Menu

భద్రం సినిమా!

film-preservationఇప్పటివరకూ మన దేశంలో ఎన్నో వేల సినిమాలు నిర్మింపబడి ఉంటాయి. వాటిల్లో అన్నీ కాకపోయినా కొన్నయినా రేపటి తరాల వారి కోసం భద్రపరచాల్సిన అవసరం ఉంది. అయితే మన దేశంలో ఈ ’భద్రపరచడం’ అనే ప్రక్రియ సక్రమంగా అమలవుతున్నట్టు లేదని తెలుస్తోంది. ఈ రోజు ఏదో వెబ్ సైట్లో చదివాను; భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ దర్శకుడిగా ఎన్నుకోగలిగిన కొద్ది మంది దర్శకుల్లో ఒకరైన మృణాల్ సేన్ సినిమాలు ఈ సంవత్సరం ఫ్రాన్స్ లోని కాన్ (Cannes) లో జరగనున్న ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవంలో ఆయన నిర్మించిన కలకతా ట్రైలాజీని ’రెట్రాస్పెక్టివ్’ విభాగంలో ప్రదర్శించాలనుకున్నారు. కానీ ఆ మూడు చలనచిత్రాల ప్రింట్లు పాడైపోయి ప్రదర్శించడానికి వీలులేని పరిస్థుతుల్లో ఉన్న కారణంగా కాన్ చిత్రోత్సవ కమిటీ ఇప్పుడు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారట.

ఈ పరిస్థితి ఒక్క మృణాల్ సేన్ సినిమాలకే కాదు దాదాపు భారతీయ చలనచిత్ర ప్రముఖులందరి సినిమాలనూ ఈ సమస్య పట్టి పీడిస్తోంది. కొన్నేళ్ల క్రితం కె.బాలచందర్ నిర్మించిన ’తనీర్ తనీర్’ సినిమా ఒక ఫిల్మ్ క్లబ్ లో ప్రదర్శిస్తుండగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో కాసేపు ముచ్చటించే అవకాశం దొరికింది. ఆ రోజు ప్రదర్శించిన సినిమా ప్రింటు కూడా చాలా ఘోరంగా ఉండండమే కాకుండా, చాలా చోట్ల సౌండ్ కూడా మాయం. కె.బి దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేర్చదగ్గ ’తనీర్ తనీర్’ పరిస్థితే ఇలా ఉందంటే ఆయన మిగతా సినిమాల పరిస్థితి ఏంటని ఆయన్ను అడగడం జరిగింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు ఇప్పుడు ఒక్క సరైన ప్రింటు కూడా లేని పరిస్థితి ఉందని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలను పరిరక్షించుకుని సరిగ్గా భద్రపరిచే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నకు ఆయన దగ్గరా సరైన జవాబు లేదు.

బెంగాలీ చిత్రదర్శకుడు రిత్వక్ ఘటక్ సినిమాలను బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (మహానుభావుడు Derek Malcolm చేసిన పుణ్యం) వారు పాడైపోయిన దీన స్థితిలో ఉన్న ఆయన సినిమా ప్రింట్లను బాగుచేసి, డిజిటల్ ఫార్మట్ లోకి మార్చి, వారి ఆర్కైవ్స్ లోభద్రపరిచే వరకూ దిక్కులేదు.

మలయాళం సినిమా దర్శకుడు జాన్ అబ్రహం కళాఖండం ’అమ్మ అరియన్’ సినిమా ఈ రోజు చూద్దామనుకుంటే ఎక్కడైనా మీడీయా స్టడీస్ విద్యార్థులను బ్రతిమాలి వారి లైబ్రరీలో ఉన్న ఒకే ఒక్క సిడి/విహెచ్ ఎస్ తెచ్చుకుని చూడ్డమే కానీ మన సినిమా చరిత్రలో ఎంతో ముఖ్య ఘట్టమైన ఆ సినిమాని భద్రపరిచి, రేపటి తరం సంగతి తర్వాత, నేటి తరానికయినా చూసే అదృష్టం లేదు.

మన దేశంలోనే కాదు  ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫిల్మ్ ప్రిజర్వేషన్ అనే సమస్య అందరినీ పట్టి పీడుస్తుందన్న మాట నిజం. అయితే మన దేశంలో పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందన్న మాట నిజం.

మన దేశంలో ఫిల్మ్ ప్రిజర్వేషన్ గురించి ప్రస్తావనకి వచ్చినప్పుడు మనకి తెలిసింది ఒకే ఒక్క సంస్థ. అదే నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలోనే అతి ఎక్కువ సినిమాలు నిర్మించే దేశంలో ఆ సినిమాలు భద్రపరిచడానికి ఉన్నది ఒకే ఒక సంస్థ అయితే ఆ సంస్థ పరిస్థుతులు తెలుసుకుంటే ఆశ్చర్యం తో పాటు తీవ్రమైన బాధ కూడా కలుగుతుంది. మన దేశంలో ఇంతవరకూ వచ్చిన సినిమాలు భద్రపరిచి ఎప్పటికప్పుడు వాటి పరిస్థితి గమనిస్తూ, వీలైతే వాటిని బాగుపరుస్తూ ఉంచడానికి ఇద్దరో ముగ్గురో నిపుణులు మాత్రమే ఉన్నారట. దాదాపు 20000 సినిమాలు ఈ సంస్థ భద్రపరుస్తూ ఉందని అంచనా. అయితే ఇక్కడ పని చేసే వాళ్ళ మొత్తం సంఖ్య కేవలం 30. ఇదంతా ఒకెత్తయితే ఏ సంస్థయితే  చలనచిత్రాల ప్రింట్లను భద్రపరిచే బాధ్యత తీసుకుందో అదే సంస్థ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో అత్యంత ప్రాచీనమైన చలనచిత్రాలు ప్రింట్లు కాలి బూడిదైపోవడాన్ని ఏమనాలి?

జనవరి 11, 2003 న నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా వేర్ హౌస్ లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం లో ఎన్నో విలువైన సినిమా రీళ్ళు నాశనమయ్యాయని ఒక వైపు జనాలంటుంటే అబ్బే అదేం లేదు ఏదో ఒకటో రెండు శాతం ప్రింట్లు మాత్రమే ఈ అగ్ని ప్రమాదంలో నాశనమయ్యాయని అక్కడి అధికారులు తేల్చేశారు. అయితే పూర్తిగా ఈ సంస్థను తప్పుపట్టి ఏం లాభం లేదు. అటు ప్రభుత్వం, ఇటు దర్శక నిర్మాతలు ముందు మన సినిమాలు నాశనం కాకుండా భద్రపరుచుకునేలా చర్యలు చేపట్టాలి.

ఈ భాద్యత కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు కృషి చేయాలి. అలాగే చలనచిత్ర పరిశ్రమలో పనిచేసే అందరు కళాకారులు, సాంకేతిక నిపుణులు ఈ విషయం పై దృష్టి సారించాలి. చలనచిత్ర వజ్రోత్సవాలు అంటూ ఒక వైపు సంబరాలు చేసుకుంటూ మరో వైపు అపూర్వ సంపద కాలి బూడిదవుతుంటే చూసి వూరుకోవడం ఏ మాత్రం సమంజసం?

ఈ మొత్తం ప్రక్రియలో ఒక సాధారణ ప్రేక్షకుడిగా ఇలా మన ఆవేదన వ్యక్తం చెయ్యడం తప్ప మనం చెయ్యగలిగిందేమైనా ఉందా?film-preservation

2 Comments
  1. మేడేపల్లి శేషు March 30, 2009 /