Menu

13B-ఒక విశ్లేషణ

113b13B. ఈ మధ్యనే వచ్చిన ఒక హిందీ సినిమా. నవతరంగంలో ఇదివరకే ఈ సినిమా గురించి ఒక సమీక్ష వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా గురించి నా అభిప్రాయం చెప్దామనే ప్రయత్నమే ఈ టపా.

మాధవన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఎంతో కష్టపడి ఇద్దరన్నదమ్ములు బ్యాంకు లోను తీసుకుని ఒక ఇళ్ళు కొనుక్కుంటారు. అది ఒక అపార్ట్ మెంట్లోని పదమూడో ఫ్లోర్ లో ఉన్న ఫాట్ ’బి’. అందుకే ఈ సినిమాకి ఆ పేరు. వాళ్ళు ఇంట్లో అడుగుపెట్టినప్పటినుంచీ ఏదీ సక్రమంగా జరగదు. ప్రతి రోజు పాలు విరిగిపోవడం, లిఫ్టు పని చేయకపోవడం, పూజ గదిలో మేకులు కొట్టబోతే ప్రమాదాలు సంభవించడం లాంటి సంఘటనలతో పాటు మరో పెద్ద విచిత్రం ఆ ఇంట్లో జరుగుతుంది.

ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంటకు వాళ్ళింట్లో టివిలో మాత్రమే ఒక ’సబ్ కైరియత్’ అనే సీరియల్ వస్తుంది. విచిత్రంగా ఆ సీరియల్ లో జరిగే సంఘటనలే ఆ ఇంట్లో కూడా జరుగుతుంటాయి. మనోహర్ (మాధవన్) కు ఈ విషయం మొదట ఆశ్చర్యం కలిగించినా రాను రాను సీరియల్ లో జరిగే సంఘటనలు భయం కలిగిస్తాయి. అయితే సీరియల్ లో పాత్రలకు జరుగుతున్నట్లే తన ఇంటివాళ్ళకూ జరుగుతున్న విషయం మనోహర్ తప్ప వేరే వాళ్ళెవ్వరూ గమనించరు. తన అన్నకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినట్టు, చాలా ఏళ్ళుగా పరీక్షల్లో ఫెయిలవుతూ వచ్చిన చెల్లెలు హఠాత్తుగా అన్ని పరీక్షల్లో పాస్ అయిపోవడం లాంటి ఆనందించదగ్గ విషయాలు టివి సీరియల్ లో కనిపించి వెనువెంటనే నిజజీవితంలోనూ జరగడం బాగానే ఉన్నా రాను రాను ఇంట్లో వాళ్ళకు సంభవించే ప్రమాదాలు కూడా ఆ సీరియల్ లో భాగం అవుతాయి. కేవలం తనింట్లో మాత్రమే ఈ సీరియల్ ఎందుకు వస్తుంది? అందులో పాత్రలు తన ఇంట్లో వారిలానే ఎందుకు ప్రవర్తిస్తున్నారు? లాంటి విషయాలను తెలుసుకుని ఆ ఇంటి వెనుక ఉన్న మిస్టరీ ని మనోహర్ ఎలా చేధించాడాన్నది ఈ సినిమా ముఖ్య కథ.

ఈ సినిమా చూసిన చాలా మంది “అసలా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళుంటే ఈ గొడవంతా ఉండేది కాదు కదా” అని అనుమాన పడ్డారు. అసలు ఈ జన్ర లోని సినిమాలైన కొన్ని సినిమాలు పరిశీలిస్తే ఇలా ఒక హాంటడ్ హౌస్ లోకి ఒక కుటుంబం రావడం, ఆ ఇంట్లో ఉన్న దయ్యాలు, భూతాల భారినపడడం అనేది ఒక genre convention అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు, స్టాన్లీ కూబ్రిక్ సినిమా షైనింగ్ కానీ, రోమన్ పొలాన్స్కీ సినిమా రోజ్ మేరీస్ బేబీ కానీ, మన వర్మ గారి దెయ్యం, రాత్రి, మర్రిచెట్టు లాంటి సినిమాలు తీసుకుంటే ఒక హాంటడ్ హౌస్ లోకి ఒక కుటుంబం రావడం కారణంగా జరిగే కథగా సినిమా సాగుతుంది. ఇక ఆ ఇంట్లో నుంచి ఎందుకు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళలేదనే దానికి ఎంత బలమైన కారణం ఉంటే కథలో అంత పట్టు ఉంటుంది. ఉదాహరణకు షైనింగ్ సినిమాలో ఆ ఇల్లు వదిలి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం ఇవ్వడు దర్శకుడు. ఎందుకంటే మంచు కారణంగా అక్కడి రోడ్లన్నీ పూర్తిగా కప్పబడిపోయి ఈ వాహనం కూడా అక్కడ్నుంచి వెళ్ళే పరిస్థితి లేదని సినిమా మొదట్లోనే తేల్చేస్తాడు దర్శకుడు. అలాగే రోజ్ మేరీస్ బేబీ లో వాళ్ళుంటున్న అపార్ట్ మెంట్ వదిలి వచ్చేస్తే అసలు రోజ్ మేరీ కి ఎటువంటి సమస్యలూ ఉండవు కానీ ఆమె ఇల్లు ఖాలీ చెయ్యకుండా ఉండడానికి చాలా బలమైన కారణమే ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా మనోహర్ ఇల్లు ఖాళీ చెయ్యకపోవడానికి ఒక బలమైన కారణమే ఉంది. ఆ విషయం అతను ఒక సీన్లో తెలియచేస్తాడు కూడా. అయితే ఆ సీను కాస్త హడావుడిగానూ కొంచెం ఫన్నీ గానూ ఉంటుంది కాబట్టి అదో పెద్ద కారణం అని చాలామందికి అనిపించి ఉండకపోవచ్చనిపించింది. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు కదా అనే ఆలోచన వచ్చే సమయానికి మనోహర్ కి ఆ ఇంట్లో జరిగే మిస్టీరియస్ విషయాల గురించి సగం తెలిసీ సగం తెలియని పరిస్థితిలో ఉంటాడు. అలాంటి సమయంలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఆ తర్వాత ఏం జరగనుందో తెలియని పరిస్థితుల్లో తన పరిస్థితి మరింత గందరగోళమవుతుందేమోనని మనోహర్ ఆ ఇల్లు ఖాళీ చెయ్యడానికి ఒప్పుకోడు మనోహర్. ఇది మరీ గొప్ప రీజనింగ్ కాకపోయినా నమ్మదగినదే అనిపించింది నాకు.

