Menu

భావోద్వేగాల ’పాలపిట్ట’లు

kafiso-dairyమన రాష్ట్రంలో ప్రస్తుతం చురుగ్గా ఉన్న ఫిలిం క్లబ్ లు రెండే. ఒకటి హైదరాబాద్ ఫిలిం క్లబ్. రెండోది కరీంనగర్ ఫిల్ం సొసైటి(కఫిసొ). ఈ రెండు చోట్లా ప్రతీనెలా కొన్ని మంచి సినిమాల ప్రదర్శనతోపాటు అప్పుడప్పుడు చిత్రోత్సవాలు నిర్వహించి మంచి సినిమాని అభిమానించే ప్రేక్షకులకు విందు చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు కరీంనగర్ లో జరిగిన లఘు, డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో 41 సినిమాల్ని చూసి ’పాలపిట్ట అవార్డు’లను నిర్ణయించే జ్యూరీకి చైర్మన్గా నేను వెళ్ళాను. ఆ వివరాలను పంచుకునేందుకే ఈ వ్యాసం.

‘కఫిసొ’ అనగానే అందరికీ గుర్తొచ్చేది వారాల ఆనంద్. ఆయన ఆద్వర్యంలో ఉత్తమాభిరుచులతోపాటు సామాజిక స్పృహతో పని చేసే మమ్చి బృందం ఈ ’కఫిసొ’కి బలం. ఈ రాష్ట్రంలో స్వంతభవనం ఉన్న ఏకైక ఫిలిం క్లబ్ (దక్షిణ భారతదేశంలో బెంగుళూరు తర్వాత రెండోది ఇదే) ’కఫిసొ’. గతంలో రెండు సార్లు కేవలం చిత్రోత్సవాలకి పరిమితమైతే ఈసారి పోటీ కూడా పెట్టిన ఘనత ఈ సొసైటీ స్వతం చేసుకుంది.

ఈ చిత్రోత్సవానికి చ్చిన 41 సినిమాల్లో తెలుగు 7, ఇంగ్లీషు, మలయాళం, హిందీ, బెంగాలీ భాషలవి ఐదేసి, మూడు మూకీలు, కన్నడ, మారాఠీ, తమిళం, జార్ఖండ్ లవి రెండేసి, రాజస్థానీ, జపనీస్, అస్సామీల నుంచి ఒక్కొక్కటి వచ్చాయి. మన తెలుగు నుంచి ఏడు సినిమాలు రావడం విశేషం. ఆయా భాషల్లో వచ్చిన కొన్ని సినిమాలకు ఇంగ్లీషులో వాయిస్ ఓవర్ ఇచ్చారు. కొన్నింటికి సబ్ టైటిల్స్ ఇచ్చారు.

వీటిలో దాదాపు సగం సినిమాలు చాలా బాగున్నాయి. కొన్ని ’మంచి విషయం’ తీసుకుని సరిగ్గా చెప్పలేకపోతే, మరికొన్ని అనవసరపు లాగుతో విషయాన్ని అందకుండా చేశాయి. కానీ బాగున్న ఇరవై సినిమాలలో ఐదిటికే అవార్డులు ఇవ్వాల్సిరావడం మా జ్యూరీకి (నాతో పాటు రాకేష్ అంబటి, డాక్టర్ దామోదర్ స్వామి లు సభ్యులు) చాలా కష్టమైంది. అందుకే నిర్వాహకులను ఒప్పించి మరో మూడు అవార్డులు అంటే మొత్తం ఎనిమిది అవార్డులను ప్రకటించాం. ఈ సినిమాల సంక్షిప్త పరిచయం….

