ఒరు చెరు పుంచిరి-ఒక పరిచయం
ఒరు చెరు పుంచిరి/ a slender smile/ఒక చిన్న చిరునవ్వు(మళయాళం/2000/90min)-ఒక పరిచయం
ఈ సినిమా మన తెలుగు కథ ఆధారంగా తీయబడింది. ఆ కథే మన శ్రీ రమణ గారి “మిథునం”
కథ వెనుక కథ:
మిథునం కథ మొదటి సారిగా నవంబరు 1997 లో ఆంధ్రభూమి వారపత్రిక లో ప్రచురించబడింది. అది చదివి బాపు గారు ఆనందంతో “చదివినదానికంటే రాస్తే బాగా అర్థం అవుతుంది.” అని ఆ కథని తన దస్తూరితో వ్రాసి శ్రీ రమణ కు పంపారు. తర్వాత రచన సంపాదకులు శ్రీ శాయి గారు ఈ కథను బాపు దస్తూరితో, బొమ్మలతో రచనలో ప్రచురించారు. ఆ సంచికకు బాపు గారి బొమ్మను ముఖచిత్రంగా వేస్తూ “దస్తూరి తిలకం-బాపు” అని ప్రచురించారు. దానికి పాఠకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఎంతటి ఆదరణ పొందిందంటే, రచన పత్రికలో తిరిగి అనుబధంగా ప్రచురించాల్సివచ్చింది. ఎందరో రచయతల, ప్రముఖుల మన్ననలను పొందింది. కథ, కొత్త ఢిల్లి వారు ప్రతి సంవత్సరం ఎంపిక చేసే అత్యుత్తమ భారతీయ కథల్లో ’మిథునం’ను కూడా చేర్చుకున్నారు. వారి ఆ సంవత్సర (1998) “కథ” సంచికలొ మిథునం ఆంగ్ల అనువాదం (వట్లూరి శ్యామల (కల్లూరి శ్యామల అని ఒక website లో వుంది) అనువదించారు) ప్రచురింపబడింది. అలా ఆ అనువాదాన్ని చదివిన M.T. వాసుదేవన్ నాయర్ చలన చిత్రంగా తీయాలని నిశ్చయించారు. ఈ కథ అనేక భారతీయ భాషల్లోకి, నాలుగు విదేశి భాషల్లోకి అనువదింపబడింది. ఈ కథను విమర్శించినవాళ్ళు కూడా లేకపోలేదు. “ఏముంది కథలో, బ్రాహ్మణ వంటకం మీద రాయబడింది” అన్నారు. దానికి శ్రీ రమణ గారి స్పందన: “నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేను బ్రాహ్మణుణ్ణి మరియు భోజన ప్రియుణ్ణి”.
సినీ నటులు సుత్తివేలు దీనిని రేడియో కోసం నాటకంగా రూపోందించారు. మన తెలుగు నిర్మాత స్రవంతి కిషోర్ దీన్ని టీ.వి. సీరియలుగా తీద్దామనుకున్నారు. దీంట్లో వాణిజ్య విలువలు లేవు అని శ్రీ రమణ వారించారంట.
సినిమా నిర్మాణం:
ఈ సినిమా దర్శకుడు ఒక ప్రసిద్ధ మళయాళ రచయత. జ్ఙానపీఠ బహుమతి గ్రహీత అయిన డా|| M.T. వాసుదేవన్ నాయర్ కి ఇది ఆరవ చిత్రం. ఆయన చేసిన చిత్రాలు చాలా వరకు అవార్డులు పొందినవే. MT గా పిలవబడే ఈయన మొదటి సారిగా ఇతరుల కథతో తీసిన సినిమా ఇదే. ఇది ఒక ముసలి దంపతుల కథ. తమలో తాము కీచులాడుకున్నా ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. తమ కష్టాలకు లోకాన్ని నిందించకుండా సరదాగా గడిపుతూ సహజీవనం సాగించే ఇద్దరి ముసలి వాళ్ళ కథ ఇది. ఈ విషయం నచ్చి MT గారు శ్రీరమణ గారికి వుత్తరం వ్రాసారు.
Dear Sri Sriramana,
I know you through your writings and association in films.
You must have heard my name too as a writer and occasional filmmaker. I have not done any film work for some years as it is very depressing the type of films which I want to make will not have seekers.
Recently I read your shortstory Mithunam in Katha anthology. In these days of morbid situations every where – in life, literature, films- I thought the idea of Mithunam strikes a pleasant positive note.
I would like to make a short film based on that in 16mm. The idea is to compete in some Short Film Festival if not for a personal pleasure. I will alter it to Kerala atmosphere with due credit to you as the original story writer.
I had written about this to my writer friends Jayapradha. Waiting to hear from you.
With Warm Regards.
Yours Sincerely
M.T. Vasudevan Nair
కొన్నాళ్లకి షూటింగ్ మొదలుపెట్టామని నిర్మాణ సంస్థ నుంచి వుత్తరం వచ్చింది.
మూల కథ మార్చకుండా,సినిమాలో కొన్ని అనుబంధ కథలు జోడించారు MT. ఒక పిల్లాడికి ముసలాయన చదువు చెప్పడం, తన మనవరాలి ప్రెమ పెళ్లికి కొడుకు కోడలును ఒప్పించటం, పాత మిత్రుడి రాక ఇలాంటివి. నాకు మాత్రం మనవరాలి పెళ్లి కొంచెం diversionలా అనిపించింది.
