ప్రచురణ: రూపవాణి , ఫిబ్రవరి 1946
రచయిత: వి.యస్. దేవర్, బి.ఏ
ఏ పనికైనా నిపుణతి, సాహసము, ఓర్పు, త్యాగము ఉండాలి. మనలో సత్తువలేక పొరుగువానిపై బడి ఏడిస్తే లాభమేమున్నది. అంతకంటే అవమానకరమున్నదా? అరవచిత్రాలు చూడవద్దని మొరపెట్టుకొనే బదులు మన ఇల్లు చక్కబెట్టుకోవడం చాలా ఉత్తమమైన విషయము. స్టూడియోలలో ఎక్కడ జూచినా కుళ్ళు, వాసన, అంతా వీధిబడి మనుష్యులు. ఇక వికాసము, విజ్ఞానము ఎక్కడనుండి వస్తుంది? స్వలాభముకోసమో, స్వంతకోరికలు తీర్చుకొనుటకో ఈసినీవృత్తి అవలంబించి కొందరు పెద్దమనుష్యులు డబ్బు సంపాదించి కళను తమ చేతిలో పెట్టుకొని అధికారం చెలాయిస్తున్నారు. కర్తవ్యము,బాధ్యత గుర్తెరింగిన నూతన యువకరక్తానికి తావొసంగుటలేదు. ఎక్కడ మంచిచిత్రాలు తయారైపోతాయో అని భయం. ఆంధ్రదేశంలో పేరుపొందిన ఓ సినిమా డైరక్టరు తన అసిస్టెంటు డైరక్టరుతో స్వయముగా ఇలా అన్నాడు. అసిస్టెంటు యువకుడు, నూతనముగా పని నేర్చుకుంటున్నవాడు. “నీవెక్కడ దాపురించినావయ్యా మా నోట మట్టి కొట్టటానికి.మేము పది సంవత్సరాలలో నేర్చుకున్నది మీ యువకులు పదినిముషాలలో గ్రహిస్తారు.” ఇంతకీ కళారాథకులైతే గదూ! సంకుచితాభిప్రాయాలను జీర్ణించుకుని కళను చేతులారా నాశనము చేయుచున్నారు. చేతులు కాలినతరువాత ఆకులు పట్టుకుని లాభములేదని హెచ్చరిస్తున్నాను.
ఆంధ్రదేశములో ఏ బేడాకానీ టికెట్టు వానిని కదిలించినా మన చిత్రాలను నిందించుటయే కదూ! భాష తెలియకపోయినా, మాటలు అర్థము కాకపోయినా, జట్కాబండివాడు దగ్గరనుండి హిందీ పిక్చరు చూసి “హాయి, హాయి” అంటూఉన్నాడే! ఎందువలన? భాష తెలిసి, మాటలు అర్థంచేసుకొనిగూడ తన తెలుగుభాషలో తయారైన చిత్రాలను ఆమోదించడము లేదంటే…ఎంత అవమానకరము. ప్రొడ్యూసర్లకు, డైరక్టర్లకు తలవంపుగా లేదా?..ఈ విషయము ఎప్పుడైనా చర్చించుకున్నారా?…ఇక మన చిత్రాలు పొరుగు జిల్లాలల్లో వ్యాపించవలెనంటే ఎంత వ్యంగ్యంగా ఉందో చూడండి.
ఏ డైరెక్టర్ను కదిలించినా “ఎందుకండీ పెద్దెత్తులకు పోవటము. మన తెలుగు చిత్రాలు ఎన్నాళ్ళు ఆడించినా ఈ తొమ్మిదిజిల్లాలలోనే కదండీ. ఏరాక్షసమాయో, ఏ పాతివ్రత్యమహత్యాలో ఏ గడబిడో చూపిస్తే చాలు. మన డబ్బు మనకు ఇట్టే రాలుతుంది. ఎ సద్భావము స్పురింపజేసినా “అబ్బే మన ప్రేక్షకులకు ఇది అర్థం కాదండి. చిత్రం ఫైలు అయిపోతుంది. డబ్బురాదు” అంటూ చచ్చు చిత్రాలకే సిద్దపడతారు గాని తమలో విశాలభావ ప్రకటనాశీలమే కనుపరచరు. మన తెలుగు ఫిల్ములుగూడ ఎందుకు హిందీఫిల్ములవలె All India Fame సంపాదించకూడదు. ” All India ఫేము ఏమిటి World ఫేం సంపాదిస్తాను. మన తెలుగువారి నిపుణత చాటుటకు అటువంటిది ఒక్కఫిల్ము తయారుచేస్తే చాలదా నా జన్మకు” అన్న ధీమాతో ఒక్క డైరక్టరు మాట్లాడడు.
