Menu

మన వెండి తెరకి మంచి కథలు కావాలంటే

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో భాగంగా చందూగారిద్వారా నవతరంగప్రవేశం చేస్తున్న ఈ వ్యాసాలను వారానికొక్కటి చొప్పున ప్రచురిస్తున్నాం. చదివి ఆనందించండి. ’

ఈ వ్యాస పరంపరలో వచ్చిన మిగతా వ్యాసాల కోసం ఇక్కడ చూడండి.

రచయిత: వి.వి.యస్.ఆర్.హనుమంత రావు, ఎం.ఏ
ప్రచురణ: రూపవాణి అక్టోబరు 1946

మనం వెండితెరమీద చూసే కథలు రెండు విధాలు:- (1) సంగ్రహించినవి (2) సృష్టించినవి. సంగ్రహించినవి అంటే ఒక కథనుగాని, కథలో ఘట్టాలని గాని పురాణాలలోనుంచో, లేక చారిత్రాత్మక గ్రంథాలనుంచో, తీసుకొని తెరమీద ప్రదర్శించేవన్నమాట. లవకుశ, అనసూయ, కచదేవయాని, సత్యభామ మొదలైనవి పురాణగాథలు. హుమయూన్, పుకార్,సికిందర్ మొదలైనవి చరిత్రగాథలు. శకుంతల, కాదంబరి, మేఘదూత్, డాక్టరు కోట్నీస్ మొదలయినవి, కాళిదాస, బాణ అబ్బాస్ మొదలైన ప్రముఖులయొక్క గ్రంథాలనుండి సంగ్రహించిన కథలు. ఇక సృష్టించబడిన కథలు అంటే కవులచేగాని, డైరక్టర్లచేగాని, లేక ప్రొడ్యూసర్లచేగాని, స్వబుద్దిచే అల్లబడి తెరపైకెక్కించినవన్నమాట. గృహలక్ష్మి, మళ్ళీపెళ్ళి, వందేమాతరం మొదలైనవి ఈ తరహాకి చెందుతాయి.

ఇప్పటికి తయారైన మన తెలుగు చిత్రాలు చాలావరకు మొదటిరకానికి చెందుతాయి. అంటే సంగ్రహించబడినవన్నమాట. సృష్టించిన కథల సంఖ్య చాలా తక్కువైనప్పటికి వాహినివారు ఇలాంటివి తియ్యడంలో ముందంజ వేసారు. సారథివారు తీసినవి అట్టే లేకపోయినప్పటికి సృష్టించిన కథలనే తెరకి ఎక్కించారు. జగదీష్ వారు కూడా ఈమార్గాన్ని కొంతవరకు అనుసరించి ఇంక కథలు సృష్టించడానికి ఆలోచన తట్టకో మరి ఎందుచేతనోగాని అక్కడడక్కడా దారి తప్పుతూ సంగ్రహించిన కథలనే అందజేసారు. ఈ ముగ్గురు నిర్మాతలను తప్పించి చూస్తే ఆలోచనా పరంపరలనుపయోగించి సృష్టించిన కథలను తెలుగు తెరపైకెక్కించిన నిర్మాతలు సున్న. దీనినిబట్టి చూస్తే శ్రమపడకుండా చేతిదగ్గరవున్న గాథలను తీసి ఎలాగోలాగున కథని తెరపైకి ఎక్కించడమే ప్రధానము అనుకొని మన నిర్మాతలు పాటుపడుతున్నారేమో! అన్న అనుమానాన్ని సూచిస్తుంది.

సంగ్రహించిన కథలు బాగుంటాయా? లేక సృష్టించిన కథలు బాగుంటాయా? అన్న సమస్య చాలా పెద్దది. కానీ ఈ సందర్భంలో ఏవో ముఖ్యమైన లోటుపాట్లు సూచించి మంచి కథలు దొరకే మార్గాలు వెదకుదాం.