ఐతే ముసలాయన పెళ్లిలో జరిగిన సన్నివేశం (శనగలు జేబులోంచి తీసి ఈవిడ చేతిలో పెట్టడం), ఈవిడ కొబ్బరి తురమడానికి ముందు ఈయన గారు ఆ తురుము తినకుండా చేయడానికి పాత జాడీ కావాలని చెప్పి అటక ఎక్కించి నిచ్చెన తీసేసి ఆయన కళ్ళెదుటే కొబ్బరి తురుముతూ ఆయన తిట్లు తినడం, వంట ఎలా చేయాలో ఈయన ఆవిడకు సరదాగా నేర్పడం లాంటివి మార్చలేదు. సినిమా చివర ముసలావిడ అన్న మాటలు మన కళ్ళు చెమర్చేలా చేస్తాయి. ఆవిడ మాటల సారాంశం:”ఆయన కంటే నేను ముంద వెళ్ళకూడదు. ఆయన పోయేవరకు కంటికి రెప్పలా చూసుకునేదెవరు మరి” (అసలు మాటలు వ్రాయడానికి ప్రస్థుతం నాదగ్గర ఆ సినిమా గాని, శ్రీ రమణ గారి కథ గాని అందుబాట్లో లేవు). ఒక మంచి సినిమా (ఇది అప్పుడప్పుడు మళయాళం TV ఛానెల్ Asianet లో వస్తూ వుంటుంది).
ఈ కథలోని ఒకే దృశ్యాన్ని ఇద్దరు దిగ్గజాలు ఎలా చిత్రీకరించారో చూడండి
[caption id="attachment_4902" align="alignleft" width="312" caption="MT గారి చిత్రీకరణ"]ఇక ఈ కథకు బాపు గారు వేసిన ముఖచిత్రాలు చూడండి. బొమ్మ చూడగానే కథ సారాంశం తెలిసిపోతుంది.
[caption id="attachment_4933" align="alignleft" width="295" caption="తాళి నే తాడుగా వాడి భర్తను పైకి పంపే వైనం. "]ఈ సినిమా పొందిన అవార్డులు:
1. బాంబే చిత్రోత్సవం 2000 లో FIRPESCI ప్రత్యేక బహుమతి.
2. 48వ జాతీయ చలనచిత్రోత్సవం 2001 లో “పర్యావరణ రక్షణ” పై ఉత్తమ చిత్రం
నిర్మాత జిషా జాన్ కు రజత కమలం మరియు ౩౦ వేల రూపాయల నగదు బహుమతి
దర్శకుడు MT గారికి రజత కమలం మరియు ౩౦ వేల రూపాయల నగదు బహుమతి
ఆ అవార్డు CITATION:
THE AWARD FOR THE BEST FILM ON ENVIRONMENT CONSERVATION/PRESERVATION OF 2000 IS GIVEN TO MALAYALAM FILM ORU CHERU PUNCHIRI. THE FILM TELLS THE SIMPLE AND MOVING STORY OF AN ELDERLY COUPLE AND THEIR RELATIONSHIP WITH THE WORLD AROUND THEM. IN DEPICTING THE COUPLE’S LOVE FOR THE TREES AND PLANTS IN THEIR GARDEN, THE FILM SPREADS THE MESSAGE OF ENVIRONMENTAL CONSERVATION IN THE BROADEST SENSE IN A GENTLE, UNOBTRUSIVE WAY.
పాల్గొన్న చిత్రోత్సవాలు:
1. లండన్ చిత్రోత్సవం (ప్రపంచ సినిమా విభాగం) నవంబరు 7-22, 2001
2. మారిషస్ చిత్రోత్సవం 2003 / Festival of Cinema Seychelles 2003.
చివరిగా ..:
1. “ఒక చిన్న చిరునవ్వు”. చిన్న చిరునవ్వు ఏంటి అనుకుంటున్నారా? మళయాళం “ఒరు చెరు పుంచిరి” అంటే ఒరు=ఒక, చెరు=చిన్న, ముద్దొచ్చే (బహుశా చారు అనే సంస్కృత పదం నుంచి వచ్చి వుంటుంది), పుంచిరి=చిరునవ్వు
2. మరో మళయాళ దర్శకులు K. సుబ్రహ్మణ్యం సేతుమాధవన్ గారు (వీరు కొన్ని తెలుగు సినిమాలు కూడా తీసారు) శ్రీ రమణ గారి “బంగారు మురుగు” ను సినిమాగా తీస్తున్నారని వినికిడి. వీరే పాలగుమ్మి వారి పడవ ప్రయాణం కథను ఒక సినిమాగా తీసారంట. ఆ సినిమా వివరాలు ఎవరికైనా తెలిస్తే తెలపండి.
ఆధారాలు:
1 . రచన, సెప్టెంబరు 2000
2. కథా మహల్ 2000 (శ్రీ శాయి గారికి ధన్యవాదాలతో)
3. MT వెబ్ సైట్: www.mtvasudevannair.com
4. ఇతర వెబ్ సైట్లు
మూల కథ (తెలుగు) : శ్రీ రమణ
సమర్పణ: John Paul Films And Asianet Communications Pvt. Ltd
కళ: రాధాకృష్ణన్ మంగలత్
కూర్పు: బీణ పాల్
సంగీతం: జాన్సన్
ఛాయాగ్రహణం: సన్నీ జోసెఫ్ (ఈయన ’పిరవి’కి కూడా చేసారు)
Promoted by: Kerala State Film Development Corporation & Chitranjali Studio
సహనిర్మాత: Asianet Communications Pvt Ltd.