ఈ సినిమా చూసిన వాళ్ళకి వచ్చిన మరి కొన్ని డౌట్స్: లిఫ్ట్ పని చెయ్యకపోవడం, మొబైల్ ఫోన్ లో ఫోటో సరిగ్గా రాకపోవడం కేవలం మనోహర్ కే ఎందుకు జరుగుతాయి? బాత్ రూమ్ లో లైటెందుకు పేలుతుంది? పూజ గదిలో మేకులు ఎందుకు దిగవు?

నాకైతే ఇవేమీ పెద్ద విషయాలనిపించలేదు. మనోహర్ ఇంట్లో ప్రవేశించిన ఆ దెయ్యాల కుటుంబం (దెయ్యాల ఇంట్లోకి ప్రవేశించిన మనోహర్ కుటుంబం అనాలా?) ఆ ఇంట్లోకెల్లా చురుకైన, చలాకీ వాడయిన మనోహర్ కి ఇలాంటి ఇబ్బందులు కలగచేయడం ద్వారా ఆ ఇంట్లో ఏదో తెలియని శక్తులున్నాయేమో అని గమనించేలా చెయ్యడం, తద్వారా తమ పని మనోహర్ ద్వారా పూర్తి చెయ్యాలనుకోవడం ఇక్కడ ముఖ్య ఉద్దేశం.అయితే ఈ పనులన్నీ ఆ దెయ్యాలెలా చెయ్యగలిగాయి? అని అడిగితే కష్టమే.

ఈ సినిమాలో నేను గమనించిన మరో విషయం సబ్ టెక్స్ట్.దాదాపుగా ప్రపంచంలో వచ్చిన అన్ని ముఖ్య సినిమాల్లోనూ చదువుకునేంత సబ్ టెక్స్ట్ ఉంటుంది. ఉదాహరణకు పైన చెప్పిన షైనింగ్ సినిమానే తీసుకుంటే,ఈ సినిమాలో ఒక పెద్ద హోటల్ లో కేవలం ముగ్గురు (తల్లి, తండ్రి, కొడుకు) మాత్రమే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో వారి మధ్య జరిగిన భయానక సంఘటనలతో ఈ సినిమా ఒక హారర్ సినిమాగా నడుస్తుంది.అయితే ఒక సినీ విశ్లేషకుని ప్రకారం ఈ సినిమాలోని సబ్ టెక్స్ట్ ని ఈ విధంగా వివరిస్తారు

“The Shining is not really about the murders at the Overlook Hotel. It is about the murder of a race — the race of Native Americans — and the consequences of that murder […] it is also explicitly about America’s general inability to admit to the gravity of the genocide of the Indians — or, more exactly, its ability to “overlook” that genocide.”

అలాగే రోజ్ మేరీస్ బేబీ అనే హారర్ సినిమాలో కూడా కొత్తగా ఒక అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్లో అద్దెకు దిగిన ఒక జంటకు ఎదురైన భయానక అనుభవాలుగా ఈ సినిమా ఒక హారర్ సినిమా నడిచినా ఈ సినిమా సబ్ టెక్స్ట్ గురించి ఈ వివరణ చూడండి.

