Menu

రాజకీయ ‘రంగు’లరాట్నం – గులాల్

gulaalమొదటి సినిమా “పాంచ్” ఇప్పటికీ సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్ వాళ్ళు ఆపేసారు. రెండో సినిమా “బ్లాక్ ఫ్రైడే” విడదలచెయ్యకుండా దాదాపు మూడు సంవత్సరాలు కోర్టు ఆపేసింది. ఆ తరువాత “నో స్మోకింగ్” అని తనకు తప్ప చాలా మందికి అర్థం కాని ప్రయోగాన్ని చేసి ‘బాగుంది కానీ అర్థం కాలేదు’ అనిపించుకున్నాడు. ఈ మధ్యనే దేవదాసుకు “దేవ్ డి” అని కొత్త భాష్యం చెప్పిన అనురాగ్ కశ్యప్ మరొక్కసారి ప్రేక్షకుల్ని తన సినెమాటిక్ ఫైర్ తో అబ్బురచిరిచిన చిత్రం “గులాల్”.

సమకాలీన భారతీయ సినీదర్శకుల్లో ఇంత అలజడిని, భవిష్యత్తుపై ఆశనూ కలిగించిన మరో దర్శకుడు లేడేమో! ఇప్పటి వరకూ తను తీసిన చిత్రాలు  వ్యక్తిగత expression కూ, cinematic excellence కూ, విషయవస్తువులోని integrity కీ మధ్య పొంతన కుదరని ప్రయత్నాలుగా మిగిలిపోయాయి. కానీ వాటిని అధిగమించి ఒక పూర్ణచిత్రంగా ఆవిర్భవించిన సినిమా, గులాల్ అని చెప్పుకోవచ్చు.

కథా పరంగా రాజస్థాన్ ప్రాంతాన్ని కథా ప్రదేశంగా ఎంచుకున్నా, సమస్త భారతదేశానికీ అన్వయించుకోదగిన ఒక శక్తివంతమైన సామాజిక,రాజకీయ, వ్యక్తిగత కోణాల్ని గులాల్ అనే రంగులరాట్నంలో కలగలిపి, ప్రేక్షకుడికి ఒకవైపు నేలపైనున్న నిజాల్ని చూపిస్తూనే తన స్క్రీన్ ప్లే తో, సాంకేతిక నైపుణ్యంతో ఆకాశాన్ని మించిన ఆలోచనల్ని అందించడంలో అనురాగ్ కశ్యప్ సఫలమయ్యాడు. ఇదొక అరుదైన ప్రయోగం. అర్థవంతమైన ప్రయత్నం. అధ్బుతమైన సినిమా లోకం.

మాజీ రాజపుత్ర రాజులు కొందరు, తమకు ప్రజాస్వామ్యం ద్వారా జరిగిన అన్యాయానికి ప్రతీకారం,గా భారతదేశంపై ఒక సమిష్టి పోరాటానికి నాంది పలుకడానికి పిలుపునిస్తున్న సమావేశంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇక్కడే ఒక “నిజమైన” మాయాప్రపంచాన్ని దర్శకుడు మనకొసం సృష్టించడం మొదలుపెడతాడు. చిత్రం మొత్తం దిలీప్ సింగ్ (రాజా సింగ్ చౌదరి) అనే ఒక పిరికి లా స్టూడెంట్ చుట్టూ తిరగుతుంది. దిలీప్ సింగ్ ఈ రాజకీయ భూయిష్టమైన కాలేజీకి రావడం, తన రూం మేట్ రణన్ జయ సింగ్ (అభిమన్యు సింగ్) తో స్నేహం చెయ్యడంతో ఇతడి జీవితంలో మార్పు రావడం మొదలవుతుంది . స్థానిక రాజపుత్రవంశానికి చెందిన రాజకీయ నాయకుడు డుక్కీ బన్నా (కే.కే.మీనన్)  రణన్ జయ సింగ్ ను కాలేజీ ఎన్నికల్లో నిలబడమని అడగడంతో, దిలీప్ జీవితం సమూలంగా మారిపోతుంది. ప్రేమ, రాజకీయం, కక్షలు,హత్యలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ దిలీప్ సింగ్ జీవితాన్ని అతలాకుతలం చేసేస్తాయి. చివరకు దిలీప్ జీవితం ఏమవుతుంది? ఈ రాజకీయ పరమపద సోపాన పఠంలో పాములెవరికి, నిచ్చెనలు ఎవరెక్కుతారు? అనేదే చిత్ర కథ.