నిర్మాత: జిషా జాన్
చిత్రానువాదం, మాటలు,దర్శకత్వం: M.T. వాసుదేవన్ నాయర్
తారాగణం: ఒడువిల్ ఉన్నికృష్ణన్ (ఇతనే అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వం లో వచ్చిన “నిళల్ క్కూత్తు(Shadow Kill: చేతబడి)”లో ఉరిశిక్ష అమలుపరిచే దళారిగా నటించారు), P.K. వేణుకుట్టన్ నాయర్, పాల్, ముకుందన్, జాయ్, నిర్మల శ్రీనివాసన్ మొ||
Filed Under: featured • lead • భారతీయ సినిమా • మలయాళం • సమీక్ష
మంచి కథ. బాపూగారి దస్తూరితో ఉన్న ఈ కథను అప్పట్లో జంపాల చౌదరిగారు తనకు తెలిసిన నలుగురితో పంచుకున్నారు. అలా నా దగ్గరికీవచ్చింది. కానీ దీన్ని మళయాళీలు సినిమాగా తీసారనీ, అసలు దీన్ని సినిమాగా తీయొచ్చనీ నాకు తెలీదు, అనిపించలేదు… మీరు చెప్పేదాకా. ఈ సినిమా ఎక్కడన్నా దొరుకుతుందేమో చూడాలి. థాంక్స్ విజయవర్ధన్!
గాంధీ సినిమాను ఇంగ్లీషోడు తీసినట్టు, మన సాహిత్యాన్ని మరొకరు తియ్యాల్సిందే! మనకు మన సాహిత్యంపట్ల ప్రేమ నిబద్ధత ఎక్కడేట్చాయీ?
తెలుగువాళ్ళను వెక్కిరించడానికే మీరు ఉన్నట్లున్నారు…
పొనీ కామెంట్ చేయడం కాక మీరెం చేసారో చెప్పండి…
..
చాలా మంచి వ్యాసం విజయవర్ధన్ గారు. అదే పుస్తకంలోని “బంగారు మురుగు” కథని కూడా సినిమాగా తీస్తే బాగుండెది. Google చేస్తే http://www.megavideo.com/?v=HN6IWAE0 లో ఈ సినిమా దొరికింది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి చూడ్డానికి ఇబ్బంది ఉండదు.
చందు గారు, మంచి link తెలియజేసినందుకు ధన్యవాదాలు. “బంగారు మురుగు” ను సేతుమాధవన్ గారు తీస్తున్నారని వినికిడి.
చాలా మంచి వ్యాసం అందించారు. అసలైన దాంపత్యానికి అర్థం చెప్పే ఓ మంచి సరదా కథ. మనల్ని నవ్విస్తూనే కంట తడిపెట్టించే కథ. మీరు చెప్పిన చిత్రం చూడాలనిపిస్తుంది.
“ఆయన కంటే నేను ముందు వెళ్ళకూడదు. ఆయన పోయేవరకు కంటికి రెప్పలా చూసుకునేదెవరు మరి”
అసలు మాటల్లో…….
“నే ముందు పోతే పసుపు కుంఖాలు మిగిలేవేమో గాని ఆ జీవుడు ఎంత అవస్థపడేవాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే-పచ్చని చెట్టు కింద కూచుని చెబుతున్నా–’దేవుడా ఈ మనిషిని తీసికెళ్లు-ఆనక నా సంగతి చూడు’ అని రోజూ దణ్ణం పెట్టుకునేదాన్ని. మొగుడి చావు కోరుకునే వెర్రి ముడలుంటారా అనుకోకు. వుంటారు. నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన ముచ్చట చెల్లక పోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకునేది.”
“చీకటంటే భయం–ఉరిమితే భయం–మెరుపంటే భయం–నే వెన్నంటి వుండక పోతే ఎవరు ధైర్యం ఇస్తారు!అర్థరాత్రిపూట ఆకలేస్తుందని లేచి కూచుంటే ఆవిరి కుడుములూ కందళ్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు? పిలిస్తే పిలకెత్తే వెర్రి కోరిక లెవరు తీరుస్తారు? కొడుకా–కోడలా–మనవడా–దేవుడా? నేన్నది కరెష్టా కాదా?”
@ సిరిసిరిమువ్వ: కథలోని మాటలు అందించినందుకు ధన్యవాదాలు.
మొన్ననే ఒక బ్లాఙ్మిత్రుల ఇంటికి వెళితే,
ఆయన నాకు ఈ కథ ఇచ్చి దాన్ని చదవమని చెప్పారు. నేను ఇంటికి తీసుకువచ్చి ఆ కథ చదివి ఆయనకు తిఱిగిచ్చాను. ఇలా ఆయన ఈ కథని గత పదేళ్ళలో ఎంతో మంది చేత చదివించారఁట. వారింటిలో శ్రీరమణ గారు వేసిన ఉత్తరం కూడా వుంది. అది చదివిన నాలుగు రోజులుకే అసలు సినిమా గుఱించి ఇలా నత లో చదవడం చాలా సంతోషకరంగా వుంది. ఆయన కూడా సినిమా వీడియో దొరికితే బాగుణ్ణు అనుకుంటున్నారు. ఇచ్చినందుకు ధన్యవాదాలు.
కథ చాలా బాగుంది అని వేఱేచెప్పనక్కరలేదు. కథలోని ప్రతి అక్షరం కొలిచి వ్రాయబడ్డది అనిపించింది నాకు. పెర్ఫెక్ట్ స్కిరిప్ట్ అంటే నమ్మండి. కానీ బాపుగారి వ్రాత చదవడం కొంత కష్టమనిపించింది. దాని బదులు మామూలు ప్రింటు అయితే సరిపోయేదిగా అనుకున్నాను .
- రాకేశ్వర
మంగళసూత్రాన్ని తూడుగా వాడడం ఆ బొమ్మలో నేను గమనించక, నాకు ఆ బొమ్మ అర్థం కాలేదు. వివరించినందుకు ధన్యవాదాలు. కథ చదివిన తరువాత బొమ్మ చూడాలనమట.
బాపుగారు కూడా వారు బొమ్మలు వేసిన కథలకు ఇంకో కొత్త డైమణ్షన్ ఇస్తారు. పసలపూడి కథలైనా, అమరావతి కథలైనా.
