Menu

Delhi-6

delhi-6Delhi-6 గురించి నవతరంగం లో ఇంకా ఓ వ్యాసం లేకపోవడం ఆశ్చర్యంగానే ఉన్నా కూడా, ఈ వ్యాసం రాయడం నెల నుండీ వాయిదా వేస్తున్న నేను కూడా దానికో కారణం అయి ఉండొచ్చని గోల చేయకుండా ఆపేస్తున్నా 😉 సినిమా రిలీజ్ కి ముందు నుండీ డిల్లీ-6 పాటల గురించి, ఏ.ఆర్.రెహమాన్ సంగీతం గురించీ చాలా విని ఉండటంతో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాను. పాటలు అప్పట్లో నా బుర్రకి ఎక్కలేదు కానీ, తరువాత్తరువాత “మసకలి”, “మౌలా మౌలా” పాటలు మార్చి మార్చి వింటూ సినిమాకి వెళ్ళి తీరాల్సిందే అని చివరగా పూనే లోని Inox మల్టీప్లెక్స్ లో చూశాను.

కథ: అన్నపూర్ణ (వహీదా రహమాన్) అమెరికాలో తన సంతానం దగ్గర ఉంటూ ఆఖరి రోజుల్ని ఇండియాలో గడపాలని నిర్ణయించుకుని తన మనవడైన రోషన్ (అభిషేక్ బచ్చన్) తో సహా పాత డిల్లీలోని తమ నివాసానికి చేరుకుంటుంది. ఇక్కడి వాతావరణం రోషన్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెనక్కి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటాడు. క్రమంగా ఇక్కడి పరిస్థితులకీ, వాస్తవాలకీ అలవాటు పడతాడు. ఇక్కడి మనుషుల్నీ, వాళ్ళ మనస్తత్వాల్నీ అర్థం చేసుకోవడం మొదలౌతున్నప్పుడు డిల్లీ గల్లీల్లో ఓ “కాలా బందర్” తిరుగుతోంది అన్న పుకార్లు ఊపందుకుంటాయి. ఎక్కడేది జరిగినా “కాలా బందర్ ని చూశాము..అదిలా…ఇదిలా…” అని కబుర్లు చెప్పే వారు కనిపిస్తారు. ఒక్కోళ్ళూ దాని గురించి ఒక్కోలా వర్ణిస్తారు. ఒక్కోళ్ళూ ఆ పేరుని తమకనుగుణంగా ఉపయోగించుకుంటారు. ఓ పక్క మన రోషన్ ఆ ప్రాంతంలోనే ఉండే బిట్టూ (సోనం కపూర్) అనబడే wannabe model తో పరిచయం పెంచుకుంటాడు.

వాళ్ళ స్నేహం రోజురోజుకీ పెరుగుతూ ఉంటుంది. “కాలాబందర్” నుండి తమని తాము కాపాడుకోవడం కోసం ఆ ప్రాంతం జనం ఓ మంత్రవేత్త ను పిలిస్తే, అతను అక్కడున్న మసీదు ఓ పాడుబడ్డ దేవాలయం పై నిర్మించిందనీ, అదే కాలాబందర్ కి మూలమనీ చెబుతాడు. హిందూ-ముస్లిం తగాదా మొదలు. రోషన్ శాంతి కోసం ప్రయత్నిస్తాడు కానీ – హిందూ-ముస్లిం కలయికలో పుట్టిన అతనికి వీళ్ళ అంగీకారం దొరకదు. బిట్టూ ని ఓ మోసగాడి నుండి కాపాడే ప్రయత్నం లో రోషన్ కాలాబందర్ వేషమేస్తాడు. అదే సమయంలో అక్కడి వారు అతన్ని చూసి అతనే అలా ఇన్నాళ్ళుగా తమని మోసం చేస్తున్నాడు అనుకుని చితకబాదుతారు. అప్పుడు వారిలో ఒకడు, పిచ్చి పుల్లయ్య అని అందరూ భావించే గోబర్ కాలాబందర్ గురించి అన్న మాటలు అందరినీ ఆలోచింపజేసి, చావు బ్రతుకుల్లో ఉన్న రోషన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళేలా చేస్తాయి. కథ రోషన్ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకోడం తో ముగుస్తుంది.

ఇంతకీ, ఈ సినిమాలో నాకు నచ్చిన భాగాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకి, అక్కడో జంట తమ పడగ్గది లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళు తగిలినప్పుడల్లా రిమోట్ ప్రెస్ అయి చానెళ్ళు మారుతున్నప్పుడు ఓ పక్క చంద్రయాన్, ఓ పక్క కాలా బందర్ గురించిన వార్తలు కనబడ్డం, అభిషేక్ బచ్చన్ డిల్లీ గల్లీల్లో తిరుగుతున్నప్పుడు ఆవు రోడ్డు పై కనబడగానే ఇతని స్పందనా-జనం స్పందనా, మసకలీ పాట చిత్రీ కరణ, కొన్ని దృశ్యాల్లో అభిషేక్ కి అమెరికా, ఇండియా ల జీవితాల మధ్య ఉండే తేడాలను గురించిన ఆలోచనలను తెరపై చూపిన విధానం, మౌలా..మౌలా పాట చిత్రీకరణ, గోబర్ పాత్ర మౌల్డ్ చేసిన విధానం, “కాలా బందర్” అని అప్పట్లో డిల్లీ లో వచ్చిన వార్తల్ని ఈ సినిమాలో వాడిన తీరు – ఇలా సినిమా లో ఇలాంటివి చాలా ఉన్నాయి – బాగా తీసిన భాగాలు. సోనం కపూర్ బాగానే చేసింది కానీ, షరా మామూలుగా అభిషేక్ బచ్చన్ అన్నింటికీ కలిపి హోల్‌సేల్ ముఖం పెట్టుకుని ఉన్నాడు.

Delhi-6 రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తీశాడు అని సినిమా కి వెళ్ళే ముందుదాకా నాకు తెలీదు. తెలిసాక, మళ్ళీ “రంగ్‌దే బసంతీ” ని గుర్తు తెచ్చుకుని, కొంత ఆంచనాలతో వెళ్ళాను. ఆ పరంగా ఈ సినిమా నన్ను నిరుత్సాహ పరచలేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

9 Comments
  1. sasank March 19, 2009 /
  2. shree March 19, 2009 /
  3. Manjula March 19, 2009 /
  4. Ram March 20, 2009 /
  5. hero. March 20, 2009 /
  6. sujata March 20, 2009 /
  7. rayraj March 21, 2009 /
  8. kumar March 30, 2009 /