Menu

భూత్ నాధ్

చిన్న పిల్లల కోసం సినిమా – దెయ్యం సినిమా – అమితాబ్ బచ్చన్ సినిమా అనగానే ఎగిరి గంతులేసుకుంటూ చూసేద్దామనుకుని చూళ్ళేదా – మిస్స్ అయిపోయారు. భూత్ నాధ్ నిజంగా పిల్లల సినిమానే ! షాహ్ రుఖ్ ఖాన్ ఒక మర్చంట్ నేవీ షిప్ కి కేప్టెన్. జూహీ చావ్లా, బంకూ అతని భార్యా, పిల్లలు. వీళ్ళకు గోవాలో ‘నాథ్ విల్లా’ ని కేటాయిస్తారు కంపెనీ వారు. షాహ్ రుఖ్ ఆర్నెల్లకోసారి గానీ ఇంటికి రాని కేండిడేట్. ఫేమిలీని నాథ్ విల్లా కి షిఫ్ట్ చేసి మళ్ళీ షిప్పు ఎక్కిపోతాడు. కాబట్టి ప్రధాన తారాగణం ఒక అమ్మ, ఒక బంకూ ! అంతే !

బంకూ చాలా పెంకి ఘటం. అయితే అమ్మ కి వాడంతే పంచ ప్రాణాలు. ఎంత పెంకి ఘటం అయినా ఎవర్నీ ఇబ్బంది పెట్టే తత్వం కాదు బంకూది. కాబట్టి మంచివాడే అని చెప్పుకోవచ్చు. ఇంతకీ వీళ్ళుండే నాథ్ విల్లా లో దెయ్యం ఉంటూందని బాగా ప్రచారం జరిగి ఉంటుంది. అయితే ఈ తల్లి, తండ్రీ మాత్రం ఆ మాట్లని లెక్క చెయ్యకుండా ఇంట్లో దిగుతారా – ఇంట్లో సామాన్లు విప్పకుండానే షాహ్ రుఖ్ వెళిపోతాడు. ఇంక జూహీ చావ్లా నానా కష్తపడీ ఇల్లు సర్దలేకపోతూ ఉంటుంది. అప్పుడే వంటింట్లోంచీ కొన్ని సామాన్లు మిస్ అవుతూ ఉంటాయి. ఏంటబ్బా అని చూస్తే రాజ్ పాల్ యాదవ్ ఈ సామాను దొంగతనం చేస్తూ దొరుకుతాడు. ‘ఓహ్ ! భూతం భూతం అంటూ జనాల్ని హడలగొడుతూంది నువ్వా ? ఎందుకు దొంగతనం చేస్తున్నావ్ ?’ అని గాట్టిగా అడిగితే ‘బీద వాడిని తల్లీ- పనివ్వు చేస్తానూ అంటాడు. వెంటనే వాడిని ఇంటి పని చూడటానికి పెట్టేసుకుంటుంది తల్లి.

ఈ లోగా బంకూ కి ఇంట్లో భూత్ నాధ్ కనపడటం మొదలు పెడతాడు. ఈ భూత్ నాధ్ ని చూస్తే బంకూ కి అస్సలు భయం కలగదు. ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. తెలివిగా భూత్ నాధ్ తో స్నేహం చేయడమే కాకుండా అతనితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడు బంకూ. భూత్ ని భూత్ అనకుండా ఏంజెల్ – అంటూ పిలుస్తూ ఉంటాడు. ఈ ఏంజెల్ గురించి తల్లి తో చెప్తున్నపుడు ఆవిడ పెద్దగా పట్టించుకోదు. కానీ ఈ పైత్యం ముదిరి, స్కూల్ లోంచీ కంప్లయింటులు రావడం మొదలయ్యే సరికీ ‘ఇలాంటి పిచ్చి వాగుడు కట్టిపెట్టు – భూతాలూ, ఏంజెల్లూ ఏమీ ఉండవూ అని దెబ్బలాడేస్తుంది.

అయితే స్కూల్ లో పిల్లలందరూ కూడా భూత్ నాధ్ మంచితనాన్ని ఒప్పుకునే సందర్భం ఒకటొస్తుంది. వీళ్ళు ఈ ఏంజెల్ ని ఎంతో ఇష్టపడిపోయి, ఆ పాత్రలతో ఒక నాటకం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ నా నాటకం చూస్తున్న పేరెంటు ఒకరు – తల్లి దగ్గరకొచ్చి – ఈ పిల్లలు నాధ్ అంకుల్ లా ఎందుకు వేషాలు వేసుకున్నారూ – అని అడుగుతుంది. అపుడు తల్లికి నాధ్ విల్లా లో బంకూ కి చనిపోయిన నాధ్ అంకుల్ కనబడటం నిజమే అని అర్ధం అవుతుంది.

అయినా, ఏదో అపనమ్మకంతో బంకూ ని తల్లి శిక్షించబోతే అంతవరకూ ఎదుటపడని నాధ్ జూహీ చావ్లా ముందు ప్రత్యక్షం అవుతాడు. బెదిరిపోయిన ఆమె కు తన కధ చెప్తాడు. నాధ్, ఆయన భార్యా కట్టించుకున్న ఆ విల్లా లోనే వారి జీవితం ఆనందంగా గడిచింది. అయితే నాధ్ ఒక్కగానొక్క కొడుకు మాత్రం అమెరికా మోజులో అమెరికా వెళిపోయి, అక్కడే పెళ్ళి చేసుకుని, తల్లికీ, ఇంటికీ దూరం అవుతాడు. విల్లాకి రమ్మని ఎంత పిలిచినా రాకుండా, తను అమెరికా వొదిలి రానని స్పష్టం చేస్తాడు. ఈ బాధలో నాధ్ గారి భార్య జబ్బు చేసి మరణిస్తుంది. అయినా కొడుకూ, కోడలూ, మనవడూ ఆ ఇంటిని వొదిలి వెళిపోతుంటే, వాళ్ళను ఆపడానికి పెరిగెడుతూ, మెట్లమీద నుండీ జారి పడి, తలకి దెబ్బ తగిలి నాథ్ మరణిస్తాడు. ఆ సంగతి కొడుక్కి అమెరికా చేరే దాకా తెలియనే తెలియదు. ఈ కారణాల వల్ల నాథ్ కి అంత్యక్రియలు సరిగ్గా జరగవు. ఆయన ఆత్మ మాత్రం నాథ్ విల్లాను అంటిపెట్టుకుని ఉండి, ఎవరినీ ఆ స్వప్న సౌధం లోకి అడుగుపెట్టనీకుండా కాపలా కాస్తూ ఉండిపోతుంది.

అయితే బంకూ రాక తో నాథ్ గారి పట్టు వదులుతుంది. తన మనవడి వయసున్న ఈ పిల్లవాడు తనను చూసె ఏమాత్రం అదురూ బెదురూ పోకుండా పైగా, తన పట్లే సానుభూతి చూపిస్తూ, స్నేహం చేయడం ఆయన్ని కదిలిస్తుంది. హాస్యం గా సాగే పాటలూ, సన్న్నివేశాల్లో అమితాభ్ ను ఒక ఆట ఆడించే అమాయకమయిన బంకూ తెలివి తేటలు ముచ్చట కలిగిస్తాయి.

అయితే కొడుకు సముద్ర తీరంలో ఉన్న ఆ ఇంటిని అమ్మేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూ గోవ వస్తాడు. ఆ సమయంలో షాహ్ రుఖ్, జూహీ అతన్ని కలసుకుని నాథ్ గారికి సరిగ్గా శ్రాద్ధ కర్మలు చేయించమని కోరుతారు. అలా చెయడం వల్ల నాథ్ గారి ఆత్మ ఆ విల్లాను విడిచిపోవడమే కాకుండా, కొడుకు రాక ను చూసి ఆ ముసలి ప్రాణానికి శాంతి కలుగుతుంది. ఇలా.. శాస్త్ర పూర్వకంగా శ్రాద్ధ కర్మలు జరగగానే నాథ్ ఆత్మ ఒక నక్షత్రంలా మారి ఆకాశంలోకి వెళిపఒతుంది. బంకూ కి అంతవరకూ ఆసరాగా తోడుగా నిలిచిన నాథ్ ఇంక కనిపించకుండా పోతాడు. బంకూ ఒంటరి అయిపోతాడు. బాధ పడుతూ ఉంటాడు. ఒకసారెప్పుడో బంకూ కి ఏదొ చిన్న సమస్య వస్తుంది. ఏంజెల్ ఉంటే ఎంత బావుణ్ణు అనుకుంటూ ఉంటాడు ! వెంటనే అమితాభ్ ప్రత్యక్షం ! బంకూ కి ఆనందమే ఆనందం ! బంకూ, నా బుజ్జి బంకూ, నేకెప్పుడయినా ఏమయినా ప్రాబ్లం ఉంటే నన్ను తలచుకో నేను వెంటనే వస్తాను – అంటాడీ ఏంజెల్. ప్రేక్షకులూ, బంకూ, ఏంజెల్ అందరూ ఆనందంగా నవ్వుతూ ఉండగా సినిమా ముగుస్తుంది.

ఫీల్ గుడ్ సినిమా లు ఒక్కోసారి మన మూడ్ కి చాలా అవసరం. చిన్న పిల్లల కోసం ఉద్ద్యేశించి తీసిన ఈ సినిమా అమితాబ్ ఫేక్టర్ తో కింగ్ ఖాన్, మిస్ ఇండియాల ప్రెసెన్స్ తో, ముఖ్యంగా రాజ్ పాల్ యాదవ్, సతీష్ కౌషల్ మొదలయిన కూల్ నటులతో చక్కగా, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పాటలు బావుంటాయి. సెంటి మెంటూ, అమాయకత్వం, హాస్యం, లాస్యం.. ఇవన్నీ భూత్ నాధ్ లో సంవృద్ధి గా వున్నాయి. హాయిగా ఫీల్ కావాలనుంటే భూత్ నాధ్ చూడొచ్చు. మీ పిల్లలకు కూడా చూపించొచ్చు.

బంకూ గా అమన్ సిద్దికీ అదరగొట్టేసాడు. ఈ సినిమాకి దర్శకత్వం వివేక్ శర్మ ! ఈ సినిమా ముగిఎసే విధానం మరో భూత్ నాథ్ సీక్వెల్ ఉందేమో అన్న ఆశనయితే కలిగిస్తుంది కానీ ఈ సినిమా దర్శకుడు మాత్రం సీక్వెల్ లేదంటున్నాడు. కానీ పిల్లలతో మంచి సినిమా చూడాలనుకుంటే అసలు మొదటి భూత్ నాథ్ ని చూడటం రికమెండెడ్ !

–సుజాత పాత్రో

3 Comments
  1. అబ్రకదబ్ర March 22, 2009 /
  2. జ్యోతి March 25, 2009 /