ఒక కాల్పనిక ప్రపంచాన్ని నిజానికి దగ్గరగా సృష్టించి, పాత్రల అర్థరహిత ఆశలద్వారా, వారి బలహీనతల ద్వారా ఒక సాంఘిక-రాజకీయ సందేశాన్ని మాటల్లో చెప్పకుండా కేవలం ఆలోచింపజేసేలా సినిమా తియ్యడం అత్యంత కష్టతరం. ఈ సినిమా అది చేసి చూపిస్తుంది. Magic realism అనే సాహితీ ప్రక్రియను, absurd theater అనే నాటక ప్రక్రియనూ, ఇంత పరిణితితో తెరపైకి అనువదించడం అత్యద్భుతమైన సాహసం. ఈ సాహసాన్ని కేవలం ప్రయొగాత్మకంగా కాకుండా, ప్రయోజనాత్మకంగా, ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెయ్యడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం.

ఈ సినిమాని తమ ప్రతిభతో రక్తికట్టించిన కె.కె.మీనన్, దీపక్ ధోబ్రియాల్ (ఓంకారా ఫేం) తో పాటూ కొత్త నటీనటులు కొందరు విపరీతంగా ఆకట్టుకుంటారు. విప్లవాత్మక రాజవంశ వారసుడిగా అభిమన్యు సింగ్ ఉన్నది కొంచెం సమయం అయినా, తలుచుకుంటే ఒక్కసారి ఒళ్ళు జలదరించే నటన చేశాడు. పిరికి విద్యార్థి  దిలీప్ సింగ్ గా రాజా సింగ్ చౌదరి జీవించాడు. Ambitious రాజవంశపు అక్రమసంతానంగా (అన్న పాత్రలో ఆదిత్య శ్రీవాస్తవ తోపాటూ), ఎన్నికల్లో పోటీచేసే విద్యార్థినిగా ఆయేషా మోహన్ పాత్ర, నటన హిందీ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉంది. కొత్తగా వచ్చిన టీచర్ గా, ర్యాగింగ్ లో చెరచబడి, దిలీప్ సింగ్ కు చేరువయ్యే స్నేహితురాలి పాత్రలో జస్సీ రంధావా తన గుర్తింపుని చాటుకుంది. ఈ పాత్ర కొంత అసంపూర్ణంగా అనిపించినా, గుర్తుండిపోతుంది. ప్రత్యేకంగా చెప్పుకోవలసింది నాట్యగత్తె/వేశ్య పాత్రలో దేవ్ డి ఫేం ‘మాహి గిల్’ చేసిన నటన. పాత్ర నిడివి, ప్రాముఖ్యత తక్కువే అయినా, ఉన్నంతలో తన నటనతో టాబూను గుర్తుకు తెస్తుంది. సినిమాలో ఒక చోట “నేను టాబూలా ఉంటాను కదా?” అని ఈ పాత్ర చేత దర్శకుడు ప్రశ్నింపజేస్తాడు కూడా.

ఈ చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు, నటీనటుల పాత్ర ఎంతుందో, ఈ చిత్ర సంగీత – సాహిత్యాల సృష్టి కర్త ‘పియూష్ మిశ్రా’కు అంతే ఉందేమో అనిపించక మానదు. ఈ చిత్రంలోని పాటలు ఒక విప్లవం. సాహిత్యం ఒక బాంబు ప్రేలుడు. సమకాలీన భారతీయ వ్యవస్థపై, కొన్ని పాత పాటలను ఆధారం చేసుకుని కొత్త గీతాల్ని కూర్చిన విధం, అద్భుతమైన ఫలితాల్నిచ్చింది. చాలా వరకూ పాటల్ని స్వయంగా తనే పాడటంతో, వాటిల్లోని కవితాత్మకతకు నిగారింపుని తీసుకొచ్చారని చెప్పాలి. అంతేకాకుండా, ఈ చిత్రంలో పృధ్వీ బన్నా అనే ఒక పాత్రను కూడా పోషించి తన వైవిద్యతను చాటుకున్నారు.

ఈ చిత్రంలోని పాటల్ని వింటేగానీ,  ఇక్కడ చెబుతున్నదాన్ని అర్థం చేసుకోవడం కష్టం. సినిమాలో ఈ పాటల్నీ, పాత్రల్నీ “అనుభవిస్తే”గానీ ఆస్వాదించడం అసాధ్యం. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకూ వచ్చిన మంచి చిత్రాలలో ఇదొకటి. బహుశా అత్యద్భుతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయే చిత్రమూ ఇదే అవుతుందోమో! So, don’t miss it.

6 Comments
  1. sasank March 16, 2009 /
  2. vamshi March 16, 2009 /
  3. కొత్తపాళీ March 16, 2009 /
  4. shree March 17, 2009 /