ఇప్పటికి తయారైన ఫిలింలలోని సంగ్రహించిన కథలను పట్టి చూస్తే మన డైరక్టర్లకి కథని నడిపించడం పాత్ర పోషించడం ఏమి అవగాహనకాక ‘ఏదో ఫిలిం తీసాం అంటే తీసాం’ అని చెప్పుకోడానికేమో అని అనిపిస్తుంది. ఈ వుద్దేశ్యంతో నైతేనేమి మరెలాగైతేనేమి మన నిర్మాతలు రసవంతమైన గాథలని మూలము నుండి సంగ్రహించి జీవంలేని కథలుగా వెండితెరకెక్కిస్తున్నారు. ఇంతటితో ఆగక మూలములోని రసవంతమైన గాథలన్నీ అయిపోయాయన్న తలంపుతోనో లేక మరి స్వంత ఆలోచన తెలివి వుపయోగించి కథను సృష్టించాలన్న అభిలాషతోనో అర్థంలేని అవక తవక కథలు సృష్టించి తెరపైకెక్కించి ప్రేక్షకులయొక్క వుత్సాహాన్ని అంతంచేయడం తటస్థితోంది.

ఫిలింకి జీవం కథ అని అందరకూ తెలిసిన విషయమే. ఫిలిం కథ సృష్టించినదైనను సంగ్రహించినదైనను జీవం ఉన్నది అయి ఉండాలి. ఇలాంటి కథలు దొరికే మార్గాలు కనుగోడానికి ఈ క్రింది సలహాలు చాలా వరకు పనిచేస్తాయని తలుస్తాను

జీవంవున్న సంగ్రహించిన కథలు దొరికే మార్గాలు మూడు విధాలు.

మొదటిది ఇదివరకు వక పర్యాయం తీయబడి దురదృష్టవశాత్తు పాడైపోయిన రసవంతమైన గాథలని మళ్ళా తీయడం. ఇదివరకు శకుంతల తీయబడింది. అనేక కారణాలవల్ల అది పాడైంది. అన్ని విధాలా ఆలోచించి తగిన నటీనటులను ఏరి, కథను అనుకూలంగా అల్లి రసవంతమైన కథగా మళ్ళా తెరకెక్కించే అవకశాలు లేకపోలేదు. ఈ విధంగా పాదుకా, సావిత్రి, చింతామణి, వుషాపరిణయం, ప్రహ్లాద మొదలైనవి మళ్ళా తీయవచ్చు. కానీ ఈ సందర్భంలో నిర్మాతలు ముఖ్యంగా జ్ఞాపకముంచుకొనవలసిన దేమనగా ఈ గాథలు ఒకసారి తెరకి ఎక్కాయి. ప్రజల ఆదరణ బాగా పొందలేకపోయాయి. ఇప్పుడు తమరు మళ్ళా రెండవ మాటు ఆగాథలనే తీస్తున్నారు. వ్యయప్రయాసలలో ఏ మాత్రం లోట్లు ఉన్నా ఫిలిం పాడైపోతుంది.

