Menu

సంగీత దర్శకుడు కార్తిక్ తో ముఖాముఖి

kartikవిజయానికి దగ్గరి దారులు ఉండవు అని చాల మంది చెప్తుంటారు, కాని వాస్తవం ఏమిటంటే షార్ట్ కట్ వెతకడమే విజయం అనే విషయం చాలమందికి బోధ పడదు. కొంతమంది ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కాని చాల మంది మాత్రం బయటెక్కడో ఏదో సాధిస్తేనే ఇక్కడి వారు గుర్తిస్తారు ముఖ్యంగా సినిమా ఫీల్డ్ లో. నిన్న మొన్నటి వరకు సినిమా అంటే అభిరుచి ఉన్నవారంతా ఏ మద్రాసుకో లేదా ముంబాయికో లేదా హైదరాబాదు ఫిల్మ్ నగర్ లకు ఎలాగో అలాగా వచ్చిపోయి స్టూడియో ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి తమ కలలను సాధించుకునే వారు. అది పాత తరం మాట నేటి తరం అంతా “హం హై నయే.తో అందాజ్ క్యొ హొ పురానా”అనే టైపు కదా! అందుకే….తమ ఇంటి గడప దాటకుండానే,తమ చేతుల్లో దేవుడు ( నాస్తికుల మాటల్లో ఐతే సైన్స్)ఇచ్చిన ఇంటర్నెట్ టూల్స్ ని పూర్తిగా ఉపయోగించుకుంటూ సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. అలాంటి వారిలో యువ సంగీత దర్శకుడు కార్తిక్ ఒకరు.

గత సంవత్సరం నా సినిమా పని మీద మరో చిన్న సినిమా దర్శకత్వం కోసం కసరత్తులు మొదలెట్టిన ఒక దర్శక మిత్రుడి ఆఫీసుకి వెళ్ళినప్పుడు, అతను ఓ రెండు పాటలు వినిపించాడు.తాలింపుని చూసి వంట చెప్పొచ్చు అంటారు కదా అలా ఆ పాట ప్రారంభములొనే హమ్మింగ్ చాలా నచ్చింది.వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే కార్తిక్ అని చెన్నై నుంచి సాంగ్స్ రికార్డ్ చేసి పంపించాడని చెప్పగానే వెంటనే ఆ పాట మీద నా కర్చీఫ్ వేసుకొవాలనుకొని.  ఈ పాట నీకు అవసరం లేకపోతే నాకిస్తావా అని అడిగాను.వెంటనే కార్తిక్ కి ఫోన్ చేసి “కార్తిక్, తెలుగు సినిమా చరిత్ర లో నీకంటూ ఒక పేజి ఉందయ్యా ” అంటూ మనదైన స్టైల్ లో ఫొన్ లొనే సన్మానం చేసేసాను. పరిచయం పెరిగిన కొద్ది, కార్తిక్ ప్రొఫెషనల్ గా మంచి సంగీత దర్శకుడే కాదు,వ్యక్తి గతంగా కూడ చాలా మంచతను అని తెలిసిపొయింది.

ఈ మధ్య ’యూ అండ్ ఐ’ అనే ఒక తెలుగు సినిమా కు సంగీతం అందించే అవకాశం రావడంతో ఆ సినిమా ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చి వెళ్ళారు కార్తిక్.అలా పరిచయం మూడు ఫోన్లు ఆరు మెయిల్స్ లా నడుస్తుండగా మొన్నీ మధ్య ఫొన్ చేసినప్పుడు పాటల కంపొజిషన్ రికార్డింగ్ అన్ని అయ్యాయి, త్వరలొనే ఆడియో రిలీజు అని చెప్తుండగా నాకు మాటల మధ్యలో నవతరంగం గుర్తుకు వచ్చి ఇంటర్వ్యూ కావాలి అన్నాను. ఇంటర్వ్యూ అంటే ప్రత్యేకంగా ఏముంటది అని ఆ రాత్రి మరో రాత్రి నేను అడగడం ఆయన చెప్పడం, ఇదిగో ఇలా సాగింది..

సైఫ్:కార్తిక్ నవతరంగం తరపున మీకు స్వాగతం

కార్తీక్:ధన్య వాదాలు

సైఫ్:మొదట ఈ విషయం క్లియర్ చెయ్యండి కార్తిక్ తెలుగబ్బాయేనా..

