Menu

మార్పు రావాలి

రచన: “అంగర”
ప్రచురణ: రూపవాణి ఆగస్టు 1946

మన తెలుగుచిత్ర పరిశ్రమ కొంతవరకూ తల ఎత్తింది! అభివృద్ధి సూచకములైనవార్తలు వస్తున్నాయి. మన పరిశ్రమలో మళ్ళా సంచలనం బయలుదేరింది. అది అబినందింపతగ్గ విషయం. అంతటితో సరికాదు. ఇంకా తెరవెనుకగల వ్యక్తులందరూ ముందుకు వచ్చి మన చిత్రనిర్మాణంలో మరింత చురుకుదనాన్ని కలిగించేందుకు కృషిచేయాలి!.

అట్టివారికి ఒకమాట – ముందు చిత్రం తీయబోయేవారు కథను మంచిది ఎంచుకోవాలి. ఆ ఎంచుకోవడంలో విశేషమయిన ప్రజ్ఞావిశేషాలు, శ్రద్ధ, శ్రమపడాలి. కథలు కాలానుగుణ్యంగావుండాలి. దేశ-కాల పాత్రాలతో సన్నిహిత సంబంధం కలిగినవైయుండాలి. దేశంలో ఈనాడు యే మూలచూసినా జాతీయత, స్వాతంత్ర్యవాంఛ ప్రబలంగావున్నాయి. బానిసత్వపు బ్రతుకులోంచి వెలుతురులోకి వస్తోంది మన జన సామాన్యం. వాళ్ళుకూడ ప్రతి రాజకీయ విషయాన్నికూడ అతిసులువుగా అవగాహన చేసుకుంటున్నారు. కాబట్టి నిర్మాతలు అట్టి ప్రేక్షక జనానికి, అనుగుణంగా వాతావరణపూరితమైన చిత్రాలే అందివ్వాలి. వారిలో జాతీయతను, స్వాతంత్ర్యేఛ్ఛను రేకెత్తించాలి! అందు ఉత్తమమైన మార్గం ముసలమ్మ కథల్ని మూలకితొయ్యండి – నాయనమ్మగాథల్ని నీటిలో నానబెట్టండి. కథావస్తుసేకరణలో పూర్తి మార్పునుతేవ ప్రయత్నించండి. ప్రతి నిర్మాత, దర్శకుడూ రాజకీయ, సాంఘిక, చారిత్రాత్మక చిత్రనిర్మాణానికి పూనుకోవాలి! దేశంలో రాజకీయంగా, సాంఘికంగా మతసామరస్యాన్ని కుదిర్చేందుకు వీలయిన కథారచన ఉంది. దాన్ని దర్శకులు అభిమానించాలి.సాంఘిక కథలని పదిసంవత్సరాల క్రిందటి సాంఘిక జీవనాన్ని యీనాడు తీసే చిత్రాల్లో కనపర్చకండి. అంటే యింతవరకు తీయబడిన కథలకు ముందు తీయవలసిన కథలను యిప్పుడు మరి తీయకూడదు. తీయాలంటే అవి కేవలం చారిత్రాత్మకమైనవైయుండాలి!

తరువాత – తరువాతది, మరొక ముఖ్యమయిన విషయం. అది ప్రతి దర్శకులవారు శ్రద్దగా గమనించవలసిన విషయం. అది నటీనటుల విషయం. ఇప్పటికిప్పుడే ప్రేక్షకలోకంలో పాతనటులమీది మోజు తగ్గిపోయింది. అది గమనించి వెంటనే క్రొత్త నటీనటుల్ని సినీమారంగంలో ప్రవేశపెట్టవలసిన బాధ్యత దర్శకులది. ఈ విషయంలో స్వలాభాపేక్షను విడనాడాలి. వీలయినంతవరకు యికమీద ఒకరిద్దర్ని చొప్పున పాతనటులకు స్వస్తివాక్యం పాడాలి. సినీమాపరిశ్రమ అంటే, కళ, కళాసేవ అంటే అభిమానం, ఆదరం, సరదాగల నవ యువకులకి స్థానమివ్వాలి. “స్టార్ వాల్యూ” అనే మంత్రజపాన్నిమాని ధైర్యంగా మార్పు తేవాలి. స్టార్‌వాల్యూ అంటూ ముసలితారలో తీయబడిన చిత్రాల్ని ప్రేక్షకులకివ్వబోకండి. వయసుమళ్ళిన వ్యక్తి యువక పాత్ర ధరిస్తే ఆ చిత్రం, ఆకారం మరి చూడలేం. ఒక్కోసారి ఎంతయినా విచారం కలుగుతుంది. ఎంత నటించడానికి ప్రయత్నించినా ఇత్తడి బంగారంగా మారుతుందా? ఏం? దేశం గొడ్డుపోయిందా? విద్యావంతులయిన నవ యువతీ యువకులు మన నడిగడ్డమీద లేరా? వారికి మన నిర్మాతలు ఎందుకు చేయూతనివ్వకూడదు. ముసలివాళ్ళు ముసలివేషాలు వేస్తే రాణిస్తుందిగాని యువకుడిలా తయారయితే స్వర్గసీమలో మూర్తిలా తయారవాలి! కాలుకదపం, నటీనటులు కావాలి అంటే కుదరదు. స్టూడియోలోనుంచి కాలుకదిపి, కారుమీద బయలుదేరితే కోటానుకోట్ల నటీనటులు కంటికి కనిపిస్తారు. అంతేగాని రావడంలేదు ఏంచెయ్యగలం అనే దిగదుడుపుమాటల్ని కట్టిపెట్టాలి నిర్మాతలు. ఇకనుంచి వీలయినంతవరకు యిద్దరేసిచొప్పున కొత్తనటుల్ని చూపడానికి ప్రయత్నించాలి. అంతెందుకు? యింట్లో వరసగా నాలుగురోజులు వంకాయపెడితే “వెధవకూర ఎప్పుడూ వంకాయే” అని యింట్లో తెగ ధుమధుమలు ఎగబోస్తారే! అలాటి ఎప్పుడూ ఆ ముసిలిముఖాలే ముచ్చటగా చూడమంటే చూసేవాళ్ళవి కళ్ళా, కాయలా?