ఐ వాంట్ మై ఫాదర్ బ్యాక్

ఈడాక్యుమెంటరీని సుమాజోసన్ అనే మహిళా డైరెక్టర్ తీశారు. తూర్పు మహారాష్ట్ర లోని విదర్భ పత్తిరైతుల ఆత్మహత్యల నేపథ్యంలో నిర్మించిన చిత్రమిది. ప్రపంచీకరణ ఫలితంగా గిట్టుబాటు ధరల పతనమూ, ఆధునీకరణ పేరుతో వచ్చిన కొత్త వంగడాలూ, బిటి విత్తనాలూ, మాన్ శాంటో ఆగమనం, దిగుబడి, విత్తనాలనూ, ఎకరానికి ఇరవై టన్నుల వాగ్ధానాలూ, కాని పండేసరికి ఒకటే టన్ను దిగుబడీ, పెరిగిన రుణాలు, ఎరువుల దిగుబడి వల్ల రైతులతోపాటు నాశనమైన నేల, బి.టి, మాన్ శాంటోనీ విత్తనాలనూ, ఊర్లోకి అడుగుపెట్టనీయమనే రైతుల ఊరేగింపులతోపాటు,ఆర్గానిక్ ఫార్మింగ్ కి మళ్లుతున్న రైతులూ….భవిష్యత్తుమీద నమ్మకంతో ముగిసే డాక్యుమెంటరీ చూస్తుంటే ఇది ఒక్క విదర్భకో, ఏ ఒక్క రాష్ట్రానికో చెందిన రైతు వ్యధలా తోచదు. అలాగే వందనాశివ లాంటి అనేకమంది సామాజిక శాస్త్రవేత్తల విశ్లేషణలతో డాక్యుమెంటరీకే భాష్యం చెప్పిన చిత్రం ఇది. అత్యుత్తమ డాక్యుమెంటరీగా ’పాలపిట్ట’ అవార్డు పొందింది.

సోలో వాయిస్ సోలో వాయిస్

రాజస్థాన్ లో మనగనియర్స్ పాటల సామ్రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు వారి కోటల ప్రాకారాన్ని కాళ్లులేని రుక్మాబాయి తన (పాటల) తన్నుల్తో కూలగొట్టింది. కాళ్లు లేవనే దిగులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా తన పాటల్తో తిరిగింది.

రాజస్థాన్ మహిళ పరదాల వెనక దాక్కోక తగుదునమ్మా అని బయటకి రావడమేగాక పాటలు పాడుతుందా? అని అహంకరించారు పురుషపుంగవులు. అప్పటిదాకా పబ్లిగ్గా పాటలు పాడిన స్త్రీలు లేరు. ఏదో పాడిందని కాకుండా రుక్మాబాయి గొప్ప గాయినిగా పేరు తెచ్చుకుంటోంది. పెద్ద పెద్ద పాటకచేరీలు జరుగుతున్నాయి. దాంతో ఆమెని చంపుతామని తాగి కత్తులు పుచ్చుకు తిరిగే రౌడీలు. అవిడో తిరుగుబోతు, పిచ్చిదిమ్ ఎప్పుడేం చేస్తుందో ఆమెకే తెలియదు..ఇలా అభాండాలు. అయినా ఎంతమంది ఆపుదామని చూసినా ఆగని గానజ్వాల రుక్మాబాయి. ఈమె పాటల సీడీలు మార్కెట్లో దొరుకుతాయి. కొని విని తరించండి. ఈ డాక్యుమెంటరీని యాధవన్ చంద్రన్, మల్లికా సారాభాయ్ కలిసి నిర్మించారు. ఇది ఉత్తమ డాక్యుమెంటరీగా పాలపిట్ట అవార్డు దక్కించుకుంది.

మిస్సింగ్ కలర్స్

ఆమెది రంగు వెలసిన జీవితం. ఆమె జీవితమే రంగులమయం. ఏమిటీ వాక్యాలనుకుంటున్నారా? ఓ బాలుడు…నెమ్మదిగా బాలికలా అవుతున్నాడు. తండ్రి కొడతాడు. తల్లి ఏడుస్తుంది. సమాజం నవ్వుతుంది. ట్రాన్స్ జెండర్. వెలి…వెలి. తనలాంటి వాళ్లతో సహజీవనం. ఆమెకు రంగులతోడిదే ప్రపంచం. పెయింటింగ్స్ వేస్తూ, తింటూ, తాగుతూ జీవితం గడుపుతుంది. ఒక్క చిరునవ్వు కోసం…ఒక్క ఆదరణ కోసం తపన…ఏమిటి ఇలాంటి వాళ్లు చేసిన నేరం? ప్రశాంత్ కనతూర్, మురళీధరన్ నంబియార్ లు తీసిన ఈ లఘుచిత్రం చిన్న సినిమా కేటగిరీలో అత్యుత్తమ చిత్రంగా నిలిచింది.