శ్రీ రమణ గారు వ్రాసిన “మిథునం” మొట్టమొదటగా “ఆంధ్రభూమి” వారపత్రిక లో 1998 లో చదివాను. అది చదివడం పూర్తి అయ్యేసరికి,నాకు ఒక్కసారిగా కళ్ళంబట నీళ్ళు వచ్చేశాయి. ఒక ఇన్లాండ్ తీసికొని నా అభిప్రాయం,స్పందన శ్రీ రమణ గారికి వ్రాశాను. దానికి ఆయన తిరిగి జవాబు ఇచ్చారు (స్వదస్తూరితో), ఆ ఉత్తరం ఈనాటికీ నా దగ్గర జాగ్రత్తగా ఉంది. చిత్రం ఏమిటంటే, ఆ ఉత్తరం అందిన సరీగ్గా 10 సంవత్సరాలకి అంటే 16-02-2008 ,మా చుట్టాల ద్వారా హైదరాబాద్ లో ఆయనతో 4 గంటలు గడిపే అదృష్టం నాకూ, నా భార్యకి కలిగింది. ఆరోజున, ఆయన వ్రాసిన “శ్రీ రామాయణం” మాకు బహుమతిగా ఇచ్చారు.
నాకు తెలిసిన ప్రతీ తెలుగు వారికీ, ఈ కథ ని క్సెరాక్స్ తీసి చదివించాను, ఈ 11 సంవత్సరాలలో. మిథునం ఒక అద్భుత సృస్టి.
పైన మిత్రులు ,”బాపు గారి చేవ్రాత చదవడం కొంచెం కష్టం అయ్యింది” అన్నారు. ఈ విషయమై నా ఉద్దేశ్యం ఏమిటంటే,….మనం ఈ నాడు
పూర్వపు రోజుల్లో వ్రాసిన తాళ గ్రంధాలు ఎంత అపురూపంగా చూస్తున్నామొ, అదే విధంగా కొన్ని సంవత్సరాల తరువాత ” మా రోజుల్లో బాపు అనే మహానుభావుడు ఉండే వారు.. ఆయన స్వదస్తూరి తో వ్రాసిన మిథునం అనే నవల చదివే అదృష్టం నాకు కలిగింది” అని మన తరువాతి తరానికి చెప్పుకొనే భాగ్యం కలుగుతుంది.
మిథునం నవల మామూలు లిపి లో కూడా ప్రచురించారు
భమిడిపాటి ఫణిబాబు
ఫణి బాబు గారు,
అదేచేత్తో ఆకధ ని స్కాన్ చేసి మా అందరికి కూడా చదివే భాగ్యం కలిగించగలరా. ప్రకామ్య లో ఫైల్ లోడ్ చేసే సౌలభ్యం ఉంది. థాంక్స్ ఇన్ అడ్వాన్స్. థాంక్స్ టు శిద్దారెడ్డి వెంకట్ అని కూడా మనస్పూర్తి గా చెప్పాలి ఇంతటి సౌకర్యం ఇస్తున్నందుకు.
రాకేశ్వర్రావు గారూ,
కధంతా ఒక ఎత్తైతే, బాపు రాత మరో ఎత్తు.
ఆ దస్తూరిలో ఆ కధ యింకొంత కొత్త అందంతో కనిపిస్తుంది.
ఎట్ లీస్ట్ – నాకు.
రమణమూర్తి గారు అన్నట్లుగా బాపు గారి దస్తూరీ తిలకం తో ఈ కథ ఇంకా బాగా బాగా వఛ్ఛేసింది.
ఫణిబాబు
ఇంకా మొదటి లైన్ మాత్రమే చదివాను. తెలుగు కథ ఆధారంగా మలయాళం సినిమా…వావ్! శ్రీరమణ గారూ జిందాబాద్!
సౌమ్య గారూ,మీరు ఒక్క లైన్ మాత్రమేచదివానంటున్నారు. ఈవేళ మిథునం మీద చర్చ చదివిన తరువాత ఆ కథ ని మళ్ళీ ముప్పయ్యో సారి చదివాను. ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు.
వెంకట్ ఉప్పులూరి గారు ఆ కథని అప్లోడ్ చేయమన్నారు, నేను అంత టెక్నికల్లీ ఎడ్వాన్స్ అవలేదు. ఏదో నాకుతెలిసిన వాళ్ళందరిఛేత చదివించడం వరకే చేయకలిగాను. మిత్రుడు రాకేష్ ఈ బృహత్తర కార్యం చేస్తానంటే, నేను శ్రీ రమణ గారికి ఫోన్ చేసి ఆయన అనుమతి తీసికొంటాను.
ఫణిబాబు
మొదటి లైన్…ఈ రివ్యూది. మిథునం కథది కాదు.
చాలా మంచి పని చేశారు. అద్భుతమైన సినిమాని పరిచయం చేసి. ఆ పుస్తకానని నేను నాలుగు సార్లు చదివాను.
కానీ బాపు దస్తూరిలో చూడలేదు.
అప్లోడింగ్ ఏమన్నా?
వెంకట్ గారు, మీ నవతరంగం వర్ధిల్లు గాక.
మొత్తానికి నా అభిమాన రచయిత శ్రీరమణ గారి మిథునం కధని ఇక్కడ పట్టుకోగగలిగాను. ఇంతకుముందెప్పుడు ట్రైచేసినా ఫాంటు సరిగా ఓపెన్ అయ్యేది కాదు. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో ప్రత్నించండి.
http://www.telugupeople.com/ShortStories/content.asp?ContentID=6180&uid=20090328112934&Page=1
ఉమాశంకర్ గారు, చాలా థాంక్సండి. మిత్రుడు మణి చెపితే telugupeople.com లో వెతికితే దొరకలేదు. మీరు లంకె తెలియజేసినందుకు ధన్యవాదాలు.