కార్తీక్:అచ్చమైన తెలుగబ్బాయినే…

సైఫ్:చాల మంచి విషయం. మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట చేసిన ప్రాజెక్ట్ ఏంటి..?

కార్తీక్:చెన్నై లొ 21 వ సంవత్సరం వయస్సు నుంచే సంగీతంతో ప్రయోగాలు చేయ్యడం ప్రారంభించాను.లోకల్, ఇంటర్నేషనల్ బ్రాండ్ల యాడ్స్ కు దాదాపు 200 వరకు నేను జింగిల్స్ చేసాను.

సైఫ్:చెన్నయ్ ఎందుకు?

కార్తీక్:పుట్టింది, పెరిగింది, ఇక్కడే కాబట్టి…
సైఫ్:సరే ఇక విషయానికి వద్దాం..కేవలం కూని రాగం తీసి ట్యూన్ చెప్పటమేనా లేక, సంగీతంతో చిన్నప్పటి నుంచి ఏమైనా అనుబంధం ఉందా..?

కార్తీక్:అమ్మ, నాన్న ,అన్నయ్య ,బామ్మ ల లాగే సంగీతం కూడ చిన్నప్పటినుంచి నా ఫ్యామిలి మెంబరే.అంటే..నాకు 5 సంవత్సరాలా వయసున్నప్పుడే మా నాన్న గారు సంగీతంపై నాకున్న ఆసక్తి ని గమనించి వీణ నేర్చుకోవడానికి మ్యూజిక్ క్లాసులకు పంపేవారు కాని నా వయసుకి అది చాల పెద్దదై మోయలేని భారమవుతుందని గిటార్ నేర్పించారు.అలా మొదలుపెట్టి న సంగీతాన్ని ఇదిగో ఈ రోజు ఇలా మ్యూజిక్ డైరెక్టర్ గా మీ ముందుకొచ్చేలా….చేసింది.
సైఫ్:సో మీరు మంచి గిటార్ ప్లేయర్ అన్నమాట

కార్తీక్:ఇప్పుడు అంతగా ప్లే చేయ్యడం లేదు.

సైఫ్:అంటే అందరు తల్లి తండ్రుల లా కాకుండ…మీకు మిమ్మల్ని ప్రొత్సహించే…స్నెహితుల్లాంటి కుటుంబం దొరికిందన్న మాట.

కార్తీక్:నిజం చేప్పాలంటే అమ్మ,నాన్నా, పెద్దన్నయ్య కుటుంబం, నన్ను బాగా ఇష్టపడే బామ్మ అశీస్సులు  ఉన్నాయి.చిన్నదో పెద్దదో ఈ రోజు వస్తున్న లేక రేపు రాబోయే అవకాశాలు అన్నింటి వెనుక వారి ప్రోత్సాహం ఉంది. నాకు ఆర్ధికంగాను,మానసికంగాను సపోర్ట్ చేస్తున్న నా కుటుబానికి నేనెంతో ఋణపడివుంటాను.

సైఫ్:కుటుంబం కాకుండా.. ఇంకా చిన్నప్పటినుంచి ఈ రంగములో ఎవరైన ప్రేరణగా ఉన్నారా?

కార్తీక్:నా చదువంతా ఇక్కడే(చెన్నై) జరిగింది.కాబట్టి వెంకట సుబ్బరాయ హయ్యర్ సెకండ్రి స్కూల్ లో చదివే సమయం నుంచి ప్రముఖ తెలుగు గాయకుడు, మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్, ఆయన తమ్ముడు, మంచి గాయకుడు అయిన సాగర్ నాకు మంచి స్నేహితులు.ఒక విధంగా చెప్పాలంటే వారు నాకు ప్రేరణ.

సైఫ్:సొ చదువుకున్నారన్నమాట…(సాధారణంగా ఇంట్లో నుంచి పారిపొయి వచ్చిన వాళ్ళు, చదువు అంతగా ఒంటబట్టని వాళ్ళు,ఎక్సట్రా ఎక్సట్రా లు మాత్రమే సినిమా ఫీల్డ్ ను ఎంచుకుంటారని చాలా మంది ఇంకా అనుకుంటున్నారు కదా అందుకని అలా అడిగాను) గుడ్ అయితే మీరేం చదువుకున్నారో చెప్పండి?