లెవెల్ క్రాసింగ్

ఇద్దరు చిన్నపిల్లలు ప్రధాన పాత్రలుగా నడిచిన చక్కని చిత్రమిది. ప్రభుకి కొన్ని చిన్న చిన్న విశ్వాసాలు. వాటిల్లో ఒకటి పరీక్ష రాయడానికి వెళ్ళేముందు రైలుని చుస్తే బాగా రాయగల్గుతానని. సైకిల్ మీద వెళ్తున్న ప్రభుని అంధుడైన మణి తనని కంపెనీ దగ్గర దించమని అడుగుతాడు. రైలు వెళ్ళిపోతుందనే భయంతో కుదరదంటాడు ప్రభు. పరీక్షల చివరిరోజున తండ్రిని కొత్త పెన్ను కొనివ్వమంటాడు. కొనిస్తాను గానీ సాయంత్రం నాకు పెన్ను చూపించాలంటాడు తండ్రి. చివరి పరీక్ష రాసిన సంతోషంతో సైకిల్ మీద వస్తూ పడిపోతే పెన్ను విరుగుతుంది. దిగులుతో వస్తున్న ప్రభుకి అంధుడైన మణి పారేసుకున్న డబ్బు వెదుకుతూ కనబడతాడు. మణికి తెలియకుండా ఆ డబ్బు తీసుకెళ్తాడు ప్రభు. తర్వాత తప్పుచేశానని ప్రాయశ్చిత్తంగా మణిని సైకిల్ మీద కంపెనీకి తీసుకెళ్ళడం, తీసుకురావడంతో ఇద్దరూ మంచి స్నేహితులు అవుతారు. ఒక లఘు చిత్రం ఎలా తీయాలో అలా తీసిన ఘనత రాజా దండపాణికి దక్కుతుంది. దీనికి ఉత్తమ లఘుచిత్రంగా పాలపిట్ట అవార్డు వచ్చింది.

ఐరన్ ఈజ్ హాట్

1985లో కేవలం మూడు మాత్రమే ఉన్న స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలు మన దేశంలో ఇప్పుడు 430 వరకు పెరిగాయి. సమస్య ఏమిటంటే ఇప్పుడు-ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఫ్యాక్టరీలలో గ్యాస్ ఆధారంగా ఉత్పత్తి జరుగుతుంటే మన దగ్గర మాత్రం బొగ్గుతో జరుగుతోంది. దీనివల్ల వందలవేల టన్నుల వ్యర్థాలను రోడ్ల పక్కన, పొలాల్లో, నదుల్లో పారబోస్తున్నారు. ఫలితంగా జల, వాయు కాలుష్యం పెరిగిపోయి పంటలు నాశనమవుతున్నాయి. మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతోంది.

కొత్త ఫ్యాక్టరీలు పెట్టే చోట మొక్కుబడి మీటింగులు….ప్రజలు వద్దని ఆందోళన…అయినా ప్రభుత్వాధికారులు, నాయకులు ప్రజలు అంగీకరించారని రిపోర్టులు ఇవ్వడం….ఈ మొత్తం వాతావరణ కాలుష్యాన్ని నిజాయితీగా తీశారు మేఘనాథ్, బిజు టొప్పొలు. దీనికి కరీంనగర్ ఫిలిం సొసైటీ మరియు నవతరంగం వెబ్ సైట్ సంయుక్తంగా ఇచ్చే ’నవతరంగం’ అవార్డు దక్కింది.

వీటితో పాటు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ పొందిన మూడు చిత్రాలు ఈ విధంగా ఉన్నాయి.

బియాండ్ ది హొరైజన్

అండమాన్ ద్వీపాల్లోని వాండూర్ బీచ్లో సుందర దృశ్యాల్ని చూస్తున్న ఒక పర్యాటకుడికి ఎక్కడ్నుంచో వేణునాదం వినిపిస్తుంది. నెమ్మదిగా అక్కడికి వెళ్తాడు. ఒకతను ఈయన్ని అహ్వానించి తనతోపాటు పిక్నిక్ కి వచ్చిన తన బంధుమిత్రుల్ని పరిచయం చేస్తాడు. వారంతా భిన్న భాషలకు, మతాలకు, ప్రాంతాలకు చెందిన వారు. అయినా మానవత్వమనే భావన వారిలో బేధాలు లేకుండా చేస్తోందనీ గమనిస్తాడు. అక్కడ వీరితో ఉంటూ వంట చేస్తున్న ముస్లిం వ్యక్తి తన కుటుంబం ’కాలాపానీ’ నాటిదని అంటాడు. ఇది కాలాపానీ ఏమిటి అమృతజలం అంటాడు పర్యాటకుడు.