రెండవది చక్కటి కథలని నవలలనుండి నాటకాలనుండి ఇంకా ఇతర గ్రంథాలనుండి సంగ్రహించడం. మన మాతృభాషలో శ్రీ వెంకటపార్వతీశ్వరకవులు రచించినవి, వంగభాషనుండి మన భాషలోకి తర్జుమా చేసినవి నవలలు చాలా వున్నసంగతి మన ఆంధ్రలోకానికంతకు తెలిసిన విషయమే. ఈ నిధులనుండి చాలా కథలను తీసి తెరకెక్కించే అవకాశాలు మన నిర్మాతలు కొంత ఆలోచించాలి. అతి నాజూకైన కథలు ఆంధ్రలోకానికి అమిత సంతోషాన్ని కలుగజేసే ‘ కాశీ మజిలీల ‘ నుండి కూడా సంగ్రహించవచ్చు. ఈ ఫక్కీని కొంతవరకు అనుసరించిన ప్రముఖులలో శ్రీరామబ్రహ్మంగారు, సి.పుల్లయ్యగారును. పుల్లయ్యగారి ‘ గొల్లభామ ‘ ఎలాగుంటుందో తెలియకపోయినా రామబ్రహ్మంగారి ‘మాయలోకం’ మాత్రం అంత బాగాలేదు. ఏది ఎలాగైనా మంచి కథలకు ఆలయమైన కాశీ మజిలీలనుండి కథలను సంగ్రహింపవచ్చును అనెడి భావాన్ని వెల్లడిచేసిన ఈ నిర్మాతల వుద్దేశ్యం శ్లాఘనీయం. వాహినీవారు, జగదీశ్‌వారు ఈ మార్గాలని త్రొక్కి కొన్ని రసవంతమైన జీవకథలను తెరపై కెక్కించే ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని నా నమ్మకం.

మూడవది షేక్సిపియర్ బెర్నార్డుషా థామస్‌హార్డీ మొదలైన గొప్ప గ్రంథకర్థలు వ్రాసిన గ్రంథరాజములనుండి కథను స్వీకరించి మన దేశకాల పరిస్థితులకు ఆచార వ్యవహారములకు అనుగుణ్యంగా కథను అల్లి తెరకెక్కించడం. ఈ పద్దతిని ఆచరణలో పెట్టడం చాలా కష్టసాధ్యమైన పని అయినప్పటికి, నిర్మాతయొక్క స్వయంకృషిని, ఆలోచనని వెల్లడిచేస్తూ ప్రేక్షకులయొక్క ఆదరణని పొందవచ్చునని చెప్పడంలో అతిశయం లేదంటాను.

జీవమున్న సృష్టించే కథలను తెచ్చే మార్గాలు రెండు.

మొదటిది ప్రపంచకములో రోజురోజు జరిగే చిత్రగాథలనిగాని ఒక వ్యక్తియొక్క గాని లేక కొంతమంది వ్యక్తులయొక్కగాని జీవ చరిత్రలనుండి కొన్ని ఘట్టాలను తీసి చక్కటి కథగా అతిశయోక్తిలేకుండా అల్లి తెరపైకెక్కించడం. ఇదివరకు ఆంధ్రలోకానికందజేసిన గృహలక్ష్మి, వందేమాతరం, సుమంగళి, మళ్ళీపెళ్ళి, రైతుబిడ్డ, తహసిల్దార్, పోతన మొదలైనవి ఈ రకానికి చెందుతాయి. బాగా కృషిచేసి నిర్మాతలు తమ విజ్ఞాన్ని పూర్తిగా వుపయోగిస్తే ఇలాంటి కొన్ని చక్కటి కథలను ఇంకా తెరపైకెక్కించవచ్చు.

రెండవది ఒక మూలములోవున్న కథని ముఖ్యముగా ఇంగ్లీషులోనూ హిందీలోను వున్న కథలను ఆధారముగా చేసుకొని చక్కని కథని క్రొత్తగా సృష్టించి వెండి తెరకెక్కించడం. డేవిడ్ కాపర్ఫీల్డుయొక్క గాథనిగాని నికలస్ నికెల్బ్ కథను అనుసరించిగాని ఒక క్రొత్తగాథను అమిత చమత్కారంగా ఆంధ్రలోకానికి అనుగుణ్యంగా సృష్టించి తెలుగు తెరకి అందజేయవచ్చు.

మన వెండితెరకి మంచి కథ కావాలంటే పై విధానాలు బాగా తోడ్పడుతాయి. కాబట్టి వీటిని ఆధారంగా చేసుకొని మన నిర్మాతలు కృషి చేస్తారని నమ్ముతాను.

5 Comments
  1. hero February 28, 2009 /
    • rayraj March 1, 2009 /
  2. reddy g February 28, 2009 /