“కాగల కార్యం గంధర్వులే ఛేశారు ” అన్నట్లుగా శ్రీ ఉమాశంకర్ గారు ఇచ్చిన లింక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో పేస్ట్ చేసేసి, చదివేసి,
ఆనందిస్తారని భావిస్తున్నాను.
భమిడిపాటి ఫణిబాబు
ఈ వ్యాసం ఎంతో కొంత ఉపయోగడనందుకు సంతోషంగా వుంది. అందరికి ధన్యవాదాలు.
మొత్తానికీ పట్టేసుకున్నారు. నెట్టీకరణా మజాకా?
విజయవర్ధన్ గారూ, నేను ఒక తెలుగువాడిగా గర్వించదగిన, ఒక తెలుగువాడిగా సిగ్గుపడాల్సిన విషయాన్ని మీరు చెప్పారు. గర్వించడం ఎందుకంటే, మన తెలుగు కథను, అదీ పూర్తి తెలుగు వాతావరణంలో రాసిన కథ అనువాదం చదివి ఎం. టి. వాసుదేవన్ నాయర్ మహా రచయిత, దర్శకుడు స్పందించి దాన్ని సినిమాగా తీయటం జరిగినందుకు, ఇక సిగ్గుపడాల్సింది ఎందుకంటే, ఒక తెలుగువాడిగా ఈ విషయం ఇన్నాళ్ళుగా తెలియనందుకు. బహుశా, ఒక్క ‘నవతరంగం’ ద్వారా తప్పితే ఈ విషయం తెలుసుకునే అవకాశం నాకు ఉండేది కాదేమో. చచ్చు, పుచ్చు సినిమా విశేషాలతో ఊదరగొట్టే మన తెలుగు పత్రికలేవీ ఈ విషయాన్ని ప్రస్తావించిన గుర్తు నాకు లేదు. మొత్తంమీద మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు.
‘మిథునం’ కథ ‘ఆంధ్రభూమి’ లో వచ్చిన విషయం కూడా మీ వ్యాసం చదివే వరకూ నాకు తెలియదు. నేను దాన్ని మొట్టమొదటగా చదివింది, ‘బాపు’ గారి చేతి రాతతో ‘రచన’ పత్రికలో వచ్చినప్పుడే (ఆ కాపీ నా దగ్గిర ఇప్పటికీ ఉంది). ఇక కల్లూరి శ్యామల గారు (ఆవిడ పేరు కల్లూరి శ్యామలయే. డిల్లీ ఐ.ఐ.టి. ఇంగ్లీషు శాఖలో ప్రొఫెసరు. నాకు బాగా తెలుసు), ‘కథ’ లో చేసిన అనువాదం కూడా నేను చదివాను. అయితే అది చదివాక ఇంత పూర్తి తెలుగు వాతావరణంలో ఉన్న కథను ఇతరభాషల వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుని ఆనందిస్తారు? నేటివిటీ లేదే? అని ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నాను. కాని ఇప్పుడు నా అభిప్రాయం తప్పని తెలిసింది. నిజానికి ఆ కథను ఇంగ్లీషులో అనువదించటం సాహసమే. అయితే, ఆ కథలో చూపించిన హాస్యం మళయాళంలో వైక్కోం మహమ్మద్ బషీర్ శైలికి కొంచెం దగ్గిరగా ఉంది. అందుకే వాళ్లకు అది నచ్చి ఉంటుంది. ఇక కథను వాళ్ళ నేటివిటీకి దగ్గిరగా మలుచుకోవటం సమర్థనీయమే. లేకపోతే, అది వాళ్ళు ఆనందించలేరు. మొత్తంమీద మన కథ మళయాళీలకు నచ్చటం కొంత ఆశ్చర్యంగానే ఉంది – అదీ తెలుగు వాతావరణానికి దగ్గిరగా ఉన్న కథ. ఇది తప్పకుండా మనదగ్గిర ఉంచుకోవలసిన సినిమా. నేను ఈరోజే డి.వి.డి. బుక్ చేస్తాను.
ఇక ఈ కథ ‘నవతరంగం’ లో పెట్టడం గురించి – నా దగ్గిర బాపు గారి చేతిరాత ప్రతి ఉంది. అది స్కాన్ చేసి పంపగలను. కాకపోతే, శ్రీరమణ గారి దగ్గిరనుంచి అనుమతి తీసుకోవాలి. శ్యామల గారి అనువాదం కూడా సంపాదించవచ్చు. దానికి బహుశా ‘కథ’ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుందేమో.
చిన్నది కాకపోయినా చివరి విషయం – ఎం.టి. వాసుదేవన్ నాయర్ గారు శ్రీరమణకు రాసిన ఉత్తరం, రచన ముఖచిత్రం, బాపు రాసిన కథ పేజీ సంపాదించి ఎంతో ఒద్దికగా, అందంగా దిద్ది తీర్చిన మీ వ్యాసం మరచిపోదామన్నా మరపుకు రానిది. నా ప్రత్యేక అభినందనలు.
శషు గారు,
మీకు ఈ వ్యాసం informativeగా వున్నందుకు సంతోషంగా వుంది. నాకు వ్రాయటంలో అనుభవం లేదు. కేవలం పరిచయం చేయాలనే ఉద్ధేశంతో వ్రాసాను. చందుగారు video లంకె ఇచ్చారు. అది చూసి ఎవరైనా సమీక్ష వ్రాస్తే బాగుంటుంది. అలాగే ఉమాశంకర్ గారు ఈ కథ (బాపు గారి దస్తూరి తిలకం) link అందించారు. ఈ సినిమా DVD ఇంకా రాలేదనుకుంటా. మీకు తారసపడితే తెలపండి.