ఎంతసేపటికి తొమ్మిదిజిల్లాల మీదే దృష్టి సారిస్తూ, తనవలె తనప్రేక్షకులుగూడ మూర్ఖులుగానే యున్నారనుకుంటాడు. ప్రజలలో ఆనురాగము లేకపోవుటచే వచ్చే అవస్థలు ఇవే. ప్రపంచమే మారిపోతున్నాది. ప్రజలలో నూతన శక్తులు విజృభిస్తున్న రోజులివి. బేడాకానీ ప్రేక్షకునికికూడ హృదయము, ఆనందము, భావము, ఆశయాలు గలవని ఈ మనుష్యుడు గ్రహించడు. తను ప్రేక్షకులకు ఎటువంటి చిత్రాలని అందజేయవలయునో అర్థం కాదు. తెలియజెప్పితే అర్థం జేసుకొనడు. తమ ప్రేక్షకులకు మనోవికాసం, నూత్నజీవితం కల్పించుట తమ విధియై యున్నను, వారిని మరింత ఆథోగతికి తీసుకు వెళ్ళుచున్నాడు. ప్రేక్షకులు ఈ చచ్చు చిత్రాలను చూడలేక విసిగిపోతున్నారు. వారికి కావాల్సింది చూపించలేకపోతున్నారు మన సినీ కర్తలు. ఆంధ్రసినీకళకు ప్రతిఫలము వ్యయము, కాలయాపనము, కళాదేవతకు కన్నీటి బొట్టు, ఆంధ్రులకు తీరని కళంకము, అన్యాయము.
ఇందుకు ముఖ్యముగా కారణభూతములు రెండు. ప్రొడ్యూసర్ల అమాయకత్వము, డైరక్టర్ల అసమర్థత. వీరి స్వార్థపరత్వము, సంకుచితబుద్ది వీడినగాని ప్రజలలో సినిమా పరిశ్రమగురించి సద్భావన జనించదు, చదువుకున్న యుత్సాహవంతులు ముందంజవేయజాలరు. అంతవరకు మనగతి ఇంతే!
మరొక విశేషము. కొందరు తమభాషలో ప్రావీణ్యము గణించినట్లు నేడు అరవచిత్రాలు తయారుచేయుచున్నారు. “ఇంటగెలిచి రచ్చ గెలువుము” తన ఇల్లు చక్కబెట్టుకోవడం చేత కాలేదు. పొరుగువాని ఇల్లు చక్కదిద్దటానికి బయలుదేరినారు. ఎంత చోద్యమో చూడండి. కన్నతల్లి కన్నీటిబొట్టుచూస్తూ (ఎంత దరిద్రులైనా) ఎవరు ఊరుకొనగలరు. అరవదేశంలో త్యాగరాయ కీర్తనలు పాడకూడదని అరవవారు బహిష్కరిస్తున్నారని ఈ ఆంధ్రులు అప్పుడే మరచిరి గాబోలు. ఎంతటి సహనము. కన్నతల్లిని కష్టపెట్టి ఎవరూ బాగుపడలేదు.
నిజము మాట్లాడాలంటే వీరిలో కొందరికి అరవము రానేరాదు,చిత్రానికి డైరక్టరు. ఎంత Tragedyయో చూడండి! ఇక చిత్రం ఎలా ఉంటుందో ఆలోచించుకొనుడు. నాలుగురాళ్ళు చేరినవాడల్లా డైరక్టరని ముద్రించుకుంటే కళాదేవత బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది. ఎన్నాళ్ళు సాగుతుంది ఇలా ప్రేక్షకులను మోసముజేసి డబ్బు గుంజుకోవడము. మానవజాతి ముందడుగు వేస్తున్న రోజులివి. మేము వెనక్కి అడుగువేస్తామంటే ఎవరు తీసికున్న గోతిలో వారే పడవలసియుంటుంది. జాగ్రత్త.
ఆంధ్రప్రేక్షకులారా! మీకూ విజ్ఞానము, హృదయము, భావతరంగాలు, ఆశయాలున్నవని ఈ సినీ ప్రభుత్వానికి నిరూపించండి. చచ్చుచిత్రాలతో డబ్బు దోచుకొనే రోజులు పోయినవని నిరూపించండి. ఈ ప్రాతవారు తమలో సత్తువ తెచ్చుకునేటంతవరకు, లేదా నూతన విజ్ఞాన యువకులకు తావొసంగేవరకు అరవసినిమాలతోపాటు ఈ తెలుగుసినిమాలను చూడకండి. అప్పుడే కళాదేవతను పోషించినవారౌతారు.
’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో భాగంగా చందూగారిద్వారా నవతరంగప్రవేశం చేస్తున్న ఈ వ్యాసాలను వారానికొక్కటి చొప్పున ప్రచురిస్తున్నాం. చదివి ఆనందించండి. ’
ఈ వ్యాస పరంపరలో వచ్చిన మిగతా వ్యాసాల కోసం ఇక్కడ చూడండి.
Sowmya says:
అప్పట్నుంచీ ఈ గోల ఇలాగే ఉందన్నమాట – అరవ సినిమాలతో పోల్చుకోడంతో సహా
పాత వ్యాసాల్ని ఇలా డిజిటైజ్ చేయడం బాగుంది. keep going.