Menu

ఫిరాఖ్ – ఒక అవసరమైన సినిమా

firaaq-wallpaper1మారణకాండలో చనిపోయిన ముస్లిం శవాల గుట్టల్ని, ఇద్దరు ముస్లింలు సామూహిక ఖననం చేస్తుంటారు. ఇంతలో ఆ శవాల మధ్యన ఒక హిందూ స్త్రీ శవం కనిపిస్తుంది. ఆ ఇద్దరు ముస్లింలలో ఒకరు ద్వేషం రగిలే కోపంతో, ఆ హిందూ స్త్రీ శవాన్ని చంపడానికి తయారవుతాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి “చచ్చిన శవాన్ని ఇంకేంచంపుతావు” అని బలవంతంగా తనని అదుపుచేస్తాడు. ద్వేషం,అసహనం,అసహ్యం, తనమీద తనకే వస్తున్న కోపం మధ్య ఆ వ్యక్తి వెక్కివెక్కి ఏడుస్తాడు.

ఈ ఒక్క సీన్ తో ఫిరాఖ్ చిత్రం ద్వారా నందితాదాస్ తన గొంతు విప్పుతుంది.

గుజరాత్ మతవిద్వేషం,మానవహననం నేపధ్యంలో జరిగిన వెయ్యి నిజాల ఆధారంగా సృష్టించిన ఒక కథ – a work of fiction based on 1,000 true stories ఈ సినిమా. ఫిరాక్ మతవిధ్వంసం జరిగిన నెలతరువాత మొదలౌతుంది. ముక్కలైన బ్రతుకులు, విడిపడి చెక్కలైన మానసికస్థితులు, తెగిన గాలిపటాలైన జీవితాలు, నగ్నంగా నిల్చున్న మానసిక దౌర్బల్యాలు, గుర్తుంచుకోవడానికి ఇష్టపడని గుర్తింపులు (identities), ప్రశ్నార్ధకాలైన నమ్మకాల మధ్య నడిచే కొన్ని (నిజమైన)పాత్రల కథా సమాహారం ఫిరాఖ్.

ఈ ఆల్లర్ల నేపధ్యంలో డిల్లీకి వెళ్ళిపోవాలనుకునే ఒక ఎగువమధ్యతరగతి మతేతరవివాహం చేసుకున్న ముస్లిం-హిందూ జంట (సంజై సూరి- టిస్కా చోప్రా) . ముస్లిం ద్వేషాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకునే ఒక హిందువు (పరేష్ రావెల్). కళ్ళముందే అన్యాయం జరిగినా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోవున్న గృహిణి(దీప్తి నావల్). మతకల్లోలాల్లో ఇల్లు కాలిపోయి, తన స్నేహుతురాలు జ్యోతి (అమృతా సుభాష్)ని అనుమానించకుండా ఉండలేకపోయే ముస్లిం గృహిణి (సహానా గోస్వామి). కుటుంబాన్ని మొత్తం కోల్పోయి వాళ్ళ వెతుకులాటలో మరిన్ని ఘాతుకాలకు సాక్షిగా మిగిలే పదిసంవత్సరాల ముస్లిం అబ్బాయి. తన సంగీతప్రపంచంలో మునిగిపోయి ఈ దారుణాల తీవ్రతను అర్థం చేసుకోని స్థితిలో ఉన్న ఒక సంగీతవిద్వాంసుడు (నసీరుద్దీన్ షా) అతని సహాయకుడు (రఘువీర్ యాదవ్) . ఇలా మరికొన్ని పాత్రలను ఈ చిత్రం మనముందు సజీవంగా ఆవిష్కరిస్తుంది. ఒక చిన్నపాత్రలో నాజర్ మరియూ షఫీ లాంటి దక్షిణాది నటులుకూడా ఇందులో కనిపిస్తారు.

19sli1నటీనటుల నటన గొప్పగా ఉన్నప్పటికీ, ఆ పాత్రల్లోని “డ్రామా” ని నందితాదాస్ అండర్ ప్లే చేసి, నిజానికి దగ్గరగా చిత్రించడం వలన కొంత నిరాసక్తతని కలిగిస్తుంది.  సాంకేతిక పరంగా రవి కె.చంద్రన్ సినెమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, గౌతమ్ సేన్ ఆర్టు, రజత్-పియూష్ ల నేపధ్యం సంగీతం సినిమాకు బలాన్ని చేకూరుస్తూ, ఉత్తమం అనిపిస్తుంది. కాకపోతే,ఈ సినిమా లో కథల్ని కలిపిన విధానం, వారి అంతర్మధనాన్ని ఆవిష్కరించిన గతి అక్కడక్కడా ప్రేక్షకులకు బోర్ కలిగిస్తుంది.

“నా ఏడుస్వరాలో ఇంత ద్వేషాన్ని సహించే శక్తెక్కడుంది?”, “హిందువులు ముస్లింలను కాదు మనుషుల్ని మనుషులు చంపుతున్నారని బాధపడాలి.” వంటి బలమైన మాటల్ని అలవోకగా పాత్రల వ్యక్తిత్వాల్లోకి అల్లిన నందితాదాస్ కలం బలంకూడా అక్కడక్కడా మెరుపు తెస్తుంది. నటులననుంచీ అత్యంత సహజమైన నటనను రాబట్టుకోవడంలో దర్శకురాలు అత్యంత సఫలమైందని చెప్పొచ్చు. మొదటి ప్రయత్నం కాబట్టి ఈ సినిమా అక్కడక్కడా నిరాశ పరిచినా, విషయవస్తువులోని బలంవల్ల మనసును కలిచివేసే సినిమాగా గుర్తుండిపోతుంది. మొదటి ప్రయత్నంలో నందితాదాస్ “అద్భుతం” అనిపించకపోయినా, అద్భుతాలు చెయ్యడానికి అవకాశంవున్న దర్శకురాలన్న నమ్మకాన్ని కలిగించింది.

ఉర్దూ భాషలో ఫిరాఖ్ అంటే విడిపోవడం,వెతకడం అనే రెండర్థాలూ వస్తాయి. ఈ సినిమాలో నందితాదాస్ ప్రయత్నం కూడా అదే అనిపిస్తుంది. ఫిరాఖ్ గొప్ప సినిమా కాకపోయినా, అవసరమైన సినిమా. కాబట్టి అందరూ చూడాల్సిన సినిమా.

7 Comments
  1. Chetana March 23, 2009 /
  2. akasaramanna March 23, 2009 /
      • akasaramanna March 23, 2009 /
  3. Sowmya March 24, 2009 /
  4. anonymous March 26, 2009 /