Menu

విజయ విశ్వనాథం:అనంతరామ శర్మ ఆత్మకథ-1

sankara-roark-leadచాలా రోజులైంది. ఈ విషైకంగా వ్రాసి. తగిన సమయం లేకా, ఉన్నా కాస్త సమయంలో వేరే అంశాల మీద వచ్చిన ఆలోచనలూ నన్ను దారి మల్లించినా కాస్త productive గానే నా పనులు సాగాయి.

ఎందుకో కానీ నాకు తోచక అలా నేను ఒక రోజు రోడ్డు మీద నడిచి వెళ్తున్నాను. హఠాత్తుగా ఎవరో తెలిసన మనిషి లాగా ఉంటే తేరిపార చూశాను. ఆశ్చర్యం!!! నా కళ్ళని నేనే నమ్మలేక పోయాను. “నమస్కారం శర్మ గారూ!” అన్నాను. ఎంతైనా పెద్ద వ్యక్తి కదా.

“నేనెవరో నీకేలా తెలుసు?”

“ముందు ఆశీర్వదించండి. పెద్దలు.”

“ఆయుష్మాన్ భవ! ఇప్పుడు చెప్పు నేను నీకేలా తెలుసునో?”

“మిమ్మల్ని నేను ‘స్వాతి కిరణం’ అనే సినిమాలో చూశాను. మీరు అనంతరామ శర్మ కదూ?”

“అంటే నా గత జీవితం గురించి నీకు అంతా తెలుసునన్నమాట!”

“తెలుసునా అంటే కాస్త తెలుసునండీ.”

“మరి నా గురించి తెలిసిన వాడికి నాకు నమస్కారం పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? నా స్వంత వారే నన్ను అసహ్యించుకున్నారే?”

“అయ్యా! ఆ కాలంలో నాకూ మీ మీద అసహ్యం కలిగిన మాట నిజమే! మీరూ చివరకి పశ్చాత్తాప పడ్డారు. అయినా అసూయ మనిషిని ఎంత పతనం చేస్తుందో తెలుసుకోవటానికి మీ కథే ఒక సజీవ ఉదాహరణ.”

“నీ మాటల్లో పొంతన కుదరటం లేదు అబ్బాయీ.”

“విలువైన పాఠాన్ని నాకు నేర్పిన ఎవరైనా నాకు గౌరవనీయులే. అదీ కాక మీరు ఎంతైనా విద్వాంసులు.”

బాగానే మాటలు చెపుతున్నావ్. కానీ నా తప్పుని క్షమించగలవా?”

తప్పో ఒప్పో. అది జరిగి పోయిన విషయం. ఒకసారి తప్పు చేసినంత మాత్రాన ఎప్పుడూ తప్పు చేయాలనేమీ లేదుగా.”

“…”

“నాకు మీతో మాట్లాడాలని ఉంది. కొన్ని విషయాలు మీ నుండి తెలుసుకోవాలని ఉంది నాకు. మీరు అనుమతిస్తే.”

“నా నుంచా?”

“అవును శర్మగారూ. మీరు మధ్యన మీ ఆత్మకథని వ్రాశారట కదా?”

అవును వ్రాశాను. విషయం మీదా? నేను అన్నీ నిజాలనే అందులో వ్రాశానా లేదో తెలుసు కుందామనా?”

మీరు నిజాలు వ్రాసినా అబద్ధాలు వ్రాసినా నాకు సంబంధం లేదు. నాకు కావలసినది సత్యం. అన్ని నిజాలూ సత్యానికి దారితీయవు. అలాగే అబద్ధాలన్నీ అసత్యం కాదు. ధర్మాన్ని నిలబెట్టేది ఏదైనా సత్యమే.”

ధర్మం అంటే?”

ఇది నేను ఊహించని ప్రశ్న! నాకు ధర్మం అంటే పూర్తిగా తెలియదు. మరి సత్యం? ఆ అన్వేషణలోనే ఉన్నాను. ఆయనకీ ఏమి చెప్పాలి?

“ఏమబ్బాయ్! మౌనం వహించావు? సమాధానం చెప్పలేవా?”

“…”

“ధర్మం
గురించి చెప్పలేనివాడివి ఆ పదాన్ని ఉచ్చరించకూడదు. మనకా అర్హత ఉందా? అని మనం తెలుసుకునే మాట్లాడాలి. నిన్ను తప్పు పట్టటం లేదు. తెలుసుకుంటావని చెపుతున్నాను.”

“మీరన్నది నాకు అర్ధం అవుతున్నది. కానీ అసలేమీ తెలియని వాడిని కాదు.”

“అంటే కాస్తైనా తెలిసిన వాడినే అంటావు. సరే పద. నీతో సంభాషణ ఆసక్తికరంగా ఉంది. ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం. వస్తావా?”

అలా నేను ఆయనతో నడుస్తూనే ఉన్నాను. మా మధ్య మౌనం. పొద్దుటి నుంచీ తిరిగి తిరిగి అలసిపోయిన నాకు కాస్త విశ్రమించాలని అనిపించింది. అందుకే ఏమీ మాట్లాడకుండా నేను ఆయనని అనుసరించాను. క్షణాలే నాకు అసూయ అంటే ఏమిటో అవగతం అయింది. నా అన్వేషణ ముందుకు సాగేలా చేసిందా ప్రయాణం.

