Menu

ఆకాశమంత (2009)

akasamnthaఆభియుం, నానుం అన్న తమిళ సినిమాకి ఇది తొంభైశాతం డబ్బింగ్, పది శాతం రీమేక్ (జగపతి బాబు ఉన్న సీన్లు రీమేక్. ఆ రోల్ తమిళం లో Mozhi పృథ్వీ రాజ్ వేశాడు). ఆ సినిమా రిలీజైనప్పటి నుండీ చూద్దాం అనుకుంటూ ఉంటే ఈ సినిమా రిలీజయ్యేనాటికి కుదిరి తెలుగులోనే చూశాను మొన్న శనివారం. ఇంతకీ, ఈ సినిమా నాకు కుతూహలం కలిగించడానికి గల కారణాలు:
1. Mozhi సినిమా దర్శకుడి సినిమా
2. ప్రకాశ్ రాజ్ సొంత సినిమా
3. తండ్రీ కూతుళ్ళ అనుబంధం సినిమా
-మూడింటిలో ఏ విషయంలోనూ నేను పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదు ఈ సినిమా చూశాక.

కథ: రఘురామ్ (ప్రకాశ్ రాజ్) ఓ పార్కులో వాకింగ్ చేస్తూ సుధాకర్ (జగపతి బాబు) తన కూతుర్ని ఆడిస్తూ కష్టపడుతూ ఉండటం చూస్తాడు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక కథంతా రఘు తన కూతురు అభి (త్రిష) తో తన అనుబంధం గురించి కొన్ని గతాల్ని తలుచుకుంటూ సుధాకర్ తో పిల్లలని పెంచుతూ ఉన్నప్పుడు కలిగే అనుభవాలను గురించి చెబుతూ ఉంటాడు. క్లుప్తంగా ఇదీ కథ. కథలోని ప్రధాన పాత్రలు – రఘు, అతని కూతురు అభి. సహాయ పాత్రలు రఘు భార్య (ఐశ్వర్య), వాళ్ళ ఇంట్లో మనిషిలా మెలిగే రవిశాస్త్రి, రఘు స్నేహితుడు రాము, అతని భార్య.

నచ్చినవి:
కథనం. సున్నితంగా, మనసుని తాకేలా కథను అల్లిన విధానం. తగినంత హాస్యం ఉండి, ఎక్కడా బోరు కొట్టనివ్వకుండా, ఎక్కడా అసలు విషయం నుండి పక్కకు వెళ్ళకుండా కథను నడిపించిన వైనం. ప్రకాశ్ రాజ్, త్రిష ప్రేమించిన జోగిందర్ సింగ్ పాత్రధారి గణేశ్ వెంకట్రామన్, ఐశ్వర్య, రవి శాస్త్రి పాత్రధారి – అంతా ఆయా పాత్రల్లోకి బాగా ఒదిగిపోయారు. పిల్లని మొదటిరోజు స్కూల్లో వేసినరోజు ఏడ్చిన తండ్రి తను అత్తారింటికి వెళ్తున్నప్పుడు నవ్వుతూ సాగనంపే దృశ్యం హైలైట్. ఐశ్వర్య కూతురి పెళ్ళి తరువాత తండ్రి ఏమౌతాడో అని భయపడుతున్నప్పుడు ఆ భార్యా భర్తల మధ్య తీసిన సన్నివేశాలు కూడా చాలా వాస్తవికంగా ఉన్నాయి. పిల్లని స్కూల్లో చేర్చేందుకు జరిగే ఇంటర్వ్యూ ప్రహసనం లో కొన్ని జోక్స్ బాగా పేలాయి.

నిజజీవితంలో జరిగే కథలకి దగ్గరగా ఉన్నందుకో ఏమో కానీ, రెండో భాగమంతా చాలా కదిలించింది నన్ను. లొకేషన్స్ సూపర్బ్. అక్కడికి వెళ్ళిపోయి ఓ ఇల్లు కట్టుకోవాలనిపించింది. సినిమాలో దొరికిన చోటల్లా కాస్త సామాజిక స్పృహనూ, కొంత అభ్యుదయాన్నీ, మనుష్యుల జీవితాలలోని వైవిధ్యాలనీ, వైరుధ్యాలనీ చూపాడు దర్శకుడు, Mozhi లో లాగే. అది కూడా చాలా బాగా చూపాడు.

నచ్చనివి: ప్రకాశ్ రాజ్, ఐశ్వర్య లను 1986 లో చూపిన దృశ్యాలలో ఇద్దరూ చాలా ఓల్డ్ గా ఉన్నారు. మేకప్ పొరపాటు కాదేమో…నిజంగానే ఓల్డ్ ఏమో లెండి. అది వేరే విషయం 🙂

ఒక పిల్ల పుట్టినప్పుడే ఓ తండ్రి పుడతాడు, సర్దార్జీల పట్టుదల గురించి – ఇలాంటి డైలాగులు చాలా రొటీన్ అయినా కూడా మళ్ళీ ఆలోచనలో పడేశాయి. ఒక్కోచోట హాలు నవ్వుల్తో దద్దరిల్లిందని ఇదేదో హాస్య సినిమా కాదు. సందర్భోచితమైన హాస్యం. బాగా కుదిరింది. రాధామోహన్ ఏ సినిమా తీసినా బానే ఉంటుందన్న నమ్మకం కలిగింది.

నేడే చూడండి. మంచి సినిమాలని ఆదరించండి. థియేటర్ కి వెళ్ళి చూడండి.

9 Comments
  1. shree March 31, 2009 /
    • Pandu April 11, 2009 /
  2. krishna March 31, 2009 /
    • alapati ramesh babu April 1, 2009 /
  3. Sarath March 31, 2009 /
  4. parimalam April 1, 2009 /
  5. అబ్రకదబ్ర April 7, 2009 /
  6. భాను February 15, 2010 /