Menu

ఎవరి దృష్టిలో మార్పు రావాలి?

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో భాగంగా చందూగారిద్వారా నవతరంగప్రవేశం చేస్తున్న ఈ వ్యాసాలను వారానికొక్కటి చొప్పున ప్రచురిస్తున్నాం. చదివి ఆనందించండి. ’

ఈ వ్యాస పరంపరలో వచ్చిన మిగతా వ్యాసాల కోసం ఇక్కడ చూడండి.

ఈ మధ్య ఏ పత్రికలోచూచినా మన చిత్రధ్వజాలను విమర్శించడం ఎక్కువగా కనిపిస్తూంది. ప్రతీ రచనా- ప్రొడ్యూసర్లూ, దర్శకులూ, టెక్నీషియన్లూ, నటకులు కొందరూ – క్రిమినల్సని రుజువుచేస్తూంది. అందువల్ల మన ఈ ధ్వజాలకు వుక్కురోషం పుట్టింది. ఆర్థికమాంద్యం వల్ల (ప్రజాదరణ లేకపోవడంవల్లకూడాను) ప్రేలియున్న మంగలాలవలె (?) కనపడుతున్న విమర్శక రచయితలమీదికి వాళ్ళు రాళ్ళు విసరడం ప్రారంభించారు. కొందరుద్యోగులు బర్తరఫ్‌చేయిస్తే మరికొందరు టీ పార్టీలలో సవాళ్ళు, రాతలు(కోతలు!) సాగించారు.

శారీరార్థిక వ్యవస్థలలో సినీమా స్థానాధిపతులనోడించ లేకపోవచ్చును గాని; మజ్జనుపయోగించి కలంద్వారా ఎదుటిగుండెలు నీరు (రక్తం) కారేట్లు చేయగల బలవంతులు – విమర్శక రచయితలని మనం అనేక పర్యాయాలు ఋజువుపర్చుకున్నాం.

కానీ ; -“ఛా! మనవాళ్ళను స్వవచనాఘాతకు లంటున్నారే యీ బొట్టికాయలు?! ఆయ్!!” – అనే స్వాభిమానం యెక్కువయి – ఆ విమర్శక రచయితలవల్లనే ఓ ప్రముఖస్థానంలో ఉండగలిగిన శ్రీ నాగయ్యగారామధ్య మన జర్నలిస్టులమీద ఓ అభూతకల్పనారోపణానిందలతో కసి (?) దీర్చుకుందామనుకున్నారు. కాని, అది ఆయనకు మనలోనున్న పలుకుబడినీ గౌరవాన్ని తగ్గించింది.

ఇది కాస్త సద్దుమణిగి మామూలుత్రోవలో పత్రికా రచనలూ విమర్శలూ సాగిపోతున్నాయ్. కాని, మన ఆధ్వజాల చిత్రాల వకాలతా పుచ్చుకుంటూన్న డిస్త్రిబ్యూటరొకాయన ఆ చిత్రధ్వజాల అవకతవక పరువుప్రతిష్టల కన్నింటికీకూడా వకాలతాపుచ్చుకున్నట్లుగా యీమధ్య మన జర్నలిస్టులనూ, పత్రికలనూ పైమెట్టుమీద నుంచుని తిట్టారు! (సైరన్లా వాగారు!!)

ప్రతీ సినిమా ముందూ చూపించే టైటిల్స్ లో డిస్ట్రిబ్యూటర్ల ముద్రలుకూడా మనంచూస్తున్నాం. కాని వాటిని చదివేవాళ్ళే బహుకొద్దనుకుంటాను. కారణం, మన డిస్ట్రిబ్యూటర్లెవరూ మేలుచిత్రాలకొరకు శ్రమించరు గనుక! కాగా, ఈ మన డిస్ట్రిబ్యూటర్లు తమ ప్రకటనల గొడవలూ, జమాఖర్చులూ చూచుకుంటూ ఫిల్ముల బాగోగులతో తమకు సంబంధమేలేనట్లు ప్రవర్తిస్తున్నారుకూడాను.