మనిషిలో ఠీవి. ఒకరకమైన దర్పం. జీవితం నేర్పిన పాతం వల్ల వచ్చిన humbleness. ఆ రెండూ ఆయనని ఒకేసారి ముంచేట్టినట్టు అనిపించింది. నుడుటున పొడూగ్గా బొట్టూ, పంచా, పైన ఉత్తరీయం. నడుముకీ పై పంచకీ మధ్యన ఆయన వేసుకున్న జంధ్యం అదో మాదిరిగా ఊగుతున్నది. సందె వేళైంది.

“ఇదిగో! ఇదే మా ఇల్లు. కాళ్ళు కడుక్కుని లోపలకి రా.”

ఇంతలో అమ్మగారు వచ్చి చెంబుతో నీళ్ళందించారు.

“అచ్చం స్వాతి కిరణం సినిమాలో రాధిక లానే ఉన్నారే?” స్వగతం లోనే అయినా పైకే అనేశాను.

ఆవిడ నవ్వింది. చల్లగా. చందమామలా.

ఆయన నన్నొక సారి చూసి అన్నారు. “అదే కదయ్యా! విశ్వనాధ్ గొప్పతనం. పాత్రోచితమైన నటులనే ఎన్నుకుంటారు. మమ్ముట్టి నాలా ఎలా సరిపోయాడో నీకు తెలుసు కదా.”

నేను అవునన్నట్టు తలూపాను. వరండాలో రెండు కుర్చీలు వేసి అమ్మగారు నన్ను లోపలకి పిలిచారు. చేతికి రెండు గ్లాసులు మంచి తీర్థం ఇచ్చి తినటానికి ఏమైనా తెస్తానంటూ లోనకు వెళ్ళారు.

నేను ఆయనకి ఒక గ్లాసు ఇచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడ్డాను.

“అబ్బీ! ఇంతకీ నీపేరు చెప్పనేలేదు.”

“నన్ను ‘గీతాచార్య’ అంటారండీ.”

“అంటే ‘విజయ విశ్వనాథం’ అనే ప్రయత్నం మొదలెట్టినది నీవేనా?”

“అవునండీ. ‘నవతరంగం’ అనే వెబ్ పత్రికలో. వ్రాస్తున్నాను.”

వ్రాస్తున్నావా? లేక వ్రాసి ఆపేశావా మధ్యలోనే?”

“వ్రాసి ఆపాను. కాస్త విరామం కొరకు. కానీ నేను వ్రాస్తాను.”

ఎందుకాపాల్సి వచ్చిందో?”

అసూయ అంటే తెలియక.”

సెల్ఫ్ డబ్బానా?” ఆయన నవ్వారు. నేనూ ఆయనతో శృతి కలిపాను. ఇంతలో అమ్మగారు ప్లేట్లలో పులిహారతో వచ్చారు.

‘ఆపు నీ పులిహార కబుర్లూ, నువ్వూనూ’ అని చెప్పటానికా అండీ.” అన్నాను నేను నవ్వుతూ.

ఆవిడ నవ్వింది.  “ముందు తినవయ్యా! తరువాత మాట్లాడుకుందాం.” అన్నారు ఆయన గంభీరంగా. పులిహార చాలా బాగుంది. ట్రిప్లికేన్ పార్థసారథి స్వామి గుడిలోని పులిహారలా.

తింటుండగా ఆయన సాలోచనగా అన్నారు. “శంకర శాస్త్రిని Howard Roark తో పోల్చావు. అద్భుతం. మరి నన్ను? నీకు చెప్పటం ఇష్టం
లేకపోతే చెప్పొద్దులె.” నేను కాస్త నవ్వుతూ ఊరుకున్నాను. ఏదో ఆలోచిస్తూ.

“నీ శైలి బాగుంది. కానీ కాస్త ఆ లోపాల మీద దృష్టి పెట్టు. జనం చేత చదివించేలా వ్రాయాలి.” సరే అన్నట్టు తలూపి ఆయన కళ్ళలోకి చూస్తూ అన్నాను నేను.

“Peter Keating.”

ఆయన ఉలిక్కి పడ్డారు.

(సశేషం)

…..మా మిగిలిన సంభాషణా, ఆత్మకథ విషయం మళ్ళీ కలసినప్పుడు.


విజయవిశ్వనాథం శీర్షికలో వచ్చిన మరికొన్ని వ్యాసాలు

9 Comments
 1. venkat February 23, 2009 / Reply
  • గీతాచార్య February 24, 2009 / Reply
 2. మేడేపల్లి శేషు February 25, 2009 / Reply
 3. pappu February 26, 2009 / Reply
 4. Srujana Ramanujan February 27, 2009 / Reply
 5. శ్రీ లక్ష్మీ కళ March 1, 2009 / Reply
  • Dhanaraj Manmadha April 14, 2009 / Reply
 6. Priya Iyengar March 3, 2009 / Reply
 7. Vaishnavi Harivallabha March 27, 2009 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *