందించగూడదు? ఒక్క సంస్థతో సాంఘికాన్ని చిత్రించేసరికి – సమకాలిక నిర్మాతలీ సోదరుని మించాలనే దురాశతో అదే చిత్రాన్ని సంగీతాన్ని మార్చి హాలివుడ్ చిత్రంలా చేయాలని సంకల్పిస్తున్నపుడు ప్రగతి ఎవ్వరిని వరిస్తుంది?

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో భాగంగా చందూగారిద్వారా నవతరంగప్రవేశం చేస్తున్న ఈ వ్యాసాలను వారానికొక్కటి చొప్పున ప్రచురిస్తున్నాం. చదివి ఆనందించండి. ’

ఈ వ్యాస పరంపరలో వచ్చిన మిగతా వ్యాసాల కోసం ఇక్కడ చూడండి.

One Response
  1. krishnarao jallipalli March 1, 2009 /