శేషు గారు, క్షమించాలి మీ పేరు వ్రాయడంలో తప్పు దొర్లింది..
ఈకథని ఎల్.బి.శ్రీరాం గారితో తెలుగులో సినిమా చెయ్యాలని తనికెళ్ళభరణిగారు చాల ప్రయత్నం చేసారు ప్రొడ్యుసర్కి ఎల్.బి.మీద నమ్మకంలేక ఆగిపోయింది.పాపం నిర్మాత!’అమ్మొ ఒకటో తారీకూ మొన్నవచ్చిన ‘సొంతవూరు ‘చూస్తే అందరికితెలుస్తుంది ఎల్.బి.ప్రతిభ.బాపు బొమ్మలో పాత్రలాగ వుంటాడనినా అభిప్రాయం అయినా పట్టువదలని విక్రమార్కునిలా భరణి ప్రయత్నిస్తూనేవున్నారు.ఔత్సాహిక నిర్మాతలెవరైనా భరణిగారిని సంప్రదించి ,మిధునం ని తెలుగు సినిమాగా చూడాలని కోరుకుందాం.మంచి కధగురించి నవతరంగంలో తెలియజేసిన విజయవర్ధన్ గారికి ధన్యవాదాలు.
@ceenu ; తనికెళ్ళ భరణిగారి ‘సిరా’ చూశాను. దాదాపు మొదటి ఎనిమిది నిమిషాలలో చెప్పాలనుకున్నది చెప్పేసాక, దాని ప్రభావాన్ని ఈసడించుకునే విధంగా మిగతా ఇరవై నిమిషాల్నీ పొడిగించి, అంత మంచి సందేశానికి ప్రేక్షకుడు అసహ్యించుకునేలా చెయ్యడం ద్వారా సాధించిన సృజనాత్మక తృప్తేమిటో అర్థం కాలేదు.
చాలా మంచి ప్రయత్నమే అయినా, అదొక నాటకంలా అనిపించింది. బహుశా నాటకరంగ అనుభవం నీడలు భరణిని వీడిపోలేదేమో! అలాంటప్పుడు, భరణి గారి నుంచీ ఒక పూర్తిస్థాయి చలన చిత్రం ఆశించే ఆశ పడమంటారా?
సిరాలో సినిమాకు కావలసిన “భాష” మాత్రం లోపించిందని ఖచ్చితంగా చెప్పగలను. ముఖ్యంగా నేపధ్య సంగీతం, అనవసరపు ‘సింబాలిజం’ పాట్లు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఒక అనుభవజ్ఞుడైన సినీ కళాకారుడి సునిశిత దృష్టి,వినికిడి,ఆత్మ లోపించాయి.
@కె.మహేష్ కుమార్….సిరా విషయంలో నేనుమీతోఏకీభవిస్తున్నాను.మిధునం విషయంలోఅలాకాకూడదని ఆశిస్తున్నాను.ఓమంచికథని సినిమాగా చూడాలని.
mahesh…
u r suffering from serious inferiority complex…consult a professional man
Thanks…nice info…
తెలుగు కథలలో వచ్చిన అద్భుతమైన కథ ‘మిధునం’.
నేను ఈ కథని మొదటిసారి రచనలో చదివాను.
ఆ తరువాత తెలుగు పీపుల్.కాం లో చదివి నా బంధుమిత్రులలో చాలా మంది చేత చదివించాను.
ఈ కథని సినిమాగా తీసారని ఇప్పుడే తెలిసింది.
ఈ సినిమాని తెలుగులో అక్కినేని నాగేశ్వర రావు, షావుకారు జానకి గార్లు చేస్తే చూడాలని నా కోరిక. తీరుతుందో లెదో?
అందమైన బాల్యం గురించి అందరూ వ్రాస్తారు. కాని అందమైన వృధ్ధాప్యం గురించి చక్కగా వ్రాసిన కథ ఇది.
ఎంతమందికి ఇలాంటి అందమైన వృధ్ధాప్యం కలిగే భాగ్యం దక్కుతుంది?
I have no accessibility for the telugu font right now, so this comment in English with due apologies. In this write up the article says the story was translated by Vatluri Syamala though some websites mention this as Kallury Syamala. It was translated by me Kallury Syamala and Sriramana garu actually showed this letter to me when I visited him after both of us got the award for the story and the translation. Also I traslated Bangaru Murugu for the indian Literature which was also very well received though it had editorial mistakes which could be attended to. If any one is interested I can wirte a dramatic version to it also.
It is rather educating for me to see that the story got its atention through the Katha Publication of it int heir volume and no one knows for sure who the translator was. And does it not tell us something? While one is not looking for any gain at least reccognition should come if the ranslation is good enough for the story to attract the atention of good critics and film makers like Vasudevan Nair. Thank you
శ్యామల గారు,
క్షమించాలి మీ పేరు కావాలని తప్పుగా వ్రాయలేదు (google లో వెతికి వుండాల్సింది. పొరపాటే) . మీరే స్వయంగా మీ అభిప్రాయాన్ని, అప్పటి సంగతులను తెలియజేశారు. ధన్యవాదాలు. “బంగారు మురుగు” dramatic version offerకు మంచి స్పందన వుంటుందని నా నమ్మకం.
I was just commenting on the plight of the traslators. I did not intend it as a personal comment against anyone. When some one takes it up for film in other languages or the TV serials that have come on stories like Amaravati kathalu the subtitles were so bad. If the subtitles are given correctly maybe some some of the spirit of the original story can be retained. I also watched hindi version of Veyi padagalu on hindi doordarshan which was quite dull and maybe it is our knowledge of telugu which works against our appreciation of these efforts. But one thing for sure: Translation can never hold even a candle to the original. Still we have to make these efforts. This story was recommended for translation to Katha by Dasari Amarendra. After its response he was not sure his choice was the right one and he voiced this on many occasions. He felt it was too traditional and reminded him of same old ramayana mould. I liked it and tranlated it as I appreciated telugu nudi in the story, in all the stories of Sriramana garu in fact telugu language is at its musical best.