Rosemary’s Baby is provocative on many levels besides it technical brilliance, it raises issues around abortion and a woman’s right to self-determination as “a story of violence, deceit, and misappropriation of a woman’s body by people she trusts that makes [this] pregnancy a Gothic spectacle”

ఈ రెండు సినిమాలతో పోల్చదగినంత గొప్ప సినిమా కాకపోయినప్పటికీ పైన చెప్పిన రెండు సినిమాలకీ 13B సినిమాకీ చాలా పోలికలున్నాయి. 13B పైపైన హారర్ సినిమాలా కనిపించినా అన్ని హారర్ సినిమాల్లాగా ప్రేక్షకులను భయపెట్టేలా శబ్దాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేవనే చెప్పాలి. అలాగే పైన చెప్పిన సినిమాలకి లాగే ఈ సినిమాకీ ఒక సబ్ టెక్స్ట్ ఉంది. అందుకు ముఖ్యకారణాల్లో ఒకటి పైకి ఇది హారర్ సినిమాగా కనిపించినా ఇది ఒక సెటైరికల్ సినిమా. టివి, మొబైల్ ఫోన్ లాంటి ఆధునిక సాంకేతిక పరికరాలు మన జీవితాల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయో చూపెడుతూ అవి దెయ్యాల్లా మనల్ని ఎలా ఆవహించేసాయో చూపించే ఒక ప్రయత్నం ఈ సినిమా అని నా అభిప్రాయం. నిజానికి సినిమాలో ఒక సీరియస్ సీక్వెన్స్ (ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ డ్రామాలో ఒక భాగం కావడం, తన జీవితం ఎలా మలుపులు తిరగబోతుందో రోజూ టివి సీరియల్ చూసి తనకు చెప్తూ ఉండాలని మనోహర్ ని వేడుకోవడం) లో మనకి నవ్వు తెప్పించడం కూడా ఇందులో భాగమే అనిపించింది. ఆ విధంగా ఈ సినిమా మన దేశంలో ఇంతవరకూ వచ్చిన అన్ని హారర్ సినిమాల మాదిరిగా కాకుండా హారర్ సినిమా ముసుగులో ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్న మనపై వేసిన ఒక సెటైర్ ఈ సినిమా. అయితే ఈ విషయం మనకి అంత డైరెక్ట్ గా ఏమీ చెప్పడు దర్శకుడు. సినిమా మొత్తం టివి గురించి, టివి మన జీవితాల్ని ఎలా ఆక్రమిస్తుందో చూపించిన దర్శకుడు సినిమా చివర్లో మొబైల్ ఫోన్ ద్వారా ఈ విషయాన్ని మరో సారి చెప్పక చెప్తాడు. టివి, మొబైల్ ఫోన్ మన జీవితాల్ని ఎంతగా ఆక్రమించేసాయో అని ఆలోచన వచ్చిన వారికి ఈ విషయం అర్థం కావడం అంత కష్టం కాదనుకుంటా.

రాబోయే రోజుల్లో ఈ సినిమా ఫిల్మ్ స్టడీస్ విద్యార్థులు స్టడీ చేసి ఈ సబ్ టెక్స్ట్ ని మరింత విశదంగా పరిశోధన చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇందులో పరిశోధించగలిగేంత విషయం ఉందని నా అభిప్రాయం.

ఇవన్నీ కాకపోయినా సినిమాలో నటీనటులు పోషించిన అద్భుతమైన నటన, పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్, చాలా కాంప్లెక్స్ ఐడియాని పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండానే స్క్రీన్ ప్లే గా రూపొందించడం, వీటన్నింటినీ కలగలిపి ఒక మంచి సినిమాగా మలచడంలో దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి. కాకపోతే సరైన పబ్లిసిటీ చెయ్యకపోవడం, సినిమాని ప్యూర్ హారర్ సినిమాగా ఊహించుకుని వెళ్ళిన ప్రేక్షకులు కాస్తా నిరాశ చెందడం లాంటి కారణాల వల్ల ఈ సినిమాకి రావాల్సిన గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంది.

అయితే ఈ సినిమాలో అన్నీ perfect గా ఉన్నాయని కూడా నేనటం లేదు. ఉదాహరణకు ఒక సీన్లో మనోహర్ ఎన్ని మెట్లెక్కినా రెండో ఫ్లోర్ లోనే ఉండిపోవడం (అఫ్ కోర్స్ అది కలనుకోండి), మరో సీన్లో కుక్క ఎవర్నో చూసి భయపడిపోవడం (ఆ సీన్లో కుక్క ఎవర్ని చూసి అంతగా భయపడిందో నాకర్థం కాలేదు) లాంటి కొన్ని సీన్లు కేవలం ఎఫెక్టు కోసమే వాడినట్టుగా ఉంది.

ఏదేమైనప్పటికీ మన దేశంలో వచ్చిన అత్య్తుత్తమ హారర్ సినిమాగా, ఈ సంవత్సరంలో వచ్చిన మంచి సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచి పోతుందని నా నమ్మకం.

చివరిగా ఈ సినిమా చూసిన/చూడని వాళ్ళందరూ తప్పకుండా ఈ సినిమాకి సంబంధించిన వెబ్ సైటు విజిట్ చెయ్యడం మర్చిపోకండి. Worth checking out!

6 Comments
    • anveshi March 17, 2009 /
  1. అబ్రకదబ్ర March 18, 2009 /
  2. sanjeev June 19, 2009 /