కార్తీక్:అడ్వర్టైజింగ్ మరియ పబ్లికేషన్లలోఉన్నత విద్యను పూర్తిచేసాను.

సైఫ్:అన్నట్లు మ్యూజిక్ డైరెక్టర్లంటే అంతా ప్రైవేట్ ఆల్బం లు చేస్తారు కదా. మీరూ అలాంటివేమైనా చేశారా?

కార్తీక్:అవునవును. ప్రైవేట్ అల్బంలంటే సొషల్ అవేర్నెస్ కోసం కొన్ని చేసాను.ఉదాహరణకు సునామి, ఇరాక్ యుధ్ధం, ప్రపంచ శాంతి ఇలా కొన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది.విన్న వారందరు మెచ్చుకున్నారు.మలయాళంలో ఒకటి చేసాను.

సైఫ్:మాతృ భాషా తెలుగు, ఉండేది తమిళ నాడు లో చేసిన మొదటి ఆల్బం మలయాళం, అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది?

కార్తీక్:ఈ రంగములో నేను కాస్తొ కూస్తో ఇలా మీముందుకు రాగలిగాను అంటే ఆ క్రేడిట్ అంతా ఆర్కుట్ దే. మలయాళ ప్రొడ్యూసర్ శ్రీ సాజన్ గారు ఆర్కుట్లో నా ప్రొఫైల్ చూసి , వెంటనే నా ట్యూన్స్ ని డౌన్ లోడ్ చేసుకొని విని ఎంతగానో ఆయనకు నచ్చేసి వెంటనే మలయాళంలో ఒక కమర్షియల్ ప్రైవేట్ వీడియో ఆల్బం చేయడానికి ఆఫర్ ఇచ్చారు. “కనవుపొల్” అని 2007 సంవత్సరంలో చేశాం ఈ ఆల్బం. అది కేరళ లో మంచి హిట్ అయ్యింది. అది సక్సెస్ కావడంతో మలయాళంలోనే మరో రెండు వీడియో ఆల్బంస్ చేసె అవకాశం వచ్చింది.

సైఫ్:ఆల్బంలంటే భక్తి , రొమాంటిక్, జానపదం, ర్యాప్, ఇలా ఉంటాయికదా.అలాంటివాటి జోలికి పొలేదా?

కార్తీక్:భక్తి ఆల్బం ఒకటి చేసాను.శ్రీ శ్రీ త్రిదండి శ్రీరంగ రామనూజ జీయర్ స్వామి మహరాజ్ గారి ఆశీశ్శులతో ఆయన ఆధ్వర్యంలో శ్రీ పెరంబుదూర్ లొ ఉన్న శ్రీ రామనుజర్ మీద ఒక సంస్కృత భక్తి గీతాల ఆల్బంచేసాను. అది మన విశాఖలో కూడ విడుదలైంది దానికి కూడ చాల చక్కటి స్పందన వచ్చింది.

సైఫ్:సంస్కృతమా వేరి గుడ్!ఈ రోజుల్లో ప్రాంతీయ భాషల్లో ప్రైవేట్ ఆల్బంస్ అంతగా గుర్తింపు నొచుకోక పొవడానికి , రాక పోవడానికి కారణం?

కార్తీక్: ప్రైవేట్ ఆల్బంస్ ఎందుకురావడం లేదంటే ఒక రకంగా మీడియా సపోర్ట్ లేక పోవడం కూడ అని నేను అనుకుంటున్నా. కాని క్రమ క్రమంగా మార్పు వస్తుందనే ఆశ ఉంది.

సైఫ్:అదిసరే.ముందు “ఆ ఒక్క చాన్స్” కోసం చేసిన స్ట్రగుల్ గురించి చెప్తారా?

కార్తీక్:స్ట్రగుల్ అంటే దాని గురించి ప్రత్యేకముగా ఏం చెప్పాలి? అందరికి తెలిసిందేగా సినిమా కష్టాలు. నిర్మాతల ఆఫీసుల చుట్టూ, దర్శకుల ఆఫీసుల చుట్టూ తిరగడాలు అవన్ని తప్పవు కదా.తమ టాలెంటు తాము ప్రదర్శించాలంటే ఇవన్ని తప్పవు.అందుకే చెన్నై సినిమా ఆఫీసులు , హైదరాబాదులో కూడా తిరిగాను. ఇంకా తిరుగుతాను కూడా. ఎందుకంటే నాకు సంగీతమంటే ప్రాణం. ఇలా తిరిగే సమయాల్లోనే, మనకెంత టాలెంటు ఉన్నా కాని దానికి తోడు అదృష్టం అనేది కూడ ఉండాలి  అని తెలుసుకున్నాను. ఒక విధంగా నేను లక్కీ నే అని చెప్పుకోవాలి.