కాని, డిస్ట్రిబ్యూటర్లకుకూడా చిత్రాల బాగోగుల బాధ్యతలున్నట్లు తానూ గ్రహించుకున్నానని మనకందరికీ తెలియజేసుకుని రొమ్మువిరుచుకు తిరుగుదామనుకునట్లు – క్రొత్తగా నచ్చీ నచ్చని నాలుగు చిత్రాల డిస్ట్రిబ్యూటర్ (వకాలత్) నరసూగారు ఈ మధ్య ఒక పెద్ద టీపార్టీలో మాట్లాడుతూ – మనమీద విరుచుకుపడి తిట్టారు. ఇంతకూ యీయన మొత్తుకున్నదేమిటంటే – మన పత్రికలు తన చిత్రాలరాబడికి సహకరించడంలేదట; ప్రకటనల సంఖ్యను బట్టి విమర్శలు సాగిస్తున్నాయట మన పత్రికలు;మన పత్రికలెంత విమర్శించినా వాటి ఆదేశానికి వ్యతిరేకంగా రాబడి పొందిన చిత్రాలుండడంవల్ల ప్రజానీకం మన పత్రికలలోని విమర్శలను గడ్డిపోచకంటే హీనంగా చూస్తున్నట్లు ఋజువవుతూందట; కాబట్టి యిక యిప్పటినుండీ మన పత్రికలు నేరు మనకీ ప్రొడ్యూసర్లు, దర్శకులూ, ధ్వజాలూ అందిస్తూన్న లేక అందించగల చిత్రాలనేచూచి ఆనందిచగల దృష్టిని ప్రజలలో కలగజేయడానికే పాటు పడాలట; ఇది మన పత్రికల బాధ్యతయేనని ఆయన వాదన.

ప్రకటనలసంఖ్య కనుగుణంగా విమర్శించి ప్రజలలో పలుకుబడిలేకుండాపోతున్నా యీపత్రికలని అంటున్నాడు (తిడుతున్నాడు!) పైగా ప్రజాభిరుచులను మార్చే బాధ్యత పత్రికలదేనంటూన్నాడు!! (అంటే, యీ పత్రికలు ప్రజాదృష్టిని చక్కగా చిత్రించి దిద్దగలవని నమ్ముతున్నాడన్నమాట.) ఈ రెండు విషయాలకూ అవినాభావ సంబంధం ఏమైనా ఉన్నదంటారా? ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకంకదూ?? పైగా, మన యీ పత్రికలు కల్లబొల్లి పక్షపాత విమర్శలుచేస్తూంటే మనం,ప్రజానీకమంతా నిద్రపోతూందనా ఈ కొలంబస్ వుద్దేశ్యం? ఈవిషయంలో ఎడిటర్‌గారు చేయిచేసుకుంటారు.

నేనిప్పుడు చెప్పదలచుకున్నది “ప్రజాభిరుచి చిత్రాలకనుగుణంగా మారాలా? లేక చిత్రాలే ప్రజాభిరుచి ననుసరించాలా” అనే విషయం, ఇది “చెట్టుముందా? విత్తు ముందా??” లాంటి ప్రశ్న కానేకాదు.

ప్రజ బహుముఖ విస్తృతమయీప్పటికీ, బహుళ ప్రజాదృష్టియే సామాజిక అభిరుచిగా పరిగణింపవలె, ఆ సమాధానానికి వినోదం, విజ్ఞానాలకోసం కొన్ని సంస్థలూ, కళలూ వుద్దేశించబడ్డాయ్. ఇట్టికళాసంస్థలలో సినిమాలూ, పత్రికలూ ముఖ్యమైనవి. ఒక సమాజాన్ని ఆదర్శపథంలోనికి మేల్కొల్పాలంటే వానిచెవికింపై, వారి మనస్తత్వాని కనుగుణంగా భోదిస్తూ; – యధాతథంగా నేటి ఆ సామాజిక సంస్కృతినిచూపి, భావిలో అభ్యుదయ విజ్ఞానము లెలాసంపాదించి ఆదర్శసామాజం కాగలుగుతుందో యీ కళలు ఋజూపరచినపుడే అవి సాఫల్యమవుతాయ్. అంతేగాని – “మేం చేసిందాల్లా అభ్యుదయమే” నంటే ప్రజలు పిచ్చెక్కిందని పాదుకాభిషేకం చేస్తారు!