అన్నివిధాలా – దేశంలో నేడు జాతీయభావాలు, స్వాతంత్ర్య గీతికలను ఆలాపించేవారికి దేహాన్ని గగుర్పాటు నొందించే చారిత్రాత్మక చిత్రాలు సహాయకారులు కాగలవు. అంతేకాని నాయినమ్మ ముసలమ్మకథలు చూపితే ప్రజల్లో పిరికితనానికి తావుయిస్తున్నారన్నమాట. వారిలో రగుల్కొన్న జాతీయ ఆవేశాన్ని అణిచి, చల్లార్చేసి దద్దమ్మలని చేస్తున్నారన్నమాట. నిర్మాతలు మరువవద్దు. అలాచేయడం దేశానికి, ప్రజానీకానికి తీరని ద్రోహం తలపెట్టడం అన్నమాట. ఇంక పౌరాణికాలు తీస్తున్నాముగా అంటే అవి కేవలం పేలవంగా, వీధినాటకాలకంటే అధ్వాన్నంగా తయారు చేస్తున్నారు. ఇది మరీ అన్యాయం. వాటిగురించి వ్రాయాలంటే యుద్ధానికిపూర్వం తయారయిన పౌరాణికాలు మంచనిపిస్తున్నాయి. ఆదర్శాలు, అవకాశాలు ఎక్కువగావున్న యీ దినాల్లో వీధి నాటకాల్లాంటి పౌరాణికచిత్రాలు మనభాషలో తయారవుతున్నవంటే అది దర్శకుని అసమర్థతను సూచిస్తున్నది.

చివరిమాట – ప్రతినిర్మాతా, దర్శకుడూ కొంతవరకు వ్యాపారదృష్టిని వదలి దేశవిముక్తిని సాధించేందుకు వీలయిన కథావస్తువులను సేకరించి చిత్రాలు తీయాలి. అరవచిత్రాభిమానంగల తెలుగు దర్శకులు కొంతవరకూ ఆ అభిమానాన్నివదలి స్వపరిశ్రమకు దోహదమివ్వాలి. అది బొంబాయి నిర్మాతలు గ్రహించి కేవలం భారతప్రజకు పనికివచ్చే జాతీయచిత్రాల్ని నిర్మిస్తున్నారు. కాబట్టి తెలుగు నిర్మాతలుగూడ యీసత్యాన్ని గ్రహించి కార్యక్రమాలని సాగించాలి. సాగించడానికి ముందు ప్రతి నిర్మాత, దర్శకుడు, పెద్దమార్పును తీసుకురావాలి. ఆ “మార్పు” దర్శకత్వంలో కథా సేకరణలో, నూతన నటీనటుల యెన్నికలో పూర్తిగా మార్పును తీసుకురా ప్రయత్నించాలి. ప్రయత్నంలో సఫలులుకావాలి. ఆనాడే మన తెలుగుచిత్ర కళామతల్లి తన తలెత్తి ఆనందించగలదు.

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో భాగంగా చందూగారిద్వారా నవతరంగప్రవేశం చేస్తున్న ఈ వ్యాసాలను వారానికొక్కటి చొప్పున ప్రచురిస్తున్నాం. చదివి ఆనందించండి. ’

ఈ వ్యాస పరంపరలో  ఇదే చివరి వ్యాసం. ఈ శీర్షికలో వచ్చిన మిగతా వ్యాసాల కోసం ఇక్కడ చూడండి.

2 Comments