I am enjoying the discussion. Can any one educate me how to use the telugu fonts during this summer Seshu garu?
శ్యామల గారు
“బరహ” (కన్నడలో బరహ అంటే వ్రాయుట) అనే free softwareని download చేసుకోండి.
http://www.baraha.com/download.htm
నేను ఇప్పుడు BarahaUnicode 1.0 లోని BarahaIME వాడుతున్నాను. 01 April నంచి 2.0 లభిస్తోంది. చూడండి. మీకు ఏమైనా ఇబ్బందులుంటే నాకు mail చేస్తే నాకు తెలిసినంతలో సహాయపడగలను.
నా email id: bvijay@gmail.com
నాకు ఇఎ మైల్ పంపించి సహాయపడిన మీకు చాల ధన్యవాదాలు. ఇప్పట్నుంచే సాధన చేసెయ్యాలని ఉత్సాహము వచ్చేసింది.
నిన్ననే మళయాళ సినిమా ఒరు చిరు పుంచరి చూసాను. కథుంది కానీ ఆత్మలేదు. కథలో ఉండాల్సిన సహజ సంబంధాలు కొన్ని సరిగ్గా చూపించలేకపోయారు. అనువాదంలో అడుగున పడిపోయాయి.
నటులు మరీ అంత గొప్పగా చేయలేదు. చాలా గొప్ప కథని చప్పగా చిత్రీకరించారు. మిధునం కథలో తెలుగుదనం కనిపిస్తుంది. మాటల్లో విరుపులూ, దెప్పిపొడుపులూ, వ్యంగ్యాలూ, ఇవన్నీ లేవనిపించింది.
నేనూ మొత్తం సినిమా కాకపోయినా, అర్థగంట వరకూ నిన్న చూశాను. ఈ మళయాళం సినిమాలో తెలుగుతనం లేదనుకోవటం అర్థంలేనిది. అది ఎలాగూ ఉండదు. తెలుగులో ఉండే మాటవిరుపులు మళయాళంలో ఎలా వస్తాయి? అలాగే మళయాళంలో ఉండే మాటవిరుపులూ తెలుగువాళ్ళకు అర్థం కావు – ఆ భాష తెలిస్తే తప్ప. అవి తెలియాలంటే కొంతలో కొంత ఆ భాష నేర్చుకుని చూడటం తప్ప వేరే మార్గం లేదు. కథలో ఉన్న ఆత్మ అన్నారు కదా – అవును. దాన్ని పట్టుకుంటే ఈ సినిమాను ఆనందించటం పెద్ద కష్టమేమీ కాదు. అసలా ఆత్మను పట్టుకోనిదే, వాసుదేవన్ నాయర్ ఎలా దీన్ని సినిమాగా తెయాలనుకున్నాడు? తాను చదివి ఆనందించలేని కథను ఏ దర్శకుడూ ప్రేక్షకులకు చూపించలేడు. నేను మొట్టమొదటిగా చదివినప్పుడు, ఈ కథ నాకు కొంచెం అతిగా ఉందనిపించింది. అలా అని కథను పూర్తిగా తీసిపారేటట్టుగా కూడా లేదు. మనం నిరాకరించలేని అంశాలు కొన్ని, కథ అక్కడక్కడా నచ్చకపోయినా, చదివినతర్వాత మనలను వెన్నాడతాయి. బహుశా ఆ లక్షణమే ఈ కథను ఇప్పటివరకూ పాఠకుల్లో నిలబెట్టింది. ఒక కథైనా, సినిమా అయినా – కొన్నిటి విషయంలో ఒక్కసారి చదివి, లేదా చూసి త్వరగా ఒక అభిప్రాయానికి రావటం తప్పేమో అనిపిస్తుంది. వాటిని మరి కొన్ని సార్లు పరిశీలిస్తే తప్పకుండా మనం అర్థంచేసుకోగల అంశాలు చాలానే ఉంటాయని నా అభిప్రాయం.
శేషు గారు, బ్రహ్మానందం గారు,
మీరిద్దరు ఆ సినిమా చూసారు కాబట్టి, సమీక్షలు వ్రాస్తే బాగుంటుంది. ఏమంటారు?
బహుశా తెలుగు కథ ఇంకా కళ్ళ ముందు కదలాడుతూ అదే ఊహించుకొంటూ చూడడంవల్ల 15 నిమిషాలకంటే ఎక్కువ చూడలేకపోయాను. కథ చదవకుండా ఉండి ఉంటే మొత్తం సినిమా తప్పక చూడగలిగేవాడిని.
నేనిప్పుడే కథ పూర్తిగా చదివాను. నాకైతే “గొప్పగా” అనిపించలేదు.