సైఫ్:సంగీత దర్శకుడిగా మీ ఆశయం?

కార్తీక్:ప్రాంతీయ భాషా భేదాలు చూపకుండా దర్శకులు కోరినట్లుగా ఎవరికి ఏం కావాలో వారికి నా నుంచి మంచి సంగీతాన్ని ఇవ్వాలన్నదే నా ప్రయత్నం.

సైఫ్:కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఖాళీ సమయాల్లో కొన్ని ట్యూన్లు చేసుకొని బ్యాంక్ గా ఉంచుకుంటారంట.అవసరమైనప్పుడు వెంటనే వాటిని తీసి వినిపిస్తారట! మరి మీరు….. అలా ఏమైనా చేసి రెడీగా ఉంచుకున్నారా?

కార్తీక్:నా వద్ద ఉన్న పాత ట్యూన్లను తీసి ఇవ్వడం కంటే..కూడా, ప్రస్తుతం చేస్తున్న సినిమాకు దర్శకుడు కొరినట్లు గా, కధా , సన్నివేశానికి తగినట్లుగా.. కొత్త ట్యూన్లను ఇవ్వడం అంటే నే నాకు చాలా ఇష్టం
ప్రస్తుతం చేస్తున్న ఈ “యూ అండ్ ఐ ” తెలుగు సీనిమా కు కూడ… నేను కధ విన్న తరువాత కొత్తగా చేసినవే…కాని నేను చేసి పేట్టుకున్న వాటిలొ నుంచి తీసి ఇవ్వలేదు.

సైఫ్:తొలి సినిమా అవకాశం మీ వద్దకు వచ్చిందా? మీరే వెతుక్కుంటూ వెళ్ళారా?

కార్తీక్:అందరు మ్యూజిక్ డైరెక్టర్ల గమ్యం సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ కావాలని, మంచి సంగీతం అందించాలని.ఆ కల నాకు చాలా త్వరలోనే నిజమైంది. “సైలంధి” అని ఒక తమిల్  హర్రర్ సినిమా చేసాను. చాల పెద్ద విజయం సాధించింది అది. నా శ్రమను అందరు మెచ్చుకున్నారు.ఆ అవకాశం ఎలా దొరికిందంటే….అది కూడ హఠాత్తుగా నే జరిగింది,ఆ సినిమాకు అప్పటికే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నారు కాని అతని వర్క్ తో వాళ్ళు సంతృప్తి చెందక, మరొకరి కొసం వెతుకుతున్న సమయం లో అదే సినిమాలో హీరో గా చేస్తున్న నా మిత్రుడు వారికి నా గురించి చెప్పడం, ఆ దర్శకుడు ఆ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశం నాకు ఇచ్చి బ్యాక్ గ్రౌండ్ సంగీతం చేసి చూపమని కోరడం, తరువాత నేను చేసినది విన్న దర్శకుడు వెంటనే నాతో అగ్రిమెంట్ రాయించుకొని అడ్వాన్సు ఇవ్వడం జరిగిపోయింది. అలా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాను.

సైఫ్:మళ్ళీ వెనక్కు వద్దాం? జింగిల్స్, ఆల్బంస్, సినిమా లలో ఏది కష్టం?

కార్తీక్:జింగిల్స్ అయినా ఆల్బంస్ అయినా లేక సినిమాలైనా నా మటుకు ఒక ప్రసవవేదనే.ఒకటి చాల సులభం మరొకటి కష్టం అని నేను చెప్పను. ఎందుకంటే ప్రతీది నిద్రాహారాలు మానుకొని, మనసు పెట్టి చేస్తాను, నేనే కాదు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ అంతే చేస్తాడు .

సైఫ్:రీమిక్స్ గురించి…

కార్తీక్:రీమిక్స్ అంటే నాకు ప్రాణం, అందులో తప్పేం లేదు అనుకొంటాను.నా పాటలనే చెయ్యాలని ఉంది.

సైఫ్:అవును ఇంతకు ఎలక్ట్రానిక్ ధ్వనులమీద ఎక్కువగా ఆధార పడుతారా లేకా, లైవ్ రికార్డింగ్ అంటే ఇష్ట పడుతారా?

కార్తీక్:అవసరాన్ని బట్టి అన్ని ఉపయోగిస్తాను.

సైఫ్:తెలుగు సినిమా అవకాశం ఎలా వచ్చింది?

కార్తీక్:తెలుగు సినిమా అవకాశం కూడ నాకు ఈ ఆర్కూట్ ద్వారానే వచ్చింది. ఇక్కడే నాకు దర్శకుడు రంజిత్ బెల్లూరి, నిర్మాత రవిందర్ గారు పరిచయం అయ్యరు. నా ట్యూన్స్ వారికి నచ్చాయి.అలా “యూ అండ్ ఐ” సినిమా మొదలైంది .

సైఫ్:మీరు ఇప్పటి వరకూ ఎవరికైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారా?

కార్తీక్:ఎందుకివ్వలేదూ?ప్రస్తుతం చేస్తున్న సినిమాలో గాయకులుగా రానినా రెడ్డి ,మేఘ, యూకే (UK)నివాసి, తెలుగు వాడైన రాప్ సింగర్ కేఐ(K.I)లకు తొలి అవకాశం ఇచ్చాను.

సైఫ్:చాలా మంచి విషయం. తొలి సినిమాకి పెద్ద పెద్ద సింగర్లతో పనిచేస్తనే మంచి పేరు వస్తుందనుకోకుండా ఇలా నవయువ గాయకులకు అవకాశం ఇచ్చినందుకు సంతోషం.

కార్తీక్:అంతా సవ్యంగా జరిగితే ఇంకా కొంతమందని ముందు ముందు పరిచయం చేయాలని ఉంది.

సైఫ్:ఈ పాటల కోసం ఎవరెవరు పనిచేసారు?

కార్తీక్:అనంత శ్రీ రాం పాటలు రచయిత. కార్తిక్,గొపిక పూర్ణిమ,సాగర్, బెన్ని దయాల్, కే ఐ, రనీన రెడ్డి, మేఘలతో నేనూ గొంతుకలిపాను. ప్రత్యేకంగా నా కోరికపైన ఈ సినిమాలో వచ్చే ఫస్ట్ పాటని ఫ్రెండ్ దేవి శ్రీ పాడారు.

సైఫ్:చాలా మంది ఎక్కువగా పాటల రికార్డింగ్ అంటే హైదరాబాద్ స్టూడియోలు వదిలిపెట్టి చెన్నై వెళ్తుంటారు. మీరు కూడా అక్కడే రికార్డింగ్ చేసారు కారణం ఏంటి?

కార్తీక్: అందరి సంగతి తెలియదు కానీ నా కంటూ చెన్నై లో ఒక స్వంత రికార్డింగ్ స్టూడియో ఉంది కాబట్టి ఇక్కడే అన్ని పాటలు చేసుకున్నాను.స్వతహాగా మిక్సింగ్ దాదాపు నేనే చేసుకుంటాను కూడా. అంతే కాని హైదరాబాదు లొ మంచి స్టూడియో లు లేవని కాదు .

సైఫ్:త్వరలో మీ సంగీతం మేము చెవులారా వినాలని మనసార కొరుకుంటూ సెలవు తీసుకుంటాను.

కార్తీక్:థ్యాంక్స్. నాకీ అవకాశం ఇచ్చిన మీకు,నవతరంగానికి కూడా చాలా కృతజ్ఞతలు .

తొలిసారిగా తెలుగు సినిమాకు సంగీత దర్శకత్వం చేస్తూ త్వరలోనే ఆడియో రిలీజు కి హైదరాబాదు రాబోతున్న నవయువ సంగీత దర్శకుడు కార్తిక్ కి అభినందనలు చెప్పాలనుకున్నట్లైతే  ఇదిగొ ఆర్కూట్ లొ ఒక సారి కలవండి. karthikmusziboy@gmail.com

3 Comments
  1. hero. March 20, 2009 /
  2. shree March 20, 2009 /
  3. Reddy G March 24, 2009 /