Menu

జాతీయ చిత్రాలు కావాలి

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో భాగంగా చందూగారిద్వారా నవతరంగప్రవేశం చేస్తున్న ఈ వ్యాసాలను వారానికొక్కటి చొప్పున ప్రచురిస్తున్నాం. చదివి ఆనందించండి. ’

ఈ వ్యాస పరంపరలో వచ్చిన మిగతా వ్యాసాల కోసం ఇక్కడ చూడండి.

మనకు స్వాతంత్ర్యము సిద్దించక ముందు (అంటే యుద్దనంతరం) అన్ని పరిశ్రమలతోపాటు చలనచిత్ర పరిశ్రమ బాగుగా సాగుతూ ఉండేది. మనకు స్వాతంత్ర్యము సిద్దించగనే, అన్ని పరిశ్రమలు బాగుగానే ఉన్నాయి; కాని, సినిమా పరిశ్రమ మాత్రం పడిపోయింది. అందులోను ముఖ్యంగా తెలుగు సినీమాపరిశ్రమ బాగా దెబ్బతింది. ‘పడిపోవడం’ అంటే పూర్తిగా కాదు. యేవో చిత్రాలు తయారౌతున్నాయి; పేరుకు మాత్రం. మదాలస, శ్రీయాళ, రాధిక ఇల్లాంటి పురాణ సంబంధమైన చిత్రాలెన్నో వున్నాయి. జాతీయంగా తీసిన ఫిల్ములు యిప్పటిలో కనిపించడం అరుదు; కనిపించినా అవి అప్పటిలో తీసిన మాలపిల్ల, రైతుబిడ్డ, ఇల్లాలు, వందేమాతరం లాంటివి మాత్రంకాదు. ‘అప్పటి ప్రొడ్యూసర్లేనా, ఈ చిత్రాలు తీస్తున్నారు?’ అన్న ప్రశ్నవచ్చినా – ‘అప్పటి వారే తీస్తున్నారు…?’ అని అనక తప్పదు. ‘ఈ విషయంలో ప్రొడ్యూసర్లు బాధ్యులుకారు; వారిని డైరక్టర్లు మోసం జేస్తున్నారు ‘ అని మనం అనడంలో పొరపాటు లేదు.

ఇప్పుడు తీస్తున్న చిత్రాలలో, పాతబడిపోయిన తారలనే బుక్‌చెయ్యడం, క్రొత్తతారలను బుక్ చేసుకోకపోవడం, పైగా యెప్పుడూ సినీమాలో కనబడుతూఉన్న ముసలితారలే నవ నవోన్మేష వయస్కులుగ నటించడానికి ప్రయత్నం చేసి, విఫలులు కావడము, దానితో ప్రేక్షకులకు ఆ సినీమాయందున్న అభిరుచి పోవడమూ, నిత్యమూ జరుగుతూన్న విషయము. ఈ తారలకే, హెచ్చుగా డబ్బు వినియోగించడం కూడా ఒక కారణం అవుతూవుంది. క్రొత్తతారలకు ప్రాధాన్యత యిచ్చినట్లయితే వారివల్ల వీరిపేరుకు భంగము వస్తుందని కామోసు ప్రొడ్యూసర్లు గాని, డైరక్టలు గాని, అలా చెయ్యరు. అలా చేసినా ఒకవేళ వారిచ్చేది, రాణీగారి దగ్గర చెలికత్తె పోర్షను మాత్రమే!

పురాణగాథలే చిత్రాలు తీస్తూ వున్నందువలన, ఆ కథలు యింతకుముందుగా ప్రేక్షకులకు తెలిసియున్నందువలన, దానికి రాబడి తగ్గదనే, మరొక పురాణచిత్రం తియ్యడమే కాని, జాతీయ చిత్రాలు తీయవలెనన్న వూహ వారికెప్పటికినీ, కలుగదు కాబోలు! ఉదాహరణకు.మనకు కన్నులకు కట్టినట్లుగా, మదాలస చిత్రం కనిపిస్తుందిగా! డైరక్ట్రలందరూ (ఉన్నవారిలో హెచ్చుసంఖ్య) పురాణచిత్రాలు తీయడానికి సిద్ధపడతారు. కాని జాతీయమైన చిత్రాలు తియ్యడానికి సిద్ధపడరు. తీసిన పురాణ చిత్రాల్లో కనుపించేతారలందరూ, పాతవారే!