మీరు పైన కామెంట్సన్నీ చదివి మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసారేమో
‘మిథునం’ కథ పాఠకుల్లో కలిగించిన అనుభూతి వాసుదేవన్ నాయర్ సినిమా ప్రేక్షకుల్లో కలిగించలేదు అని బ్రహ్మానందంగారు, తదితరులు అనుకోవటంలో తప్పేమీ లేదు. అది వాస్తవం అయ్యిండొచ్చు కూడా. అయితే, మనం కాస్సేపు మూలకథను మరిచిపోయి సినిమా అసలు సారం మీద దృష్టి కేంద్రీకరించి చూస్తే, మంచి సినిమా అనిపించ వచ్చేమోననే ఉద్దశంతోనే నేను పై వ్యాఖ్యలు రాశాను. నేను కూడా లోగడ కొన్ని ప్రసిద్ధ తెలుగు రచయితల కథలు దూరదర్శన్ లో చూసి చాలా నిరాశ చెందాను. ఎందుకంటే ఎంతో గొప్పకథలుగా పేరుపొందిన కారా ‘జీవధార’, శ్రీపాద వారి ‘గులాబీ అత్తరు’ వంటి కథలను చాలా పేలవంగా చిత్రీకరించారు. అవి చూసి భవిష్యత్తు తరాల వారు ఆ కథల గొప్పతనం ఇంతేనా అనుకునే ప్రమాదం చాలా ఉంది. అసలు కొన్నిసందర్భాల్లో రాసే ప్రక్రియకీ, తీసే ప్రక్రియకీ పొంతన కుదరదా అని కూడా అనిపిస్తుంది (ఈ విషయంలో పూర్తిగా విజయం సాధించిన దర్శకుడు ఒక్క సత్యజిత్ రాయ్ మాత్రమే అనుకుంటాను – అయితే తను కూడా పాఠకులనుంచి చాలా విమర్శలు ఎదుర్కొన్నానని ఆయన రాశారు. అంతమాత్రం చేత బెంగాలీ వాళ్ళం కాని మనం ఆ చిత్రాలను ఆనందించకుండా ఉన్నామా? ఎన్ని దేశదేశాల చిత్రాలను భాష ఏమాత్రం తెలియకపోయినా, కేవలం కథను అర్థం చేసుకుని ఆనందించడంలేదు?). మన కథను ఒక పరభాషలో చిత్రంగా తీసినప్పుడు దూరదర్శన్ కథల్లా విమర్శించడం కుదరదు (ఎందుకంటే దూ.ద.లో తెలుగు బాగా తెలిసిన మనవాళ్ళు తీసినవే కాబట్టి మనకు విమర్శించే స్వేచ్చ ఉంది). మన కథలో ఉన్న భావాలను ఆమాత్రం అర్థం చేసుకుని సినిమా తీశారంటే, దానికి ముందుగా కావలసినవి ప్రోత్సాహకరమైన మాటలు. తర్వాత విమర్శలు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలను కొంత సానుభూతితో అర్థం చేసుకోవలసి ఉంటుందనేది నా అభిప్రాయం. మన సాహిత్యం మనకే సొంతం అనుకుంటే (అనుకున్నందువల్లనే) తెలుగు సాహిత్యం ఈనాటికీ ఇతరభాషల వాళ్లకు చేరకుండా ఉంది.
లంకెలో ఉన్న కొన్ని అసౌకర్యాలవల్ల నేను సినిమా గంటకంటే ఎక్కువ చూడలేక పోయాను. వీలుచూసుకుని పాక్షికంగా చూసినంతవరకైనా దాన్ని గురించి నాలుగు మాటలు రాసే ప్రయత్నం చేస్తాను.
మళయాళం నాకు రాదు. కాదనను. ఇతర భాషా చిత్రాలు దూరదర్శన్ లో అనేకం చూసాను. అస్సామీ, బెంగాలీ, మళయాళం, ఒరియా, ఇలా అనేక భాషల కథలు సినిమాలుగా వచ్చాయి.
భాషతో సంబంధం లేకపోయినా ఎన్నో సినిమాలు చూసి ఆనందిచాను. సినిమాకి భాష కంటే దృశ్యమే ఎక్కువ చెబుతుంది. కథని పక్కన బెట్టి, సినిమాని చూసినా ఇందులో జీవం లేదు. ఆత్మ కనిపించలేదు. ముఖ్యంగా ఆ ముసలావిడ పాత్ర మిధునం కథకి ప్రాణం. ఆవిడ పాత్రని సతీ సావిత్రి పాత్రలా సినిమాలో చిత్రీకరించారు. రాసింది తెలుగు కథయినా వస్తువు సర్వకాలీనం. భాషాతీతం. కాబట్టి తెలుగుదనం ఆశించి చూడలేదు. కానీ కథలో వున్న విరుపులూ వ్యంగ్యాలూ ఇవేమీ పట్టించుకోలేదన్నదే రాసాను. అవి మళయాళంలో ఉన్న చాయలు కూడా కనిపించలేదు. మళయాళం రాకపోయినా ఇంగ్లీషు అర్థమవుతుంది. సబ్ టైటిల్స్ లోనూ అవి కనిపించలేదు. సినిమా అంటే మలుపులూ, కథంటే సస్పె న్స్ ముగింపులూ ఉండాలనుకునే వర్గానికీ మిధునం నచ్చదు.
I have seen the movie from the link. Not that interesting, but not far behind. Anyway, one can watch it leisurely.
నాకు తెలుగు, ఇంగ్లీష్ తప్ప ఇతర భాషలేవీ రావు. అదీ సినిమా నామీద అంత ప్రభావం చూపకపోవటానికి కారణం కావచ్చు.
మిథునం కథ కూడా నాకు అంత ఎకలేదు. ఎందుకో మధ్యలోనే వదిలేశానలా. మరో ట్రై చేయాల్సిందేనేమో?
ee movie ni youtube lo chudochandi… 11 parts unnayi… mithunam katha chadavakunda aa cinema chusi vunte inka baaga nachedi… katha chadivaaka… kathane bagundanipistundi…
ఒక చక్కటి కథని గురించి, ఒక మంచి సినిమా గురించి..చాలా చక్కటి సమీక్ష రాశారు. అభినందనలు
[...] ఒరు చెరు పుంచిరి, MT Vasudevan Nair | Leave a Comment నవతరంగంలో|ప్రచురణ: March 28, 2009 at 12:59 am ఈ సినిమా మన [...]