ఈ విధానాలలో – “ఈ సంస్థలూ, కళలూ ప్రజకాదేశిస్తున్న ఆదర్శాలూ, విజ్ఞానమూ భావిభాగ్యోదయాని కుపయోగపడతాయా లేదా? ఈ సంస్థలూ, కళలూ ప్రజకేవిధంగానైనా వినోదాన్ని కలిగిస్తున్నాయా లేదా??” అనే లొతుపాతులు తెలుసుకునేవాళ్ళు యీ మన సమాజంలోనే కొందరుంటారు. ఒక ప్రజా విషయపు బాగోగు లందరికీ తెలుస్తాయ్. కాని, అందు కొందరు చాలాత్వరగా గ్రహిస్తారు, మరికొందరు దీర్ఘకాలానుభవంవల్లగాని గ్రహించలేరు.

వీళ్ళలో చురుకుగా గ్రహించగలిగినవాళ్ళు నోరుమూసుక్కూచోలేదు- అసలు కూచోగూడదు!! వాళ్ళే విమర్శకులు. వీళ్ళు నోరుమూసుక్కూచుంటే యిపుడు జరుగుతున్న బాగోగులు మరో తరంవరకూ బాగోగులని తెలియవు ప్రజలకు. ఒకతరం గడిచిన తర్వాత ఆ పని చెడుదని తెలుసుకున్నందువల్ల దానినితిట్టి కంఠశోషపడడమే తప్ప మరోలాభం లేదు. అలాగే ఆ పని మంచిదని అప్పుడు తెలుసుకున్నప్పటికీ – ఆ పని చేసినవారికి ఈ లోపున తగినంత ప్రోత్సాహంలేక విసుగుపుట్టి ఆ పనిని విరమించియుంటారు. ఒక వ్యక్తికి విసుగుపుట్టి విరక్తిచే చెడిన తర్వాత కనుగొనబడిన అతని శక్తి కీర్తివలన లాభమేమిటి?

ఇలా ప్రజకూ యిట్టి సంస్థల కళలకూమధ్య భావసంచలనం కలిగించే విమర్శకులకు అద్దములు – పత్రికలు. పత్రికలు ప్రత్యేకంగా సామాజిక, రాజకీయదృష్ట్యా చూచినపుడు – అవి ప్రజల కుపయోగకరంగా వున్నాయో లేవో విమర్శలు సాగుతూనేవుంటాయ్. సినీమాల విషయంలో – ఆ పత్రికలు నిర్మిహమాటంగా మంచీ చెడులను విమర్శించి కుళ్ళును బట్టబయలుచేసి; ప్రజానీకం సినీమాలనుండి ఎట్టి అనుభూతి కోరుతున్నారో, ఏ విధాల నడిపితే చలన చిత్రకళ బాగుపడి వుపయోగపడుతుందో తెలియజేస్తయ్ – మన పత్రికలు.

అంతేగాని – “మా సినీ దురంధరులు అల్లి బుల్లి జననాలు, తిరిగి అరవ సితరాలూ తీస్తున్నారు. ఎంతలేదన్నా అవి సినీమాలు అంటే, మీ గురువులు – కాబట్టి వాటిని పదేశిసార్లుచూచి ఆనందించగలిగే అభిరుచి నలవరచుకోండి” – అని ఏ ప్రజాభిమానం కోరే పత్రికా వాగదు. అలాగ తెలియజేసేవాళ్ళుంటే – వాళ్ళు మన కళ్ళను గుడ్డివి చేసుకుని, మానసాన్ని ఖూనీచేసుకోమంటున్నారన్నమాట.

రచయిత: శ్రీ పోలవరపు శ్రీహరిరావు
ప్రచురణ: రూపవాణి, సెప్టెంబరు 1946

One Response
  1. chakrapani February 5, 2009 /