“ఈ దీవి నుంచి పిడికెడు మట్టి తీసుకెళ్లి భారత ప్రధాన భూభాగాల్లో చల్లండి. మానవత్వపు పరిమళాలు విచ్చుకుంటాయ” అంటాడు ముస్లిం వ్యక్తి. మనకి కావాల్సింది ఇప్పుడిదే.

నాద మృదంగం

ఓ ఊళ్ళోని పూజారి అరకొర ఆదాయంతో కొడుకుని చదివించలేకపోతాడు. బాధనిపించినప్పుడల్లా మృదంగం వాయించడం అతనికి అలవాటు. పిల్లాడికి అది భరించలేనిదిగా ఉంటుంది. కొడుకు అలా ఉండటం తండ్రి భరించలేక కొడతాడు. కొుకు ఒక రోజు మృదంగాన్ని పగలగొట్టి ఊరొదిలిపోతాడు. పూజారి మరింత దరిద్రంతో సతమతమవుతుండగా ఓ యువకుడు వీరింటికొస్తాడు. పొరుగూరులో తన చెల్లెలి పెళ్ళికి డబ్బులు, నగలు తీసుకెళ్తున్నట్లు చెప్పి రాత్రికి ఆశ్రయం ఇమ్మని అడుగుతాడు. పూజారికి తనున్న స్థితిలో ఇంతకన్నా మంచి అవకాశం దొరకదని ఆ యువకుడిని చంపి అతని సంపదను దోచుకుంటాడు. చివరికి ఆ యువకుడు తన కొడుకేనని తెలుస్తుంది. కథ నాటకీయంగా ఉన్నప్పటికీ ఈ చిన్న సినిమాలో కర్ణాటకలోని మారుమూల పల్లలోని సంప్రదాయాలను చాలా చక్కగా చిత్రీకరించాడు దర్శకుడు ఎ.వి.జయరాజ్.

ఇదీ నా జీవితం

పెళ్లాయ్యాక ఎంతోమంది స్త్రీలకు హెచ్.ఐ.వి సోకుతోంది. దానిక్కారణం పిచ్చి తిరుగుళ్లు తిరిగి హెచ్.ఐ.వి తెచ్చుకుని భార్యలకు అంటిస్తున్న భర్తలు. తర్వాత భర్త చనిపోతే భార్య వల్లే అతనికి వచ్చిందని ఆరోపించే అత్తామామలు…సమాజం…ఆ మహిళను నరకయాతనకు గురి చేస్తున్నారు. కాబట్టి పెళ్లికి ముందే హెచ్.ఐ.వి టెస్టులు చేయించాలనే డిమాండ్ ని చట్టం చేయాలని ముగుస్తాడు దర్శకుడు పొలసాని వేణుగోపాల్.

లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు తీసే నిర్మాతలకు సామాజిక ప్రయోజనమే కానీ ఆర్థిక ప్రయోజనం ఉండదు. అందువల్ల ప్రభుత్వం, అలాగే డబ్బున్న మంచివాళ్ళు ఇలాంటి చిత్రాలు తీయించడం. తీసిన చిత్రాలకు బహుమతులు, సబ్సిడీలు ఇవ్వడం చేస్తే వివిధ విషయాలను విశ్లేషిస్తూ చక్కని సినిమాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి కరీంనగర్ ఫిలిం సొసైటీ నిర్వహించిన ఈ ఫిలిం ఫెస్టివల్ కు సినీగోయర్స్ మాత్రమే కాకుండా అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, నల్లూరి రుక్మిణి, వరలక్ష్మి వంటి 40 మంది రచయితలు, రచయిత్రులు హాజరై సదరు సినిమాల గురించి సీరియస్ గా ఆలోచించడం మంచి పరిణామం.

–అక్కినేని కుటుంబరావు

3 Comments
  1. murali ravikanti April 16, 2009 /
  2. శివ కిషోర్ కందుకూరి November 15, 2009 /