ఒక పేరుబడిన తార ఒక క్రొత్త సినీమాలో నటిస్తోంది అంటే ప్రజలంతా ఆ చిత్రాన్ని విరగబడి చూస్తారు. ఆ తార పాతతారే కానీయండి, క్రొత్తతారే కానీయండి, ‘ పేరు ‘ అంటూ ఒకటి వుందికదా? అది ప్రజాసామాన్య లక్షణం. దీనినిబట్టే డైరక్టర్లు ఆడే నాటకమంతాను. అంతే కాని, క్రొత్తతారలకు సినీమాలలో స్థానమిచ్చి, వారిని అభివృద్దిలోనికి తెచ్చి, సినీమాలకు మెఱుగుపెడితే బాగుంటుంది అన్న విషయం, యింతవరకూ, యే ప్రొడ్యూసరు గాని, డైరక్టరుగాని, గమనించలేదేమో! ‘చిత్రాలలో నటించాలి ‘ అని కుతూహలపడుతున్న యువతీ యువకులు నేరెందరులేరు?

సమాజంలోగల, మూఢాచారాల్నీ, దుర్వ్యసనాలనీ నిర్మూలించి, వర్గచైతన్యాన్నీ, జాతీయతత్వాన్ని ప్రేరేపించి కళాభ్యుదయానికి, సౌభాగ్యమునకు దారిచూపగల చిత్రాలను నిర్మించినాడే, మన తెలుగు సినీమాలను అభివృద్ది చేసుకున్నవారమౌతాము. సినీమాకథ విషయంలో, కృత్రిమప్రేమను, కాముకత్వాన్నీ, మనోద్వేషాన్నీ వ్యాపింపజేసే కథలే, ఇంతకు ముందు తయారైన, జాతీయ చిత్రాలలోను, పురాణ చిత్రాలలోను కనిపిస్తూ వున్నాయి. సంఘ సంస్కరణకు, మత సంస్కరణమునకు దారితీసే చిత్రాలు తీయడానికి తగిన కథలు వ్రాసి, తెలుగు సినీమా పరిశ్రమ నభివృద్ధి చేయాలి. సాహిత్యంలో ఆరితేరిన అభ్యుదయ రచయితలను ప్రోత్సహించి, వారికి సరియైన బహుమతులనిచ్చి, వారిద్వారా చక్కటి కథలు సంపాదించాలి.

సినీమాలలో వార్తా చిత్రాలకు పాధాన్యత యిచ్చి, వాటిని చిత్రానికి ముందుగా చూపించాలి. మద్యపాన నిషేధం, జమిందారీ సమస్య, పారిశ్రామిక, వ్యవసాయక కూలీల సమస్యలను గురించికూడా, చిత్రాలద్వారా తెలియజేసి, ప్రజాబాహుళ్యానికి అందచేయాలి. పల్లెపల్లెకు టూరింగు సినీమాలద్వారా, సంఘసంస్కరణ గూర్చి, మద్యపాన నిషేధం గురించి, వ్యవసాయక కూలీలగురించి, స్వపరిపాలనను గూర్చి, తీరుబడికాలము నెట్లు వినియోగించి లాభము చెందవలెనొ,-కూడా వారికి తెలియజేస్తూ ఉండడం మన జాతీయప్రభుత్వ కర్తవ్యము. ముఖ్యముగా ఇన్‌ఫర్‌మేషన్ ఫిల్ముసు శాఖను పునరుద్ధించి, దానిని శాస్త్రీయముగా నడపడం మన ప్రభుత్వ విధులలో ఒకటి. కాదంటారా?

రచయిత: శ్రీ ఎన్.లక్ష్మీనరసింహాచార్య
ప్రచురణ: రూపవాణి, అక్టోబర్ 1948

One Response
  1. Basavanath Reddy S February 6, 2010 /